సగరుని అశ్వమేధయాగ సంకల్పం
సగరుడు అశ్వమేధయాగం చేయ సంకల్పించాడు. యాగాశ్వాన్ని రక్షించే బాధ్యతను కుమారులకు ఇచ్చాడు. యాగాశ్వం నీళ్ళు లేని సముద్రంలోకి వెళ్ళి మాయమైంది. సగరుడి కొడుకులు యాగాశ్వాన్ని వెదుకుతూ సముద్రాన్ని తవ్వారు. వారికి ఈశాన్యంలో కపిల మహాముని ఆశ్రమంలో యాగాశ్వం కనిపించింది. కపిలుడే తమ అశ్వాన్ని దొంగిలించాడని సగరకుమారులు అతడిని అవమానించారు. ఆ మహాముని కోపాగ్నితో సగరకుమారులను భస్మంచేసాడు.
నారదుని వలన ఆ విషయం సగరునికి తెలిసింది. సగరుడు దుఃఖించాడు. ఆ సమయానికి అసమంజసునికి జనించి పెరిగి పెద్దవాడైన అంశుమంతుడు అనే కుమారుడు ఉన్నాడు. సగరుడు అంశుమంతుని చూసి " నాయనా! నాకుమారులు చనిపోయినందుకు నేను భాధపడను కానీ అశ్వమేధయాగం సగంలో ఆగిపోయింది దానిని నీవు పూర్తి చెయ్యి " అని కోరాడు. అలాగే అని అంశుమంతుడు కపిలమహామునిని చూసి నమస్కరించి తను వచ్చిన పని చెప్పాడు. కపిల మహర్షి అంశుమంతునికి యాగాశ్వాన్ని అప్పగించాడు. కపిల మహాముని " అంశుమంతా! ఈ యాగాశ్వంతో నీ తాత సగరుడు అశ్వమేధయాగం పూర్తి చేస్తాడు.
నీ మనుమడు భగీరధుడు గంగను భూమి మీదకు తీసుకువచ్చి సాగరాన్ని జలంతో నింపుతాడు " అని చెప్పాడు. అలాగే సగరుడు అశ్వమేధం పూర్తిచేసాడు. సముద్రాన్ని తన కుమారునిగా స్వీకరించాడు. అందుకే సముద్రానికి సాగరం అనేపేరు వచ్చింది.