Subscribe

వేమన పద్యాలు


పద్యం:

చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు గొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నదేకదా!

పద్యం:

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.

పద్యం:

గంగిగోవుపాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: కడివెడు గాడిదపాలకంటె గరిటెడు ఆవుపాలు మేలును కలిగించును. భక్తితో పెట్టిన కూడు పట్టెడు అయినప్పటికి తృప్తిని కలిగిస్తుంది.

పద్యం:

నిక్క మైన మంచినీల మొక్కటి చాల
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?
చాటుపద్యములను చాలదా ఒక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: తట్టెడు గులకరాళ్ళ కంటె ఒకమంచి నీలము శ్రేష్ఠము. అదే విధముగ వ్యర్ధమైన పద్యముల వంటె ఒక చక్కని చాటు పద్యము శ్రేష్ఠమవుతుంది.

పద్యం:

మిరపగింజచూడ మీద నల్లగనుండు
కొరికిచూడు లోనచురుకు మనును
సజ్జను లగునారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: మిరియపుగింజ మీద నల్లగానుప్పటికి దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధముగా కనిపించినప్పటికీ అతనిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయము బయటపడుతుంది.

పద్యం:

మృగమదంబు చూడ మీఁద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పతికి దాని సువాసన నాలుగు దిక్కులకు వెదజల్లునట్లు పెద్దలైన వారు బయటికి ఆడంబరముగ కనపడక గొప్ప గుణములు కలవారై ఉండురు.

పద్యం:

మేడిపండు చూడ మేలిమై యుండు
పొట్టవిప్పి చూడ పురుగులుండు
బిరికి వాని మదిని బింకమీలాగురా
విశ్వ దాభిరామ! వినుర వేమ!

భావం: అత్తిపండు పైకందముగా కనపడుతుంది. దానిలొపల పురుగులుంటాయి. అదే విధముగ పిరికి వాని ధేర్యము కూడ పైన పటారము లొన లొటారముగ ఉంటుంది.

పద్యం:

నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన
నేర్తునన్న వాఁడు నింద జెందు
ఊరుకున్న వాఁడె యుత్తమయోగిరా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: తనను ఏమీ రాదు అని చెప్పుకొనే వాడు నిజముగా తేలివైనవాడు. అన్నీ వచ్చుటకు చెప్పువాడు గౌరవాన్ని పొందలేడు. మౌనముగానున్నవాడే ఉత్తమ యౌగి అనిపించుకొంటాడు.

పద్యం:

గంగ పాఱు నెపుడు కదలని గతితోడ
ముఱికి వాగు పాఱు మ్రోఁతతోడ
పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: గొప్పదైన గంగానది కూడ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చిన్నదైన మురికి కాలువ పెద్ద శబ్ధం చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవారికి, నీచునికి ఈ రకమైన భేదమే ఉన్నది.

పద్యం:

నిండునదులు పారు నిల్చి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ఓ వేమా ! నీటితో నిండియున్న నదులు గంభీరముగ నిల్లిచి ప్రవహించుచుండును. చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగముగ ప్రవహించుచుండును. చెడ్డగుణములు గలవారు మాటలాడినంతటి తొందరగా, మంచిగుణములు గలవారు మాట్లాడరు.

పద్యం:

అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వ దాభిరామ! వినుర వేమ!

భావం: ప్రపంచములొ ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందము కలిగించు వేమనా! అల్పుడు శాంతముతో మాట్లాడతాడు. కంఛు ధ్వని చేసినట్లుగా బంగాము ధ్వని చేయదుకదా! అల్పుడు కంచుతోనూ, సజ్జనుడు బంగారముతోనూ సమానము.

పద్యం:

కులము లోన నొకడు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణము చేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: కులములో ఒక వ్యక్తి గుణవంతుడన్నట్లయితే ఆ కులమంతా అతనివలన గౌరవాన్ని పొందుతుంది. వనములో ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నప్పటికీ ఆ వనమంతా వాసన వెదజల్లుతుంది.

పద్యం:

పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: పూజపునస్కారముల కంటె బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము.

పద్యం:

ఉత్తముని కడుపున నోగు జన్మించిన
వాఁడె చెఱకు వాని వంశమెల్లఁ
జెఱకు వెన్నుపుట్టి చెరపదా! తీపెల్ల
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: చెరకు మొక్క చివర కంకిపుట్టి చెరకు యొక్క తీపిని చెరచునట్లుగా, ఉత్తమ వంశములో దుష్టుడు పుట్టిన ఆ వంశము యొక్క గౌరవము నశించును.

పద్యం:

కులములోన నొకఁడు గుణహీనుఁడుండిన
కులము చెడును కాని గుణము వలన
వెలయు జెఱకునందు వెన్ను వెడలి నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: చెరకు గడకు చివర వెన్నులడితే చప్పబారినట్లుగా గుణహీనుడైనవ్యక్తి వలన ఆ కులమంతా చెడిపోవును.

