యుద్ధపర్వం



హిరణ్యగర్భుని కోటను శత్రుసేనలు చుట్టుముట్టాయి. వారిని ఎదుర్కొనేందుకు ఏం చెయ్యాలో మంత్రి సర్వజ్ఞుడు, రాజుతో చర్చిస్తున్నాడు. అంతలో నీలవర్ణుడు వచ్చాడక్కడకి. వచ్చి, శత్రుసేనను తను అంతమొందిస్తానని, అనుమతి ఈయమని కోరాడు. నీలవర్ణునిపై కోపగించుకున్నాడు సర్వజ్ఞుడు. అసలీ ఈ యుద్ధానికి కారణం అతనేనన్నట్టుగా మాట్లాడాడు. తర్వాత రాజుతో ఇలా అన్నాడు.

‘‘మహారాజా! ఈ నీలవర్ణుని మాటలు నమ్మకండి. మోసపోతాం. వీడు మిత్రువులా కనిపించే శత్రువు. వీడు చెప్పినట్టు, మన సైనికులు కోట వదలి, బయటికెళ్ళి యుద్ధం చేస్తే, క ష్టపడి మనం కోట కట్టుకున్నది ఎందుకు? నీళ్ళలోనే మొసలికి బలం. బయటికొస్తే అదెందుకూ పనికిరాదు. యుద్ధానికి స్థానబలిమి కావాలి. ఆలోచించండి.’’నీలవర్ణుణ్ణి చూశాడు హిరణ్యగర్భుడు‘‘మహారాజా! ఈ సర్వజ్ఞుడే మేకవన్నె పులి. మాయమాటలు నావి కావు. ఆయనవే! ఒక పక్క శత్రుసేన కమ్ముకొస్తుంటే, ఈయనేమో, కోటలో ఉన్నాం కదా, మనకేం కాదంటున్నాడు. చుట్టుముట్టిన వారు, ద్వారాలు బద్దలు కొట్టుకుని రాలేరా? అసలు కోట మీద దాడి చేస్తున్నది అందుకే కదా! ఏమంటారు?’’ అడిగాడు నీలవర్ణుడు.ఆలోచనలో పడ్డాడు హిరణ్యగర్భుడు.‘‘ఇలాంటి మంత్రిని కొలువులో ఉంచుకోకూడదు. వెళ్ళగొట్టండిక్కణ్ణుంచి. ఇలాంటి వాడు ఉన్నా ఒకటే! పోయినా ఒకటే! ఒకటి నిజం మహారాజా! మీ సైన్యం అంతా ఒక ఎత్తు! నేనొక్కణ్ణే ఒక ఎత్తు. నేను తలచుకున్నానంటే చిటికెలో మీకు విజయాన్ని చేకూర్చగలను. నా శక్తియుక్తులు తెలుసు కాబట్టే ఈ సర్వజ్ఞుడికి నేనంటే పడదు. విన్నారు కదా, నన్ను పట్టుకుని ఎంతలేసి మాటలన్నాడో! నన్నంటే మిమ్మల్ని అన్నట్టు కాదా మహారాజా? మీ ఆప్తుణ్ణి నేను. నన్ను తూలనాడితే మిమ్మల్ని తూలనాడినట్టే!’’ అన్నాడు నీలవర్ణుడు.

కోపం కట్టలు తెంచుకుంటోంది సర్వజ్ఞుడికి. అయితే రాజ సముఖంలో ఎలా ఉండాలో అలా ఉంటూ, నిగ్రహించుకుంటున్నాడు.‘‘కోటలో దాక్కుని కులకటం వీరుల లక్షణం కాదు. వీరుడన్నవాడు యుద్ధం చెయ్యాలి. చేతకాదంటే, శరణు వేడాలి. అంతేకాని, ఈ సర్వజ్ఞుడిలా యుద్ధం వచ్చినప్పుడు దాక్కొని, తర్వాత తీరిగ్గా తిరుగుదామంటే నగర ప్రజలు నవ్విపోరూ? కోట బయటకి వెళితే మన సైన్యం ఎందుకూ పనికిరాదనడం మీకెంత అవమానకరం? వద్దు మహారాజా! పదే పదే చెబుతున్నానని మీరేమీ అనుకోకపోతే, ఈ నీచుడి సలహాలు వినవద్దు. ఇప్పటికే సగం చచ్చిన చిత్రవర్ణుని సైన్యాన్ని మట్టుబెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అనుమతించండి. నేన్చూసుకుంటాను.’’ అన్నాడు నీలవర్ణుడు.సర్వజ్ఞుడు కోట దాట వద్దంటాడు. నీలవర్ణుడు దాటుదాం అంటాడు. ఏది మంచిదో అర్థం కాకుండా ఉంది హిరణ్యగర్భుడికి. మౌనం దాల్చాడు. అదే అవకాశంగా ఇలా అన్నాడు నీలవర్ణుడు.‘‘మౌనం అర్ధాంగీకరం మహారాజా! మిగిలింది నేను చూసుకుంటాను. శలవు.’’

