రణభేరి
తనని ఈ అడవికి దేవుడే రాజుని చేశాడని చెప్పింది నక్క. దానికి గుర్తుగా నలుపు రంగు తనకి పులిమాడని చూపించింది. విన్న సాటి నక్కలు ఆ మాటలు నిజమని నమ్మాయి.‘‘ఇక మీదట ఈ అడవిలోని జంతువులన్నీ నా మాట వినాల్సిందే! వినకపోతే ప్రమాదం అని చెప్పండి. వెళ్ళండి.’’ ఆజ్ఞాపించింది. పరుగుదీశాయి పిచ్చి నక్కలు. ఇక్కడనీ అక్కడనీ లేదు, ఎక్కడ పడితే అక్కడ నల్లనక్క చరిత్రను అడవిలో చాటి చెప్పాయి. అంతే! ఆనాటి నుంచీ నక్కమారాజుకు తిరుగులేకుండా పోయింది. అడవిలోని జంతువులన్నీ నల్లనక్కని తమ రాజుగా భావించి, సేవలు చెయ్యసాగాయి. పులులూ, సింహాలు కూడా నక్కమారాజు ముందు తలలొంచాయి. దాంతో నల్లనక్క పేట్రేగిపోయింది. దాని కళ్ళు నెత్తికెక్కాయి. సాటి నక్కల్ని హీనంగా చూడసాగింది. మాట్లాడాలని దగ్గర కొస్తే ‘దూరం దూరం’ అంటూ వారిని దూరం చేసింది. సాయం కావాలని చేయి జాచితే, ఆ చేతిని విసిరి కొట్టింది. తట్టుకోలేకపోయాయి నక్కలు. రాజు చేష్టలకి కన్నీళ్ళు పెట్టుకున్నాయి. గుంపుగా కూర్చుని ఓ రోజు చర్చించుకోసాగాయి.‘‘అసలిదంతా మనం చేజేతులా చేసుకున్నాం.’’ అందో ముసలి నక్క.‘‘అలా అంటావేంటి మామా! మనం చేసుకున్నదేముంది? దేవుడు చేశాడిదంతా.’’ అందో నక్క.‘‘దేవుడా? దెయ్యమా? దేవుడు తనని రాజుని చేశాడని అది చెప్పింది.
మనం నమ్మాం. అడవంతా చెప్పమంది. చెప్పాం. దాంతోనే దానికి తిరుగులేకుండా పోయింది. చెప్పకుండా ఉండాల్సింది. ప్రచారం చెయ్యకుండా ఉంటే బాగుండేది.’’ అంది ముసలి నక్క.‘‘ప్రచారమే మన కొంప ముంచిదంటావా?’’‘‘కాకపోతే, ప్రచారం చెయ్యక పోతే దీన్నెవరు నమ్మారు? చేసి, తప్పు చేశాం. రాజుని చేశామన్న కృతజ్ఞత కూడా లేదు ఈ నీచుడికి. సాటి జాతి పట్ల కనికరం లేకుండా పోయింది. క్షణ క్షణం అవమానించి, తిట్టి కొట్టి బాధిస్తున్నాడు. కుండలా నెత్తిన పెట్టుకుని మోసాం. ఇక మొయ్యొద్దు. కింద పడేసి, పగలగొడదాం. అప్పటిక్కాని దారికి రాడు.’’‘‘అంతేనంటావా?’’‘‘అంతే! దేవుడూ లేడు, స్వర్గమూ లేదు. వీడు చెప్పిందంతా అబద్ధం. నక్కక్కెడ? నాకలోకం ఎక్కడ? వీడు స్వర్గానికి వెళ్ళాడంటే నేను నమ్మను.’’
