తెలివి తక్కువ కోతి
ఒకానొక ఊరియందు ఒక ధనవంతుడు కలడు. వాడు పాపాత్ముడు. ఎన్నో పాపములు చేసిన తరువాత వాడికి పాపభీతి పట్టుకుంది. దానితో వాడు ఒక మునీశ్వరుని కలుసుకుని "మునివర్యా! నేను తెలిసి ఎన్నో పాపాలను చేశాను. ఇప్పుడు నాకు ఈ అంతిమ దశలో వాటి గురించి భయం పట్టుకున్నది. నేను చేసిన దాని మూలముగా నేను, నా పెద్దలు, పూర్వులు, నా రాబోయే తరములవారు నరకములో ఘోర పావములను అనుభవించెదవేమో! దీనికి తమరే తరుణోపాయమును సెలవియ్య వలెనని" వేడుకున్నాడు.
అతడి ప్రార్ధన విన్న మునీశ్వరుడు అతడి పట్ల జాలితో "నాయనా! అన్ని పాపములను ఆ సర్వేశ్వరుడే రూపుమాపుతాడు కనుక, నీవు నీ ఊరిలో ఒక ఆలయాన్ని నిర్మించి అందులో అనునిత్యం పేదలకు అన్నదానం చేయించు దానితో నీ యొక్క పాపములు పరిహారమవుతాయని తెలిపాడు. మునీశ్వరుని సలహా నచ్చిన అతడు ఆయనకు నమస్కారము చేసి తన ఇంటికి చేరుకుని వెంటనే దేవాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయసాగాడు. ఇందు నిమిత్తంగా కొద్దిగా కలప అవసరమైనది. దానితో కొందరు అడవికి పోయి పెద్ద పెద్ద చెట్లను నరికి ఆ దూలాలు తీసుకువచ్చి మంటప నిర్మాణానికిగాను వాటిని రంపాలతో కోయసాగారు. దానితో ఆ ప్రాంతమంతా ఎంతో సందడిగా ఉండసాగింది.
ఈ తంతును అక్కడికి దగ్గరలోనే మరో గుడివద్ద ఉంటున్న కోతులమందలోని ఒక కోతి చూచినది. దానికి ఈ సందడంతా ఎంతో ఆనందంగా ఉంది. అప్పుడప్పుడు అది పని జరుగుతున్న చోటుకు వచ్చి పోతూ ఉండేది. మిగిలిన కోతులు మనుషు లతో మనకు పనేమిటంటూ దానిని హెచ్చరించాయి. అయినా అది వినలేదు. ఒకనాటి మధ్యాహ్నం వేళ పనివారందరూ ఎక్కడ దూలాలను అక్కడే వదిలి భోజనానికి వెళ్ళారు. వారు లేకపోవడం చూసిన కోతి అక్కడికి వచ్చింది. అక్కడ దానికి దూలాల మధ్యలో ఇనుమమేకులు కనిపించాయి. వాటిని దూలాలు సగం వరకు కోసిన తరువాత అవి మళ్ళీ అతుక్కుపోకుండా ఉండటానికిగాను పెడతారు.
ఈ సంగతి తెలియని కోతి ఇలాంటి ఒక దూలంమధ్యలోకి దూరి ఎంతో ఆత్రంగా ఆ మేకును తీయడానికి ప్రయత్నించింది. ఎంతకి రాకపోవడంతో ఒక రాయిని తెచ్చి దానితో బలవంతంగా కొట్టింది. ఆ రాయి దెబ్బకు ఆ మేకు క్రిందకు. జారి పోవడం దూలం దగ్గరగా చేరడం మధ్యలో ఉన్న కోతి ఊపిరాడక తన్నుకుని మరణించడం జరిగింది."