వ్యాఘ్ర - భల్లూకముల కథ



పూర్వము ఆంధ్రావనిలో పేరుగాంచిన నగరం పిస్టలాపురం. ఆ నగరానికి చుట్టుప్రక్కల అనేక చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. అవి అన్నీ పిస్టలాపురానికి కప్పాలు చెల్లిస్తూ ఉంటాయి. వాని యొక్క (ఆ గ్రామాలయొక్క) బాగోగులన్నీ యీ నగరమే చూస్తూ ఉంటుంది.

అందువల్ల గ్రామోద్యోగులకు తరచు పిస్టలాపురానికి రాకపోకలు జరుగుతూ ఉంటాయి, లక్ష్మీపురం, పిస్టలాపురానికి ఎనిమిది మైళ్ళదూరంలో ఉంది. ఈ రెండు ఊరులకు మధ్య ఒక చిన్న ఆడవి ఉంది. అందువల్ల రాత్రిపూట ఎవ్వరూ ఒంటరిగా ప్రయాణం చెయ్యరు. ముఖ్యమైన ప్రయాణాలయితే (వివాహాది శుభకార్యాలకు) తప్పని సరిగా వెళ్ళవలసిన పరిస్థితి అయితే పది మంది కలిసి వెడుతుంటారు: కాగడాలు వెలిగించుకొని, ఎందువల్లనంటే రాత్రి పూట క్రూరమృగ సంచారం ఉంటుందని ఆ గ్రామవాసుల నమ్మకం నిజంకూడ.

ఒకనాడు లక్ష్మీపురం దివాణం నుండి పిస్టలాపురం దివాణాన్ని ముఖ్యమైన సమాచారంగల పత్రాన్ని అతిభద్రంగా దాచుకొని బయలుదేరాడు ఒక ఉద్యోగి. పగటిపూట రెండు గంటల ప్రాంతంలోనే బయలుదేరాడు; ఆ ఉద్యోగి, కాని, ఆడవిమధ్యకు రాగానే కుండపోతగా వర్షం ప్రారంభం అయింది. అందువల్ల ఆ ఉద్యోగి, ఒక చెట్టు క్రింద అగాడు. కానీ, ఎంత సేపటికీ వర్షం ఆగలేదు. వెళ్ళవలసింది యింకా నాల్గు మైళ్ళ దూరం ఉంది. క్రమంగా సాయంకాలమైంది; చీకట్లు గూడ అలుముకోవడం ప్రారంభించాయి. వెనక్కి పోదామన్నా నాలుగు మైళ్ళు పోవాలి: ముందుకు పోవాలన్నా నాలుగు మైళ్ళు పోవాలి. చీకట్లు క్రమంగా ఎక్కువ ఆవుతున్నాయి.

ఆ ఉద్యోగి వర్షం కొంచెం తగ్గగానే ముందుకే బయలు దేరాదు. తోడు ఎవరైనా దొరుకుతారేమోనన్న ఆశతో చూస్తూన్నాడు. కానీ, ఎవరూ దొరుకలేదు. దేవునిమీద బారంవేసి ఆ వర్షంలోనే ప్రయాణం సాగిస్తున్నాడు- ఆ ఉద్యోగి.
కొంతసేపటికి మధ్యమార్గంలో చిన్న జ్యోతుల్లా వెలుతురు కనిపించింది -అతనికి, మొదట అవి యేవో కాగడా కాంతులని భ్రాంతి పడ్డాడు. కానీ, కొంచెంసేపటికి అవి ఒక పెద్దపులి నేత్రాలుగా గోచరించింది అతనికి. వెంటనే అతడు ప్రాణభీతితో పరుగెత్తుకొనిపోయి, సమీపమందే యున్న ఒక చెట్టు ఎక్కికూర్చున్నాడు. కాని, అతడు కూర్చున్న కొమ్మమీద ఒక భల్లూకం కూర్చుని ఉంది. కంగారుగా ప్రాణభీతితో ఎక్కిన ఉద్యోగి దాని ప్రక్కనే కూర్చున్నాడు: కూర్చున్నాక దానిని చూశాడు. వెంటనే గుండె గుభేలు మన్నది అతనికి, భయంతో శరీరమంతా చెమటలుపట్టాయి. గడగడ వణికి పోతున్నాడు. క్రిందికి దూరుదామని చూశాడు. అప్పటికి పెద్దపులి అక్కడే తిష్ట వేసి కూర్చున్నది.

