రాజు మరియు కుమ్మరి



ఒక గ్రామంలో కుండలు చేసుకుని బ్రతికే కుమ్మరి ఉండేవాడు. ఒకరోజు అతడు చాలా కుండలు తీసుకుని ప్రక్క గ్రామంలో అమ్ముకోవాలని మోసుకుని తీసుకుపోతున్నాడు. ఆ సమయంలో అతడి కాలు జారి ఎదురుగా ఉన్న బండపై పడ్డాడు. బండరాయి తగిలి తలకు పెద్ద గాయమైంది, కుండలన్నీ పగిలిపోయాయి. కుమ్మరి గాయానికి వైద్యం చేయించుకున్నాడు.

గాయమైతే తగ్గింది కానీ తలకు మచ్చ అలానే ఉండిపోయింది. కొద్ది రోజుల తరువాత ఆ గ్రామంలో భయంకరమైన కరువు వచ్చి పడింది. కుమ్మరి ఆ గ్రామంలో బ్రతకలేక భార్యతో సహా నగరానికి వెళ్ళాడు. రాజుగారి ఆస్థానంలో ఏదైనా పని దొరుకుతుందని వెళ్ళాడు. కుమ్మరి తలపై ఉన్న మచ్చను చూసి మహారాజు పొరపాటు పడ్డాడు. ఈ మచ్చ యుద్ధంలో అయిన గాయంగా రాజు అనుకున్నాడు. వివరాలు కనుక్కోకుండా కుమ్మరిని ప్రశంసించాడు. “ఇటువంటి వీరులు మనకు చాలా అవసరం. ఇతని వీరత్వానికి తలపై ఉన్న గాయమే నిదర్శనం” అన్నాడు మహారాజు.

కుమ్మరి కూడా మాట్లాడకుండా ‘కొలువు దొరికింది చాలు’ అనుకుని మౌనంగా ఉన్నాడు. ఒకరోజు పలుదేశాల రాజకుమారులు వచ్చి వారికి వచ్చిన యుద్ధ విద్యలు ప్రదర్శించి మహారాజు ప్రశంసలందుకున్నారు. “మా కొలువులో కూడా ఇంతటి నిష్ణాతులు ఉన్నారు” అని గొప్పగా మహారాజు ప్రకటించాడు.

అయితే కుమ్మరి ముందుకు రాకపోవడం చూసి మహారాజు ఆశ్చర్యపోయాడు. “నీ విద్యలు ఎందుకు ప్రదర్శించడం లేదు?” అని మహారాజు కుమ్మరిని ప్రశ్నించాడు. “మహారాజా! నేను కుమ్మరిని. నాకు కుండలు తయారు చేయడం తప్ప మరో పని రాదు” అన్నాడు కుమ్మరి. ఇది విన్న మహారాజుకు పట్టరాని ఆగ్రహం కలిగింది. “ఈరోజు నీ వల్ల నా పరువు ప్రతిష్ఠలు కోల్పోవాల్సి వచ్చింది. తక్షణం నా కళ్ళముందు నుండి వెళ్ళిపో” అంటూ మహారాజు అరిచాడు.

మహారాజు గారి మాటలు విన్న కుమ్మరి “మీరు ఆజ్ఞ ఇస్తే ఏదో ఒక విద్యను ప్రదర్శిస్తాను” అన్నాడు కుమ్మరి. కుమ్మరి మాటలకు మహారాజు పెద్దగా నవ్వి “గొప్పలకు పోకు కుమ్మరి. నీకు తెలిసిన కుండలు తయారుచేసే విద్యను నీ వాళ్ళతో కలిసి చెయ్యి. ఇక్కడ నువ్వు చేయదగిన పనిలేదు” అని కుమ్మరిని కొలువు నుండి పంపించివేశాడు.

నీతి కథలు : మనకు ఏ పని వచ్చో, ఆ పని చేసుకోవడమే మంచిది. మనకు రాని పని చేస్తే, నష్టపోయే ప్రమాదం ఉంది.

Responsive Footer with Logo and Social Media