విజ్ఞాన హీనుల కథ
"విక్రమార్క భూపాలా: గమనాయాసం కల్గకుండా నీకు ఒక కథ చెబుతా విను. పూర్వం అవంతి పట్టణాన్ని ఆనుకొని "సుధానుపురం" అను ఒక అగ్రహారం ఉండేది. ఆ అగ్రహారంలో అగ్నిదత్తుడనే పండితుడు ఉండేవాడు. అతడు అనేకమైన మంత్ర తంత్రములలో ప్రవీణుడు. అగ్నిదత్తునికి నలుగురు కుమారులుండిరి. వారు తండ్రి వద్దనే అన్ని విద్యలూ నేర్చుకొన్నారు. కానీ, వారికి లోకజ్ఞానం కొంచమంతకూడా లేదు.
అగ్నిదత్తుడు బాగా ముసలివాడైనాడు. అవసానదశ సమీపించినది. అందువలన అతడు. తన నలుగురు కుమారులను పిలిచి, వారికి అమూల్యములు, అపూర్వములైన మంత్రములను నలుగురుకి నాల్గుమంత్రములు ఉపదేశించినాడు. కాలము తీరుటచే మరణించినాడు.
పుత్రులు నలుగురు తండ్రికి జరుపవలసిన పితృకర్మలు ముగించారు. తరువాత వారు తమకు తండ్రి భోధించిన మంత్రములద్వారా డబ్బు సంపాదించుటకు అవంతి నగరానికి బయలుదేరారు.
సుధానుపురానికి, అవంతి నగరానికి మధ్య ఒక అడవి ఉంది. ఆ అడవి
దాటితే అవంతి నగరం చేరవచ్చు. క్రమముగా వారు నలుగురు సుధానుపురం దాటి ఆడవిలోకి వచ్చారు. అప్పుడు వారిలో పెద్దవానికి ఒక సందేహం వచ్చింది. అదేమనగా "తండ్రి ఉపదేశించిన మంత్రము ఫలిస్తుందా? లేదా?" అనునది.
"ఆ సందేహం తీర్చుకొనిగాని ఆవంతి నగరానికి పోకూడదు" అని నిశ్చయించుకొని తమ్ముళ్ళకు చెప్పాడు. వారు కూడ అందుకు సమ్మతించారు. పెద్దవాడు ఆ అడవిలో వెదకి. ఒక ఎముకను సంపాదించాడు. దానిని తమ్ముల ముందు ఉంచి, తన మంత్రాన్ని పఠించాడు. వెంటనే ఆ ఏముక ఒక అస్థి పంజరంగా తయారయింది, తన మంత్ర ప్రధానమునకు పెద్దవాడు ఎంతో ఆనందించాడు,
వెంటనే రెండవవాడు ముందుకువచ్చి "నా మంత్రమును గూడ పరీక్షించుకుంటాను" అని పలుకుచు, ఆ ఆస్థినంజరముపై తన మంత్రాన్ని ప్రయోగించాడు. వెంటనే ఆ ఆస్థిపంజరానికి, మాంసము - ప్రేగులు - రక్తము మొదలగునవి ఏర్పడినాయి, తన మంత్రం ఫలించినందుకు అతడు కూడా ఎంతో మురిసిపోయాడు.
మూడవ వాడు కూడా ముందుకు వచ్చాడు తన మంత్రాన్ని పరీక్షించుకోడానికి.
మాంసము, రక్తము, ప్రేగులు వగైరాలు గల ఆ నిర్జీవ కళేబరముపై
తన మంత్రమును పఠించినాడు మూడవవాడు. వెంటనే ఆ నిర్జీవ కళేబరానికి-
రోమములు, చర్మము, కళ్ళు, గోళ్ళు, కాళ్ళు, చేతులు చర్మం ఏర్పడినాయి. అదియొక సింహము ఆకారం అయింది. ప్రాణం మాత్రము లేదు. తన మంత్ర ప్రభావానికి మూడవవాడు ఉబ్బిపోయి గంతులు వేశాడు.
ఇక ఉన్నవాడు నాల్గవవాడు. వాని మంత్ర ప్రభావమువల్ల దానికి జీవము వచ్చును. జీవము వచ్చిన ఆ ప్రాణి ఊరుకుంటుందా? అసలే క్రూర జంతువు. లోకజ్ఞానము లేని మూర్ఖులు ఆది ఆలోచించలేదు,
వెంటనే నాల్గవవాడు ఆ నిర్జీవమైన సింహం మీద తన మంత్రాన్ని ప్రయోగించాడు. వెంటనే సింహం లేచి కూర్చుంది; జీవం వచ్చిన సింహం శరీరం. ఆది ఊరుకుంటుందా? ఆ నలుగురు బ్రాహ్మణులను పొట్టన బెట్టుకొంది: ఆడవిలోనికి హాయిగా వరుగెత్తింది.
"మహారాజా: విన్నావుకదా: ఆ నలుగురులో ఎవరు విజ్ఞానహీనుడు" అని భేతాళుడు ప్రశ్నించాడు.
"విక్రమార్కుడు "భేతాళా: మొదటి ముగ్గురు బ్రాహ్మణులు తమ తమ మంత్ర మహిమ తెలుసుకోదలచి - ఎముకను సింహంగా తయారుచేశారు. క్రూర జంతువని సింహమని తెలిసికూడా నాల్గవవాడు తనమంత్ర మహిమను చూడదలచు కొన్నాడు. కావున వారిలో నాల్గవవాడే జ్ఞానహీనుడు" అని బదులు చెప్పాడు.
భేతాళుడు వెంటనే ఎగిరి చెట్టుమీదికి చేరుకొన్నాడు. విక్రమార్కుడు విసుగు జెందక - మరల వృక్షము వైపు బయలుదేరాడు.
విక్రమార్కుడు మరల భేతాళుడుని భుజముపై వేసుకొని ఆశ్రమానికి బయలుదేరాడు. భేతాళుడు మరల ఇంకొక కథ చెప్పడం ప్రారంభించాడు.