బంగారు గాడిద
ఇప్పటికి 150 ఏండ్ల నాటి మాట. ఒక గొప్ప మంత్రి ఉండేవాడు. ఆయన పేరుతో మనకేమి గాని యీ కథ మాత్రం నిజంగా జరిగింది. ఆ మంత్రి రాజు కూడాను. ఆయన గొప్ప దాత. అందులో బ్రాహ్మణులంటే ఆయనకు పంచ ప్రాణాలు లేచిపొయ్యేవి. వారికిచ్చినట్లు యెవ్వరికినీ యిచ్చేవారు కారు. ఆయన దానము పాత్రాపాత్రము లెరుగదు. బ్రాహ్మణులు దానరూపకంగా ఆయన ద్రవ్యకోశాన్ని చూరగొన్నా కాని వారికి ఆశ వదలలేదు. వర్క్షాతూరి ఆయన వద్దనుండి ఒకే మొత్తంగా గొప్ప ద్రవ్యం లాగవలెనని బుద్ధి పుట్టింది. ఒకనాడు వారిలో కొందరు చేరి మంత్రాలోచన చేసినారు. అందులో ఒకాయనకు మంచి యుక్తి దోచింది. ఆయన యిట్లన్నాడు: “నేను మంచి ఆలోచన చెప్తా వినండి. నేను సన్యాసి వేషముతో మంత్రిగారి దగ్గరికి పోతాను. అక్కడ నేను ఉపాయాలుచేసి ఆయనను మెప్పించి నేను చెప్పినట్లు చేసేదానికి ఒప్పిస్తాను. తరువాత తమతో ఆలోచిస్తే మీరున్నూ నా మాట ప్రకారం చెయ్యాలె” అని యేమేమో ఉపాయం చెప్పినాడు. అందరూ ఆయన ఆలోచన బాగుందని మెచ్చుకొన్నారు.
మర్నాడే పై బ్రాహ్మణుడు సన్యాసివేషంతో మంత్రి దగ్గరకు పోయినాడు. మంత్రి దిగ్గునలేచి నడుముకు సెల్లా బిగించుకొని పొట్టమీద బోరగిలబడి నమస్తే అన్నాడు. సన్యాసి మహాగంభీరంగా “జై సీతారాం!” అని కుడిచేయి పైకెత్తి దీవించినాడు. ఒంటినిండా అగ్గువ బూడిద పూసుకొన్నాడు. చేత వంకరటింకర కట్టె బట్టినాడు. ఎక్కడిదో ఒకటి సంపాదించుకొన్న సొరకాయబుర్ర చంకన తగిలించుకొన్నాడు. జింకతోలు ముడిచి ఇంకోచంకన ఇరికించుకొన్నాడు. మాటకు "జై సీతారాం!" అని గర్జిస్తాడు. మంత్రిగారు వారిని కూర్చుండబెట్టి దేశదేశాల సమాచారాలు అడిగినారు. సన్యాసి ఇట్లా సెలవిచ్చినాడు: “మహారాజ్! నేను కాశీయాత్రచేసి రామేశ్వరం పోతూవున్నాను. నేను బైరాగిని, నాకేమిన్నీ ప్రాపంచికమైన కోరికలులేవు. నేను నీవద్ద ఒక పైసాకూడా తీసుకోను. కాని నేను చెప్పేది బాగావిను. నేను గంగలో స్నానముచేసి గట్టుపైన గోచిబట్ట ఆరవేసి కూర్చుని యుంటిని. ఎప్పుడో ఒక గాడిదవచ్చి ఆ బట్టను తినివేసింది. నాకు మహాకోపం వచ్చింది. కొట్టబోయినాను. అంత ఆ గాడిద 'వద్దువద్దు' అని నోటినిండ మాట్లాడింది. నాకు ఆశ్చర్యమైంది. భయపడిపోతిని. అయినా సంగతి తెలుసుందామని ఇట్లంటిని:
“నీవుచూస్తే గాడిదవుకాని మనిషివలె మాట్లాడుతావు ఏంచిత్రం?" అన్నాను. ఆ గాడిద ఇట్లన్నది: 'నా చరిత్ర కొంతచెప్తా విను. నేను పూర్వజన్మంలో ఒక మంత్రి తల్లిని. నేను కర్మ ప్రారబ్ధముచేత ఇట్లు గాడిదనై పుట్టినాను. కాని నా కొడుకు మహాదాత అగుటచేత నాకు పూర్వ జన్మస్మృతి కలిగింది. మీరు రామేశ్వరం పోతూపోతూ నా కొడుకును చూస్తే యిట్లు చెప్పింది': 'నీ తల్లి గాడిదయై నరకబాధ అనుభవించుతూ వుంది. నీ తల్లికి ముక్తియిప్పించే కోరికవుంటే నీవు గాడిదంత నిండు బంగారు విగ్రహంచేసి బ్రాహ్మణులకు దానము చేయవలెను. లేకుంటే నా గతి యిట్లే వుంటుంది' అని చెప్పి ప్రార్థిస్తూవున్నాను.
“నేను అదేప్రకారం మాటయిచ్చి ఈ సంగతి నీతో చెప్పవచ్చినాను. వచ్చినపని అయింది. ఇక నీయిష్టం. నేను పోతూవున్నాను." అని సన్యాసి లేచినాడు. మంత్రికి పట్టరాని దుఃఖము కలిగింది. సన్యాసి చెప్పినమాటలు నమ్మినాడు. పైగా ఆయన యేమిన్ని ప్రతిఫలం కోరనందున యింకా విశ్వాసం యెక్కువ అయ్యింది. ఆయనను పంపివేసినాడు. వెంటనే బ్రాహ్మణులను పిలిపించినాడు. సంగతంతా చెప్పుకొన్నాడు. వారిట్లని జవాబిచ్చినారు.
