వడ్రంగి- సింహం కథ



మృగరాజు దర్పసారం ఆరోగ్యం బాగాలేదు. లేచి తిరగలేని పరిస్థితి. వేటాడి ఆహారాన్ని సంపాదించుకోవడం కష్టంగా ఉంది. దాంతో మంత్రులు పులి, నక్క, కాకి, ఒంటెలను మాంసాన్ని తెచ్చి పెట్టమని ఆజ్ఞాపించింది. ఆరోగ్యం కుదటపడేవరకూ సహకరించమంది. ‘సరే’నని ఆహారాన్ని తెచ్చిపెట్టేందుకు మంత్రులు నలుగురూ బయల్దేరారు. అడవి అంతా వెదికారు. ఎక్కడా ఏమీ దొరకలేదు. తర్జన భర్జన పడ్డారు. వేళకి రాజుకి ఆహారాన్ని సమకూర్చాలి. అందుకు ఏంచెయ్యాలేం చెయ్యాలనుకుంటున్నంతలో కాకికి ఓ ఆలోచన తట్టింది. తమ మంత్రివర్గంలోని ఒంటెను చంపి, రాజుకి ఆహారాన్ని సమకూర్చవచ్చన్నది దాని ఆలోచన.

ఆ ఆలోచనకి, నక్క-పులి భయంగా వణికిపోయాయి. కాకి ఆ మాట అన్నప్పుడు వారి దగ్గరగా ఒంటె లేదు. అది, కొద్దిదూరంలో లేత ఆకులు మేస్తూ ఉంది.‘‘పిచ్చెక్కిందా నీకు! ఒంటెను చంపుదామంటావా? ఈ సంగతి రాజుకి తెలిసిందనుకో, మన ప్రాణాలు పోతాయి.’’ అంది నక్క.‘‘మహారాజు మంత్రి పదవి ఇచ్చి మరీ ఒంటెను గౌరవిస్తున్నాడు. అది తెలుసుకో ముందు.’’ అంది పులి.‘‘అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఆకలి బాధతో ఉన్నవాడికి ఇది మంచి, ఇది చెడు అని తెలియదు. పొట్ట నింపుకోవడమే ప్రధానమనిపిస్తుంది. తను పెట్టిన గుడ్లనే ఆకలికి తట్టుకోలేక పాము మింగేస్తుంది. అలాగే తన కన్న పిల్లల్నే ఆకలికి తట్టుకోలేక పులి చంపి తింటుంది. ఇదీ అంతే!’’ అంది కాకి.ఆకలి బాధను ఓర్చుకోలేక కన్నపిల్లల్నే తాము తింటాయని కాకి అన్నదానికి పులి బాధపడింది. అయితే ఆ బాధను కనబరచక ఇలా అంది.‘‘ఆకలిబాధను తట్టుకోలేక మహారాజు ఒంటెను చంపి తింటే తిననీ. అది వేరే విషయం. మనం చంపడం మాత్రం తప్పు. రాజు ఆహారాన్ని వెతకమన్నాడు. వెతికాం. దొరకలేదు. ఆ సంగతే వెళ్ళి చెబుదాం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.’’‘‘పదండి అయితే’’ అంది కాకి.

గాలిలోకి ఎగిరింది. పులి, నక్కా దానిని అనుసరించాయి. ఒంటెను రమ్మని ఈ మూడూ పిలవలేదు. ఒంటె రాలేదు. అది ఆకులు మేస్తూ ఉన్న చోటనే ఉండి, కడుపు నింపుకుంటోంది. రాజు దగ్గరకు చేరుకున్నాయి పులి-నక్క-కాకి.‘‘ఆహారం ఏదీ’’ అడిగింది సింహం.‘‘దొరకలేదు మహారాజా! ఎంతగానో కష్టపడ్డాం. ఎక్కడపడితే అక్కడ వెతికాం. ఇంత కూడా దొరలేదు.’’ బాధపడింది మంత్రివర్గం.‘‘ఒక పని చేయండి మహారాజా! ఆహారం దొరకలేదని బాధపడకండి. నన్ను తినండి, మీ ఆకలి తీర్చుకోండి.’’ ముందుకొచ్చింది కాకి. దాన్ని పక్కకి లాగి నక్క ఇలా అంది.‘‘కాకికేం తెలుసు మహారాజా! అదెంత జీవి. పిడికెడు కూడా ఉండదు. దాన్ని చంపి తిన్నారన్నమాటేగాని, మీ ఆకలి తీరదు. నన్ను చంపి తినండి. మీ కడుపు నింపుకోండి.’’

