సముద్రుడు- గరుత్మంతుడు
అనగనగా ఓ చెరువు. ఆ చెరువులో మూడు చేపలు ఉండేవి. హాయిగా ఆనందంగా ఉండేవి. కాలం ఒక్కలా గడవదు కదా! ఓసారి ఏమయిందంటే ఎండలు మండిపోయాయి. వానలు కురవడం మానేశాయి. కరువు వచ్చి పడింది. దాంతో చెరువు ఎండిపోసాగింది. ఎండిపోయిన చెరువులో చేపలు ఉండలేవు. బతకలేవు. భయపడ్డాయవి. ఆ భయంతో ఓ చేప ఏమన్నదంటే...‘చూస్తున్నారు కదా! చెరువు ఎండిపోతోంది. వానలు కురిసే అవకాశం లేదు. అటువంటప్పుడు ఇక్కడ ఉండి, ప్రాణాలు పోగొట్టుకునే బదులు, కొద్దిదూరంలో ఓ పెద్ద చెరువు ఉంది. అది ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎండిపోదు. మా తాతల కాలం నుంచి దాని గురించి వింటున్నాను. అక్కడికి పోదాం. ఆ పెద్ద చెరువును చేరుకునేందుకు, ఇక్కడ ఈ చెరువు నుంచి సన్నని కాలవ ఉంది. అదృష్టం బాగుండి, కాలవ ఇంకా ఎండిపోలేదు. ఇదే అదనుగా వెళ్ళిపోదాం అక్కడికి. జాగ్రత్త పడదాం.’ అంది.
తొలి నుంచీ ఈ చేపకు అన్నిటా ముందు జాగ్రత్తలెక్కువ. అందుకే దీనికి ‘అనాగత విధాత’ అని పేరు.విధాత చెప్పింది మిగిలిన రెండు చేపలూ వినిపించుకున్నట్టు లేదు. దాని మాటల్ని పట్టించుకోనట్టుగానే ప్రవర్తించాయి.‘మీకే చెప్పింది. విన్నారా నా మాటలు.’ రెట్టించింది విధాత.‘విన్నాం. కాని, ఇప్పటి నుంచే కంగారు పడడం అనవసరం. ఎన్ని చూడలేదు, ఇలాంటి ఎండల్ని. ఈ ఎండలు పోతాయి. వానలు పడతాయి. భయం దేనికి? ఒకవేళ వానలు పడక, ఇలాగే ఎండలు మండిపోయి, ఈ చెరువు పూర్తిగా ఎండిపోతే అప్పుడు చూద్దాం. అప్పుడు ఆలోచిద్దాం.’ అంది ప్రత్యుత్పన్నమతి. దీనికి బద్ధకం ఎక్కువ. పైగా అన్నిటికీ ముందు నుంచే జాగ్రత్తలు పడడం అంటే చిరాకు. ఎప్పటికి ఏది అవసరమో అప్పుడు ఆలోచిద్దామనే మనస్త్వత్వం కలది.
‘నీ సంగతేంటి?’ మూడో చేపను అడిగింది విధాత.‘ఏంటి అంటే ఏం చెప్పమంటావు? ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. దేన్నీ మనం ఆపలేం. అంతా ఆ భగవంతుని నిర్ణయం.’ అంది. దీని పేరు యద్భవిష్యం. నీరసంగా, నిరాశగా మాట్లాడడం దీనికి మొదటి నుంచీ అలవాటు. దేవుణ్ణి పూర్తిగా నమ్మదు. కాకపోతే దేవుడి మీద భరోసా వేసి తిరుగుతూ ఉంటుంది. విధాతకి వాళ్ళిద్దరి ప్రవర్తనా నచ్చలేదు. చేజేతులా చావుని కొని తెచ్చుకుంటున్నారనుకుంది. పెద్దదానిగా మంచేదో చెప్పాను. వినలేదు. నా దారి నేను చూసుకోవడంలో తప్పు లేదనుకుంది. ఓ తెల్లారుజామున చల్లచల్లని వేళ కాలవ ద్వారా ప్రయాణించి పెద్ద చెరువుకి చేరుకుంది. నిండుగా నీరున్న ఆ చెరువులో ఎంచక్కా జీవించసాగింది.