"అయ్యో! పాపము ఎంతఘోరము! శాస్త్ర ప్రకారముగాకూడా సన్యాసిచెప్పిన ప్రకారం చేయవల్సిందని ఆజ్ఞవున్నది. మీతల్లి నుత్తమ లోకమునకుపంపే ఏర్పాటు చేయకుంటే మీరిన్ని దినాలు చేసిన సుకృతమంతా వ్యర్థమే! తప్పక ఆ ప్రకారం చెయ్యండి." ఇంకా కొంతసేపు ఆలోచించి శుభదినం పంచాంగ శుద్ధిచూచి ఏర్పాటు చేసినారు. వెంటనే తన ఖజాంచీకి ఒక పెద్ద గాడిదను బంగారుతో తయారు చేయించేదానికి కావలసినంత ధనము ఇయ్యవలసినదని మంత్రిగారు ఆజ్ఞాపించినారు.
“సర్కార్! ఖజానా ఖాలీ” అన్నాడు ఖజాంచీ. “అరే, బాకీ తీసుకరా” అన్నాడు మంత్రి.
ఒక తట్టు బంగారు గాడిదను తయారు చేసేదాంట్లో పట్నము కంసలివాండ్లు పోరాడుతున్నారు. ఈ సంగతంతా కొడుకు చూచినాడు. తన తండ్రికి వెఱి ముదిరిపోతున్నది. దీనికి తగిన ప్రతిక్రియ చేయవలె ననుకున్నాడు. ఆయన భార్య గతించి రెండేండ్లు అయివుండింది. అంతలో తద్దినం వచ్చింది. బ్రాహ్మణులకు బాగా సంభావన లిస్తానని అందరిని పిలిపించినాడు. వారికి కడుపునిండా భోజనాలు పెట్టించినాడు. భోజనమైన తర్వాత వారినందరిని అంగణములో సమావేశం చేసినాడు. గవినిదర్వాజా బందుచేయించినాడు. ఒక మూలకు పెద్ద పెద్ద మంటలు చేసి సుమారు 20, 30 ఖడ్డీలు ఎర్రగా కాచుతూవుండేది బ్రాహ్మణులు చూచినారు. “ఏమిటయ్యా అది?" అని కొందరు అక్కడుండే చోల్దార్లను అడిగినారు. ఒకడు ఇట్లా జవాబిచ్చినాడు: “ఏమి చెప్పాలె సామీ! మా మంత్రిగారి కొడుకుభార్యకు చచ్చేముందర వాయిపట్లు పట్టుకొన్నవి. వాతలేస్తేనే బతుకుతా లేకుంటే చస్తా అంటూ వుండింది ఆమె. ఆఖరుకు ఇట్లానే మంటలు చేసి సలాకులుకాల్చి వాతలు వేసేదానికి సిద్ధపడేవరకే ఆమె గంతు కొట్టింది. మొన్ననే ఒక సన్యాసి మామంత్రి కొడుకు దగ్గరికివచ్చి యిట్లా చెప్పిపోయిండు: 'నీ భార్య గంగాతీరములో గాడిద రూపంగా కుంటుతూ తిరుగుతుంది. నాతో మాట్లాడింది. నా మొగుడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి బాగా దక్షిణలిచ్చి పొయ్యే అప్పుడు తలా ఒకవాత నడుముచుట్టువేస్తే నా కీజన్మలోనే ముక్తి కలుగుతుంది' అని చెప్పిందట. అందుకోసరం ఈ తయ్యారీ అంతాను.” బ్రాహ్మణు లీమాటలనువిని దద్దరిల్లిపోయినారు. లబలబ అరచినారు. దర్వాజతట్టు ఉరికినారు. ద్వారాలు బంధింపబడి ఉండినవి. చోల్దార్లు కత్తులు జళిపించుకుంటూ బెదరించినారు.
అంతలో మంత్రికొడుకు వారితో దక్షిణతీసుకోండి అయ్యగార్లూ అని పిలిచినారు. "మహాప్రభో! మమ్మువదలి పెట్టే అదేదక్షిణమాకు, ఇంకేమిన్నీవద్దు" అని ఏకవాక్యంగా వారు ప్రార్థించినారు. "అయ్యా, మా అమ్మకూడ గాడిదగానె పుట్టింది. నా భార్యకూడా గాడిదగానే పుట్టింది. ఇద్దఱి మోక్షోపాయం మీరే చెప్పండి” అన్నాడు మంత్రి కొడుకు. బ్రాహ్మణులు ఒకరి మొకం ఒకరు చూచుకున్నారు. తుదకు ఒకడు ముందుకొచ్చి యిట్లా అన్నాడు:
"మహాప్రభో! బంగారు గాడిద ఉపాయం చెప్పింది వీడేనండీ! మాకేమిన్నీ తెలియదు."
అంతట మంత్రికొడుకు పకపకనగి వారి ఉపాయాలంతా తండ్రికి చెప్పి గాడిదను చేయించుటకైనట్టి బంగారును మళ్ళి అమ్మించి నష్టము నుండి విముక్తిని బొందినారు.