సైన్యంతో పాటుగా కోట బయటికి నడిచాడు నీలవర్ణుడు. శత్రు సైన్యం మీద యుద్ధం ప్రకటించాడు. నీలవర్ణుడు తనంత తానుగా యుద్ధాన్ని ప్రకటించడం, మంత్రి సర్వజ్ఞుడికీ, సేనాపతి వీరవరుడికీ నచ్చలేదు. బాధ కలిగించింది ఇద్దరికీ. రాజుకి ఎంత చెప్పాలో అంతా చెప్పారు. వినలేదు రాజు. పరాయి వ్యక్తి నీలవర్ణుని నమ్మినట్టుగా సొంతవాళ్ళను నమ్మలేదు రాజు. తప్పదిక. యుద్ధంలో పాల్గొనక తప్పదనుకున్నారు. వారూ యుద్ధానికి సన్నద్ధులయ్యారు.ఇరు సైన్యాలూ బరిలోకి దిగాయి. యుద్ధం ప్రార ంభమయింది. ఆసరికే చాలా మంది సైనికుల్ని పోగొట్టుకున్న చిత్రవర్ణుడు, శత్రు సైన్యాన్ని చూసి భయపడలేదు సరికదా, వీరోచితంగా తలపడ్డాడు వారితో. సూర్యాస్తమయం వరకు యుద్ధం జరిగింది. సూర్యాస్తమయంతో ఆనాటికి యుద్ధం ఆగింది. యుద్ధంలో ఇరువైపులా వేలాది పక్షులు నేలరాలాయి.రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నారంతా. నీలవర్ణుడు మాత్రం నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లారుతుందా అన్నట్టుగా చూస్తున్నాడు. అతనితో పాటు చిత్రవర్ణుని సైన్యం వంద కాకులు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాయి.చీకటి చీకటిగానే ఉంది. ఇంకా తెల్లగా తెల్లారనే లేదు. నీలవర్ణుడు మండే కట్టెను ముక్కున కరచి ముందుకు దూసుకుపోయాడు.

అతన్ని వెన్నంటాయి వంద కాకులు. చూసేవారికి ఆ దృశ్యం, శత్రు సైన్యం వెంట తరుముతోంటే, నీలవర్ణుడు భయపడి, పారిపోతున్నట్టుగా ఉంది. కావాల్సింది అదే! నీలవర్ణుడు నేరుగా కోటలోకి ప్రవేశించాడు. మంచి నిద్రలో ఉంది, హిరణ్యగర్భుని సైన్యం. అదే అదనుగా మండుతున్న కట్టెను విసిరేశాడక్కడ. మంటలంటుకున్నాయి. నలువైపులా వ్యాపించాయి. ఎంతో క ష్టపడి వీరవరుడు నిర్మించిన కోట క్షణాల్లో బూడిదయి పోయింది. నిద్రలో ఉన్న సైనికులు నిద్రలోనే చనిపోయారు. కొన్ని మేల్కొన్నా పొగ కారణంగా ఎటు పోవాలో తెలియక అటూ ఇటూ తిరగసాగాయి. ఇంతలో నీలవర్ణుని వెంట వచ్చిన వంద కాకులూ ముక్తకంఠంతో ఇలా అరిచాయి.‘‘మాదే గెలుపు! కోట మా వశమయింది.’’కోట లోపల ఎటు పోవాలో తెలియని సైనికులు, కాకుల గోల వినిపించడంతో తప్పించుకుని లాభం లేదనుకున్నారు. పారిపోయే ప్రయత్నాలు మరి తలపెట్టలేదు. కావాలనే మంటల్లో మాడి మసయిపోయారు. ఒకటి రెండు బయటికొచ్చాయి.

వాటిని బయట కాచుక్కూర్చున్న నీలవర్ణుని సైన్యం పొడిచి పొడిచి చంపేశాయి. చూస్తూండగానే తన రక్షణ కోసం హిరణ్యగర్భుడు, కట్టించుకున్న కోట కాలి బూడిదయిపోయింది. వీరుడన్న వాడు మిగల్లేదు. మిగిలిందల్లా రాజూ, సేనాని వీరవరుడూ, నలుగురైదుగురు సైనికులు మాత్రమే మిగిలారు. కనిపిస్తున్నవారంతే! కొందరు సైనికులు కనిపించకుండా పారిపోయి దాక్కున్నారంటున్నారు. అది నిజమో కాదో తెలియదు.కళ్ళ ముందే తన సైన్యం, వేలాది పక్షులు కాలి చచ్చిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు హిరణ్యగర్భుడు. కాకుల కుట్రలో ప్రాణాలు కోల్పోవడం చెప్పలేనంత దుఃఖాన్ని కలిగించిందతనకి. బాధగా వీరవరుణ్ణి చూశాడు.