‘‘మహారాజు ఆకలి తీరాలంటే ఆ కాకీ సరిపోదు, నక్కగా నువ్వూ సరిపోవు. నేను సరిపోతాను రాజుకి. రాజా! నన్ను చంపి, హాయిగా తినండి. మీ ఆకలి తీర్చుకోండి.’’ సింహం ముందు మోకరిల్లింది పులి. నేనంటే నేనంటూ, తనకి ఆహారమవుతామంటూ మంత్రులు ముగ్గురూ ముందుకు వచ్చేసరికి, సింహానికి చెప్పలేనంత బాధ కలిగింది.‘‘హరిహరీ’’ అంటూ చెవులు మూసుకుంది.‘‘మతులు పోయాయా మీకు? మిమ్మల్ని చంపి నేను ఆకలి తీర్చుకోనా? బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా మీరు? మంత్రుల్ని చంపి పొట్ట నింపుకోవడం ఎంత పాపం! ఒకవేళ తిన్నానే అనుకోండి. రేపు రాజ్యంలో తలెత్తుకుని తిరగగలనా? వద్దు, మీ మాటలతో నన్ను చంపకండి.’’ అంది సింహం.‘‘మీరు వూరుకోండి మహారాజా, మీకేం తెలియదు’’ అంది నక్క. పులితో ఇలా అంది అంతలోనే.‘‘నువ్వు మహారాజుకి ఆహారం కావడం పద్ధతి కాదు. తొందరపడకు. నా కంటే, ఆ కాకి కంటే నీకు బలం ఎక్కువ. ఇవాళ ఆహారం దొరకలేదు. రేపు దొరుకుతుంది. నువ్వు తెచ్చి పెట్టగలవు. అందుకని, నువ్వుండు. నేనో, కాకో రాజుకి ఆహారమవుతాం.’’కాదంది పులి. అవునన్నాయి నక్క-కాకి. రాజుకి ఏదీ అంతుచిక్కడం లేదు. ఆత్మార్పణకి మంత్రులు ముగ్గురూ పోటీపడడం మాత్రం ముచ్చటనిపించింది.

అంతలో కనిపించని సాటి మంత్రుల్ని వెతుక్కుంటూ అక్కడికి రానే వచ్చింది ఒంటె. నక్క-కాకి-పులి తనంటే తనంటూ మహారాజుకి ఆహారమయ్యేందుకు ముందుకు రావడం, ఆకలి తీర్చుకోమని చెప్పడంలో వాటి త్యాగం గొప్పది అనుకుంది ఒంటె. తానెందుకు త్యాగి కాకూడదనుకుంది. సింహంతో ఇలా అంది.‘‘మహారాజా! రండి, ఆనందంగా నన్ను ఆరగించండి. నాకెవరూ లేరు. నేనెవరికీ ఏమీ కాను. నేను చనిపోయినందువల్ల వచ్చే నష్టం కూడా లేదు.’’కథ కొలిక్కి వచ్చిందనుకుంది కాకి.నక్కను చూసింది. అంతే! నక్క ఇలా అందుకుంది.‘‘మంచి మాట అన్నావు. ఎవరికీ ఏమీ కాని నిన్ను రాజు ఆహారంగా స్వీకరించడంలో తప్పు లేదు. పైగా సేవకుడిగా మహారాజు ఆకలి తీర్చడం నీ కర్తవ్యం. గొప్ప ఆలోచన. ఈ ఆలోచనతో నువ్వు నేరుగా స్వర్గానికి పోతావు. అనుమానం లేదు.’’‘‘మహారాజా! ఆలస్యం చేయకండి. ఒంటెను ఆరగించండి. మీరు ఆకలిని తట్టుకోలేరు. మాకు ఆ సంగతి తెలుసు.’’ అన్నది కాకి.‘‘మీరు ఇందుకు ఒప్పుకోకపోతే మేమంతా తలలు కొండకేసి కొట్టుకుని మరణిస్తాం. ఒప్పుకోండి మహారాజా! ఒంటెను కడుపారా తినండి.’’ అంది నక్క.

