తీరిన కాకి దాహం
అది మండు వేసవి కావడంతో విపరీతమైన ఎండ, వేడి వల్ల ఒక కాకికి విపరీతంగా దాహం వేసింది. దానికి ఎక్కడా నీరు దొరకలేదు. చెరువులు, బావులు, కాలువలు ఎండిపోయాయి. ఎక్కడెక్కడో కాకి తిరిగినప్పటికీ దానికి నీళ్ళు దొరకలేదు. నాలుక, గొంతు తడి ఆరిపోయింది. ఏం చేయాలో కాకికి పాలుపోలేదు.
నీటి కోసం వెతుకుతున్న కాకికి ఒక కుండ కనిపించింది. అందులో నీళ్ళు ఉంటాయేమో అని కాకి ఆశగా ఆ కుండపై వాలి లోపలికి తొంగి చూసింది. ఆ కుండలో ఎక్కడో అట్టడుగున కొన్ని నీళ్ళు కనిపించాయి. ఆ నీటిని తాగడానికి కాకి చాలా ప్రయత్నించింది. నీరు అడుగున ఉండటం వల్ల దానికి అందలేదు. దాహంతో అల్లాడుతున్న ఆ కాకికి నీరు కనిపించినప్పటికీ తాగులేకపోతున్నందుకు బాధపడింది.
అటూ ఇటూ చూసింది, కుండకు సమీపాన కాకికి గులకరాళ్ళు కనిపించాయి. వెంటనే కాకికి ఒక ఉపాయం తట్టింది. ఒక్కోరాయిని పట్టుకొని వచ్చి ఆ కుండలో మెల్లగా జారవిడిచింది. ఆ రాళ్ళన్నీ నీటి అడుగు భాగానికి చేరాయి. రాళ్ళు పెరిగిన కొద్దీ నీరు పైకి వచ్చింది. అలా నీళ్ళు పైకి వచ్చే వరకు కాకి గులకరాళ్ళను కుండలో వేసింది. కొద్దిసేపటికి కుండలోని నీళ్ళు పైకి వచ్చాయి. కాకి ఆ నీటిని తాగి తన దాహం తీర్చుకుని ఆనందంగా ఎగిరిపోయింది.
నీతి కథలు : ఎటువంటి అపాయాన్నైనా ఉపాయంతో తప్పించుకోవచ్చు. సమస్యలు వచ్చినప్పుడు మనం సహనంగా ఉండి కష్టపడి పనిచేసినట్లయితే పరిష్కార మార్గం లభిస్తుంది.