సింహం- గాడిద- చేపలకథ



నెత్తి మీద చక్రంతో తిరిగిపోతున్న మిత్రుణ్ణి చూసి, అతని శరీరమ్మీద ధారలు కడుతోన్న రక్తాన్ని చూసి నిర్ఘాంతపోయాడతను. చదువుకున్నాడు కాని, వివేకాన్ని కోల్పోయాడు. ఆడియాసకు లోనయ్యాడు. అందుకే ఇంతటి శిక్షను అనుభవిస్తున్నాడనుకున్నాడు. మిత్రుడికి ‘సింహకారకులు’ కథ చెప్పసాగాడు.‘అగ్రహారానికి చెందిన నలుగురు మిత్రులూ డబ్బు సంపాదించేందుకు దేశాటనకు బయల్దేరారు. మార్గమధ్యంలో వారికి ఓ అడవి ఎదురయింది. అడవిలో సింహానికి సంబంధించిన ఎముకలు కనిపించాయి. వైజ్ఞానికుల్లో మొదటివాడు ఆ ఎముకల్ని చూస్తూనే సంబరపడి ఇలా అన్నాడు.

‘ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానో! ఇవి సింహం ఎముకలు కదా, వీటిని ఎంచక్కా పేర్చి అస్థిపంజరాన్ని తయారు చేస్తాను. పంజరాన్ని చూస్తూనే మీరే అంటారు. అచ్చం సింహంలా ఉందని.’చె ప్పినట్టుగానే అతను అస్థిపంజరాన్ని తయారు చేశాడు. తనేం తక్కువ తినలేదన్నట్టుగా రెండోవాడు ఆ అస్థిపంజరానికి రక్తమాంసాలు నింపాడు. చర్మాన్ని తొడిగాడు. మూడోవాడు తన ప్రతిభను కనబరిచేందుకు కదలక బొమ్మలా ఉన్న సింహానికి ప్రాణం పోస్తానన్నాడు. వద్దన్నాడు లోకజ్ఞానం మాత్రమే కలిగిన నాలుగోవాడు.‘ఎందుకొద్దు?’‘ఎందుకొద్దంటే దీనికి ప్రాణం పోశావనుకో, నిజం సింహం అయిపోతుంది. సింహం అయిపోయిన మరుక్షణం అది మనల్ని తినేస్తుంది. చేజేతులా ప్రాణాలను ఎందుకు పోగొట్టుకోవడం. వద్దు. నా మాట విను. దీనికి ప్రాణం పొయ్యొద్దు. పదండి పోదాం ఇక్కణ్ణుంచి.’‘రాక రాక వచ్చిన అవకాశాన్ని వదులుకోమంటావేంటి? నా విద్య ఎలాంటిదో చూపించవద్దా, బలేవాడివే, తప్పుకో’ అన్నాడు మూడోవాడు.‘అవునవును! అతని విద్యను అతను ప్రదర్శించనీ, చూద్దాం.’ వత్తాసు పలికారు, వైజ్ఞానికులు.‘ఈ బొమ్మ సింహం ప్రాణం పోసుకుని నిజం సింహం అయితే దానిని తీసుకుని వెళ్ళి మహారాజుకి చూపిద్దాం. ఎలా రూపుదిద్దుకున్నదీ వివరించి చెబుదాం. రాజు మెచ్చుకుని బహుమతులిస్తే ఇంకేం ఉందీ, పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్టే!’ అన్నారు.‘పొయ్యి, ప్రాణం పొయ్యి’ అని ప్రోత్సహించారు.‘ఆగండాగండి’ అన్నాడు లోకజ్ఞాని.

‘నేను ఆ చెట్టెక్కి కూర్చుంటాను, అప్పుడు ప్రాణం పొయ్యండి. అందాకా ఆగండి.’ అన్నాడు. గబగబా చెట్టెక్కి కూర్చున్నాడతను.‘పిరికి’ నవ్వుకున్నారు వైజ్ఞానికులు.మూడోవాడు తన ప్రతిభనంతా రంగరించాడు. బొమ్మ సింహానికి ప్రాణం పోశాడు. అంతే! సింహం ఒక్కసారి జూలు విదిల్చింది. పెద్దగా గర్జించింది. తమ పైకి వస్తోన్న సింహాన్ని చూసి, భయంతో పరుగందుకున్నారు వైజ్ఞానికులు. వారి వెంటపడింది సింహం. ముగ్గురినీ చంపి, తినేసింది.’ ముగించాడతను.నెత్తి మీది చక్రాన్ని అదుపు చేసుకునేందుకు ప్రయత్నిస్తూ మిత్రుడిలా అన్నాడు.‘ఈ కథ చెప్పి, నన్ను చదువుకున్న మూర్ఖునిగా, బుద్ధిహీనుడిగా జమకట్టావు. దీనికి నేనేం బాధపడను. కాని, ఒక విషయం తెలుసుకో మిత్రమా! దేనికైనా దైవం అనుకూలించాలి. దైవం అనుకూలిస్తేనే బుద్ధి వికసిస్తుంది. అనుకూలించలేదనుకో, అంతే సంగతులు. దైవం అనుకూలిస్తే అల్పబుద్ధులయినా రాణిస్తారు. అనుకూలించకపోతే బుద్ధిశాలురు కూడా భంగపడతారు. దీనికి సంబంధించి రెండు చేపల కథ ఒకటి ఉంది. చెబుతాను, విను.

