తెలివైన ఇంద్రజాలికుడు – పిల్లల కథ
ఒకానొక ఊర్లో ఎలుకలు బాగా ఎక్కువైపోయాయి. రైతులు కష్టపడి పండించి గోదాముల్లో దాచుకున్న ధాన్యం అంతా ఎలుకల పాలు అయిపోయాయి. అదే సమయంలో ఆ గ్రామానికి ఓ ఇంద్రజాలికుడు వచ్చాడు. ఆ గ్రామ పెద్ద వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పాడు. అప్పుడు ఆ ఇంద్రజాలికుడు తాను ఆ సమస్యను పరిష్కరిస్తాననీ దానికి పారితోషికం ఏదైనా కావాలని అడిగాడు. గ్రామస్తులంతా ఇంటికో బస్తా చొప్పున ధాన్యం ఇస్తామని ఒప్పుకున్నారు.
దానికా ఇంద్రజాలికుడు సంతోషించి తన దగ్గరున్న వేణువుతో ఒక రాగం మొదలు పెట్టాడు. ఆ రాగం వినగానే ఎక్కడెక్కడో నక్కి ఉన్న ఎలుకలన్నీ అతని వెంట పడటం ప్రారంభించాయి. అతను వాయిస్తూ నెమ్మదిగా నడుస్తూ ఉండగా, ఎలుకలు కూడా అతనిని వెంబడించడం ప్రారంభించాయి. అతను వాయిస్తూ నెమ్మదిగా దగ్గరున్న నదిలోకి ప్రవేశించాడు. ఆ ఎలుకలు కూడా ఆ నదిలోకి దూకి అన్నీ ప్రవాహ వేగంతో కొట్టుకుపోయాయి.
ఎలుకల పీడ విరగడైనందుకు గ్రామస్తులంతా ఎంతో సంతోషించారు. చివరికి అతనికి పారితోషికం ఇచ్చే సమయం ఆసన్నమైంది. అప్పుడే గ్రామస్తులకు దుర్బుద్ధి పుట్టింది. ఇతను కేవలం వేణువు వాయించినందుకే మనం ఎందుకంత పారితోషికం ఇవ్వాలి. ఏదో ఒకటో రెండో బస్తాలు ధాన్యం ఇచ్చి పంపేద్దాం అనుకున్నారంతా కలిసి. దానికి ఇంద్రజాలికుడు ససేమిరా ఒప్పుకోలేదు. అయితే నీకు అసలేమీ ఇవ్వం. ఏం చేసుకుంటావో చేసుకో అన్నారంతా కలిసి. అప్పుడతనికి కోపం వచ్చి, తన దగ్గరున్న వేణువు తీసి మరో రాగం ఆలపించసాగాడు. దాంతో ఆ ఊర్లో ఉన్న పిల్లలంతా మంత్రించినట్టుగా అతని వెంటపడసాగారు. అతను నెమ్మదిగా వాళ్లను నది వైపు తీసుకువెళ్లసాగాడు. గ్రామస్తులు తమ పిల్లలందరినీ కూడా నదిలో ముంచేస్తాడేమోనన్న భయంతో అతన్ని ఆపి అతనికి కావలసిన పారితోషికాన్ని ఇచ్చి పంపించేశారు.