వింధ్యపర్వతం పెరుగుట



ధర్మరాజు కోరికపై రోమశుడు అగస్త్య మహాముని కథను సవిస్తరంగా వివరించసాగారు. కృతయుగంలో వృత్తాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తన అనుచరుడైన కాలకేయులతో కలిసి దేవతలను పీడిస్తూ ఉండేవాడు. దేవతలు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి వృత్తాసురుని చంపడానికి మార్గం చెప్పమన్నారు.

బ్రహ్మదేవుడు " మీరు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన ఎముకలను దానంగా అడిగి తీసుకుని ఆ ఎముకలతో ఆయుధాన్ని చేయండి. ఆ ఆయుధంతో వృత్తాసురుని సంహరించండి " అని చెప్పాడు.

దేవతలు దధీచి మహర్షి ఎముకలను దానంగా అడగగానే ఆ మహర్షి శరీరాన్ని విడిచి ఎముకలను దానంగా ఇచ్చాడు. వాటితో త్వష్ట ప్రజాపతి వజ్రాయుధం చేసి ఇంద్రునికి ఇచ్చాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్తాసురుని సంహరించాడు.

వృత్తాసురుని అనుచరులైన కాలకేయులు సముద్రగర్భంలో దాగి రాత్రివేళలో బయటకు వచ్చి జనులను ఋషులను బాధిస్తుండే వాళ్ళు. ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తికి మొర పెట్టుకున్నారు. విష్ణుమూర్తి దేవతలతో " కాలకేయులు మహా బలవంతులు. పైగా సముద్ర గర్భంలో ఉన్నారు కనుక సంహరించడం వీలు కాదు.

సముద్రంలో నీరు ఇంకిపోతే సంహరించవచ్చు. కనుక మీరు అగస్త్యుని వద్దకు వెళ్ళి తరుణోపాయం అడగండి " అని చెప్పాడు. దేవతలు అగస్త్యుని వద్దకు వెళ్ళి " పూర్వం వింధ్య పర్వతం పెరిగి జగత్తుకు విపత్తుగా పరిణమించినప్పుడు తమరి వలన ఆ కీడు తొలగింది. అలాగే ఇప్పుడు కూడా మా కష్టాన్ని మీరే పోగొట్టాలి " అని అడిగారు.అగస్త్యుని గురించి వింటున్న ధర్మరాజు రోమశుని చూసి " అయ్యా! వింధ్య పర్వతం పెరగటం ఏమిటి? వివరించండి " అని అడిగాడు.

రోమశుడు ధర్మరాజుతో " ప్రతి రోజు సూర్యుడు మేరుపర్వతానికి ప్రదక్షిణం చేస్తుంటాడు. అది చూసి వింధ్య పర్వతానికి కోపం వచ్చింది. " సూర్యదేవా! నేను పర్వతాలకు రాజును, నువ్వు నాకు ప్రదక్షిణం చేయకుండా మేరు పర్వతానికి ప్రదక్షిణం ఎందుకు చేస్తావు? " అని అడిగాడు. సూర్యుడు " బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం ఇలా చేస్తున్నాను " అని పలికాడు. ఆ మాటకు వింధ్యపర్వతానికి ఆగ్రహం కలిగింది. అలా పైపైకి ఎదుగుతూనే ఉన్నాడు. అలా సూర్యచంద్రుల మార్గాలను నిరోధించాడు. లోకాలు అంధకారంలో మునిగి పోయాయి. దేవతలంతా అగస్త్యుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో వింధ్యపర్వతం వద్దకు వెళ్ళి " వింధ్యపర్వతమా ! నేను దక్షిణదిక్కుగా వెళుతున్నాము మాకు దారి ఇచ్చి తిరిగి వచ్చేవరకు అలాగే ఉండు" అన్నాడు.

అలాగేనని అంగీకరించిన వింధ్య పర్వతం భూమికి సమానంగా దిగి వచ్చాడు. అప్పటి నుండి పెరగడం ఆపివేసాడు. తరువాత రోమశుడు కథను పొడిగిస్తూ " అగస్త్యుడు దేవతల కోరికపై సముద్ర జలాలను త్రాగి వేసాడు. దేవతలు కాలకేయుడు మొదలైన వారిని సంహరించారు. చావగా మిగిలిన వారు పాతాళానికి పారి పోయారు.దేవతలు " మహర్షీ! మీ దయ వలన మాకు రాక్షస బాధ తప్పింది.

మరల సముద్రాలను జలంతో నింపండి " అని ప్రార్థించారు. అగస్త్యుడు " దేవతలారా! అది నాకు సాధ్యం కాదు. సముద్రజలం నా పొట్టలో ఇంకి పోయాయి " అన్నాడు. అగస్త్యుడు సముద్ర జలాలను తిరిగి ఇవ్వలేనని చెప్పడంతో దేవతలంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు " సముద్ర జలాలను రప్పించడం ఇప్పుడు సాధ్యం కాని పని. చాలా కాలం తరువాత భగీరధుడు ఈ సముద్రాన్ని జలంతో నింపగలడు, అని బ్రహ్మదేవుడు చెప్పాడు " అని రోమశుడు ధర్మరాజుతో చెప్పాడు.