చెప్పసాగాడతను.‘ఓ చెరువులో రెండు చేపలుండేవి. ఒకదాని పేరు శతబుద్ధి, మరోదాని పేరు సహస్రబుద్ధి. వాటితో పాటు ఓ కప్ప కూడా ఉండేది. దాని పేరు ఏకబుద్ధి. ఈ మూడు బుద్ధులూ స్నేహంగా ఉండేవి. ఒకనాడు జాలర్లు ఆ చెరువు గట్టున నడిచిపోతున్నారు. వారిని గమనించలేదు శతబుద్ధి, సహస్రబుద్ధి. నీటిలో తుళ్ళి తుళ్ళి పడ్డాయి. ఆడుకున్నాయి. అప్పుడు ఆ చేపల్ని చూశారు జాలర్లు. ఇలా అనుకున్నారు.‘చెరువు నిండా బాగా చేపలున్నాయి. రేపొచ్చి పట్టుకుందాం.’ఆ మాట విన్నది ఏకబుద్ధి. ఆడుకుంటున్న చేపలు దగ్గరకు వచ్చింది.‘చాలు, ఆపండి ఆటలు.’ అంది. తను విన్న మాటను భయంతో వణికిపోతూ చెప్పింది వాటికి.‘ఏం భయపడకు! వాళ్ళలా అంటారేకాని, రారు. ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు ఇదే మాట అన్నారు. వచ్చారా? లేదు.’ అన్నాయి చేపలు.‘ఈసారి వస్తారేమో’ అంది ఏకబుద్ధి.‘వస్తే నిన్ను కాపాడే పూచీ నాది. నా పేరే సహస్రబుద్ధి. నీకేం కాకుండా నేను చూసుకుంటాను.’‘ఇదిగో! బుద్ధి ఉండాలే కాని, ఎలాంటి ప్రమాదాన్నయినా ఎదుర్కోగలం. నా పేరే శతబుద్ధి. నిశ్చింతగా ఉండు. నీ సంగతి నేను చూసుకుంటాను.’ తను కూడా ఏకబుద్ధికి అభయం ప్రసాదించింది.రాత్రి భార్యతో చర్చించింది ఏకబుద్ధి. పొంచి ఉన్న ప్రమాదాన్ని పట్టించుకోని చేపల్ని నానా తిట్లూ తిట్టింది.

తర్వాత ప్రాణాలు కాపాడుకునేందుకు రాత్రికి రాత్రే భార్యతో పాటుగా ఇంకో చెరువుకి చేరుకుంది. తెల్లారింది. అనుకున్నట్టుగానే చెరువు దగ్గరికి జాలర్లు వచ్చారు. వల వేశారు. శతబుద్ధి తన నూరు ఉపాయలతోనూ, శహస్రబుద్ధి తన వేయి ఉపాయాలతోనూ వల నుంచి తప్పించుకోజూశాయి. తెలివితేటలెన్నో ప్రదర్శించాయి. అయితే దైవం అనుకూలించలేదు. దాంతో తప్పుకోవడం సాధ్యం కాలేదు. జాలరికి రెండూ దొరికిపోయాయి. రెంటినీ భుజమ్మీద ఉంచుకుని ఇంటిదారి పట్డాడు జాలరి. అతన్ని చూసింది ఏకబుద్ధి. అతని భుజమ్మీది చేపల్ని కూడా చూసింది. భార్యకి చూపించింది వాటిని. చూపించి ఇలా అన్నది.‘ఈ ప్రబుద్ధుల్ని నమ్ముకుంటే మన బతుకూ ఇంతే అయి ఉండేది. జాగ్రత్తపడి బతికిపోయాం.’ అంది.-కథ ముగించాడతను.‘బుద్ధిమంతులు కూడా అప్పుడప్పుడూ పప్పులో కాలేస్తారు. కాదనను. నీ మాట ఒప్పుకుంటాను. కాకపోతే బుద్ధిమంతులు అహంకారానికిపోయి, మిత్రుల మాట పెడ చె విన పెట్టకూడదు. అన్నానని కాదుగాని, నా మాట వినకే కదా నువ్విలా అయ్యావు.

చక్రాన్ని నెత్తికి చుట్టుకున్నావు. ఎందుకు చెప్పారో వినాలి. వినకపోతే పాట పాడిన గాడిదలాగే ప్రమాదంలో పడతారు.’ అన్నాడు మిత్రుడు.‘గాడిద కథ ఏమిటి?’ అడిగాడు.చెప్పసాగాడు మిత్రుడు.అనగనగా ఓ గాడిద. దాని కంఠం వినసొంపుగా ఉండకపోవచ్చుగాని, దానికి సంగీతశాస్త్రం గురించి బాగా తెలుసు. ఆ సంగతి అలా ఉంచితే, పొద్దంతా చాకలి మూటలు మోసి మోసి, పొద్దుపోయాక దోసపాదులుండే మెరకల మీదికి పోతుండేదది. అక్కడ కడుపు నిండా దోసాకులూ,కాయలూ మేసి వస్తుండేది. మెరకల మీదికి పోయినప్పుడే ఓ నక్కతో దానికి స్నేహం కుదిరింది.