‘‘మరి నల్ల రంగు ఎలా వచ్చిందంటావు?’’‘‘అదే కొంచెం అంతు చిక్కడం లేదు. అది అంతు చిక్కితే చేతికి చిక్కినట్టే! నల్ల రంగు వేసుకుని, మనల్నే కాదు, అసలు సిసలు రాజులు పులులూ, సింహాల్ని కూడా తన దారికి తెచ్చుకున్నాడు. చూస్తోంటే, మన తెలివిలాగే వాటి తెలివి కూడా తెల్లారింది.’’ అంది ముసలి నక్క.‘‘రోజులు వాడివి. మంచికాలం వస్తే నీచుడు కూడా గొప్పవాడయిపోతాడు. నాలుగు రోజులు ఓ వెలుగు వెలుగుతాడు. అయితే నీచుడు సుఖపడడం, మంచివాడు కష్టపడడం కలకాలం జరగదు. మంచికి ఎప్పటికయినా మంచే జరుగుతుంది. నీచుడుకి చూస్తూండగానే రోజులు చెల్లిపోతాయి. వాడి కన్ను వాడే పొడుచుకుంటాడు. కాలం కలసి రావాలి.అంతే’’ అన్నాయి నక్కలు.
‘‘కలసి రావాలని కూర్చుంటే ఏదీ కలసి రాదు. మనమే ప్రయత్నించాలి. ఓ పని చేద్దాం.’’ అంది ముసలి నక్క.‘‘ఏం చేద్దాం?’’‘‘ఏం చేద్దామంటే మనందరం వాడి ముందు గుంపుగా కూర్చుని పెద్దగా ఊళలేద్దాం. మారాజు కూడా నక్కే కదా, మన సందడి చూసి, వాడూ సరదా పడి ఊళ వేస్తాడు. ఊళ వేశాడంటే అయిపోయింది. వాడు రాజు కాదు, మామూలు నక్కని అందరికీ తెలిసి పోతుంది. తెలిసిపోయిన మరుక్షణం వాణ్ణేం చెయ్యాలన్నది, మనం కాదు, అడవిలోని మిగిలిన జంతువులే చూసుకుంటాయి.’’‘‘ఆలోచన చాలా బాగుంది.అలానే చేద్దాం.’’ అన్నాయి నక్కలు. బయల్దేరాయి. మారాజు ఉన్న చోటుకి చేరుకున్నాయి. గుంపుగా కూర్చున్నాయి. ఊళలేయసాగాయి. ఎందుకలా వేస్తున్నాయన్నది నక్కమారాజు ఆలోచించలేదు. జంతువు ఒకటి కూత పెడితే సాటి జంతువులు గొంతు కలపడం జాతి లక్షణం. ఆ లక్షణంతో మారాజు కూడా ఊళ వేశాడు. అప్పటికే నక్కలలా కలసి కట్టుగా ఊళలేయడాన్ని గమనించి అడవిలోని జంతువులన్నీ అక్కడకు చేరుకున్నాయి. మారాజు ముందు ఊళలేస్తున్నాయంటే ఏదో ఉత్సవం జరుగుతోందనుకున్నారు. ఎప్పుడయితే నక్కమారాజు ఊళేశాడో అప్పుడు అక్కడున్న పులికి అర్థమయిపోయిందంతా. నక్క నక్కే! మహారాజు కాదది. దేవుడు పేరు చెప్పి, మోసగించి రాజయింది. దీన్ని వదలి పెట్టకూడదనుకుంది పులి. నక్కమారాజు మీద పిడుగులా పడింది. కండ కండలు పెరికి దాన్ని చంపేసింది.’’ కథ ముగించాడు సర్వజ్ఞుడు.
ఇలా అన్నాడు అంతలోనే.‘‘ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే...సొంతవాళ్ళను కాదని, పైవారిని ఆదరించడం, గొప్పవారని వారి సలహాలూ, సూచనలూ తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఇలా చెప్పానని తప్పుగా భావించకండి. తర్వాత మీ ఇష్టం.’’‘‘నా ఇష్టం అంటూనే మంత్రులు మీరంతా తెలివయిన వారయినట్టుగా, రాజులు మేమంతా తెలివితక్కువ వారన్నట్టుగా మాట్లాడుతున్నావు. తప్పు.’’ అన్నాడు హిరణ్యగర్భుడు.
