తీతువు చెప్పిన కథ



అనగనగా ఓ సముద్రం. ఆ సముద్రం ఒడ్డున ఓ చెట్టు. ఆ చెట్టు మీద తీతువుల పిట్ట జంట ఒకటి కాపురం ఉంటోంది. చల్లనిగాలి. చక్కని ప్రదేశం. హాయి హాయిగా రోజులు గడిచిపోతున్నాయి. కొంతకాలానికి ఆడతీతువు గర్భం ధరించింది. గర్భం ధరించిన వారికి కోరికలు ఉంటాయని, వాటిని తీర్చాలని తెలుసుకున్న మగతీతువు, ఆడతీతువుతో ఇలా అంది.‘‘నీకేం కావాలో చెప్పు. తెచ్చిపెడతాను.’’‘‘నాకేమీ అక్కర్లేదు.’’‘‘కోరికలు చంపుకోకు. చెప్పు. నా శక్తి మేరకు తీర్చే ప్రయత్నం చేస్తాను.’’‘‘అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. ఇక్కణ్ణుంచి ఎంత త్వరగా కాపురం ఎత్తేస్తే అంత మంచిది.’’ అంది ఆడతీతువు.ఆశ్చర్యపోయింది మగతీతువు.‘‘ఎందుకు ఇక్కణ్ణుంచి మనం కాపురం ఎత్తేయాలి?’’ అడిగింది.‘‘ఎందుకంటే...అమావాస్య, పున్నమికి సముద్రానికి ఆటుపోటులు ఎక్కువవుతున్నాయి. పెద్దపెద్ద అలలతో ఎగిసిపడుతోంది సముద్రం. రేపో మాపో నేను గుడ్లు పెడతాను. అంతెత్తున విరిగిపడుతోన్న అలలకి గూట్లోని గుడ్లు కొట్టుకుపోతాయని నాకు భయంగా ఉంది.’’భార్య భయానికి భర్త పగలబడి నవ్వాడు.

‘‘నీకా భయం అక్కర్లేదు. మన గుడ్లేమీ కొట్టుకుపోవు. సముద్రుడు అందుకు సాహసించడు. ఎందుకంటే అతనికి గరుత్ముడంటే భయం. గరుత్ముడు ఎవరు? మన రాజు. మన రాజు మనకి అండగా ఉన్నంత కాలం మనకేమీ కాదు.’’ అన్నాడు. ఆ తీరు ఆడతీతువుకి నచ్చలేదు. ఈయనగారు ఎప్పుడూ ఇంతే! ఏది చెప్పినా వాళ్ళున్నారు, వీళ్ళున్నారంటూ భయపడవద్దంటాడు. భారం ఎవరి మీదో వేసి కూర్చుంటాడు. పద్ధతా ఇది? అనుకుంది ఆడతీతువు. ప్రమాదం పొంచి ఉన్నదంటే, ముంచుకొని వస్తున్నదంటే తప్పించుకుని పారిపోవాలి. తిని తీరిగ్గా కూర్చుంటే, ఎవరో కాపాడుతారనుకుంటే ఎలా? ఎంత బలవంతుడయినా సమయానుకూలంగా ప్రవర్తించాలి. ప్రవర్తించకపోతే నష్టం అతనికే!ఆలోచిస్తూ మాట్లాడక వూరుకుంది తీతువు.‘‘ఏంటి, దీనిక్కూడా కోపమేనా? మాట్లాడడం లేదు.’’ అడిగింది మగతీతువు.‘‘కోపం కాదు. నీ వరస చూస్తోంటే నాకెందుకో హంస-తాబేలు కథ గుర్తుకు వస్తోంది. మాట వినని మూర్ఖుడు, తాబేలులా చచ్చిపోతాడు.’’ అంది ఆడతీతువు.

తనని మూర్ఖుడు అన్నా పర్వాలేదు. ముందు తాబేలు కథేంటో తెలుసుకోవాలనుకున్నాడు.‘‘ఆలస్యం దేనికి? ఆ కథేంటో చెప్పు.’’ అడిగింది మగతీతువు. ఆడతీతువు చెప్పసాగిందిలా.‘‘వెనకటికి ఓ చెరువు ఉండేది. దాని పేరు భువనసారం. పెద్ద చెరువది. అందమయింది కూడా. అందులో వికట, సంకటాలని రెండు హంసలూ, ఓ తాబేలూ ఉండేవి. తాబేలు పేరు కంబుగ్రీవం. మూడూ ముచ్చటగా స్నేహంగా ఉండేవి. ఓ సంవత్సరం వానలు పడలేదు. ఎండలు మండిపోయాయి. దాంతో చెరువు ఎండిపోసాగింది. ఎండిపోతున్న చెరువులో ఉండలేమని, ప్రమాదం అని తెలుసుకుని, హంసలు రెండూ ఇంకో చెరువుకి ఎగిరిపోదామనుకున్నాయి. నీళ్ళతో కలకలలాడే చెరువు, పెద్ద చెరువు, దూరంలో ఉంది. అక్కడికి పోదామని నిర్ణయించుకున్నాయి. ఆ మాటే చెప్పాయి తాబేలుకి.

