రావణ సోదరుల తపస్సు



ఒకరోజు వైశ్రవణుడు వారిని చూడటానికి వచ్చాడు. రావణాదులు అతని వైభవాన్ని చూసారు. అది అంతా అతని తపస్సు వలన సమకూరినది అని తెలుసు కున్నారు. వారంతా తపస్సు చేయడానికి బయలుదేరి బ్రహ్మను గురించి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసారు. వారికి శూర్పణఖ, ఖరుడు సేవలు చేస్తున్నారు. కాని బ్రహ్మ దేవుడు ప్రత్యక్షం కాలేదు. రావణుడు వెయ్యి సంవత్సరాలకు ఒక తల చొప్పున తొమ్మిది తలలు అగ్నిలో వేల్చి హోమం చేసాడు. పదివేల సంవత్సరాలు పూర్తి కాగానే పదవ తల అగ్నిలో వేయడానికి సంసిద్ధం అయిన తరువాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు.

రావణునికి ఖండించిన తొమ్మిది తలలను ఇచ్చి ఏమి వరం కావాలో కోరుకొమ్మన్నాడు.రావణుడు " దేవా! నేను దేవతల చేతగాని, పితరుల చేతగాని, రాక్షసుల చేతగాని, పాముల చేత గాని, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, విద్యాధరుల చేతగాని ఓడి పోకూడదు. విశ్వంలో ఎక్కడికైనా ఇచ్ఛానుసారం సంచరించే వరం ప్రసాదించు అని అడిగాడు. బ్రహ్మ దేవుడు " రావణా! మానవులు వలన తప్ప ఇంకెవరి వలన నీకు మరణ భయం లేదు " అని వరం ఇచ్చాడు. బ్రహ్మదేవుడు కుంభకర్ణుని చూసి " నీ కేమి వరం కావాలో కోరుకో " అన్నాడు. విధి వశాత్తు కుంభకర్ణుడు తనకు అత్యంత ప్రియమైన నిద్రను ప్రసాదించమని అడిగాడు. అలాగే నని వరమిచ్చాడు. తరువాత విభీషణుని చూసి నీకేమి వరం కావాలో కోరుకో అని అడిగాడు. విభీషణుడు " దేవా! ఎన్ని కష్టాలు వచ్చినా నాలో పాప చింతన పొడ చూపకుండా అనుగ్రహించు " అని ప్రార్థించాడు.

అందుకు బ్రహ్మ " విభీషణా! నీవు రాక్షస వంశంలో జన్మించినా ధర్మబుద్ధిని కలిగ ఉన్నావు. నీకు అమరత్వం ప్రసాదిస్తున్నాను. నీవు కోరిన వరాన్ని ప్రసాదిస్తున్నాను " అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. బ్రహ్మదేవుడిచ్చిన వరగర్వంతో రావణుడు కుబేరునికి స్వంతమైన లంకపై దండెత్తాడు. రావణుని శక్తి తెలుసుకున్న కుబేరుడు పుష్పక విమానం ఎక్కి లంకను వదిలి పారి పోయాడు. రావణుడు కుబేరుని వెంబడించి అతని విమానం అపహరించాడు. అందుకు యక్ష రాజైన కుబేరుడు కోపించి " పెద్ద వాడినైన నన్ను అవమానించి నా విమానాన్ని అపహరించావు. ఇది పరుల పాలు అవుతుంది " అని శపించాడు. తరువాత రావణుడు దేవలోకం మీద దండెత్తి ఇంద్రుడిని దేవతలను జయించాడు.

Responsive Footer with Logo and Social Media