సంధి



హిరణ్యగర్భునితో సంధి చేసుకుందామని ఒక పక్క దూరదర్శి చెబుతూనే ఉన్నాడు, మరో పక్క సింహళరాజుమహాబలుడు, రాజధానిని ముట్టడించాడని తెలిసింది. దాంతో కోపోద్రిక్తుడయ్యాడు చిత్రవర్ణుడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. వారించాడతన్ని దూరదర్శి. కోపంతోతీసుకున్న నిర్ణయాలు, కష్టాన్నే కాదు,తీవ్ర నష్టాన్ని కూడా కలుగజేస్తాయన్నాడు. ఆలోచనలో పడ్డాడు చిత్రవర్ణుడు.దూరదర్శి మాటలు తనకెంత మాత్రం నచ్చడం లేదు. త్రోసి రాజందామంటే ఎందుకో లేనిపోని భయం పట్టుకుందతనికి. ఇది వరకు చాలా సార్లు దూరదర్శిని కాద న్నాడు. అన్నందుకు చాలా చిక్కుల్లో పడ్డాడు. మంత్రి మాటను పెడ చెవిన పెట్టకూడదు. విని తీరాల్సిందేననుకున్నాడు చిత్రవర్ణుడు.‘‘కోప తాపాలు వద్దంటున్నావు. బాగానే ఉంది. కాని, శత్రురాజు మన రాజధానిని చుట్టు ముట్టినప్పుడు శాంతంగా ఆలోచించడం నా వల్ల కాదు. ఇక్కడ మనం ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ మహాబలుడు మన రాజ్యాన్ని కొల్లగొట్టుకుపోవడం ఖాయం. అందుకని, ముందు శత్రువుని ఎదుర్కోవడమే తక్షణ కర్తవ్యం. యుద్ధం తప్పదు.’’ అన్నాడు చిత్రవర్ణుడు.కాదన్నట్టుగా తలూపాడు దూరదర్శి.‘‘సరే, నా అభిప్రాయం తప్పే! ఒప్పుకుంటున్నాను. నువ్వేమంటావో చెప్పు.’’ అడిగాడు చిత్రవర్ణుడు.

‘‘నా మాట నెగ్గించుకోవాలని కాదు మహారాజా! నా అభిప్రాయం చెబుతున్నాను, వినండి. హిరణ్యగర్భుడి మీద మన గెలుపు ఓ గెలుపు కాదు. గెలిచామన్న మాటేగాని, ఆ యుద్ధంలో మన వీరులు చాలా మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు చనిపోగా, మిగిలిన వాళ్ళు తీవ్రంగా గాయపడి ఉన్నారు. వారెవరూ ఇప్పుడు యుద్ధంలో పాల్గొనలేని పరిస్థితి. కనిపించడానికీ, ఉండడానికీ సైన్యం ఉందిగాని, వారెవరూ యుద్ధంలో ఆరితేరిన వారు కాదు. వారితో యుద్ధానికి తలపడితే ఓడిపోతాం. అది ముమ్మాటికీ నిజం.’’ అన్నాడు దూరదర్శి.

‘‘మరిప్పుడేం చేద్దాం?’’ తలపట్టుకున్నాడు చిత్రవర్ణుడు.‘‘అక్కడికే వస్తున్నాను మహారాజా! సింహళరాజు మహాబలుడు, తనంత తానుగా మన మీదకి యుద్ధానికి రాలేదు. నాకు తెలిసి, హిరణ్యగర్భుడి మంత్రి సర్వజ్ఞుడు, అతన్ని ప్రేరేపించాడు. మన మీదకి యుద్ధానికి తరిమాడు. ఒకసారి మనతో ఓడిపోయాడు. అయినా తెగించి యుద్ధానికి వచ్చాడంటే, చూడండి మనమంటే అతనికి ఎంత కక్ష ఉన్నదో! ఈ స్థితిలో వీలయినంత తొందరగా హిరణ్యగర్భుని దగ్గరికి మన దూతని పంపించి, అతనితో సంధి చేసుకోవడమే మనకి అన్ని విధాలా శ్రేయస్కరం. అప్పుడు ఈ మహాబలుడు యుద్ధం మానుకుంటాడు. వెనక్కి వెళ్ళిపోతాడు. అయితే మహాబలుని దగ్గరకు కూడా ఓ దూతను పంపించి, మనం హిరణ్యగర్భునితో సంధి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పడం మంచిది.’’ అన్నాడు దూరదర్శి.‘‘సరే! నీ ఇష్టప్రకారమే కానీ’’ అన్నాడు చిత్రవర్ణుడు. మహారాజు ఆ మాట అనడం ఆలస్యం, అరుణముఖుడు మహాబలుడు దగ్గరకు చేరుకున్నాడు. దూతనని చెప్పాడు. ఇలా మాట్లాడాడు.