‘‘నువ్వూ, సర్వజ్ఞుడూ చెబుతూనే ఉన్నారు. వినలేదు. వినని కారణంగా చూడెంత ఘోరం జరిగిపోయిందో! నీలవర్ణుణ్ణి నమ్మి నాశనాన్ని కొని తెచ్చుకున్నాను. రాజ్యాన్ని చే జార్చుకున్నాను.’’ అన్నాడు హిరణ్యగర్భుడు.‘‘దైవసంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుందంటారు. ఇది మీ తప్పు ఎంత మాత్రం కాదు. ఊరుకోండి.’’ ఓదార్చాడు వీరవరుడు.‘‘ఎక్కడున్నాడో! ఏమయిపోయాడో! అసలు బతికి ఉన్నాడో లేదో సర్వజ్ఞుడు. చెవిన ఇల్లు కట్టుకుని మరీ చెప్పాడు, నీలవర్ణుని గురించి. విన లేదు నేను. మూర్ఖుణ్ణి! చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నువ్వెంతన్నట్టుగా చూశాను. ఏమయిందిప్పుడు? అయినవాళ్ళ మాటను చెవిన పెట్టకపోతే ఇంతే! క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు.’’ అన్నాడు హిరణ్యగర్భుడు.‘‘ఎంత మాట మహారాజా! తప్పు! మీరిలా మాట్లాడకూడదు.’’ అన్నాడు వీరవరుడు.

కోటలోనే, శత్రువులు గుర్తించని ప్రదేశంలో ఉండి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. అయినా భయం భయంగానే ఉంది హిరణ్యగర్భునికి, ఏ క్షణాన ఏమవుతుందోనని. దాంతో ఇలా అన్నాడు.‘‘వీరవరా! ఓడిపోయిన రాజుకి శిక్ష తప్పదు. నాతో పాటు నీకెందుకు శిక్ష? నా మాట విను. పారిపో ఇక్కణ్ణుంచి.’’సన్నగా నవ్వి చూశాడు వీరవరుడు.‘‘విరిగిపోతున్న కొమ్మను పట్టుకుని వేలాడడం అవివేకం. వెళ్ళిపో ఇక్కణ్ణుంచి.’’‘‘వెళ్ళను మహారాజా! అలా వెళ్ళడం సేనాని లక్షణం కాదు. ఈ ప్రాణం మీది. మీ కోసం ఈ ప్రాణం ధారపోయడం నా కర్తవ్యం. నా గుండెలో ప్రాణం ఉన్నంత వరకూ నేను మిమ్మల్ని కాపాడాలి. కాపాడతాను.’’ అన్నాడు వీరవరుడు. అతని మాట పూర్తి కానేలేదు. అనుకున్నంతా అయింది. చిత్రవర్ణుని సేనాపతి తామ్రచూడుడు, సైన్యంతో దండెత్తి వచ్చాడక్కడికి. శత్రు సైన్యంతో హిరణ్యగర్భుడూ, వీరవరుడూ, మిగిలిన నలుగురైదుగురు సైనికులూ తలపడ్డారు. తప్పించుకునేందుకు రాజుకి తోవ చేస్తూ వీరవరుడు, శత్రు సేనను పరుగులు పెట్టించాడు. తామ్రచూడుడు అది గమనించి, వీరవరునితో యుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్యా పెద్ద యుద్ధమే జరిగింది. వీరవరుని చేతిలో తామ్రచూడడు చనిపోయాడు. అదే అవకాశంగా హిరణ్యగర్భుణ్ణి కోట దాటించాడు వీరవరుడు. పరిగెత్తి నీళ్ళలో దూరి ప్రాణాలు దక్కించుకున్నాడు హిరణ్యగర్భుడు.

రాజు క్షేమం అనుకున్నాడు వీరవరుడు. గట్టిగా నిశ్వసించాడో లేదో, వెనక మాటున వచ్చి అతని మీద దాడి చేశాడు శత్రువు. వె నక్కి తిరిగి చూసే అవకాశ మే లేదు. వీరవరుడు మరణించాడు. యుద్ధం ముగిసింది.చిత్రవర్ణుడు కోటలోకి ప్రవేశించాడు. సింహాసనాన్ని అధిష్ఠించాడు. జేజేలందుకున్నాడు. కొన్నాళ్ళు పరిపాలించి, తర్వాత నచ్చిన సేవకుణ్ణి సామంత రాజుని చేసి, జంబూద్వీపానికి వెళ్ళిపోయాడతను.’’ ముగించాడు విష్ణుశర్మ. విగ్రహం పూర్తయింది.‘‘పిల్లలూ! యుద్ధం అందరికీ ప్రమాదమే! నష్టం రెండు వైపులా ఉంటుంది. అయిన దానికీ కాని దానికీ పదే పదే యుద్ధం అంటే అంతకు మించిన అవివేకం మరొకటి లేదు. పోరు నష్టం. పొందు లాభం. ఇది పెద్దల మాట! దీన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మనం.’’ అన్నాడు విష్ణుశర్మ.‘‘ఓ’’ అన్నారు రాకుమారులు.