తప్పుకి చిన్నా, పెద్దా ఉండదు
కృష్ణదేవరాయల సాహితీ మండపమే భువన విజయం. పాండిత్యంతో పాటు శృంగారం కూడా అధికంగానే ఉండే ధూర్జటి కవిత్వాన్ని రాయలవారు తెగమెచ్చుకుంటూ మిగిలిన కవులను పట్టించుకోకపోవడం – వారికి చిన్నతనంగానూ అవమానంగానూ ఉండేది. ఈ పరిస్థితిని చక్కబరచమని రామకృష్ణునికి వారందరూ సూచించారు.
‘కాళహస్తీశ్వర శతకం” రచించిన ధూర్జటినొసటవిభూది రేఖలతో… మెడలో రుద్రాక్షలతో సాక్షాత్తూ శంకరుని వలె సభకు విచ్చేసేవారు. అంత పెద్ద వయసులో… అటువంటి శృంగారాన్నెలా రాస్తున్నారా ధూర్జటి? అనుభవంలేనిదే అటువంటి రసికతను కవిత్వంలో గుప్పించడం అతికష్టం కదా… అని రామలింగడికి అనుమానాలు కలిగేవి. మెల్లగా ఆరా తీశాడు.
ధూర్జటి -వేశ్యాలోలుడనీ కట్టుకున్న భార్యముఖమయినా చూడడనీ తెలిసింది. ధర్మపత్ని నలా నిర్లక్ష్యం చేస్తున్నందుకు ధూర్జటికి గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు.
ఒకనాటి రాత్రి ధూర్జటి భోజనము చేసి తన ముఖం కనపడకుండా శాలువను ముసుగేసుకుని… వడి వడిగా వేశ్యాగ్భహంలో దూరడం – రామకృష్ణుని కంటపడింది. వెంటనే అతనొక ప్రణాళిక ఆలోచించి – మరునాడు చీకటిపడుతున్న సమయానికి దూరదేశమునుండి వచ్చిన బ్రాహ్మణుని వేషం వేసుకుని వేశ్యాగృహం అరుగుమీద పడుకున్నాడు. ఆ వేశ్య అతన్నీ పలకరించి పడుకోడానికి చాప యిచ్చి లోపలికెళ్లిపోయింది.
రాత్రయిన తరవాత ధూర్జటి యథావిథిగా వచ్చి వేశ్యాగృహంలోకి దూరాడు. తెల్లవారురూమున ధూర్జటి తన యింటికి పోతూండగా – రామలింగడు- “తాతయ్యగారు వేశ్యాగృహంనుండి వచ్చుచున్నారే..” అన్ని పలకరించాడు. ధూర్జటి తెల్లబోయి… “ఈ సంగతి ఎవరికీ చెప్పకు.. ఈ రహస్యం ఎక్కడా పొక్కనీయకు నాయనా… నీకు పుణ్యముంటుంది-” అని బతిమాలాడు – చేతులు పట్టుకుని. రామలింగడేమీ అనకుండా మౌనంగా వెళ్లిపోయాడప్పటికి.
మర్నాడు …. బితుకు బితుకుమంటూనే భువనవిజయానికి వచ్చాడు ధూర్జటి. ఆయన రావడంతోటే, – శ్రీకృష్ణదేవరాయలు పొగడుతూ, “జవచ్యుతుడైన యాంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనో ‘యతులిత మాధురీ మహిమ…. (జవసత్వాలుడిగిన ధూర్జటి పదాలకింత మాధుర్యం ఎలా కలిగిందో…) అని ఒక్కక్షణం విరామమిచ్చాడు సభవేపు చూస్తూ. ఆక్షణంలోనే రామలింగడు టక్కున లేచి- “…….. హా తెలిసెన్ భువనైక మోహనోత దృవ సుకుమార వారవనితా జనితా ఘనతా పహార సుధారస ధారల గ్రోలుటన్ జుమీ” (జగదేక సుందరులు, సుకుమారులు, యౌవనవతులు అయిన వేశ్యల అధరసుధలను గ్రోలుట వల్లనే సుమా) అని పద్యాన్ని పూర్తి చేసేశాడు. ధూర్జటి సిగ్గుపడుతూ తలదించుకున్నాడు. సభలో – మిగిలిన వారందరూ ఆశ్చర్యపోయారు – ఏం జరిగిందో తెలియక “సంగతేమిటి వికటకవీ” అడిగారు ఆంధ్రభోజులు.
అప్పుడు రామకృష్ణుడు ధూర్జటి వేశ్యాలోలతనూ… భార్యను నిర్లక్ష్యం చేస్తూండడాన్నీ వివరించాడు – తన, పద్యపూరణమునకు సమర్ధింపుగా. రాయలు ధూర్జటిని పిలిపించి ఏకాంతంలో మందలించడమే కాకుండా. అతనిపై ప్రశంసా పద్యాలు చదవడం మానివేశారు. మిగిలిన కవులు రామకృష్ణుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.