‘‘రాజా! మనం అంతా ఇరుగు పొరుగు దేశాల వాళ్ళం. తరుచూ ఇలా యుద్ధాలకి దిగడం మంచిది కాదు. అందరం స్నేహంగా ఉందాం. అలా ఉంటే శత్రువులు మనల్ని కన్నెత్తి చూడలేరు. ఇన్నాళ్ళూ పంతాలకూ పట్టింపులకూ పోయి యుద్ధాలు చేశాం. రెండు వైపులా నష్టపోయాం. ఇక మీదట యుద్ధాలు వద్దు. స్నేహంగా శాంతిగా ఉందాం.’’‘‘ఈ ఒప్పందం మన రెండు రాజ్యాలకే పరిమితమా?’’ అడిగాడు మహాబలుడు.‘‘లేదు మహారాజా! మీ స్నేహితుడు హిరణ్యగర్భునితో కూడా ఇదే ఒప్పందం పెట్టుకుంటున్నాం. అతని రాజ్యం అతనికిచ్చేస్తున్నాం. సంధి చేసుకుంటున్నాం. త్వరలోనే అక్కడికి కూడా దూత వెళ్ళబోతున్నాడు.’’ చెప్పాడు అరుణముఖుడు.‘‘నిజమా’’ అడిగాడు మహాబలుడు.‘‘నిజం మహారాజా! ఇందులో అక్షరం అబద్ధం లేదు. దయచేసి మీరు యుద్ధాన్ని విరమించుకుని, వెనక్కి తిరిగి వెళ్ళిపోండి.’’ అన్నాడు అరుణముఖుడు.

క్రీగంట దూతని గమనిస్తూ ఆలోచించసాగాడు మహాబలుడు.తను చిత్రవర్ణుడి మీదకి ఎందుకు దండెత్తి వచ్చాడు? చిత్రవర్ణుని ఓడించి, హిరణ్యగర్భుని రాజ్యం, హిరణ్యగర్భునికి ఇద్దామని. ఆ పని ఇంత సులువుగా చక్కబడుతూంటే ఇక యుద్ధం దేనికి? తన మాటను కాదనక సైన్యం యుద్ధానికి సిద్ధమయింది కాని, నిజానికి సైన్యానికి ఇప్పుడు ఎంత మాత్రం ఈ యుద్ధం ఇష్టం లేదు. యుద్ధాలతో సైన్యం అంతా అలసిపోయి ఉంది. కావాల్సింది విశ్రాంతి. అది సంధి రూపంలో దొరుకుతూంటే చేజార్చుకోవడం అవివేకం అనుకున్నాడు మహాబలుడు. సరేనని, తిరిగి వెళ్ళిపోవడానికీ, చిత్రవర్ణునితో సంధికీ రెంటికీ అంగీకరించాడతను.దూరదర్శి చెప్పినట్టుగానే జరుగుతోంది. ప్రశాంతంగా ఉందిప్పుడు చిత్రవర్ణుడికి. ఆ ఆనందంలో హిరణ్యగర్భునికి ఓ లేఖ రాశాడతను. దానిని అరుణముఖునికి ఇచ్చి, అతన్నే హిరణ్యగర్భుని దగ్గరకు కూడా దూతగా పంపాడు. ఇదంతా మంత్రి దూరదర్శి పర్యవేక్షణలో జరిగింది.కర్పూర ద్వీపానికి హుటాహుటిన చేరుకున్నాడు అరుణముఖుడు. హిరణ్యగర్భుణ్ణి కలిశాడు. చిత్రవర్ణుని సందేశాన్ని ఇలా వినిపించాడు.