పద్యం:

రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులముఁ జెఱచె
ఇలనుఁ బుణ్యపాప మీలాగు గాదొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: రాముని పుట్టుకతో రఘువంశము ఉద్ధరింపబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశము నశించింది. ప్రపంచములో పుణ్య పాపములు విధముగానే ఉంటాయి.

పద్యం:

హీనగుణమువాని నిలుజేరనిచ్చిన
నెంతవానికైన నిడుము గలుగు
ఈఁగ కడుఁపు జొచ్చి యిట్టట్టు సేయదా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: నీచుణ్ణి ఇంటిలో పెట్టిన ఎటువంటి వానికైన కష్టము కలుగుతుంది. ఈగ కడుపులోకి వెళితె వికారమును కలిగిస్తుంది.

పద్యం:

వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను
చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ
కుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: వేరువురుగు పెద్ద వృక్షాన్ని పాడుచేస్తుంది. చీడ పురుగు చిన్న చెట్టుని నశింపజేస్తుంది. చెడ్డవాడు గుణవంతుని చేరి అతన్ని నాశనము చేస్తాడు.

పద్యం:

హీనుఁడెన్ని విద్యలు నేర్చినఁగాని
ఘనుఁడుఁగాడు హీనజనుఁడె కాని
పరిమళములు మోయ ఖరము తా గజమౌనె
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: నీచుడైన వ్యక్తి ఎంత చదువు చదివినా అతడు గొప్పవాడుకాలేడు. సుగంధ ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాలేదు.

పద్యం:

విద్యలేనివాడు విద్వాంసు చేరువ
నుండగానె పండితుండు గాడు
కొలని హంసలకడ గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: హంసలతో కలిసినంత మాత్రమున కొంగమారనట్లుగా, పండితులతో కలిసినప్పటికి మూర్ఖుడు మారడు.

పద్యం:

అల్పజాతి వాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: దుష్టునకు అధికారము నిచ్చిన యెడల మంచి వారందరినీ వెడల కొట్టును. చెప్పుతినెడి కుక్క, చెరకుతీపియేరుగదు.

పద్యం:

అల్పుఁ డైన వాని కధిక భాగ్యము గల్గ
దొడ్డవారి దిట్టి తొలగఁ గొట్టు
అల్పబుద్ధి వా డధికుల నెఱఁగునా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మూర్ణునికి సంపదగలిగినట్లయితే పెద్ద వారినందరిని తిరస్కరించి తిరుగుతాడు. అల్పుడైన వానికి గొప్ప వారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది.

పద్యం:

ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన
మాట దెలసి నడచు మర్మ మెఱిఁగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ఒక సంవత్సరముపాటు బోధించినట్లెతే ఎద్దుకూడ మర్మములను తెలిసికొని నడుచుకుంటుంది. కాని ముప్ప్తె సంవత్సరాల నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలిసికొనలేడు.

పద్యం:

ఎలుకతోలుఁదెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపేగాని తెలుపురాదు
కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినఁ బలుకునా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ఎలుక తోలు ఎంతసేపు ఉతికినప్పటికీ అది తెలుపుగా మారదు. కర్ర్తో చేసిన బొమ్మ ఎంత కొట్టినప్పటికీ మాట్లడదు.

పద్యం:

పాము కన్న లేదు పాపిష్టి జీవంబు
అట్టి పాము చెప్పినట్లు వినును
ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: పామువంటి పాపిష్టి జీవికూడ ఏదైన చెఊఇన వింటుంది కాని మూర్ఖునికి ఎంత చెప్పిన అతని గుణము మారదు.

పద్యం:

వేము పాలువోసి ప్రేమతో బెంచిన
చేదువిరిగి తీపజెందబోదు
ఓగు నోగెగాక యుచితజ్ఞు డెటులౌను
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: వేప చెట్టుకి పాలు పోసి పెంచినప్పటికి చేస్దు విరిగి తీపెక్కదు. అదే విధంగా చెడ్డవాడు చెడ్డవాడే కాని మంచివాడు కాలేడు.

పద్యం:

ముష్టి వేపచెట్లు మొదలంట ప్రజలకు
పరగ మూలికకుఁ బనికివచ్చు
నిర్దయాత్మకుండు నీచుఁడెందునకౌను
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ఎదయలేని, నీచమైన వ్యక్తులకు ఏ మంచి పనులు చేసినా వారి స్వభావం మారదు. ఇది మనం ఇతరుల పట్ల మానవత్వం, దయ చూపిస్తూ ఉండాలని సూచిస్తుంది.

పద్యం:

పాలు పంచదార పాపర పండ్లలోఁ
జాలఁబోసి వండఁ జవికిరావు
కుటిల మానవులకు గుణమేల కల్గురా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ఎంత పంచదార పోసి వండినప్పటికి పాపరపండ్లలో తీపి ఎక్కడు. అదే విధముగ దోప్పులకు మంచి గుణము అలవడదు.