పాపం: ఆ ఉద్యోగికి "ముందు గొయ్యి: వెనక నుయ్యి"లా అయింది. భయంతో గడగడలాడిపోతున్న ఆతనిని చూచి భల్లూకం జాలిపడింది. "ఓయీ, భయపడకు, నేను నిన్నేమీ అనను. ఈ పెద్దపులి చెట్టు ఎక్కి రాలేదు. నీకు సమయం దొరికేదాకా. యిక్కడే ఉండు. నీ ప్రాణనికి ఏమీ భయంలేదు. నేను హానిచెయ్యను." అని వానికి ప్రాణాదానం చేసి దగ్గరగా తీసికొని ఆదరించింది. క్రమంగా వర్షం తగ్గింది. ఆర్థరాత్రి అయిపోయింది. వ్యాఘ్రం (పెద్దపులి) మాత్రం సమయంకోసం చూస్తూ అక్కడే కూర్చుంది. భల్లూకం ఒడిలో చేరిన ఆ ఉద్యోగి నిద్రకు తట్టుకోలేక దాని ఒడిలోనే నిద్రపోయాడు.

వ్యాఘ్రం ఆలోచించి కొంతసేపటికి భల్లూకంతో యిలా అంది :- "చూడు భల్లూకరాజా! ఈ నరజాతికి ఎప్పుడూ మన మృగ జాతిపై కక్షయే, అవకాశం చిక్కిందంటే చాలు; వీరు మనలను చంపడానికి వెనుకాడరు. ఆటువంటి ద్రోహులు ఈ నరులు. ఇట్టి నరజాతిపై నీ కింత కరుణ ఎందుకు: చేతికి చిక్కిన శత్రువులపై దయ జూపుట మంచిదికాదు. వానిని తొలగించుకొనుటయే నీతి, కావున నా మాట మన్నించి వానిని విడిచిపెట్టు; నా ఆకలిని తీర్చుము. ఇందువలన నీకు పుణ్యమేగాని పాపము రాదు. ఒక శత్రువును కాపాడుట, తోటి వానిని చంపుట ధర్మము కాదు గదా! నా యాకలిని తీర్చి నా ప్రాణములు కాపాడుము" అని ప్రార్థనాపూర్వకంగా, స్వార్ధపూరితంగా పలికింది.

భల్లూకం యిలా బదులు పలికింది. "ఓ వ్యాఘ్రమా! నీవు స్వార్ధంతో ప్రార్దించుచున్నావే గాని, ధర్మం ఆలోచించుటలేదు. ఈ మానవుడు నీవు చెప్పినట్లు మనకు శత్రువే కావచ్చును. అంత మాత్రముచేత వీనిని చంపుట ధర్మము కాదు. పైగా వానికి నేను ప్రాణదానం చేశాను. నా వాగ్దానమును విశ్వసించి, నిశ్చింతగా నా ఒడిలో నిద్రపోవుచున్నాడు. ఇట్టి అమాయకుణ్ణి నీ మాటలువిని నీ కందీయ జాలను, అనృతదోషంవల్ల సంభవించు నరకాన్ని అనుభవింపజాలను. కావున నీవు వీనిపై ఆశ వదులుకొని వేరొక మార్గమును చూచుకో; నీ యాకలిని తీర్చుకో" అని పలికింది.

అయినా, పెద్దపులి అక్కడ నుండి కదలలేదు. మరికొంత సేపటికి ఆ మానవుడు (ఉద్యోగి) మేలుకొన్నాడు. భల్లూకం ఒకింత ఆలోచించింది. మానవుని యొక్క మనస్సును కూడ తెలుసుకోవాలనుకొంది. మెలకువ చెందిన నరునితో "ఓయీ: ఇంతసేపు నిన్ను కాపాడాను; చెట్టునుండి పడిపోకుండ నిన్ను జాగ్రత్తగా కనురెప్ప వేయకుండా కాపలా కాచాను. ఇక, ఇప్పుడు నేను కొంత సేపునిద్రిస్తాను. నేను పడి పోకుండా చూస్తుండు" అని పలికి నిద్రపోయింది. కానీ, నిజంగా నిద్రించలేదు. పులి ఏమని బోధించునో, ఈ నరుడు ఎట్లా సంచరించునోః" అని గమనిస్తూనే ఉంది.

భల్లూకం నిద్రించిన కొంత సేపటికి వ్యాఘ్రము మానవుని ఉద్దేశించి "ఓయి నరుడా, నీవు భల్లూకం మాటలు నమ్మకున్నావు గదూ! ఆది అంతా నటన. నేను యింటికి వెళ్ళిన వెంటనే ఆది తన వాడియైన గోళ్ళతో చీల్చి చెండాడి నీ రక్తాన్ని త్రాగుతుంది. బ్రతికి ఉండగనే, నీవు విలవిల బాధపడుతూ ఉండగనే నిన్ను కడుపార భుజిస్తుంది. నా మాటలునమ్ము. దాని కల్లబొల్లి మాటలకు పొంగిపోకు, లొంగిపోయావా? నీవు యమయాతన పడుచూ మరణిస్తావు. చూస్తూ చూస్తూ అట్టి ఘోరమరణానికి పాలుగాకు, అది యిప్పుడు మంచి నిద్రలో ఉంది. దానిని క్రిందికి తోసివేయి, దానిని తిని నా దారిన నేను పోతాను: తెల్లవారగనే నీ దారిన నీవు పోవచ్చు. అని దుర్బోధ చేసింది.

