వేదశర్మ కథ
విక్రమార్క మహీపాలా: పూర్వం వింధ్యారణ్య ప్రాంతములో ఒక గ్రామంలో వేదశర్మ అను బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆతడు ఆ చుట్టుపక్కల గల గ్రామాలలోని వారికి తిథివార, నక్షత్ర ఫలితాలను చెప్పుతు వారిచ్చు- పప్పు బియ్యములతో తన కుటుంబాన్ని పోషించుకొనేవాడు.
వేదవర్మ భార్య సుశీల, వారికి చాల కాలానికి ఒక పుత్రుడు పుట్టాడు. ఆ బాలుని వారు చాల గారాబంతో పెంచుకొనేవారు. క్రమంగా ఆ బాలుడు అంబాడుడు నుంచి తప్పటడుగులు వేసే ప్రాయానికి వచ్చాడు. అనగా రెండవయేడు వచ్చింది బాలునికి, వేదశర్మ ప్రతిరోజూ ఆయ వారానికి ప్రక్క గ్రామాలకు పోయి, తాను సంపాదించిన వానితో సంతుష్టిగా, హాయిగా తన కుటుంబాన్ని పోషించుకొనేవాడు.
ఒకనాడు వేదశర్మ ప్రక్క గ్రామాలకు పోయి, తిరిగి తన గ్రామానికి వస్తుండగా, చీమ్మ చీకటి ప్రారంభమైంది. ఆయినా వేదశర్మ యింటికి పోకున్నాగాని, మరునాటికి తిండి ఉండదు. తోడు కోసం కొంత సేపు ఎదురుచూశాడు. ఎవ్వరూ వస్తున్న జాడ కన్పించలేదు; అందువల్ల దైవంపై భారంవేసి బయలుదేరాడు.
అలా వస్తున్న వేదశర్మకు ఒక బ్రహ్మరాక్షసి ఎదురై యిలా అంది. "నరుడా: నరమాంసం కొరకు యీ అడవి అంతా గాలిస్తూ వస్తున్నాను. "నా శ్రమ ఫలించింది" అంటూ వికటంగా నవ్వుతూ అతని మీదికి వచ్చింది. వేదశర్మకు ఆ రాక్షసిని చూడగానే పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. భయంతో గడగడ వణికిపోతూ యిలా అన్నాడు.
"రాక్షస రాజా! నీకు చిక్కినవాణ్ణి నీకు కాకుండా ఎక్కడికి పోతాను. అయినా, నా కడసారి కోర్కెను దీర్చుట నీ ధర్మము; అని చెప్పగా
రాక్షసుడు ఆలోచించి "సరే: ఏమిటో అది వివరించు" అన్నాడు. "ముందుగా నాకు వాగ్దానం గావించు" అని చేయిచాచాడు బ్రాహ్మణుడు.
రాక్షసుడు బ్రాహ్మణుని ఎగాదిగ జూచి "నీ ప్రాణములు తక్క ఏదైనా నీ కోరిక నెరవేరుస్తాను" అని చేతిలో చేయి వేశాడు. "రాక్షసరాజాః మా యిల్లు చాల దగ్గరగానే ఉంది. నాకు లేక లేక కలిగిన రెండేండ్ల పుత్రుడు ఉన్నాడు భార్య సుశీల ఉంది. ఇంక మా యింట ఎవ్వరూ లేరు. ఒకసారి వారిని చూచి వస్తాను. వారికి తగిన నీడ అంటే మా బంధువుల యింటికి పొమ్మని చెప్పి వస్తాను. నా భార్య మహాసాధ్వి. నా మాట మన్నిస్తుంది. నేను తెల్లవారకుండగనే వచ్చి నీకు ఆహారమవుతాను" అని విన్న వించుకొన్నాడు.
బ్రహ్మరాక్షసుడు "ఇంటికి వెళ్ళి నీవు తిరిగి వస్తావా? అయినా నేను వాగ్దానం చేశాను; బలవంతంగా నా చేత చేయించావు. కాబట్టి వెళ్ళిరా: తెల్లవారకుండగా రా! ఇక్కడనే ఉంటాను" అని పంపించాడు.
వేదశర్మ సంతోషంతో యింటికి వచ్చాడు. భార్యకు జరిగినది అంతా చెప్పాడు. "సాధ్వీ: ప్రాణము పోయే సమయం వచ్చినా ఆసత్యమాడ వద్దని అందరికీ చెప్పేవాడిని, భగవంతుడు నాకే యీ పరీక్ష పెట్టాడు. నాకు వెళ్ళడానికి సంతోషంతో అనుమతి ఇయ్యి, నీవూ- బాబూ, మీ అమ్మగారింటికి వెళ్ళండి. సదా మిమ్ములను భగవంతుడే కాపాడుతాడు" అని బోధించి- వేదశర్మ తిరిగి చెట్టువద్దకు వచ్చాడు.
బ్రహ్మరాక్షసుడు బ్రాహణుని రాకతో మిక్కిలి ఆనందం చెందాడు. “ఓ బ్రాహ్మణోత్తమా! నీ సత్యవచనానికి, నీ శిలానికి ఎంతో మురిపం కలిగింది. నీ వంటి సదా బ్రహ్మణులు యింకా యీ లోకంలో ఉన్నారంటే త్రిమూర్తులు గూడ హర్షిస్తారు. నీ వంటి పూజ్యుని చంపి నేను నరకానికి పోలేను. నీవు హాయిగా పోయి, నీ భార్య పుత్రులతో సుఖంగా జీవించు" అని పలుకుచూ అపారమైన బంగారాన్ని బహూకరించి పంపిచేశాడు.
"మహారాజా! విన్నావుగదా కథ. ఇందులో బ్రహ్మరాక్షసుడు గొప్ప వాడా? బ్రాహణుడు గొప్పవాడా?" అని ప్రశ్నించాడు.
విక్రమార్కుడు ఆలోచించి, భేతాళ: బ్రాహ్మణుడు స్వార్థాన్ని ఆశించినవాడు. బ్రహ్మరాక్షనుడు నర మాంస భక్షకుడు అయినా, మంచి ఆకలి సమయానికి దొరికిన ఆహార్నా గూడ- స్వార్థముకోసంగాక, మాటను నిల్పుకొన్నాడు. బ్రాహ్మణుని విడిచివేశాడు. పైగా "తరతరాలకు వానికి భోజనవసతి ఏర్పాటు చేశాడు. బంగారము నిచ్చి. కావున నా దృష్టిలో బ్రహ్మరాక్షసుడే గొప్ప" అన్నాడు.
ఈ విధంగా మౌనభంగం కావడంతో భేతాళుడు ఎగిరిపోయాడు. విక్రమార్కుడు తిరిగి వృక్షము దిక్కు పయనం సాగించాడు.
విక్రమార్కుడు తిరిగి వృక్షము చేరుకొన్నాడు. భేతాళుని బందించి భుజముపై వేసికొని సన్యాసి ఆశ్రమానికి చేరుటకు బయలుదేరాడు. తప్పించుకొనే మార్గము తెలిసికొన్న భేతాళుడు, విక్రమార్కునికి యీ క్రింది కథ చెప్పుటకు ప్రారంభించాడు.