‘‘నన్ను విడిచి వెళ్ళిపోతారా?’’ బాధపడింది తాబేలు.‘‘తప్పదు’’ అన్నాయి హంసలు. వాటికీ తాబేలుని వదిలి వెళ్ళడం బాధగానే ఉంది.‘‘ముగ్గురం అన్నదమ్ముల్లా తిరిగాం. కలిసి బతికాం. ఇప్పుడు విడిపోవాలంటే బాధగా ఉంది. మీతో వద్దామంటే ఎగరలేను. పోనీ మీరు ఆకాశంలో ఎగురుతోంటే, మిమ్మల్ని అనుసరిస్తూ కింద నడుద్దామన్నా అంత వేగంగా కూడా నడవలేను. ఏం చెయ్యను?’’ అంది తాబేలు.‘పాపం’ అని జాలిపడ్డాయి హంసలు.‘‘మీరే ఆదుకోవాలి నన్ను. మీరు కాకపోతే నన్నెవరు ఆదుకుంటారు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి, మీతో పాటుగా నన్ను తీసుకుని పొండి. చావో రేవో మీతోనే! మీరు లేకుండా నేనుండలేను.’’ అంది తాబేలు.

‘‘మేము లేకుండా నువ్వెలా ఉండలేవో అలాగే నువ్వు లేకుండా మేము కూడా ఉండలేం. కాకపోతే నిన్నెలా తీసుకుని వెళ్ళాలన్నదే సమస్య. నిన్ను వీపున ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాలంటే సాధ్యం కాదు. పైగా చెరువు చాలా దూరంలో ఉంది. చాలా దూరం ఎగరాలి మేము. పోనీ ముక్కున కరుచుని నిన్ను తీసుకుని వెళ్దామంటే అదింకా అసాధ్యం. తెలిసీ తెలియక సాహసం చేసి నిన్ను తీసుకుని వెళ్ళాలంటే, ఏదేని పొరపాటు జరిగితే నీ ప్రాణాలే పోతాయి. అందుకని...’’‘‘అందుకని...’’‘‘నువ్విక్కడ ఉండడమే మంచిది. ఏం చేస్తాం? విడిపోవడం మనకి రాసి పెట్టి ఉంది. విడిపోతున్నాం. మాకు తెలిసీ నీకిక్కడ ఎలాంటి ప్రమాదమూ లేదు. ఉంటే గింటే మాకే! అందుకే వెళ్ళిపోతున్నాం.’’ అన్నాయి హంసలు.

‘‘అదృష్టం బాగుండి, వానలు కురిసి, ఈ చెరువు నిండిందీ అప్పుడు మళ్ళీ కలుసుకుందాం.’’ అన్నాయి మళ్ళీ. ఆ మాటలకు ఒప్పుకోలేదు తాబేలు. ఎట్టి పరిస్థితుల్లో ముగ్గురం కలసి ఉండాలనే పట్టుబట్టింది. కాళ్ళా వేళ్ళా పడింది. ఏం చేస్తారో, ఎలా చేస్తారో చెయ్యమంది. తనని తోడుకుని వెళ్ళాల్సిందే అన్నది.‘‘చెప్పిన మాట విను. నిన్ను తీసుకుని వెళ్ళడం చాలా ప్రమాదం.’’ అన్నాయి హంసలు.‘‘ప్రమాదమయినా సరే, తీసుకుని వెళ్ళక తప్పదు.’’ మొండికేసింది తాబేలు. ఆలోచనలో పడ్డాయి హంసలు. తాబేలును ఎలా తీసుకుని వెళ్ళాలి? ఎలా తీసుకుని వెళ్తే క్షేమంగా దూరంలో ఉన్న చెరువుకి ముగ్గురూ చేరుకోగలుగుతారు? కిందా మీదా పడ్డాయి. ఆఖరికి ఓ నిర్ణయానికి వచ్చాయి. ఇలా చెప్పాయి.‘‘ముగ్గురం కలసి ఉండాలని పట్టుబడుతున్నావు కాబట్టి, ఓ ఉపాయం ఉంది. అదేంటంటే...ఓ కర్రని తీసుకుంటే, దాని చెరో చివరా మేమిద్దరం ముక్కున కరచి పట్టుకుంటాం. నువ్వు కూడా అదే కర్రని నోటితో కరచి పట్టుకుని మధ్యలో వేలాడాలి. అలా వేలాడితే కర్రతో పాటుగా ఎగిరిపోదాం. అయితే నువ్వు చాలా గట్టిగా కర్రని పట్టుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ నోరు తెరవకూడదు. తెరిచావనుకో! ఇంతే సంగతులు. కింద పడి చచ్చిపోతావు. ఆలోచించుకో’’

