తెలివైన పిల్లవాడు
ఒక ఊరిలో ఒకావిడ ఉండేది ఆమెకు ఒక కొడుకు ఉండేవాడు. ఒకరోజు అతడు ఆమె దగ్గర పది పైసలు తీసుకొని కోమటి దుకాణానికి వెళ్లాడు. ఆ దుకాణంలో లడ్డూలు, జిలేబీలు ఉన్నాయి. వాటిని చూడగానే అతనికి నోరూరింది. ఎలాగైనా వాటినన్నింటిని తినాలనుకున్నాడు.
ముందుగా కోమటికి పది పైసలు ఇచ్చి ఒక జిలేబి ఇవ్వమని చెప్పాడు. దానిని తిన్న తరువాత మిగిలిన అన్ని జిలేబీలను, లడ్డూలను పొట్లం కట్టి ఇవ్వమని చెప్పాడు కోమటి. కోమటి అలాగే ఇచ్చాడు. పిల్లవాడు ఆ పొట్లం తీసుకుని వెళ్లబోయాడు. కోమటి డబ్బులు ఇవ్వమని అడిగాడు. అందుకు పిల్లవాడు “నేను ఇవ్వను” అన్నాడు.
కోమటికి కోపం వచ్చింది. “నీ పేరేమిటి?” అని అడిగాడు. దానికి పిల్లవాడు “నా పేరు అప్పులవాడు” అని చెప్పి పొట్లంతో పరుగెత్తాడు. కోమటి “అయ్యో! అయ్యో! నా జిలేబీలు, లడ్డూలు ఎత్తుకుపోతున్నాడు! వాడ్ని ఆపండి!” అని అరవసాగాడు. జనం గుమిగూడారు. “వాని పేరేమిటి?” అని అడిగారు. “అప్పులవాడు” అని చెప్పాడు కోమటి. అందుకు జనం “నువ్వు అప్పు తీర్చలేదు కాబట్టి ఎత్తుకు పోతున్నాడు. ఇందులో అతని తప్పేం ఉంది?” అని వెళ్ళిపోయారు. కోమటి లబోదిబోమని మొత్తుకున్నాడు, ఏమీ చేయలేకపోయాడు.
పిల్లవాడు చెరువు దగ్గరకు వెళ్ళి కూర్చుని జిలేబీలు, లడ్డూలు తినసాగాడు. అక్కడ బట్టలు ఉతుకుతున్న చాకలివాళ్ళు అతనితో "నీ వద్ద ఇన్ని జిలేబీలు, లడ్డూలు ఎక్కడివి?" అని అడిగారు. అందుకు అతడు “ప్రక్క ఊరిలో అందరికీ పంచి పెడుతున్నారు, మీరు కూడా వెళ్ళండి” అన్నాడు. చాకలివాళ్ళకు ఆశ పుట్టింది. వాళ్ళు “నీ పేరు ఏమిటి?” అని అడిగారు. “గాలి దేవుడు” అని చెప్పాడు పిల్లవాడు. “ఐతే, నువ్వు మా బట్టలను చూస్తూ ఉండు. మేం వెళ్ళి జిలేబీలు, లడ్డూలు తెచ్చుకుంటాం” అని చెప్పి చాకలి వాళ్ళంతా పక్క ఊరివైపు పరుగులు తీశారు.
పిల్లవాడు తినడం పూర్తికాగానే చాకలివాళ్ళు వదిలి వెళ్ళిన బట్టలను మూటగట్టుకుని అక్కడి నుండి ఉడాయించాడు. చాకలివాళ్ళు తిరిగి వచ్చి జరిగిన మోసం తెలుసుకుని ఏడవడం మొదలుపెట్టారు. కొంతమంది జనం వచ్చి “ఏం జరిగిందని అడిగారు.” గాలి దేవుడు వచ్చి మా బట్టలన్నీ ఎత్తుకుపోయాడు” అని చెప్పారు చాకలివాళ్ళు. దానికి జనం “గాలి వస్తే బట్టులు ఎగిరిపోక, అలాగే ఉంటాయా!” అని వెళ్ళిపోయారు. చాకలివాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు.
పిల్లవాడు ఒక నది ఒడ్డుకు వెళ్ళాడు. అక్కడ ఒక ముసలమ్మ తన మనవరాలుతో నిలబడి ఉంది. ముసలమ్మ పిల్లవానితో "నన్నూ నా మనవరాలిని పడవలో నది దాటించు బాబూ!" అని అడిగింది. అందుకు పిల్లవాడు “ముందు నీ మనవరాలిని దాటిస్తాను, ఆ తర్వాత నిన్ను దాటిస్తాను” అన్నాడు. అందుకు ముసలమ్మ ఒప్పుకుంది. “నీ పేరేమిటి?” అని అడిగింది. “మొగుడు” అని చెప్పాడు పిల్లవాడు. మనవరాలిని తీసుకుని పడవలో నది దాటిన పిల్లవాడు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. నది అవతల ఉన్న ముసలమ్మ “నా మనవరాలిని తీసుకుపోయాడు నాయనో!” అంటూ ఏడవడం ప్రారంభించింది. జనం గుమిగూడి “ఎవరు?” అని అడిగారు. "మొగుడు" అని చెప్పింది ముసలమ్మ. దానికి జనం “ఆ అమ్మాయి మొగుడు ఆమెను తీసుకెళ్లాడు, ఏడుస్తావెందుకు?” అని వెళ్ళిపోయారు. పాపం ముసలమ్మ కూడా ఏం చేయలేకపోయింది. పిల్లవాడు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. సుఖంగా జీవించాడు.