తెలివైన నక్క
ఒక అడవిలో ఒక నక్క నివసిస్తుంది. అది ఒకరోజు అడవిలో తిరుగుతుండగా పడివున్న ఏనుగు కనిపించింది. “ఆహా! ఏమీ నా అదృష్టము. ఏనుగును ఎప్పటినుండో తినాలనేది నా కోరిక, ఆ అవకాశం ఇన్నాళ్ళకు దక్కింది” అని సంతోషంగా మాంసాన్ని తినబోయింది. అయితే ఏనుగు చర్మం చాలా దళసరిగా ఉండటంతో దాన్ని చీల్చే శక్తి నక్క పళ్ళకు లేదు. తన తెలివిని ఉపయోగించి బలమైన క్రూరమృగం చేత చర్మాన్ని చీల్చేలా చేసి, తాను మాంసాన్ని తినాలనేది నక్క కోరిక. ఇంతలో ఆవైపుగా సింహం వచ్చింది. నక్క వినయంగా నమస్కరించి “మృగరాజా! పడివున్న ఈ ఏనుగుకు నేను ఇప్పటి వరకు కాపలా ఉన్నాను. మీరు దీని చర్మాన్ని చీల్చి, మాంసాన్ని తినండి” అని చెప్పింది. “నేను వేటాడిన జంతువునే తింటాను. చచ్చిన జంతువుల మాంసం ముట్టనని నీకు తెలుసుకదా?” అని చెప్పి సింహం అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి అక్కడికి పెద్ద పులి వచ్చింది.
నక్క పులితో మాట్లాడుతూ “ఈ ఏనుగును మృగరాజు పడగొట్టి, నన్ను కాపలా పెట్టి స్నానానికి వెళ్ళాడు. “ఒకవేళ పులి ఈ మాంసాన్ని తింటే దాని అంతు తేలుస్తాను’ అని చెప్పి మృగరాజు స్నానానికి వెళ్ళాడు” అన్నది. ఈమాట వినగానే పులికి భయం పట్టుకుంది. ‘ఈ సింహంతో నాకెందుకు శత్రుత్వం’ అనుకుని పులి భయపడి వెళ్ళిపోయింది.
కొద్దిసేపటికి అక్కడికి చిరుతపులి వచ్చింది. నక్క తెలివి ఉపయోగించి చిరుత పులితో ఏనుగు దళసరి చర్మాన్ని చీల్చేలా చేసి మాంసాన్ని తినాలని ఎత్తుగడ వేసింది. నక్క చిరుతతో మాట్లాడుతూ “ఈ ఏనుగును మృగరాజు పడగొట్టి నన్నుకాపలా పెట్టి స్నానానికి వెళ్ళాడు. నువ్వు దీని దళసరి చర్మాన్ని చీల్చు, సింహం వచ్చేలోగా మనం మాంసాన్ని తిందాము” అన్నది నక్క. “సింహంతో నాకు శత్రుత్వం దేనికి, మృగరాజు వస్తే గొడవలౌతాయి.
నా దారి నేను పోతాను” అన్నది చిరుత. “చిరుత! నువ్వు భయపడవలసిన పనేమీ లేదు, నువ్వు దీని చర్మాన్ని చీల్చి మాంసాన్ని తింటూ ఉండు. ఒకవేళ సింహం వస్తే నీకు సంకేతాలు ఇస్తాను. అప్పుడు నువ్వు పారిపో” అని నక్క చెప్పింది. నక్క మాటలను నమ్మిన చిరుత తన బలమైన గోళ్ళు, పదునుగా ఉన్న పళ్ళతో చర్మాన్ని చీల్చి మాంసాన్ని బయటకు తీసింది. చిరుత మాంసాన్ని తినబోతుండగా “మృగరాజు వస్తున్నాడు” అని నక్క బిగ్గరగా అరిచింది. ఆ అరుపు విని చిరుతపులి భయపడి పారిపోయింది.
నీతి కథలు : ఏనుగు చర్మాన్ని చీల్చే శక్తి లేకపోయినప్పటికీ, నక్క తన తెలివితేటలతో ఇతరులచేత ఆ పని చేయించి, హాయిగా మాంసం తిని తన కోరిక తీర్చుకుంది.