‘‘ఆలోచించడానికి ఏముంది. బ్రహ్మాండమైన ఆలోచన. అలాగే చేద్దాం.’’ అంది తాబేలు.‘‘ఆవేశపడకు. లేనిపోని ప్రమాదాన్ని కొనితెచ్చుకోకు.’’ చెప్పాయి హంసలు.‘‘నన్ను తీసుకుని వెళ్ళడం మీకిష్టం లేదని చెప్పండి. అంతేకాని, పదే పదే ప్రమాదం అంటూ గొంతు చించుకోకండి.’’ అంది తాబేలు. అలిగింది. ఎవరి రాతను ఎవరూ మార్చలేరు. లేనిపోని మాటలు పడేకన్నా తాబేలును తీసుకుని వెళ్ళడమే సమస్యకు పరిష్కారం అనుకున్నాయి హంసలు. అందుకు సిద్ధమయ్యాయి.అనుకున్న ప్రకారం కర్రను తీసుకొచ్చాయి. చెరోపక్కా ముక్కున కరచి గట్టిగా పట్టుకున్నాయి. చెప్పినట్టుగానే తాబేలు కూడా నోటితో కర్రను పట్టుకుని మధ్యలో వేలాడింది. ఆలస్యం చేయలేదు హంసలు.

ఆకాశంలోకి ఎగిరాయి. మబ్బుల మధ్య నుంచి హంసలు ఎగురుతోంటే తాబేలుకి చెప్పలేని ఆనందం కలిగింది. మబ్బుల్ని ముట్టుకోవాలనిపించింది. ముట్టుకునేందుకు ప్రయత్నిస్తే హంసలు వద్దన్నట్టుగా హూంకరించాయి. ఏదో నగరం మీదుగా ప్రయాణిస్తున్నాయి హంసలు. ఎవరు చూశారో ప్రయాణిస్తూన్న హంసల్నీ, తాబేలునూ చూశారు. నగరంలో అరచి చెప్పారు. చెప్పింది ఆ నోటా ఈ నోటా బాగా ప్రచారం అయింది. అదిగో అంటే అదిగో అంటూ అంతా వెంటపడ్డారు.హంసలు రెండు, తాబేలుని తీసుకునిపోతున్నాయి. కర్ర రెండు చివర్లూ హంసలు కరచి పట్టుకుని ఉంటే, తాబేలు నోటితో కర్రను పట్టుకుని మధ్యలో వేలాడుతోందని గోలగోలగా చూడసాగారు. ఆకాశంలోని వాటిని చూస్తూ కింద గుంపులు గుంపులుగా జనం పరుగులుదీశారు. హంసలకి అంతా వినవస్తోంది. అయినా పట్టించుకోలేదు. తమ పని తాము చేసుకునిపోతున్నాయి. ఎగురుతున్నాయి. తాబేలుకి కుతూహలంగా ఉందంతా. జనం ఎందుకు కేకలు వేస్తున్నారు. పరుగులు తీస్తున్నట్టున్నారు! ఎందుకు పరుగులు తీస్తున్నారు? హంసలని అడగాలనుకుంది. ఆత్రంగా నోరు తెరిచింది. అంతే! ఆకాశం లోంచి అంతెత్తు నుంచి గిరగిరా తిరుగుతూ దబ్‌న కిందపడింది. కొన ఊపిరితో కొట్టుకుంటోంది. ఇంతలో చుట్టూ చేరారు జనం. చచ్చిపోతున్న తాబేల్ని కాళ్ళతో అటు తన్ని, ఇటు తన్ని పూర్తిగా చంపేశారు.’’కథ ముగించింది ఆడతీతువు.

‘‘ఈ కథలో నీతి ఏమిటో తెలుసా?’’ అడిగింది. తెలీదంది మగతీతువు.‘‘చెబుతాను తెలుసుకో! అపాయం వెన్నంటి వస్తూన్నప్పుడు దేవుడు ఉన్నాడు, రాజున్నాడంటూ, వాడు చూసుకుంటాడు, కాపాడుతాడని కూర్చోకూడదు. ఉపాయాన్ని ఆలోచించి, అపాయాన్ని తప్పించుకోవాలి. పరుగుదీయాలి. లేకపోతే కోరి కష్టాలు కొనితెచ్చుకోవడమే అవుతుంది.’’ అంది ఆడతీతువు.‘‘ఇలాంటిదే ఇంకో కథ కూడా గుర్తొస్తోంది.’’ అంది.‘‘చెప్పు చెప్పు’’ ఉత్సాహపడింది మగతీతువు. చెప్పసాగిందిలా ఆడతీతువు.

Responsive Footer with Logo and Social Media