పద్యం:

పాల నీడిగింట గ్రోలుచునుండెనా
మనుజులెల్లఁగూడి మద్యమండ్రు
నిలువఁదగని చోట నిలువ నిందలు వచ్చు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ఈడిగవాని ఇంటిలో పాలు తగినా అవి మద్యమని లోకులు భావిస్తారు. నిలువ గూడని స్థలములో నిలిస్తే అపకీర్తి కలుగుతుంది.

పద్యం:

కానివాతోడఁ గలసి మెలఁగుచున్నఁ
గానివానిగానె కాంతు రవని
తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: పనికిరానివానితో తిరిగిన వారిని అందరూ పనికిరానివానిగానే చూస్తారు. తాటిచెట్టు కింద పాలు త్రాగినప్పటికి కల్లు త్రాగినట్లుగానే అందరూ భావిస్తారు.

పద్యం:

తామసించి చేయఁదగ దెట్టికార్యంబు
వేగిరింప నదియు విషమెయగును
పచ్చికాయదెచ్చి బడవేయ ఫలమౌన ?
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: కోపముతో ఏపనీ చేయకూడదు. అలా చేసినట్లై ఆపని జరగదు. వ్యతిరేకంగా కూడ జరుగుతుంది. పచ్చికాయనుతెచ్చి మూసలో వేసినంత మాత్రాన అది పండు కాదుగదా!

పద్యం:

కోపమునను ఘనత కొంచమైపోవును
కోపమును మిగులఁగోడు గలుగుఁ
గోపమడచెనేని గోర్కెలునీడేరు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: కోపము వలన గొప్పతనము నశించటమే గాక దుఃఖము కలుగుతుంది. కోపమును తగ్గించుకొన్న యెడల అన్ని కోరికలు ఫలిస్తాయి.

పద్యం:

నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు
బయట కుక్కచేత భంగపడును
స్థానబలిమిగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: నీటిలో నున్నపుడు మొసలి ఏనుగును కూడ జయింస్తుంది. కాని బయట కుక్కను కూడ ఏమి చేయలేదు. అది స్థానమహిమేకాని తనమహిమకాదు.

పద్యం:

నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు
బైట మూరుడైన బారలేదు
స్ధానబల్మిగాని తనబల్మి కాదయా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: నీటిలో స్వేచ్చగ సంచరించే చేప భూమి మీదకు రాగానే చనిపోతుంది. అదిస్థాన మహిమకాని తనమహిమ మాత్రం కాదుకదా!

పద్యం:

నీళ్ళమీదనోడ తిన్నగఁబ్రాకు
బైట మూరుడై బారలేదు
నెలవు దప్పుచోట నేర్పరి కొఱగాడు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: నీటిమీద ఏ ఆటంకము లేకుండ తిరిగి ఓడ భూమి పై ఒక మూరెడు కూడ వెళ్ళలేదు. ఎంత నేర్పరి అయినప్పటికీ తన స్థానము మారిన పనికి రాని వాడవుతాడు.

పద్యం:

కులము లేని వాడు కలిమిచే వెలయును
కలిమిలేనివాని కులము దిగును
కులముకన్న భువిని కలిమి ఎక్కువ సుమీ
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: తక్కువ కులము వాడైనప్పటికి ధనమున్నట్లయితే అతడు గౌరవాన్ని పొందును. ధనము లేనట్లయితే ఉన్నత కులస్థుడు కూడ రాణింపదు. కాబట్టి కాలముకంటే ధనము ఎక్కువ.

పద్యం:

కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు
విద్యచేత విఱ్ఱవీగువాఁడు
పసిడి గలుగువాని బానిస కొడుకులు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మంచి కులము గలవాడు , మంచి గోత్రముకలవాడు, చదువు కలిగిన వాడు బంగారము గలవానికి బానిసలవు అవుతారు. లోకములో ధనమే ప్రధానము.

పద్యం:

కనియు గానలేఁడు కదలింపఁడా నోరు
వినియు వినగలేడు విస్మయమున
సంపద గలవాని సన్నిపాతంబిది
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ధనమున్నవాడు సన్నిపాత రోగం వచ్చిన వచ్చినవలె ఎవరైన తనని చూచిన చూడనట్లుగా , వినినప్పటికీ విననట్లుగా నటిస్తాడు.

పద్యం:

ఏమి గొంచువచ్చె నేమితాఁ గొనిపోవుఁ
బుట్టువేళ నరుడు గిట్టువేళ
ధనము లెచటికేగు దానెచ్చటికినేగు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: మనిషి పుట్టీంపుడు తన కూడ తీసికొని రాలేదు. చనిపోయినప్పుదు కూద ఏమి తీసికొని వెళ్ళలేడు తానెక్కదికిపోతడో, సంపదలు ఎక్కడికి పోతాయో తెలియక లోభియై గర్వించటం వ్యర్ధము.

పద్యం:

తనువ దెవరి సొమ్ము తనదని పోషించి
ద్రవ్య మెవరిసొమ్ము దాచుకొన cగ
ప్రాణ మెవరిసొమ్ము పారిపోవక నిల్వ
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: తనస్వంతమని పోషించుటకు ఈ సరీరము ఎవరిదీకాదు. దాచినపెట్టుటకు ధనము ఎవరిదీకాదు. పారిపోకుండ నిలుచుటకు ఈ ప్రాణము ఎవరిదీకాదు. ఇవి ఏమియు శాశ్వతములు కావు.

