తాబేలు మరియు కొంగలు



ఒక చెరువులో ఒక తాబేలు నివసించేది. ప్రతిరోజు ఆ చెరువుకు రెండు కొంగలు వచ్చేవి. వాటి మధ్య గాఢమైన స్నేహం ఏర్పడింది. ఎండా కాలం రావడంతో ఆ చెరువు ఎండిపోసాగింది. చాలా నీళ్ళున్న పెద్ద చెరువులోకి వెళ్ళాలని తాబేలు అనుకుంది. ఈ విషయాన్ని తన మిత్రులైన కొంగలకు చెప్పింది. “మిత్రమా! నువ్వు ఎగరలేవు. మేము నిన్ను సుదూరంగా ఉన్న చెరువులోకి ఎలా తీసుకుని వెళ్ళగలం” అని కొంగలు అన్నాయి.

“మిత్రులారా! అలా అనకండి, మీరే ఏదో ఉపాయాన్ని ఆలోచించి నన్ను నీళ్ళున్న పెద్ద చెరువుకు చేర్చండి” అని తాబేలు ప్రాధేయపడింది. ముగ్గురూ కలసి చాలా ఆలోచించారు. తాబేలుకు ఒక ఆలోచన వచ్చింది. “మిత్రులారా! ఒక కర్రపుల్ల తీసుకుని రండి. మీరిద్దరూ ఆ పుల్లను చెరొక మూల మీ ముక్కులతో పట్టుకోండి. నేను నా నోటితో కర్ర మధ్యభాగాన పట్టుకుంటాను. మీరు ఆకాశంలో ఎగురుతూ మీతోపాటు నన్ను కూడా తీసుకొని వెళ్ళవచ్చు” అన్నది తాబేలు.

“ఇది చాలా ప్రమాదకరం మిత్రమా! నువ్వు మధ్యలో మాట్లాడటానికి నోరు తెరిస్తే ప్రాణాపాయం కలుగుతుంది” అన్నాయి కొంగలు. “నేను ఎక్కడా నోరు తెరచి మాట్లాడనని మీకు మాట ఇస్తున్నాను” అన్నది తాబేలు. తాబేలు కర్రపుల్ల మధ్యలో తన నోటితో బలంగా పట్టుకుంది. కొంగలు ఆ కర్రపుల్ల ఇరువైపులా తమ ముక్కులతో బలంగా పట్టుకొని ఆకాశంలో ఎగరసాగాయి. తాబేలుకు ఎటువంటి ప్రమాదం కలగకుండా ఉండాలని కొంగలు తక్కువ ఎత్తులో ఎగరసాగాయి.

ఈ దృశ్యాన్ని ఒక గ్రామంలో ప్రజలు చూసి వింతగా నవ్వసాగారు. ఈ దృశ్యాన్ని చూసిన తాబేలుకు ఎక్కడ లేని కోపం వచ్చింది. “ఈ మనుషులకు బుద్ధిలేదు” అని చెప్పబోయి నోరు తెరుచిన తాబేలు, తన మాట పూర్తి కాకుండానే నేలపై పడిపోయింది. ఆ గ్రామంలోని ఒకడు తాబేలును తీసుకొని వెళ్ళిపోయాడు.

నీతి కథలు : ఉపాయంతో ఆలోచించి ప్రమాదం లేని ప్రణాళికలు తయారుచేసుకోవాలి.

Responsive Footer with Logo and Social Media