చూస్తూండగానే ఎండలు మరింతగా మండిపోయాయి. వానలసలు కురవలేదు. కరువు తీవ్రమైపోయింది. దాంతో విధాత చెప్పినట్టుగానే ప్రత్యుత్పన్నమతి, యద్భవిష్యం ఉంటోన్న చెరువు ఎండిపోయింది.నీళ్ళు బాగా తగ్గిపోయాయి. ఆ చెరువు నుండి పెద్ద చెరువుకి వెళ్ళే కాలవ కూడా ఎండిపోయింది. అంటే...పెద్ద చెరువుకి వెళ్ళే అవకాశం లేదు. ఇంతలో జాలర్లు వచ్చి పడ్డారు. చెరువులో వలలు విసిరి, చేపల్ని పట్టసాగారు. యద్భవిష్యం వలలో చిక్కుకుంది. చిక్కుకున్న అనేక చేపల్తోపాటుగా యద్భవిష్యాన్ని కూడా బుట్టలో పెడుతోంటే, తప్పించుకునే ప్రయత్నం చేసిందది. జాలరి చేతుల్లోంచి జారిపోయింది. జాలరి చూస్తూండగానే జరిగిందంతా. దాంతో కోపం తెచ్చుకున్న జాలరి, యద్భవిష్యాన్ని అందుకుని, చెరువులో ఉన్న రాయికి కొట్టి చంపేశాడు దాన్ని. జరిగిందంతా చూసి గుండెలు జార్చుకుంది ప్రత్యుత్పన్నమతి. ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి. ప్రాణాలు ఎలా నిలుపుకోవాలి? అని పదే పదే ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం ప్రకారం చచ్చినట్టుగా నటించింది. ఎలాంటి కదలికలూ లేక పడి ఉంది. చచ్చిందిది అనుకుని దాన్ని పెద్దగా పట్టించుకోలేదు జాలరి.
బుట్టలో చేపలు పెడుతున్నప్పుడు కిందకి జారిపడినా ప్రత్యుత్పన్నమతిని చూసీ చూడనట్టుగా వూరుకున్నాడతను. అదే అవకాశంగా నానా కష్టాలూ పడి, జాలరి కంటబడకుండా తప్పించుకుని, మళ్ళీ చెరువులోకి చేరి ఊపిరి పీల్చుకుంది ప్రత్యుత్పన్నమతి.-కథ ముగించింది ఆడతీతువు.‘‘కథ అర్థమయిందా?’’ అడిగింది. అర్థమయినా కానట్టుగా చూసింది మగతీతువు. భార్య ఏం చెబుతుందో విందామని మాట్లాడలేదది.‘‘ముందు జాగ్రత్త పడి అనాగత విధాత ఎంచక్కా హాయిగా ఉంటే, అప్పటికప్పుడు ఆలోచించి, ప్రమాదం నుంచి తప్పించుకుని, ప్రాణాలు కాపాడుకుంది ప్రత్యుత్పన్నమతి. ఏ ఆలోచనా లేక, అంతా దేవునిదే భారం అనుకున్న యద్భవిష్యం ఏమైంది? ఆఖరికి ప్రాణాలు కోల్పోయింది. అందుకనే పెద్దలేమంటారంటే ముందు జాగ్రత్తే మంచిదని ముందే మేల్కొమంటారు. దేవుడూ, దెయ్యం అని కాలాన్ని ఖర్చు చె య్యవద్దంటారు.’’ అంది.
‘‘అనడానికేముంది? పెద్దలు ఏమయినా అంటారుగాని, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. సముద్రం పొంగదు. పొంగినా చెలియలికట్ట దాటదు. దాటినా మన చెట్టంత మేరకు అలలు రావు. వచ్చినా నువ్వు పెట్టే గుడ్లను ఆ అలలు తీసుకునిపోవు. ఒక వేళ అన్నీ జరిగి, గుడ్లను అలలు పట్టుకుని వెళ్తే అప్పుడు చూపిస్తాను నా తడాఖా! పిలిస్తే పలికే గరుత్మంతుడున్నాడు. వచ్చి, సముద్రణ్ణి అణిచేస్తాడు.’’ అన్నది మగతీతువు. అయ్యో! అంటూ ఏదో ఆడతీతువు చెప్పబోతుంటే, పట్టించకోక అక్కణ్ణుంచి ఎగిరిపోయింది.కొన్నాళ్ళు గడిచాయి. ఆడతీతువు గుడ్లు పెట్టింది. అది భయపడ్డట్టుగానే ఓ పున్నమి వేళ సముద్రానికి ఆటుపోటులు ఎక్కువయ్యాయి. అలలు అంత ఎత్తున ఎగిసిపడ్డాయి. చెట్టంత మేరకు అలలు వచ్చి పడ్డాయి. కొమ్మల్లో ఉన్న తీతువు గుడ్లు కొట్టుకుపోయాయి.