‘‘రాజా! మా మహారాజు చిత్రవర్ణుడు, మీ గొప్పతనాన్నీ, మీ మంచితనాన్నీ తెలుసుకున్నాడు. మీ స్నేహాన్ని కోరుతున్నాడు. మా రాజుతో, మా దేశంతో స్నేహసంబంధాలు పెట్టుకుని, మీ రాజ్యాన్ని మీరు ఏలుకోండి. ఇక మీదట ఈ కర్పూరద్వీపం మాది కాదు, మీదే! పోరు నష్టం. పొందు లాభం అన్నదే మా నినాదం.’’ఊహించని శుభవార్త! హిరణ్యగర్భుడు పొంగిపోయాడు. చిత్రవర్ణుడు ఇచ్చిన లేఖను కూడా చదివాడు అరుణముఖుడు. తానింతకు ముందు చెప్పిందే అందులో ఉంది.మంత్రి సర్వజ్ఞుణ్ణి సంప్రదించాడు హిరణ్యగర్భుడు. మంచి రోజులు వచ్చినందుకు మురిసిపోయాడు. చిత్రవర్ణునికి కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాశాడతను. ఆ లేఖను ధవళాంగుడి చేతికిచ్చాడు. దూతగా వచ్చిన అరుణముఖుని ఆదరించి, అతనికి అతిథి మర్యాదలు చేశాడు. ఆ తర్వాత వెల కట్టలేనన్ని బహుమతులు ఇచ్చాడు.

అరుణముఖుడితో కలిసే జంబూద్వీపానికి ప్రయాణమయ్యాడు ధవళాంగుడు. ఇద్దరూ ఆడుకుంటూ పాడుకుంటూ చేరుకున్నారక్కడకి. చిత్రవర్ణునికి, తమ రాజు హిరణ్యగర్భుడు రాసిన లేఖ అందించి, అందులోని విషయాన్ని సంగ్రహంగా తెలియజేశాడు ధవళాంగుడు. చిత్రవర్ణుడు అది విని, ఆనందించాడు. మహాబలునికి కూడా ఆ మాటలే వినిపించాడు.మిత్రుని రాజ్యం మిత్రునికి దక్కింది. కావాల్సింది అదే! సంతోషించాడు మహాబలుడు. చిత్రవర్ణుని దగ్గర సెలవు తీసుకున్నాడు. సర్వ సైన్య సమేతంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అనేక కట్న కానుకలు అందుకుని మరీ వెనుతిరిగాడతను.ఇలా హిరణ్యగర్భుడూ, చిత్రవర్ణుడూ, మహాబలుడూ ముగ్గురూ ఏకమై, ఎలాంటి అనుమానాలూ, యుద్ధాలూ లేకుండా హాయిగా రాజ్యాలేలారు. ప్రజల మెప్పు పొందారు.’’సంధి కథ ముగించాడు విష్ణుశర్మ. అంతలోనేరాకుమారుల్ని చూస్తూ మళ్ళీ ఇలా అన్నాడు.‘‘యుద్ధం ఎప్పుడూ మంచిది కాదు. ఇరు పక్షాలకూ అది తీరని నష్టమే కలిగిస్తుంది. అందుకని వీలయినంత మేరకు పొరుగు రాజ్యాలతో సఖ్యంగా ఉండడమే మంచిది. పంతాలకూ పట్టింపులకూ పోయి ప్రతి చిన్న విషయానికీ కయ్యానికి కాలు దువ్వడం రాజ లక్షణం కాదు. దీన్ని గుర్తుంచుకోండి.’’‘‘అలాగే గురువర్యా’’ అన్నారు రాకుమారులు. సూర్యాస్తమయం అయింది. ఆనాటికి బోధన ముగిసింది. లేచి నిల్చున్నారంతా. ఆ రాత్రి గడిచింది. తెల్లారింది.రాజపుత్రులు వచ్చి కథల కోసం మళ్ళీ కూర్చున్నారు. విష్ణుశర్మ పంచతంత్రంలోని ఆఖరిదయిన ‘అపరీక్షితకారిత్వం’ చెప్పసాగాడు.

