సీతయ్య మందబుద్ధి



సీతయ్యకు పుట్టెడు మతిమరుపు. ఈ క్షణంలో ఏ పని చేసింది మరుక్షణంలో గుర్తుండేది కాదు. ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే మరచిపోయే వాడు. ఇందువల్ల అతడి కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పడేవాళ్ళు, అతడి భార్య వెంటవుండి అన్ని పనులూ చేయించేది.

ప్రతిరోజూ గుడికెళ్ళి అక్కడ రామాయణ పారాయణం విని వచ్చే సీతయ్య రోజూ తన ఉత్తరీయమో, గొడుగో అక్కడ మరిచి వచ్చేవాడు. తర్వాత ఇంట్లో ఎవరో ఒకరు వెళ్ళి తీసుకొచ్చేవారు.

భర్త మతిమరువుతో బాగా విసిగిపోయిన సీతయ్య భార్య ఒక రోజు కోపం కొద్దీ అతడ్ని గట్టిగా చివాట్లు పెట్టింది.

భార్య పెట్టిన చివాట్లు సీతయ్యకు చాలా బాధ కలిగించాయి. ఆ రోజు సాయంత్రం అతడు గుడినుండి ఇంటికి తిరిగి వచ్చి భార్యను కేకవేసి “నన్ను మతిమరపువాడివంటూ తెగ చివాట్లు పెట్టావ్‌ కదా! ఈ రోజు చూడు. గుడిలో మర్చిపోకుండా చెప్పులు తొడుక్కుని వచ్చాను” అన్నాడు.

సీతయ్య భార్య అతడి కాళ్ళవైపు ఆశ్చర్యంగా చూసి “మీ మతి మరుపు మండినట్టే వుంది. ఈ రోజు మీరసలు గుడికి చెప్పులు తొడుక్కుని వెళ్ళలేదు!” అన్నది.

Responsive Footer with Logo and Social Media