అనుకున్నట్టుగానే అంతా జరగడంతో ఆడతీతువు దుఃఖాన్ని పట్టలేకపోయారెవరూ. గగ్గోలుగా ఏడ్చిందది. మగతీతువుతో ఇలా మొత్తుకుంది.‘‘ముందుగానే నీకు నేను చెప్పాను. విన్లేదు. చూడేం జరిగిందో! గుడ్లు కొట్టుకుపోయాయి. నా ప్రాణాలు పోయాయి.’’ఓదార్చ జాసింది మగతీతువు. ఆడతీతువుని దగ్గరగా తీసుకోబోయింది. రాలేదది. మగతీతువుకి దూరంగా జరిగి, మరింతగా ఏడవసాగింది. గరుత్మంతుడు ఉన్నాడన్న ధైర్యంతో సముద్రాన్ని తక్కువ అంచనా వేసింది తను. వేసినందుకు ఎంత పని జరిగిపోయింది. గుడ్లను కొట్టుకుపోయాడు. సముద్రుని తలొంచాలి. వంచి తీరాలి అనుకుంది మగతీతువు. దగ్గర్లో ఉన్న మిగిలిన పక్షుల్ని కలిసింది. సభ తీర్చింది. జరిగిన దారుణం అంతా చెప్పింది.‘‘పట్టించుకోకపోతే, తగిన శిక్ష వెయ్యకపోతే సముద్రుడింతే! చెలరేగిపోతాడు. ఇవాళ గుడ్లను పట్టుకుపోయాడు. రేపు, మిమ్మల్నీ నన్నూ పట్టుకుపోతాడు. ఈ అన్యాయాన్ని మనం ఎదిరించి తీరాలి. మన రాజు గరుత్మంతుడి సంగతి ఈ సముద్రుడికి తెలీదు. అతనికి కోపం వస్తే ఈ సముద్రాన్నంతా ఒక్క గుక్కలో పీల్చేస్తాడు.’’‘‘అవును పీల్చేస్తాడు.’’‘‘అందుకని మనందరం గరుత్మంతుని గురించి ప్రార్ధిద్దాం. అతను ఇక్కడికి రావాలి. ఈ సముద్రుడి పొగరు అణచాలి.’’‘‘అవును అణచాలి.’’పక్షులన్నీ గరుత్ముంతుని గురించి ప్రార్థించసాగాయి.
ఆహారం తీసుకోలేదు. నీరు ముట్టలేదు. కొమ్మల మీద కొలువుదీరి ఏకాగ్రతగా గరుత్మంతుణ్ణే పదే పదే స్మరించసాగాయి. తప్పలేదు. గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యాడు.‘‘ఏం కావాలి’’ అడిగాడు.పక్షులన్నీ మగతీతువుకి జరిగిన నష్టాన్ని వివరించాయి. కూడబలుక్కుని కష్టాన్నంతా చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాయి.‘‘ఈ సముద్రుడు చేసిన ఘోరం ఇంతా అంతా కాదు.’’ అన్నాయి.‘‘మహారాజా! మీరు బుద్ధి చెప్పాల్సిందే! లేకపోతే ఈ సముద్రుడు మమ్మల్ని బతకనివ్వడు.’’ అన్నాయి. కోపాన్ని తెప్పించాయి గరుత్మంతునికి. ఊగిపోయాడతను.‘‘సముద్రుడా’’ పెనుకేక పెట్టాడు గరుత్మంతుడు. పెద్ద పెద్ద రెక్కల్ని సముద్రం మీద చాచి ఆకాశానికి కనిపించకుండా చేశాడు సముద్రుణ్ణి. నోరు తెరిచాడు, అతన్ని గుక్కెట పట్టడానికి. సముద్రుడు వణికిపోయాడు అది చూసి. భయపడ్డాడు. గరుత్మంతుడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నదీ సముద్రుడికి తెలుసు. అయితే ఇంతకు తెగిస్తాడనుకోలేదు. ఇప్పుడింకా ఆలస్యం చేస్తే తన ఉనికికే ప్రమాదం. అందుకని తీతువు గుడ్లను చేతిలో ఉంచుకుని ప్రత ్యక్షమయ్యాడు.‘‘ఇవిగో గుడ్లు. తీసుకో’’ అందించాడు.
‘‘ఇవ్వాల్సింది నాక్కాదు, అక్కడ’’ అని మగతీతువుని చూపించాడు గరుత్మంతుడు. గుడ్లను మగ తీతువుకి అందించాడు సముద్రుడు. గుడ్లను అందుకున్న మగతీతువు వాటిని భార్య ఆడ తీతువు చేతిలోఉంచింది. గుడ్లను చూసుకుని ఆనందిస్తూన్న ఆడతీతువుని చూసి గట్టిగా నిట్టూర్చింది.‘‘ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి పనులు చేసి మా జాతికి కష్టం కలిగించావో నువ్విక్కడ ఉండవు.’’ సముద్రాన్ని హెచ్చరించాడు గరుత్మంతుడు.‘‘తప్పయిపోయింది. క్షమించండి.’’ సముద్రుడు తల దించుకున్నాడు. విజయాన్ని వరించినట్టుగా పక్షులన్నీ పొంగిపోయాయి. గరుత్ముంతుణ్ణి కీర్తిస్తూ ఒక్కపెట్టున కూశాయవి. రెక్కలతో వాటిని దీవిస్తూ గరుత్మంతుడు మాయమయ్యాడక్కణ్ణుంచి.’’