‘‘ఇంకెందుకాలస్యం. తినండి మహారాజా! నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి.’’ సింహం ముందు మోకరిల్లింది ఒంటె.‘‘తినండి మహారాజా! తినండి.’’ ముక్తకంఠంతో అరిచాయి, కాకి-నక్కా-పులి. సింహాన్ని ఉసిగొలిపాయి. ఆలోచించుకునే అవకాశం లేకుండా చేశాయి. ఆకలితో దహించుకుపోతున్న సింహం, ఒంటె మీద పిడుగులా పడింది. దాని కండలు కొరికి తినేసింది. ఒంటెను చంపేసింది.’’ ముగించాడు సంజీవకుడు. ఈ కథలో బాధేదో ఉంది. అది చెబితే బాగుండును అనుకున్నాడు దమనకుడు. దమనకుని మనసులోని మాట గ్రహించినట్టుగా ఇలా అన్నాడు సంజీవకుడు.

‘‘నీకు ఈ కథ ఎందుకు చెప్పానో తెలుసా? రాజుకి నీలాంటి పాత సేవకుల మీద ఉండే అభిమానం, అనురాగం, నాలాంటి కొత్త సేవకుల మీద ఉండదని చెప్పడానికే చెప్పాను. ఏదేమయినా ఒకటి మాత్రం నిజం. రాజుల సేవ ఎప్పటికీ ప్రమాదకరమే! ఈ మాట ఎందుకంటున్నానంటే, వడ్రంగి-సింహం కథ గుర్తుకొచ్చి అంటున్నాను. వింటానంటే ఆ కథ కూడా చెబుతాను.’’ అన్నాడు సంజీవకుడు.‘‘చెప్పు చెప్పు’’ ఉత్సాహపడ్డాడు దమనకుడు. చెప్పసాగాడు సంజీవకుడు.‘‘అనగనగా ఒక ఊరిలో ఓ వడ్రంగి ఉండేవాడు. కట్టెల కోసం అతను తరుచూ అడవికి వెళ్ళి, చెట్లు కొట్టేవాడు. కావాల్సిన కట్టెలు ఇంటికి తెచ్చుకునేవాడు. వాటితో పనిముట్లు తయారుచేసి అమ్ముతూ జీవించేవాడు. ఒకరోజు కట్టెలు కొట్టుకుని, తిరిగి వస్తుండగా ఓ సింహం ఎదురయిందతనికి. భయంతో వణికిపోయాడు. అతని భయాన్ని చూసి సింహం జాలి పడింది.‘‘భయపడకు’’ అంది.

‘‘ఏనుగు కుంభస్థలాలు, బలిసిన జింకలంటే నాకిష్టం. నీలాంటి బలహీనులు కాదు. వెళ్ళిరా, నిన్నేం చెయ్యను.’’ అంది మళ్ళీ. దాంతో వడ్రంగికి పెనుప్రమాదం తప్పినట్టయి, ఆనందమనిపించింది. ఆ ఆనందంతో సింహానికి సాష్టాంగ పడ్డాడు. నమస్కరించాడు. ఇంటికొచ్చేశాడు. అయితే సింహం మీద అతనికి చెప్పలేనంత అభిమానం కలిగింది. ఆ అభిమానంతో అడవికి తాను వెళ్ళినప్పుడల్లా సింహానికి తగినంత ఆహారాన్ని మూటగట్టుకుని వెళ్ళేవాడు. సింహానికి పెట్టి సంతోషించేవాడు. దాంతో సింహం వేట మానేసింది. వడ్రంగి తెచ్చిన ఆహారాన్ని తిని త్రేన్చి, గుహలోనే ఉండిపోసాగింది. రాజుగారు వేటాడట్లేదు. గుహలో నుండి బయటికి రావట్లేదు. ఏమయింది? అనుకుని, సింహం సేవకులు నక్క-కాకి, ఓ రోజు సింహాన్ని కలిశాయి. ఇలా అడిగాయి.‘‘ఏమయింది మహారాజా! వేట మానుకున్నారు. గుహలో నుండి బయటకే రావట్లేదు. ఏం జరుగుతోంది?’’‘‘ఏం జరుగుతోందంటే...నాకో అభిమాని దొరికాడు. అతడు ఆహారం తెచ్చి పెడుతున్నాడు. తింటున్నాను. సరిపోతోంది.’’ అంది సింహం.‘‘బలేగా ఉందే! మంచి అభిమానే దొరికాడు. అతన్ని చూడాలనిపిస్తోంది.’’ అన్నాయి నక్క-కాకి.