దాని మాటలు ఆ ఉద్యోగికి సత్యంగానే తోచాయి; ప్రాణం మీద ఆశ కలిగింది. పులి చెప్పినట్లుగానే చేస్తేనే మంచిదని నిశ్చయించుకొన్నాడు. వెంటనే భల్లూకాన్ని క్రిందికి త్రోసి వేశాడు. కానీ, కపట నిద్రలో ఉన్న భల్లూకం వెంటనే ఎగిరి కొమ్మపై కూర్చుంది; పులికి అందకుండా. ఆ ఉద్యోగి భయంతో ఎంతో గడగడలాడిపోయాడు: భల్లూకం ఏమి చేస్తుందోనని.
పులికి యిప్పుడు మరింత సందు దొరికింది. "చూశావా: భళ్ళుకరాజ! మానవుని కుటిలబుద్ది? నేను చెప్పితే నమ్మావా? ఇప్పుడు ప్రత్యక్షముగా చూశావు గదాః"అంది వ్యాఘ్రము.

అయినా భల్లూకం మనస్సు మార్చుకోలేదు. భయపడుతూన్న ఆ మానవుని దగ్గర తీసుకొంది. "వ్యాఘ్రరాజా: నాకు నీ కంటే మానవుల సంగతి బాగా తెలుసు. "తెల్లనివన్నీ పాలు: నల్లనివన్నీ నీళ్ళు" అని నమ్మే అమాయకులు మానవులు. ఇతడు నీ దుర్బోధలు నమ్మి. ప్రాణభీతితో ఈ అఘాయిత్యాని పాల్పడినాడు. నీవు యిలా యేదో దుర్బోధ చేస్తావనే ఉహించి యిలా పండుకొన్నట్లు నటించాను. నా ఊహ నిజమైంది. తెల్లవార వస్తుంది: పోయి వేరే విధంగా నీ యాకలి తీర్చుకో" అని భల్లూకం దానికి సలహాయిచ్చింది.

అప్పటికి బాగా తెల్లవారింది. అందువలన పులి"ఇక తన మాటలు సాగవని" తలిచి వెళ్ళిపోయింది. అప్పుడు భల్లూకం మానవుని ఉద్దేశించి.. "ఓయీ: భయపడకు. నిన్నేమీ చేయను. అయినా, నీవు స్వార్ధపరుడవై ఎదుటి వారికి హాని తెచ్చే కార్యాలు పొరబాటున కూడ చేయకు, ఇదే నేను నీకు చేస్తున్న హెచ్చరిక" అని చెప్పింది.
ఆ ఉద్యోగి దానికి మనసారా నమస్కరించాడు: పశ్చాతాపాముతో. ఇంతలో కొంతమంది ఆటు రావడం చూచి, చెట్టు దిగి వారితో వెళ్ళిపోయాడు

. "మహారాజా: విన్నావు గదాః వ్యాఘ్ర భల్లూకముల కథ! ఈ ముగ్గురిలో ఎవరి గుణము హర్షించతగ్గదో చెప్పగలవా?" అని భేతాళుడు ప్రశ్నించాడు. విక్రమార్కుని, "భేతాళా! ప్రాణదానం గావించి, తన వాగ్దానము నిల్పుకొన్న భల్లూకము యొక్క గుణమే ప్రధానమైనది: హర్షించ తగ్గది" అని విక్రమార్కుడు బదులు చెప్పాడు.

ఈ విధంగా మౌనభంగం కావడంతోనే భేతాళుడు ఎగిరిపోయి చెట్టు నాశ్రయించాడు. విక్రమార్కుడు తన పట్టువిడవలేదు. తిరిగి చెట్టువైపు ప్రయాణం సాగించాడు.
పట్టుదల వీడని విక్రమార్కుడు తిరిగి చెట్టువద్దకు వచ్చాడు: భేతాళుని బంధించి భుజముపై వేసికొని, సన్యాసి ఆశ్రమానికి బయలు దేరాదు. భేతాళుడు ఇంకొక కథ ప్రారంభించాడు.

Responsive Footer with Logo and Social Media