పద్యం:

గొడ్డుటావు బదుక గుండ గొంపోయిన
పాలనీక తన్ను పండ్లురాల
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: గొడ్డు బోతైన ఆవు దగ్గరకి పాలుపితకటానికి కుండను తీసికొనివెళ్తే పండ్లు రాలేటట్టు తన్నుతుంది కాని పాలు ఇవ్వదు అదే విధముగా లోభిని యాచించటం కూడ వ్యర్థము.

పద్యం:

మేక కుతికబట్టి మెడచన్ను గుడవంగ
ఆఁకలేల మాను ఆశగాక
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మేక మెడకిందనున్న చన్నులను కుడిచిన పాలు దొరకవు. ఇదే రీతిగాలోభిని యాచించిన ప్రయోజనముండదు.

పద్యం:

పెట్టిపోయలేని వట్టి నరులు భూమిఁ
పుట్టనేమి వారు గిట్టనేమి
పుట్టలోనఁ జెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ఎదుతి వారికి సహాయము చేయనివాడు పుట్టినా చచ్చినా ఒకటే. పుట్టలో చెదలు పుట్టినా , చచ్చినా ఒకటే కదా!

పద్యం:

ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు
తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక
మురికి భాండమందు ముసుగు నీగల భంగి
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ఆయువు ఉన్నంత కాలము మనుష్యులు ఆశ వదలలేక కాలము గడుపుచుందురు. మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరించుదురు.

పద్యం:

నీళ్ళలోని చేప నెరి మాంస మాశకు
గాల మందు చిక్కి గూలినట్లు
ఆశ బుట్టి మనుజు డారీతి చెడిపోవు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం:నీటిలో వున్న చేపను మాంసం కోసం బలంగా వేయబడ్డ వలలో చిక్కుకుంటుంది. అలాగే ఆశపడి మోసగుడ్తునప్పుడు మనిషి కూడా తన మార్గం తప్పి చెడిపోతాడు.

పద్యం:

ఆశ పాపజాతి యన్నింటికంటెను
ఆశచేత యతులు మోసపోరె
చూచి విడుచువారె శుద్ధాత్ములెందైన
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ఆశ చాలా పాపమయినది. అశచే మునులు సహితము చెడిపోయిరి. ఆ ఆశను విడిచినవారే నిష్కల్మషమయిన మనసు గలవారు.

పద్యం:

అన్నిదానములను నన్నదానమె గొప్ప
కన్నతల్లికంటె ఘనములేదు
ఎన్న గురునికన్న నెక్కుడులేదయా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: అన్ని దానములకంటె అన్నదానము గొప్పది. కన్నతల్లి కంటె మించినదిలేదు. గురువుకంటె గొప్పదిలేదు.

పద్యం:

ఆశకోసి వేసి యనలంబు చలార్చి
గోఁచి బిగియగట్టి గుట్టు దెలసి
నిలిచి నట్టివాఁడె నెఱయోగి యెందైన
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ఆశ వదలి , ఆశలను అగ్ని చల్లార్చుకొని, కామమువదలి గోచిబిగించి కట్టి, జ్ఞానము తెలుసుకొనువాడే నేర్పరియైన యోగి.

పద్యం:

కనకమృగము భువిని గద్దు లేదనకను
తరుణి విడిచి చనియె దాశరధియు
తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: భూమిపై బంగారులేళ్ళు వున్నవో లేవో అని ఆలోచింపకయే శ్రీరాముడు భార్యను విడచి ఆ లేడి వెంటబడెను. ఆ మాత్రము తెలుసుకొన లేనివాడు దేవుడెట్లయ్యెను?

పద్యం:

చచ్చిపడిన పశువు చర్మంబు కండలు
పట్టి పుఱికి తినును పరగ గ్రద్ద
గ్రద్ద వంటివాడు జగపతి కాడొకో
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: గ్రద్ద చనిపోయిన పశువుయొక్క చర్మమును , కండలను ఊడబెరికి తినును, ఈ రాజులును ఆ గ్రద్దవంటివారే కదా.

పద్యం:

ఆలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను
గలలఁ గాంచులక్ష్మి గనుటలేదు
ఇలను భోగభాగ్య మీతీరు గాదొకో
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: కెరటములో బుట్టిన బుడగలు అప్పుడే నిశించును. కలలోకనబడులక్ష్మిని పొందలేము. ఈభూమిలో భోగభాగ్యములుకూడా ఇట్టివేకదా!

పద్యం:

కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి
కొండముచ్చులెల్ల గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యుడుండుట
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: కొండముచ్చులు కోతిని తెచ్చి , క్రొత్తవస్త్రమునట్టి పూజించినట్లే నిర్భాగ్యులు గుణము లేనివారిని కొలుచుచుందురు.

