సైంధవుడి పరాభవం



జయద్రధుడు తన సైన్యాలను యుద్ధసన్నద్ధం చేసాడు. భీముడు గదా తీసుకుని సింధురాజు వైపు పోతుండగా కోటికాస్యుడు భీముని ఎదుర్కొన్నాడు. అర్జునుడు సేన అగ్ర భాగాన నిలిచిన ఐదు వందల మందిని చంపేశాడు. సౌరాష్ట్ర రాజు గద తో ధర్మరాజు యొక్క నలుగు అశ్వాలను చంపగా క్రుద్దుడైన ధర్మరాజు అర్ధచంద్ర బాణంతో రొమ్ముపై కొట్టగా అతడు గుండెలు బ్రద్దలై కూలిపోయాడు.

యుధిష్టరుడు సహదేవుడి రధం ఎక్కాడు. త్రిగర్త రాజు సురధుడు తన ఏనుగు చేత నకులుడు రధమును త్రుక్కు చేయగా నకులుడు రధంనుండి దూకి కత్తి డాలు తీసుకుని ఆ ఏనుగు యొక్క తొండాన్ని దంతాలతో సహా నరకగా ఆ ఏనుగు పెద్దగా ఘీంకరిస్తూ భూమి మీదకు ఒరిగిపోతూ తన మీదవున్న వున్న సురధనుడిని క్రింద పడవేయగా నకులుడు అతడిని సంహరించాడు.

భీముడు కోటికాస్యుడిని చంపివేశాడు. క్హేమంకరుడు, మహాముఖుడనే రాజులు నకులుడిమీదకు రాగ నకులుడు వారిరువురిని సంహరించాడు. అర్జునుడు పన్నెండు మంది సౌవీర రాజులను, అడ్డువచ్చిన త్రిగర్తులను, సైన్ధవులను,శిబి ఇక్ష్వాకు ప్రముఖుల నందరిని చంపివేశాడు. ఆ ప్రదేశ మంతా తలలు లేని మొండెములు, శరీరాలు లేని తలలతో చెల్లా చెదురుగా పడిపోయాయి. పాండవుల ధాటికి సైంధవ సేనలు ఆగలేక పోయాయి.

అర్జునుడు సృంజయుడు, స్తుకుడు, శత్రుంజయుడు, సుప్రబుద్ధుడు, శుభంకరుడు, భ్రమంకరుడు, శూరుడు, రథి, గుహకుడు, బలాడ్యుడు అనే పేరుగల సౌవీర వీరులను చంపాడు. అలా వీరులంతా చనిపోగా సైందవుడు సంకుల సైన్య మధ్యలో ద్రౌపదిని తన రథం నుండి దింపి రథం తోలుకుంటూ పారి పోయాడు. భీముడు తన పేరు చెప్పి మరీ మిగిలిన వారిని చంపుతున్నాడు. అది చూసిన అర్జునుడు సైంధవుడు పారి పోతున్నాడు ఇక అమాయకు లైన వీరిని వధించడం వలన లాభ మేమున్నది, అప మన్నాడు. అందరూ ద్రౌపది దగ్గరకు వెళ్ళారు. అర్జునుడు ధర్మరాజుతో " అన్నా! నువ్వూ, ద్రౌపది, నకుల సహదేవులు, ధౌమ్యుని తీసుకుని కుటీరానికి వెళ్ళండి. నేను భీమసేనుడు సైంధవుని వెంబడిస్తాము " అన్నాడు.

యుధిష్టరుడు "సైంధవుడు దురాత్ముడైనప్పటికి గాంధారిని, దుస్సాలను తలచుకుని చంపకూడదు" అనగా ద్రౌపది " భార్యను అపహరించిన, రాజ్యమును అపహరిచిన శత్రువును ప్రాణదానం చేయమని ప్రాధేయపడినా వదిలిపెట్ట కూడదు. కాబట్టి సైంధవుడు దుర్మార్గుడు వాడి పట్ల దయ చూపవద్దు వధించండి " అన్నది. ధర్మరాజు తమ్ములతో ద్రౌపదితో ఆశ్రమానికి తిరిగి వెళ్ళగా అక్కడి ఆసనములు ఇతర వస్తువు లన్ని చిందర వందరగా పడి వున్నాయి. అప్పటికే అక్కడికి మార్కండేయాది విప్రులు వచ్చి వున్నారు. భీమార్జునులు సైంధవుడిని వెంబడించారు. అర్జునుడు క్రోసేడు దూరంలో వున్న సైంధవుడి రధమును చూసి బాణములతో అతని గుర్రాలను చంపాడు. జయద్రధుడు రథం దిగి పారిపోసాగాడు. భీముడు అర్జునుడు వాడిని వెంబడించి పట్టుకున్నారు.

భీముడు వాడిని చితక కొట్టి మెడమీద కాలు వేసి పట్టుకున్నాడు. వాడు స్పృహ తప్పాడు. అర్జునుడు " ఇక చాలు ఇంకా కొడితే వీడు చస్తాడు. అన్నగారి మాట మన్నించి వీడిని విడిచి పెట్టు " అన్నాడు. భీముడు " అయ్యో! వీడిని వదిలితే ఎన్ని అనర్ధాలు జరుగుతాయో. అన్న ధర్మజుడు ఎప్పుడూ దయాళువే. నీవు గూడా ఎప్పుడూ నన్ను బాధపెడుతూ వుంటావు/ వీడికి తగిన శాస్తి చేస్తాను " అని పదునైన కత్తి తీసుకుని తల అయిదు శిఖలుగా గొరిగి " జయద్రధా! నీవు పోయిన చోటంతా నేను పాండవుల దాసుడను అని చెప్పు. లేకుంటే చస్తావు " అన్నాడు.జయద్రధుడు "సరే అలాగే" నన్నాడు. తరువాత వాడిని రథానికి కట్టి ధర్మరాజు వద్దకు తీసుకు వచ్చాడు. భీముడు జయద్రధుని ధర్మరాజు పాదాలపై పడవేసి " అన్నయ్యా! వీడు పాండవదాసుడు జయ ద్రధుడు " అన్నాడు.

ద్రౌపది వాడిని హేళనగా చూసింది. ధర్మరాజు " జయద్రధా ! ఇక మీదట ఇలాంటి చెడ్డ పనులు చేయకు. నీ బుద్ధి ధర్మమందు ఉంచు. అధర్మము మీద మానసు పెట్టక బుద్ధిగా ఉండు " అని వదిలి పెట్టాడు. అవమాన భారంతో జయద్రధుడు గంగా తీరానికి వెళ్ళి శివుని గురించి ఘోరంగా తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షం కాగా జయద్రధుడు " దేవా! యుద్ధంలో నేను పాండవులను జయించేలా వరం ప్రసాదించు " అని కోరాడు. శివుడు " జయద్రధా! అది అసాధ్యం. పాండవులను జయించడం ఎవరికి సాధ్యం కాదు. నీవు అడిగావు కముక ఒక్క రోజు మాత్రం అర్జునుడు తప్ప మిగిలిన వారిని జయించే వరం ఇస్తున్నాను. ఇందులో అంతరం గ్రహించి మసలుకో " అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. తరువాత జయద్రధుడు సింధు దేశానికి వెళ్ళాడు.