విలువ


భూషయ్య రామయ్య ఒకే ఊరువారు.భూషయ్య ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ మోతుబరి రామయ్యకు మాత్రం రెండెకరాల భూమి మాత్రం వుంది.భూషయ్యకు ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ తనే ధనవంతుడినన్న గర్వం వుండేది.. దీనితో అతడు అందరీ తక్కువచేసి నూట్లాడేవాడు. రామయ్య మాత్రం ప్రతి ఒక్కరితో పేద, గొప్ప భేదం లేకుండా కలసికట్టుగా వుండేవాడు అందువల్ల రామయ్య మాటంటే చెవి కోసుకునేవారు, భూషయ్య మాటంటే అయిష్టత చూపేవారు.

ఒకసారి ఆ ఊరిలో జరిగిన ఓ గొడవకి రామయ్యని పెద్దమనిషిగా పిలిచారు. అది విన్న భూషయ్యకు చెర్రెత్తి పోయింది. ధనవంతుడు, మోతుబరి అయిన తనను పిలవకుండా. పేదవాడైన రామయ్యను పిలిచినందుకు భూషయ్య అహం దెబ్బతింది. ఆ మర్నాడు భూషయ్య రామయ్యను తనింటికి పిలిపించి "నేను నీ కన్నా ధనవంతుడ్ని పలుకుబడి గలవాన్ని అయినప్పటికీ జనం అంతా నీకే వంగి నమస్కారాలు చేయడానికి కారణమేమిటి?" అని అడిగాడు.
దానికి రామయ్య మందహాసం చేస్తూ 'చూడు భూషయ్యా, నీవు గ్రామంలో అందరికన్నా ధనవంతుడవు. కాని నీవు ధనముందన్న అహంకారంతో అందరూ నీ చెప్పు చేతల్లో ఉండాలని కోరుకునే మనస్తత్వం కలవాడవు ఇతరులను నీవు చీదరించుకున్నప్పుడు, ఇతరులు కూడా నిన్ను తక్కువగా చూడడంలో తప్పు లేదుగా, కాని నేను మాత్రం పనివాడితో కూడా కలసికట్టుగా ఉండటం వల్ల నా మంచితనాన్ని గుర్తించివారంతా నాకు గౌరవం ఇస్తున్నారు.

ఇంకో విషయం చెప్పనా బెల్లం చుట్టూ ఈగలు మూగాయంటే ఆ బెల్లం తీయగా ఉండబట్టేగా తీపిలేని బెల్లం చుట్టూ ఈగలు ఎలా ముసరవో, డబ్బున్నా మనసు లేని మనిషి దగ్గరికి జనం కూడా రారు విలువ అనేది మన మంచితనాన్ని బట్టిగాని, ధనాన్ని బట్టి పెరగదని తెలుసుకో" అంటూ ముగించాడు.
విషయం తెలుసుకున్న భూషయ్య అందరితో కలసికట్టుగా ఉండటం నేర్చుకుని, అందరిచేత మంచివాడనిపించుకున్నాడు.

Responsive Footer with Logo and Social Media