పద్యం:

కల్లలాడువాని గ్రామకర్త యరుగు
సత్యమాడువాని స్వామి యరుగు
బెక్కుతిండపోతుఁబెండ్లా మెరుంగురా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: అబద్ధమాడు వానిని గ్రామపెద్ద తెలుసుకొనును. సత్యవంతుని భగవంతుడు తెలుసుకొనును. తిండిపోతుని భార్య యెరుగును.

పద్యం:

కల్ల నిజమెల్ల గరకంఠు డెరుగును ,
నీరు పల్లమెరుగు నిజముగాను
తల్లితానెరుగు తనయుని జన్మంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: నీరు పల్లమెరుగును , సత్యము అసత్యము భగవంతుడు తెలుసుకొనును. కుమారుని పెట్టుక తల్లికే తెలుసును.

పద్యం:

మైలకోకతోడ మాసినతలతోడ
ఒడలు మురికితోడ నుండెనేమి
అగ్రకులజుఁడైన నట్టిట్టు పిల్వరు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మాసిన చీరతోను , మాసినతలతోను, మురికిగాయున్న శరీరముతోనువున్నచో గొప్పకులమునందు బుట్టినవారినయినను హినముగాచూతురు.

పద్యం:

ఉప్పులేనికూర హీనంబు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు
యప్పులేనివాడె యధిక సంపన్నుండు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ఉప్పులేని కూర రుచిగావుండదు. పప్పులేని భోజనము బలవర్ధకముకాదు. అప్పులేనివాడే ధనవంతుడు.

పద్యం:

చెట్టుపాలు జనులు చేదందు రిలలోన
ఎనుపగొడ్డు పాలదెంత హితవు
పదుగురాడుమాట పాటియై ధరజెల్లు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ఈ ప్రపంచములో జనులు చెట్లపాలు మంచివి గావందురు. గేదెపాలు వారికి హితముగా నుండును. ఈ ప్రపంచములో పదిమందీ ఆడుమాటయే చెల్లును.

పద్యం:

పట్టుపట్టరాదు పట్టి విడువరాదు
పట్టేనేని బిగియ బట్టవలయు
బట్టివిడుచుకన్న బరగ జచ్చుటమేలు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: పట్టుదలయే వహింపరాదు. వహించినచో ఆ పట్టు వదలరాదు. పట్టినపట్టు నడిమిలోనే విడచుటకంటే మరణము మేలు.

పద్యం:

తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్విజనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తనతప్పులెరుగరు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ఇతరుల తప్పులను పట్టుకొనువారు , అనేకులు గలరు. కాని తమ తప్పులను తాము తెలుసుకొనలేరు.

పద్యం:

అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాభిరామ! వినుర వేమ!

భావం: తరచుగ పాడుచుండిన కంఠధ్వని మాధుర్యముగ నుండును. ప్రతిదినము తినుచుండిన వేపవేరైనను తియ్యగ నుండును. ప్రయత్నము చేయచుండిన పనులు నేరవేరును. ఈ ప్రపంచమున పద్ధతులు యీ విధముగ ఉండును.

పద్యం:

తమకుగల్గు పెక్కు తప్పులునుండగా
ఓగు నేరమెంచు నొరులగాంచి
చక్కిలంబుగాంచి జంతిక నగినట్లు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: తనయందు అనేక్ తప్పులు పెట్టుకొని , దుర్మార్గులు ఇతరుల తప్పులను యెన్నుచుదురు. చక్కిలమునుచూచి జంతిక నవ్వినట్లు వుండును కదా!

పద్యం:

ఇనుము విరిగె నేని యిరుమారు ముమ్మారు
కాచి యతుకవచ్చు క్రమముగాను
మనసు విరిగెనేని మరియంట నేర్చునా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ఇనుము విరిగిన కాల్చి , అతుకవచ్చును, మనసు విరిగినచో మరల అంటీంచుట ఎవరితనము కాదు.

పద్యం:

ఒరుని చెరచదమని యుల్లమం దెంతురు
తమకుచే టెరుగని ధరణి నరులు
తమ్ము జెఱచువాడు దేవుడు లేడొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ఇతరులను పాదుచేయవలెయునని కొందరు ఆలోచనచేయుదురు. కాని, తమకు కలుగు ఆపదలను గ్రహింపలేరు. ఒకరిని పాదుచేయ వలయుననిన, భగవంతుడు వారినే పాడుచేయును.

పద్యం:

కానివాని చేతగాసు వీసంబిచ్చి
వెంటదిరుగువాడె వెఱ్రివాడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా
విశ్వదాభిరామ! వినురవేమ.

భావం: దుర్మార్గుని చేతికి ధనముయిచ్చి , దానికై మరల అతని వెంట తిరుగుట తెలివితక్కువతనము. పిల్లిమ్రింగినకోడి పిలిచిననూ పలుకదుకదా.

