విధవ-వెధవ
రామకృష్ణుడికి ఐదోయేడు రాగానే ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపించారు. వీధిబడిలో అతడితోపాటు చదువుకునే పిల్లలందరూ చదువు మీద శ్రద్ధ పెడితే, అతడు మాత్రం లోకవ్యవహారాల మీద కూడా దృష్టిపెడుతుండేవాడు.
అయినా వేదాభ్యాసం, సంస్కృతం, తెలుగుభాషల్లో ఏకసంథాగ్రాహి. గురువుగారు ఒక్కసారి బోధిస్తే చాలు, తూచ తప్పకుండా అప్పగించేవాడు. అందుచేత రామకృష్ణుడు ఎన్ని కొంటికోణంగి పనులు చేసినా గురువుగారు పెద్దగా మందలించేవాడు కాదు.
గురువుగారి భార్యపోయి చాలాకాలం అయింది. ఆయన మళ్లీ పెళ్లి చేసుకుందామనుకున్నా, ఆయన రూపం చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు ముందుకు రాలేదు.
అందుచేత ఆయన యింటి వీధి అరుగుమీద పిల్లలకి పాఠాలు చెబుతూనే మధ్య మధ్యలో వంటపనికి లోపలికి వెళ్ళేవాడు. ఒకసారి, పిల్లలందర్నీ వేదపాఠం వల్లెవేయమని చెప్పి వంటపనికి లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక విధవరాలు అటుగా వెళ్తుంది.
పిల్లలు, “బోడిముండ!” అని గేలిచేశారు. వంటపనిలో ఉన్న గురువుగారు ఆమెని గమనించి, “తప్పు. బోడిముండ అనకూడదు. ఆమె భర్త పోయాడు. భర్తపోయిన ఆడవాళ్లని ‘విధవ’ అనాలి” అని బోధించారు.
ఒక విద్యార్థి, “అయితే గురువుగారూ, భర్తపోయిన ఆడది విధవైతే, భార్యపోయిన బోడిగుండుని ఏమనాలి?” అడిగాడు. రామకృష్ణుడు చప్పున, “వెధవ” అని అన్నాడు. తోటిపిల్లలకి వివరిస్తూ, “విధవ స్త్రీలింగం అయితే వెధవ పుంలింగం.
ఉదాహరణ మన గురువుగారే” అని చెప్పాడు. పిల్లలందరూ నవ్వారు. “ఒరే లింగా… నీ ఉపమానంతో గురువుకే గుండు కొట్టావు గదరా…” అని వాపోయాడు గురువుగారు.