ఒకరోజు పున్నమి. వెన్నెల విరగకాస్తోంది. నక్కతో ఇలా అంది గాడిద.‘ఇవాళ నీ ముందు పాడాలనిపిస్తోంది.’‘కొంపదీసి పాడేవు. ప్రాణాలు పోతాయి. వద్దు.’ అన్నది నక్క.‘దొంగతనంగా మేతమేసి పోయేవాళ్ళం. గుట్టుగా వచ్చి గుట్టుగా పోవాలి. పాటలూ ఆటలూ వద్దు. ఒకవేళ నువ్వు పాడేవనుకో, ఆ పాటకి రైతు మేల్కొంటే అంతేసంగతులు. ఇద్దరికీ బడితెపూజ అయిపోతుంది. ఎందుకొచ్చిన గొడవ. వూర్కో’ అంది అంతలోనే.‘అయినా నీ గొంతులో పాటేంటి చెప్పు? నవ్వుతారెవరయినా’ అంది. అంతే! ఆ ఆ మాటకి కోపం వచ్చింది గాడిదకి.‘నా గొంతులో పాటేంటంటావా? నీకేం తెలుసు నా పాటెలాంటిదో? ఒఠ్ఠి అడవి జంతువ్వి. ఎంతసేపూ తిండి తప్ప మీకో పాటా మాటా ? ఛీఛీ’ అసహ్యించుకుంది నక్కని.‘సంగీతం నీకంత బాగా తెలుసా?’‘చాలా బాగా తెలుసు.’ అంది గాడిద. సప్తస్వరాలను పలికింది. తాళ భేదాలు చెప్పింది. వివిధ రాగాలు, గమకాలు గురించి గుక్క తిప్పుకోకుండా దీర్ఘోపన్యాసం ఇచ్చింది.

‘ఇప్పుడు చెప్పు. నా పాట వింటావా? వినవా?’ అడిగింది.తప్పదు, పాడి తీరుతుంది గాడిద. పాట వినడమే ప్రమాదం అనుకుంటే పడుకున్న రైతు మేల్కొంటే ఇంకా ప్రమాదం అనుకుంది నక్క. అయినా తెలివిగా ఇలా అంది.‘ఓ పని చేస్తాను. నేను వె ళ్ళి అదిగో అక్కడ దూరంగా నిలబడతాను. నువ్వు అప్పుడు పాడు. ఒకవేళ రైతు లేస్తే అరిచి చెబుతాను. ఆపేయ్‌.’ అంది నక్క.‘అలా అన్నావు బాగుంది. వెళ్ళిరా’ అంది గాడిద. అదే అదనుగా నక్క అక్కణ్ణుంచి తప్పుకుంది. గాడిద పాట ఎత్తుకుంది. పెద్దగా ఓండ్ర పెట్టసాగింది. ఎంతకీ ఆపదు. దాంతో రైతుకి మెలకువ రానే వచ్చింది. మెలకువతో పాటు బంగారంలాంటి నిద్రను చెడగొట్టినందుకు గాడిద మీద కోపం కూడా వచ్చింది. ఆ కోపంతో పెద్ద దుడ్డుకర్రను పట్టుకుని వచ్చి, దాంతో గాడిదను ఇక్కడ అక్కడని గాక ఎక్కడ పడితే అక్కడ చితక్కొట్టాడు.

అయినా అతని కోపం చల్లారలేదు. దగ్గరగా ఉన్న రాతిరోలుని లాక్కొచ్చి, దాన్ని గాడిద మెడకి వేలాడదీశాడు.‘ఇప్పుడు పాడు’ అన్నాడు. వెళ్ళిపోయాడు.తిన్న దెబ్బలకి కుయ్యో మొర్రోమంటూ మెడలో రోలుతో నక్క దగ్గరగా వచ్చింది గాడిద.‘బాగుందే! నీ పాటకి మెచ్చుకుని రైతు మంచి కంఠాభరణాన్నే ఇచ్చాడు.’ అని నవ్వింది నక్క.‘పాడొద్దని చెబితే విన్నావా? పాడతానన్నావు. ఏఁవయ్యావు. పాడిప్పుడు.’ అని ఎగతాళి చేసి, నవ్వుకుంటూ అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది నక్క.’-కథ ముగించాడు మిత్రుడు.‘నువ్వు చెప్పింది నిజమే! వివేకవంతుడయిన స్నేహితుని మాట వినాలి. వినకపోతే సాలెవాడులా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.’ అన్నాడతను.‘ఏమిటా కథ’ అడిగాడు మిత్రుడు.చెప్పసాగాడతను.