తెలివి తక్కువ ఒంటె
ఒక అడవిలో కాకి, నక్క, పులి చాలా స్నేహంగా ఉండేవి. ఈ మూడు కలసి ఆ అడవికి రాజు సింహం వద్ద సేవకులుగా ఉండేవి. సింహం వేటాడిన జంతువును అన్నీ కలసి తినేవి. అడవి ప్రక్కనున్న ఒక గ్రామంలో ఒంటె ఒకటి ఉండేది. దాని యజమాని సరిగా ఆహారం పెట్టకపోయే సరికి అది సన్నగా అయిపోయింది. యజమానిపై కోపంతో అది అడవిలోకి వెళ్ళింది. అక్కడ పదిరోజులపాటు మంచి పచ్చికను మేసి కండపట్టింది. ఈ తరుణంలో ఆ ఒంటె ఒకరోజు కాకి, నక్కల, పులి కంట పడింది.
కండ పట్టిన ఈ ఒంటెను ఎలాగైనా సొంతం చేసుకొని తమ ఆకలిని తీర్చుకోవాలని అవి భావించాయి. మాటా మాటా కలుపుకుని, స్నేహం నటిస్తూ ఒకరి నొకరు పరిచయం చేసుకున్నాయి. మంచి స్నేహితుల్లాగా మారిపోయాయి. “మా అడవికి రాజు మృగరాజు. వారి వద్దకు నిన్ను తీసుకుని వెళ్ళి పరిచయం చేస్తాము” అని సింహం వద్దకు ఒంటెను తీసుకుని వెళ్ళాయి. సింహం కూడా ఒంటె స్నేహాన్ని అంగీకరించింది. సింహం మాట్లాడుతూ “భయపడకు మిత్రమా! నా నుండి నీకు ఎటువంటి ప్రాణహాని లేదు” అని ఒంటెకు అభయమిచ్చింది.
కండ పట్టిన ఒంటెను చూసి కాకి, నక్క, పులి లొట్టలేసేవి. దీని మాంసం చాలా రుచిగా ఉంటుందని చెప్పుకుంటూ అవకాశం కోసం ఎదురు చూడసాగాయి. అవకాశం రాగానే ఒంటెను దక్కించుకొని తమ ఆకలిని తీర్చుకోవాలనేది వాటి ఎత్తుగడ. కాకి, నక్క, పులికి ఉన్నన్ని తెలితేటలు ఒంటెకు లేకపోవడంతో వీటి కుట్రను కనిపెట్టలేకపోయింది. ఒంటె వాటితో స్నేహంగా మెలగసాగింది.
“ఒకరోజు ఆహారం వేటకి వెళ్ళిన సింహానికి ఏనుగు ఎదురుపడింది. ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఏనుగు తన దంతాలతో సింహాన్ని పొడవడంతో అది గాయాలపాలైంది. చేసేదిలేక సింహం తన గుహలో విశ్రాంతి తీసుకోసాగింది. వారం గడిచింది, సింహం వేటాడలేని స్థితిలో ఉంది. ఆహారం లభించకపోవడంతో ఆకలితో సింహం నీరసంగా ఉంది. ఏంచేయాలో తెలియని సింహం తన అనుచరులను పిలిచి ఆహారం తెమ్మని చెప్పింది. “నేను అనారోగ్యంగా ఉండటం వల్ల జంతువులను వేటాడలేక పోతున్నాను. నేను వేటాడితే కొద్దిగ తిని మిగిలిన మాంసాన్ని మీరు తినేవారు. కాబట్టి మీరే ఏదో ఒక జంతువును కనిపెట్టి చెప్పండి. నేను వేటాడిన తర్వాత తిని, మిగిలింది మీకు పెడతాను” అని సింహం దీనంగా అన్నది.