‘‘అపరీక్షితకారిత్వం’ అంటే పరీక్షించకుండా ముందుకురకడం. విషయాన్ని శ్రద్ధగా వినకుండా, సరిగా అర ్థం చేసుకోకుండా, వివరంగా తెలుసుకోకుండా, ముందు వెనుకలూ పరీక్షించకుండా ఏ పనీ చెయ్యకూడదు. చేస్తే తొందరపడి తనకూ, ఇతరులకూ ప్రమాదాన్ని కొని తెచ్చి పెట్టుకున్న మంగలిలా తయారవుతారు. ఆ కథ వివరిస్తాను. వినండి.ఒకానొక నగరంలో మణిభద్రుడు అనే వైశ్యుడు ఉండేవాడు. బాగా డబ్బున్నదతనికి. తాతలూ తండ్రులూ సంపాదించిన ఆస్తిపాస్తులు కొండల్లా ఉన్నాయి, కరగవు అనుకున్నాడు. దాన ధర్మాలు చేస్తూ పోయాడు. కొంత కాలానికి ఆస్తులన్నీ హరించుకుపోయి, దారిద్య్రం దాపురించింది.

అప్పుడు ఇలా అనుకున్నాడతను.ఎన్ని సుగుణాలు ఉండి ఏం లాభం? డబ్బుండాలి. డబ్బుంటేనే గౌరవం. డబ్బు లేకపోతే ఏదీ లేనట్టే! బుద్ధీ, జ్ఞానం, ఓరిమీ అన్నీ పోతాయి.నక్షత్రాలు లేని ఆకాశంలా వెలవెలా పోతుంది పేదవాడి ఇల్లు. లేచింది మొదలు పేదవాడికి అన్నీ ఆరాటాలే! ఉప్పు లేదు, పప్పు లేదు, బియ్యం లేవు, నూనె కావాలంటూ చెప్పలేనన్ని ఆరాటాలు. ఈ ఆరాటాల్లో ఏం సాధిస్తాడతను? ఏ పనీ చేయబుద్ధి కాదు. అసలు బతకాలనే ఉండదతనికి, అనుకున్నాడు మణిభద్రుడు. తనకీ బతకాలని లేదని తెలుసుకున్నాడు. తెలుసుకుని, చేయి చాచి, దేహీ అని అడుక్కోకుండా పస్తులుండి ప్రాణత్యాగం చేయడం మేలనుకున్నాడు. రెండు రోజులుగా పచ్చి మంచినీళ్ళు ముట్టలేదతను. నిద్రపోసాగాడు. అప్పుడతనికి ఓ కల వచ్చింది. ఆ కలలో ఓ బౌద్ధభిక్షువు కనిపించాడతనికి. కనిపించి, ఇలా అన్నాడు.

‘ఇదే రూపంలో నేను, రేపు మీ ఇంటికి భిక్ష కోసం వస్తాను. నన్ను చూస్తూనే నువ్వు ఏమాత్రం సందేహించకుండా మాంఛి బలమైన దుడ్డుకర్రతో నా తల పగలగొట్టు. నా తల మీద దుడ్డుకర్ర పడిన మరుక్షణం నేను బంగారు నాణాల రాశిగా మారిపోతాను. నీ దరిద్రం పోతుంది’అయోమయంగా చూడసాగాడు మణిభద్రుడు.‘నేనెవరుకున్నావు? ధనలక్ష్మిని. నీ దానధర్మాలు, నీ మంచి గుణం తెలిసీ నిన్నిలా కరుణిస్తున్నాను.’ అన్నాడు మళ్ళీ ఆ భిక్షువు.

మాయమయిపోయాడు.తెల్లగా తెల్లారింది. మెలకువ వచ్చింది మణిభద్రుడికి. లేచి కూర్చుని రాత్రి తను కన్న కలను గుర్తు చేసుకున్నాడు. సన్నగా నవ్వుకున్నాడు. పేదవాడికి ఇలాంటి కలలు మామూలే! అదృష్టాలనీ, అద్భుతాలనీ ఆశిస్తాడు పేదవాడు. అవే కలల రూపంలో ప్రత్యక్షమవుతాయనుకున్నాడు. రోగులు, బాధలో మునిగితేలిన వాళ్ళు, కామార్తులు, మద్యం సేవించిన వాళ్ళందరికీ ఇలాంటి కలలే వస్తాయనుకున్నాడు. ఇలాంటివి పట్టించుకోకూడదనుకున్నాడు. కాలకృత్యాలు తీర్చుకుని, తీరిగ్గా గుమ్మంలోకి వచ్చి నిలుచున్నాడు. అప్పుడు కనిపించాడతను. కలలో భిక్షువు, కళ్ళెదుట ఉన్నాడు.‘భవతీ భిక్షాందేహీ’ అంటున్నాడు. అతన్ని చూస్తూ మణిభద్రుడు ఆశ్చర్యపోయాడు.

Responsive Footer with Logo and Social Media