‘‘ఉండండయితే! అతను వచ్చే వేళయింది.’’ అంది సింహం. నక్క-కాకితో పాటుగా సరదాగా గుహ బయటికి వచ్చింది. చాలా రోజులకి బయటికి వచ్చిందేమో! చుట్టుపక్కల ఉన్న చెట్టు-పుట్టా చూసి అడవి అంతా పచ్చపచ్చగానే ఉందనుకుంది. అంతలో వడ్రంగి వస్తూ కనిపించాడు. అతని వీపున ఆహారం మూటగా వేలాడుతోంది.‘‘చూడండి, అతనే నా అభిమాని.’’ అంది సింహం. వడ్రంగిని చూపించింది. నక్క-కాకి వడ్రంగిని వింతగా చూశాయి. వడ్రంగి మాత్రం కాకి-నక్కల్ని చూసి కంగారుపడ్డాడు. తెచ్చిన ఆహారాన్ని కిందపడేసి, వెంటనే దగ్గర్లో ఉన ్న చెట్టేక్కేశాడు. ఆశ్చర్యమనిపించింది అందరికీ.‘‘ఏమయిందయ్యా! క్రూరజంతువుని, నన్ను చూసి భయపడని వాడివి, వీటిని చూసి, ఈ నక్కా-కాకిని చూసి భయపడ్డావేమిటి? హఠాత్తుగా చెట్టెక్కేవేమిటి?’’ అడిగింది సింహం.

‘‘నువ్వు క్రూరజంతువయినా నీతో నాకు పరిచయం ఉంది. నువ్వేం నన్ను చెయ్యవన్న నమ్మకం ఉంది. ఆ నక్క-కాకులతో నాకు పరిచయం లేదు. పైగా వాటి బుద్ధులు మంచివి కావంటారంతా. నువ్వు మంచిదానివే కావచ్చు. కాని, నీ సేవకులు మంచివారన్న నమ్మకం నాకు లేదు. చెడు సేవకులు ఉన్న రాజు, పడగెత్తిన పాములాంటి వాడు, ఏ క్షణమయినా కాటేస్తాడు. అందుకే చెట్టెక్కి, నన్ను నేను కాపాడుకున్నాను.’’ అన్నాడు వడ్రంగి.-కథ ముగించాడు సంజీవకుడు.

‘‘ఈ కథతో నువ్వేం చెప్పదలచుకున్నావు?’’ అడిగాడు దమనకుడు.‘‘ఏం చెప్పదలచుకున్నానంటే...పింగళకుడు మంచివాడే! కాకపోతే అతని చుట్టూ ఉన్న సేవకులే మంచివారు కాదనిపిస్తోంది. మంచి సేవకులు లేని రాజు, వంచనకు వెనుకాడడు. ఏదయితేనేం పింగళకుడు నన్ను శత్రువనుకుంటున్నాడు. సేవకులు నన్నతనికి శత్రువుని చేసేశారు. అయిపోయింది. ఇప్పుడు చెయ్యాల్సింది ఒకటే! యుద్ధం.’’ అన్నాడు సంజీవకుడు.‘‘రాజుతో యుద్ధం చేస్తావా?’’ ఆశ్చర్యపోయాడు దమనకుడు.

‘‘మరేం చెయ్యమంటావు? నిలబడి నిలువునా ఆహారమయిపోమంటావా? లేదు. యుద్ధమే చెయ్యాలి. గెలిచానా, నన్ను నేను కాపాడుకున్నట్టు. ఓడిపోయానూ, వీరస్వర్గాన్ని అలంకరిస్తాను.’’‘‘ చాల్చాలు, నువ్వూ నీ మాటలూ! సేవకులు రాజుతో యుద్ధానికి తలపడకూడదు. రాజు బలవంతుడు. అతనితో సేవకుడు యుద్ధం చేస్తే గెలుపు అసాధ్యం. ప్రమాదం నుంచి తెలివిగా తప్పించుకోవాలిగాని, యుద్ధం అంటూ పరుగుదీస్తావేంటి? యుద్ధం అంటే ఏమనుకున్నావు? బలాబలాలు తెలుసుకోవాలి. ఆనుపానులు చూసుకోవాలి. గెలుపు ఖాయమంటేనే కయ్యానికి కాలు దువ్వాలి. లేకపోతే తీతువుపిట్ట-సముద్రం కథలా ఉంటుంది పరిస్థితి. ఆ కథ చెబుతాను, విను.’’ అన్నాడు దమనకుడు. చెప్పసాగాడిలా.