పద్యం:

మాటలాడనేర్చి మనసు రాజిలజేసి
పరగఁ బ్రియము చెప్పి బడలకున్న
నొకరి చేత సొమ్ము లూరక వచ్చువా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ఇతరులకు సంతోషము కలుగునట్లు మాటలాదు విధానము నేర్చుకొని వారి మనస్సు ఆనందపరచి, శ్రమపడకుండ వారి నుండి చేతిలో సొమ్ము తేరగనే రాదు.

పద్యం:

చంపదగినయట్టి శత్రువు తనచేత
జిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటె చాలు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: చంపదగినట్టి శత్రువు తన చేతిలో చిక్కిననూ , అపకారము చేయక, దగిన ఉపకారమునే చేసి విడిచిపెట్టుట మంచిది.

పద్యం:

వాన గురియకున్న వచ్చును క్షామంబు
వాన గురిసెనేని వరదపారు
వరద కరవు రెండు వలసతో నెరుగుడీ
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: వానగురియనచో కరువు వచ్చును , వానకురిసిన వరద వచ్చును. వరదా కరువూ రెండునూ కదాని వెంటా మరియెకటి వచ్చునని తెలుసుకొనవలెను.

పద్యం:

పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన
పట్టునా జగంబు వట్టిదెపుడు
యముని లెక్క రీతి అరుగుచు నుందురు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: పుట్టిన వారందరూ మరణించనిచో యీ భూగోళము పట్టదు. యమునిలెక్క ప్రకారము ఒకరి తరువాత ఒకరుచనిపొవుచునే యుందురు.

పద్యం:

వాన రాకడయును బ్రాణాంబు పోకడ
కానబడ దదెంత ఘనునికైన
కానపడిన మీద కలియెట్లు నడచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ఈ కలియుగములో వానరాకడ , ప్రాణము పోకడ ముందుగా యెవరునూ తెలుసుకొనలేరు. ఇది కలియుగ ధర్మము.

పద్యం:

చిప్పబడ్డ స్వాతిచినుకు ముత్యంబాయె
నీటిబడ్డ చినుకు నీటఁగలిసె
బ్రాప్తిగల్గుచోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: స్వాతికార్తిలో ముత్యపు చిప్పలో పదినచినుకు ముత్యమగును నీటబదినది నీటిలో కలిసిపోవును. ప్రాప్తించుచోట ఫలము తప్పదు.

పద్యం:

ఎన్నిచోట్లు తిరిగి యేపాట్లు పడినను
అంటనియ్యక శని వెంటదిరుగు
భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ఎన్నిచోట్ల తిరిగి ఎన్ని కష్తములు పడినను, లాభము కలుగునీయక శని వెంటాడి తిరుగుచుండును. తమ ప్రదేశము క్రొత్తదైననూ, తినువారు క్రొత్తవారు కాదుగదా.

పద్యం:

కర్మ మధికమై గడచి పోవగరాదు
ధర్మరాజు దెచ్చి తగని చోట
గంకుబటుఁ జేసిఁ గటకటా దైవంబు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: పూర్వజన్మమున చేసిన కర్మ అనుభవింఒపక తప్పదు. ధర్మరాజు వంటివాడు. ఒక సామాన్యమైన చిన్నరాజు దగ్గర కొంతకాలము కంకుభట్టుగా వుండెను.

పద్యం:

అనువుగాని చోట అధికుల మనరాదు ,
కొంచెముండుటెల్ల కొదువ కాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా ?
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: విలుగానిచోట అధికుదనని సంచరించరాదు. సామాన్యముగనుండుట నీచముగాదు. అద్దములో కొంత చిన్నదిగ కంపించిననూ అసలు చిన్నది కాదుగకా.

పద్యం:

ఇమ్ము దప్పువేళ నెమ్మెలన్ని యుమాని
కాలమొక్కరీతి గదపవలయు
విజయ డిమ్ము దప్పి విరటుని గొల్వడా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: చెడ్డకాలము వచ్చినపుదు భోగములన్నియు వదులుకొని సామాన్యముగ కాలము గడుపవలయును. అర్జునుడు రాజ్యము పోగొట్టుకొని విరాటరాజు కొలువులో చేరెనుగదా.

పద్యం:

చిక్కియున్ననేళ సింహబునైనను
బక్కకుక్క కరచి బాధచేయు
కలిమిలేనివేళఁ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: బలము బలము లేనప్పుదు సింహమునైనను బక్కకుక్క కరచి బాధపెట్టును. సక్తిలేనప్పుడుపంతంములకుపోకతలవంచుకొని తిరుగుటమంచిది.

పద్యం:

లక్ష్మి యేలినట్టి లంకాధిపతి పురి
పిల్ల కోతి పౌజు కొల్ల పెట్టెఁ
జేటు కాలమయిన జెఱుప నల్పులె జాలు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: గొప్ప ధనవంతుదైన రావణుని లంకను సామాన్యమైన కోతులు నాసనము చేసెను. చెడ్డకాలము వచ్చినప్పుదు సామాన్యులైనను అపకారము చేయుదురు.