సింహం అనుచరులు తలా ఓ దిక్కుకు వెళ్ళి జంతువుల కోసం వెతికారు. వాటికి ఎక్కడా ఏ జంతువూ కనపడలేదు. ఈ విషయాన్ని తిరిగి వచ్చి సింహంకు చెప్పాయి. ఈలోగా కాకి, నక్క రహస్యంగా మాట్లాడుకున్నాయి. “మిత్రమా కాకి! మనం ఇతర జంతువులకోసం వెదకడం దేనికి. ఈ ఒంటె బాగా కండపట్టి ఉంది. దీన్నే మన సింహం చేత వేటాడిస్తే చాలా రోజులపాటు ఆహారానికి లోటు ఉండదు” అని నక్క అన్నది. ఇద్దరూ కలసి సింహం వద్దకు వెళ్ళి ఒంటెను దక్కించుకునే ప్రణాళిక చెప్పాయి. ఈ మాటలు వినగానే సింహానికి ఎక్కడలేని కోపం వచ్చింది. “నేను ఒంటెను హానికరం చేయనని అభయమిచ్చాను. స్నేహంగా ఉండి ప్రాణాలు తీయడం మంచి పని కాదు” అన్నది సింహం. “మీరు దాడి చేసి హానికరం చేస్తే పాపమౌతుంది, కానీ ఒంటె తనకు తాను మీకు ఆహారమౌతుందంటే హానికరం చేయవచ్చు కదా మృగరాజా!” అన్నది నక్క. “సరే మీ ఇష్టం, ఏదో ఒక ఏర్పాటు చేయండి” అన్నది సింహం.
కాకి, నక్క, పులి కలసి ఒంటె వద్దకు వెళ్ళి “మన మహారాజు ఆకలితో ఉన్నారు. వారు ఆకలితో పడిపోకుండా ఉండాలంటే మన శరీరాన్ని త్యాగం చేయాలి. అందరం కలసి సింహం వద్దకు వెళదాము, పదండి” అని నమ్మబలికి ఒంటెను కూడా మృగరాజు వద్దకు తీసుకుని వెళ్ళాయి. “మహారాజా! మీ ఆహార నిమిత్తం మేము అడవంతా తిరిగాము. ఎక్కడా ఒక్క జంతువు కూడా దొరకలేదు. అవసరమైతే నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి ” అని కాకి దీనంగా చెప్పింది. “ఛీ ఛీ నువ్వు అల్పజీవివి. నీ మాంసాన్ని మన ప్రభువు తింటే సకల పాపాలు చుట్టుకుంటాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పైగా నువ్వు మృగరాజు పంటి క్రిందకు కూడా రావు. నేను ఆహారంగా మారి నా స్వామి భక్తిని చాటుకుంటాను” అన్నది నక్క. వెంటనే కుట్రలో భాగస్వామి అయిన పులి మాట్లాడుతూ “నువ్వు కూడా ఒక అల్పప్రాణివన్న సంగతి మరువకు. మోసానికి ప్రతిరూపం నువ్వు. పైగా నువ్వు కూడా గోళ్ళున్న జంతువువి, కాబట్టి నువ్వు మృగానివే. అందువల్ల నిన్ను మృగరాజు తినకూడదు. మృగరాజు ఆకలి తీర్చడానికి నేను ఆహారంగా మారతాను” అన్నది పులి.
ఇంతమంది సింహానికి ఆహారంగా మారి త్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారని తెలివి తక్కువ ఒంటె భావించింది. అందరూ కుట్ర చేసి ఒంటెను సింహానికి ఆహారంగా వేయాలనుకుంటున్న విషయాన్ని అర్థం చేసుకోలేక పోయింది. ఒంటె మాట్లాడుతూ “పులిరాజా! నీకు కూడా గోళ్ళు ఉన్నాయి. నువ్వు కూడా మృగానివే. అనేక జంతువులను వేటాడిన నిన్ను మన మృగరాజు తినడం సరికాదు. కాబట్టి మృగరాజా! ఈ ముగ్గురూ మీకు ఆహారంగా పనికిరారు. నేను మీకు ఆహారమవడానికి సిద్ధంగా ఉన్నాను. అందువల్ల నన్ను భుజించి మీ ప్రాణాలను కాపాడుకోండి” అని ఒంటె అర్థించింది. ఒంటె అలా చెప్పగానే సింహంతో పాటు పులి, నక్క అన్నీ కలసి ఒంటెపై పడి తమ ఆకలిని తీర్చుకున్నాయి.
నీతి కథలు : ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించి తప్పించుకునే ప్రయత్నం చేయాలి. అమాయకంగా తెలివి తక్కువతనంతో ఆలోచించి మనమేదో త్యాగాలు చేసేద్దాం అనుకుంటే, సమస్యల్లో చిక్కుకుని ప్రాణాలపైకి తెచ్చుకోవలసి వస్తుంది.