‘‘అయ్యా, అది కాదు నా ఉద్దేశం.’’ సర్దుకున్నాడు సర్వజ్ఞుడు.‘‘నీ ఉద్దేశం ఏదయినా, నా ఉద్దేశం చెబుతాను, విను. ఇవాళో రేపో యుద్ధం అనుకుంటున్నాం. యుద్ధంలో పాల్గొనేందుకు వీరులూ, శూరులూ, బుద్ధిశాలులూ కావాలి. కావాలంటే ఇప్పుటికిప్పుడు దొరకడం కష్టం. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏదో అంటారు చూడు, వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా, కాకి వచ్చింది. కాకులు తెలివయినవి. వాటిని ఉపయోగించుకుందాం. మనం నీటిపక్షులం అన్నావు. కాకేమో నేల పక్షన్నావు. శత్రువు నీలవర్ణుడు నేల పక్షే కదా, వాడికి వీడు సరిపోతాడు. ముల్లును ముల్లుతోనే తియ్యాలి. అందుకు వీణ్ణి వాడుకుందాం. వద్దనుకున్నాం అనుకో, వీడు వెళ్ళి శత్రువుతో కలుస్తాడు. ఆ కలయిక ప్రమాదం.’’ అన్నాడు హిరణ్యగర్భుడు.
‘‘అయితే కాకిని చేరదీద్దాం. దాని సాయం తీసుకుందాం. లేనిపోని అనుమానాలు మానుకుందాం.’’ అన్నాడు సర్వజ్ఞుడు. రాజు రాజే! రాజు మాటకు ఎదురు చెప్పకూడదనుకున్నాడతను. చర్చను ముగించాడు.మర్నాడు కొలువుదీరాడు హిరణ్యగర్భుడు.చిలక అరుణముఖుడూ, కాకి నీలవర్ణుడూ ఉన్నారక్కడ. నీలవర్ణుడి అసలు పేరు మేఘవర్ణుడు. కాకపోతే తనని చిత్రవర్ణుడు గూఢచర్యం చేయమన్న కారణంగా నీలవర్ణుడని పేరు మార్చుకున్నాడతను.‘‘ముందు మీరు మాట్లాడండి.’’ అరుణముఖుడికి చెప్పాడు సర్వజ్ఞుడు. అలాగేనన్నట్టుగా తలూచి, ఇలా మాట్లాడసాగింది చిలక.‘‘రాజా! జంబూద్వీపం మహారాజు చిత్రవర్ణుడు పంపగా నేనిక్కడకి వచ్చాను. ఆయన సందేశం వినిపిస్తాను. వినండి. మీ కర్పూరద్వీపంతో సహా చుట్టుపక్కల ఉన్న ద్వీపాలన్నీ జంబూద్వీపంలోని భాగాలే! ఈ కారణంగా మీరు మాకు కప్పం కట్టాలి. ఈ విషయంలో వాదాలకూ, వివాదాలకూ తావు లేదు. మీ రాజ్యం మీకు కావాలంటే, మీ ప్రజలు క్షేమంగా ఉండాలంటే మా మహారాజు చెప్పినట్టుగా మీరు విని తీరాలి. లేదంటారా, యుద్ధానికి సిద్ధంగా ఉండండి.’’‘‘ఎంత మదం, ఎంత కండకావరం.’’ పెద్దగా అరిచాడు హిరణ్యగర్భుడు.
చిలక మీదికి దాడి చేసేందుకన్నట్టుగా ముందుకురికాడు.‘‘అయ్యా! నేను దూతను. మా మహారాజు చెప్పమన్నది నేను చెప్పాను. ఇందులో నా తప్పు లేదు. మీరేం చెబుతారో చెప్పండి. దాన్ని మా మహారాజుకి విన్నవిస్తాను.’’ తల వంచుకున్నాడు అరుణముఖుడు. వెనక్కి తగ్గాడు హిరణ్యగర్భుడు. అంటే అరుణముఖుని మీద దాడి చేయకుండా తనని తాను సంబాళించుకున్నాడు కాని, చిత్రవర్ణుడు మీద కోపాన్ని మాత్రం ఆపుకోలేకపోయాడు.‘‘ఒక మామూలు నెమలికి నాలాంటి రాజహంస కప్పం కట్టాలా? ఏం చూసుకుని రెచ్చిపోతున్నాడు మీ రాజు? ఈ మధ్య చిన్న చిన్న రాజ్యాల్ని గెలిచాడేమో! ఆ విజయాలతో ఒళ్ళు తెలీకుండా ప్రవర్తిస్తున్నాడు. నా మీద గెలుపు అసాధ్యం. ఆ సంగతి తెలుసుకోమను.’’హిరణ్యగర్భుడి కోపాన్ని చూసి, అతనికి వత్తాసు పలికేందుకు ముందుకొచ్చాడు నీలవర్ణుడు. గూఢచర్యంలో మొదటి పాఠం, ఎదుటి వ్యక్తిని వెనకేసుకుని రావడం. దాన్ని పాటించేందుకు సిద్ధమయ్యాడు. అరుణముఖుడితో ఇలా అన్నాడతను.