పద్యం:

మొదట ఆశపెట్టి తుదిలేదుపొమ్మను
పరలోభులైన పాపులకును
ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: మొదట ఉపకారము చేసెదననిచెప్పి , త్రిప్పిత్రిప్పి తరువాత పొమ్మను లోభులకు, అపకారము వుండేలు దెబ్బవలె తప్పక తగులును.

పద్యం:

ఇచ్చువానియొద్ద నీయని వాడున్న
ఇచ్చుగాని యీవి సాగనీడు
కల్పతరువు క్రింద గచ్చ చెట్టున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: దాతదగ్గర లోభిచేరినచో, చచ్చినను ధర్మము, పరోపకారము చేయనీయుడు. సకల కోరికలనిచ్చు కల్పవృక్షము క్రింద ముండ్లపొదవుండినచో కల్పవృషము దగ్గరకు పోనీయదుగదా.

పద్యం:

అరయ నాస్తియనక యడ్డుమాటాడక
పట్టుపడక మదిని దన్ను కొనక
తనది గాదనుకోని తాబెట్టునదె పెట్టు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ఆలోచింపగా , లేదనక అడ్డుచెప్పక తట్టుపడక మనస్సులో "యీయనా ? వద్దా ! అని ఆలోచింపక తనది కాదని ఇతరులకు పెట్టుటే మంచిదే.

పద్యం:

ధనము కూడబెట్టి దానంబు చేయక
తాను దినక లెస్స దాచుకొనగ
తేనె టీగ గూర్చి తెరువరి కియ్యదా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ధనము సంపాదించి , దానమీయక, తాను తినక, దాచుకొనుట, తేనెటీగ తేనెను ప్రోగుచేసి బాటసారికి యిచ్చునట్లుగనే ఇతరుల పాలు చేయుట అగును.

పద్యం:

కొంకణంబు పోవఁ గుక్క సింహము కాదు
కాశి కరుగఁ బంది గజము కాదు
వేరుజాతి వాడు విప్రుండు కాలేడు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: కేరళ దేశము పోయిననూ కుక్క సింహము కాలేదు. కాశీకి పోయినను పంది యేనుగు కాలేదు. ఇతర కులము వారు బ్రహ్మణులు కాలేరు.

పద్యం:

తవిటి కరయ వోయ దండులంబులగంప
శ్వాన మాక్రమించు సామ్యమగును
వైశ్వవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: తవుడును చూచుటకు బోవగా బియ్యము గంప కుక్క తినివేసినట్లుగ , వైశ్యునిసొమ్ము నీచుల పాలగు చుండును.

పద్యం:

దాత కాని వాని దరచుగా వేఁడిన
వాఁడు దాత యౌనె వసుధలోన
ఆరు దర్భయౌనె యబ్ధిలో ముంచినా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: దాతృత్వము లేనివానిని యెన్ని సార్లు అడిగినను యేమియు లాభములేదు. సముద్రములో ముంచిననూ అవురుగడ్డి దర్భగాదు.

పద్యం:

పరగ రాతి గుండు పగుల గొట్ట వచ్చు
కొండలన్ని పిండి కొట్టవచ్చు
కట్టినచిత్తు మనసు కరిగింపగారాదు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: రాతి గుండు పగులగొట్టవచ్చును. కొండలన్నియు డండిగొట్ట వచ్చును. కఠిన హృదయుని మనసు మాత్రము మార్చలేము.

పద్యం:

వంపుకర్రగాల్చి వంపు దీర్పగవచ్చు
కొండలన్ని పిండి గొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపగరాదు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: వంకరగా నువ్నె కర్రను కాల్చి దాని వంపు తీయవచ్చును. కొండ లన్నిటినీ పిండిగొట్ట వచ్చును. కాని కఠిన హృదయము మనసు మాత్రము మార్చలేము.

పద్యం:

విత్తముగలవాని వీపు పుండైనను
వసుధలోన జాల వార్తకెక్కు
బేద వానియింట బెండ్లయిననెరుగరు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ధనవంతుని వీపుపై పుండు పుట్టినను , ఆ విషయమును లోకములో అందరును చెప్పుకొందురు. పేదవాని యింటిలో పెండ్లి అయినను చెప్పుకొనరు.

పద్యం:

ఆపదల వేళ బంధులరసిజూడు
భయమువేళ జూడు బంటుతనము
పేదవేళ జూడు పెండ్లాము గుణమును
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: కష్టములు కలిగినప్పుడు బంధువులు దగ్గరకు పోయిపరిశీలిపపుము, భయము కలిగినప్పుడు, ధైర్యమును పరీక్షింపుము. దరిద్రముగా వున్నప్పుడు భార్యగుణము పరీక్షింపుము.

పద్యం:

ఆలిమాటలు విని అన్నదమ్ములబాసి
వేఱె పొవువాడు వెఱ్రివాడు
కుక్క తోకబట్టి గోదావ రీదునా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: భార్యమాటలు విని అన్నదమ్ములను వదలిపోవుట అజ్ఞానము కుక్కతోక పట్టుకొని గోదవరి ఈదుట అసాధ్యము అనితెలుసుకొనుము.

