తాజ్‌ మహోత్సవ్‌


ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైన తాజ్‌ మహల్‌ని జీవితంలో ఒక్కసారైన చూడాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. ఆగ్రాలో ఉండే ఈ కట్టడాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. దీన్ని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఎవరైనా ఆగ్రా ప్రయాణానికి వెళ్లాలనుకుంటే మాత్రం ఇక్కడ ప్రతి ఏడాది జరిగే తాజ్‌ మహోత్సవ్‌న్ని అస్సలు మిస్సవ్వరు.

తాజ్‌ మహోత్సవ్‌ ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో జరుగుతుంది.ఈ ఏడాది ఈ ఉత్సవం ఫిబ్రవరి 17న ప్రారంభమై ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది. పర్యాటకుల కోసం ఈసారి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల వీక్షణతోపాటు హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ రైడ్‌ వంటివి ఏర్పాటు చేయడం విశేషం.

ఎన్ని రోజులు జరుగుతుందంటే


ఈ ఏడాది తాజ్‌ మహోత్సవం ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతున్నాయి. తాజ్‌ మహోత్సవ్‌ అనేది 10 రోజుల పాటు జరిగే వార్షిక కార్యక్రమం. సరిగ్గా ఇది ఫిబ్రవరి 27న ముగుస్తుంది.

ఈసారి ప్రత్యేకతలు...


ఈ ఏడాది తాజ్‌ మహోత్సవ్‌లో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఈసారి యమునా మహా ఆరతి తాజ్‌ మహోత్సవ్‌లో కనిపించనుంది. యమునా నది ఘాట్‌లపై తాజ్‌ మహోత్సవం సందర్భంగా మహా ఆరతి కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో పాటు పర్యాటకుల కోసం గాలిపటాల పండుగ, గజల్‌ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు...


తాజ్‌ మహోత్సవ్‌ సందర్బంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను చూడటం ఒక విభిన్నమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు సాయంతం ప్రసిద్ధ కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తారు. తాజ్‌ కమిటీ, ఉత్తర్‌ ప్రదేశ్‌ టూరిజం శాఖ సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి. తాజ్‌ మహల్‌ తూర్పు ద్వారం సమీపంలోని శిల్పగ్రామ్లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. తాజ్‌ మహోత్సవ్‌లో భారతీయ సంగీతం, నృత్యానికి సంబంధించిన వివిధ రకాలను చూసే అవకాశం లభిస్తుంది. ఇక్కడకు వచ్చి కథక్‌, భరతనాట్యం, క్లాసికల్‌, సబ్‌-క్లాసికల్‌ గానం, భోజ్‌పురి గానం, అవధి గానం, ఖవ్వాలి, భజన్‌ సంధ్య, బ్రజ్‌ జానపద పాటలు, జానపద నృత్యాలు, వేణువు, సరోద, సితార్‌, తబలా, పఖావాజ్‌, రుద్రవీణ మొదలైనవి వాయించడం ఆస్వాదించవచ్చు.

తాజ్‌ మహోత్సవ్‌లో ప్రముఖ బాలీవుడ్‌ కళాకారులు కూడా ప్రదర్శన ఇస్తారు. ఇందులో గజల్‌ సింగర్‌, ఖవ్వాలి, సింగర్‌, స్టాండప్‌ కామెడీ, తదితర ఈవెంట్‌లను కూడా నిర్వహిస్తారు. ఇవీ కాకుండా ఇంకా దేశం నలుమూలల ను౦డి వచ్చే వందలాది మంది కళాకారులు తమ అద్భుతమైన శిల్ప కళా, హస్త కళా నైపుణ్యాలను ఇక్కడ ప్రదర్శనలో ఉంచుతారు. ఇక్కడ చాలావరకు ప్రాంతీయ ప్రత్యేకతలు కలిగిన అన్నీ కళాఖండాలు ఒకేచోట కొలువుదీరుతుండటం విశేషం. ఇందులో ఈశాన్య రాష్ట్రాల నుంచే వచ్చే కళాకారులు వెదురు బొంగుతో తయారు చేసిన బొమ్మలు ప్రదర్శనలో ఉంచుతారు. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి ప్రాంతాల నుంచి వచ్చేవారు రాతి శిల్పాలు, అలాగే జమ్మూ కశ్మీర్‌ నుంచి వచ్చేవారు తివాచీలు, షాలువాలు, స్వెటర్ల వంటివి ప్రదర్శనకు ఉంచుతారు. ఇక్కడ హస్తకళా కళల ప్రదర్శన, దుకాణాలు, రుచికరమైన ఆహారం కోసం ఫుడ్‌ జోన్‌ తదితరాలు పర్యాటకులు ఎంతగానో ఆకర్షిస్తాయి. తాజ్‌ మహోత్సవ్‌ ప్రవేశ టికెట్‌ రూ. 50. విదేశీ పర్యాటకులు ఐదేళ్లలోపు పిల్లలకు ప్రవేశ రుసుము లేదు.

_ సమాప్తం _

Responsive Footer with Logo and Social Media