‘‘హిరణ్యగర్భుణ్ణి ఏమనుకుంటున్నాడయ్యా మీ రాజు. అల్లాటప్పా అనుకుంటున్నాడా? అసలు ఏం చూసుకునయ్యా మీ చిత్రవర్ణుడు రెచ్చిపోతున్నాడు. తప్పు చేస్తున్నాడు. అతనే కాదు, నువ్వు కూడా తప్పు చేస్తున్నావు. మీ రాజు నోటికొచ్చినట్టల్లా పేలాడు. దూతగా అదంతా నువ్విక్కడ పేల్తావా? ముందు వెనుకలు చూసుకుని మాట్లాడాలని తెలీదా?’’‘‘యథారాజా తథా ప్రజాని. రాజుకి తగిన దూత.’’ అన్నాడు హిరణ్యగర్భుడు.‘‘దూతని ఈ అరుణముఖుని మీద దయతలచవద్దు మహారాజా! అనుమతి ఇప్పించండి. వీడి అంతు చూస్తాను.’’ అరుణముఖుని మీదకి ఎగరబోయాడు నీలవర్ణుడు. అడ్డుకున్నాడు సర్వజ్ఞుడు.‘‘తొందరపడకు మిత్రమా! దూతను చంపడం ధర్మం కాదు.’’ అన్నాడు.
‘‘అధర్మానికి పూనుకుంటే అన్నీ కష్టాలేనని పెద్దలు చెప్పారు. తెలిసీ తెలిసీ ఎవరికీ కీడు తలపెట్టకూడదు. తలపెట్టని వాణ్ణే మంచివాడంటారు. ఆ గుణమే అతని బలం. బలగం. వాటితోనే అతను సంపదలు సాధిస్తాడు.’’ అని, కొంచెం దూరంగా నిలబడమన్నట్టుగా అరుణముఖునికి సైగ చేసి, మళ్ళీ నీలవర్ణునితో ఇలా అన్నాడు సర్వజ్ఞుడు.‘‘ఆవూ ఆవూ పోట్లాడుకుంటూ మధ్యలో దూడ కాళ్ళు విరగ్గొట్టినట్టు, రాజూ రాజూ పోట్లాడుకుంటూ దూతను చంపడం పద్ధతి కాదు. దూత చెప్పిన మాటలు అతని సొంతం కావు. రాజు చెప్పిన మాటల్నే అతను వల్లె వేస్తాడు. అది అతని తప్పు కాదు.’’ఆవేశాన్ని అణచుకుంటున్నట్టుగా తలొంచుకున్నాడు నీలవర్ణుడు. ముక్కుని పరాపరామంటూ నేల రాశాడు.‘‘అన్ని అనర్థాలకూ కోపమే మూలం. మూర్ఖుడికి ముక్కు మీదే కోపం ఉంటుంది. కోపంతో హత్యలు చేస్తారు. ఆత్మహత్య కూడా చేసుకుంటారు. అర్థం లేనివవి. శాంతం, సహనం కావాలి. వాటిని అలవర్చుకోవాలి. శుభాలన్నీ వాటితోనే ముడిపడి ఉన్నాయి.’’ అన్నాడు సర్వజ్ఞుడు.రాజుని ఎగదోస్తున్నట్టుగా ప్రవర్తిస్తోన్న నీలవర్ణుని గమనించాడు సర్వజ్ఞుడు. మెత్తగా మొట్టాడతన్ని.