పద్యం:

మగని కాలమందు మగువ కష్టించిన
సుతుల కాలమందు సుఖమునందు
కలిమి లేమి రెండు గల వెంతవారికి
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: భర్తకాలములో కష్టపడి గృహమును కాపాడినచో, కొడుకులు పెద్దవారైనప్పుడు సుఖపడ వచ్చును. ఎంతవారికైననూ కలిమి, లేమి రెండునూ జీవితములో వచ్చుచుండును.

పద్యం:

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోనిపోరు నింతింత గాదయా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: చెప్పులో ఉన్నరాయి , చెవిలో దూరిన జోరీగ, కంటొలోపడిన నలసు కాలిముల్లు, ఇంటిలోని జగడం వెంటనే తగ్గక చాలా బాధిస్తాయి.

పద్యం:

తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు
పుట్టనేమి ? వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: తల్లిదండ్రులపై ప్రేమ లేని పుత్రుడు పుట్టినా చనిపోయినా నష్టములేదు. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి. నశిస్తూ ఉంటాయి.

పద్యం:

తనకు లేనినాడు దైవంబు దూరును
తనకు గల్గెనేమి దైవమేల ?
తనకు దైవమునకు దగులాట మెట్టిదో
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మనిషి తనకు లేనప్పుడు దేవుని దూషిస్తాడు. ఉన్నప్పుడు దేవుని మరచిపోతాడు. ఇదే మనిషికి దేవునికి సంబంధమై ఉంటుందేమోకదా!

పద్యం:

మాటలాడు నొకటి మనసులోన నొకటి
ఒడలి గుణము వేరె యోచన వేరె
ఎట్లుగల్గు ముక్తి యీలాగు తానుండ
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మనసులో ఉన్నది ఒకటి , పైకి మాటాదేది మరొకటి. తన గుణము ఒకటి, అలోచన వేరొకటి ఉన్నవానికి మోక్షము దొరకదు.

పద్యం:

మ్రుచ్చు గుడికి పోయి ముడివిప్పునే కాని
పొసగ స్వామిజూచి మ్రొక్కడతడు
కుక్క యిల్లుసొచ్చి కుండలు వెదుకదా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ఇంటిలో ప్రవేశించిన కుక్క కుండలు వెదనుకునట్లుగ గదిలోకి వచ్చిన దొంగ ధనము కొరకు వెదుకునుగాని దేవునికిమ్రొక్కడు.

పద్యం:

అంతరంగమందు సపరాధములు చేసి
మంచివానివలెను మనుజు డుండు
ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మనిషి చాటు మాటూగ అనేక తప్పుచేసి ఇతరుల ఎదుట మంచివాడుగా నటించవచ్చును. కాని సర్వము తెలిసిన భగవంతుడు మనిషి చేసిన తప్పులనుగుర్తిస్తాడు.

పద్యం:

వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్
గట్టగానె ముక్తి గలుగబోదు
తలలు బోడులైన తలుపులు బోడులా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: వేష భాషలు నేర్చుకొని కాషాయ బట్టలు కట్టినంత మాత్రాన మోక్షమురాదు. తలలు చేసినంత మాత్రాన అతని మనసు బోడిది కాదుకదా!

పద్యం:

ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావమిచ్చి మెచ్చు బరమలుబ్ధు
పంది బురద మెచ్చు బన్నీరు మెచ్చునా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మూర్ఖుణ్ని మూర్ణుడే మెచ్చుకొంటాడు. అజ్ఞానియైన వాడు లోభివానినే మెచ్చుకుంటాడు. పంది బురదనే కోరుకుంటుంది. కాని పన్నీరును కోరుకోదు.

పద్యం:

గాజుకుప్పెలోన గడఁగుచు దీపంబ
దెట్టు లుండు జ్ఞాన మట్టులుండు
దెలిసినట్టి వారి దేహంబులందును
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: గాజు బుడ్డిలో ఏవిధముగా దీపము నిలకడతో వెలుగుతుందో అదే విధముగ తెలివిగల వారియండు జ్ఞాన దీపము ప్రవేశిస్తుండి.

పద్యం:

అన్న మిడుటకన్న అధిక దానంబుల
నెన్ని చేయనేమి యేన్నఁబోరు
అన్న మెన్న జీవనాధార మగునయా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ఇతర దానములు ఎన్ని చేసిననూ అన్నదానముతో సాటిగావు. లేలోచించినచో అన్నమే యీ లోకములో జీవనాధారము.

పద్యం:

ఇహరంబులకును నిది సాధనంబని
వ్రాసి చదివిన విన్నవారికెల్ల
మంగళంబు లొనరు మహిలోన నిది నిజము
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ఈ లోక మందును, పరలోక మందును గూడసుఖపడుటకు మార్గముగ, నుందునని ఈ శతకము వ్రాసితిని. దీనిని చదివిన వారికిని విన్నవారికిని శుభములు కలుగును. ఇది నిజము.

Responsive Footer with Logo and Social Media