రాజధర్మం
కుంతల దేశపు చక్రవర్తి వీరసేనుడు. అతడు తాను జయించిన రాజ్యాలను సమర్థులైన వారికి అప్పగించి, వారిని తన సామంతులుగా చేసుకునేవాడు. ఒకసారి వీరసేనుడు విదర్భదేశాన్ని జయించి ఆ రాజ్యానికి సామంతరాజు అర్హతలుగల యువకుడికోసం అన్వేషిస్తున్నాడు.
తన ఆస్థానంలో వీరవర్మ, రఘువర్మ అనే ఇద్దరు యువకులుండే వారు. వారిద్దరూ చతురంగ విద్యలలోనూ, తెలివితేటల్లోనూ ఆరితేరినవారే. వీరసేనుడు వీరవర్మ, రఘువర్మలలో ఒక్కరికి విదర్భదేశ రాజ్య భారాన్ని . అయితే ఇద్దరిలో ఎవరు రాజపదవికి అర్హులో తేల్చుకోలేకపోయాడు. చివరికి తన నిర్ణయం తన మంత్రికి చెప్పాడు. మంత్రి ఒక ఉపాయం ఆలోచించి వీరవర్మను పిలిచి, 'నీవు రాజువైన' అనంతరం నీ అధికారాన్ని ఎలా ఉపయోగిస్తావు?' అని ప్రశ్నించాడు.
దానికి వీరవర్మ జవాబు చెబుతూ 'రాజనేవాడు అతి శక్తివంతుడు. అతని మాటకు తిరుగులేదు. అందువల్ల శాసనాలను ఖాతరు చేయని ప్రజలు తలలు వంచడానికి నా అధికారాన్ని ఉపయోగిస్తాను" అన్నాడు.
మంత్రి వీరవర్మను పంపించేసి రఘువర్మకు అదే ప్రశ్న వేశాడు. దానికి రఘువర్మ సమాధానం చెబుతూ "రాజనేవాడు ప్రజలకు తండ్రిలాంటివాడు. అందువల్ల నా అధికారంతో నేను చేసిన శాసనాలు ప్రజలనెత్తిన రుద్దడానికి ప్రయత్నించకుండా ప్రజల ప్రేమానురాగాలుసంపాదించడానికి నా అధికారాన్ని ఉపయోగిస్తాను" అని ముగించాడు.
ఇద్దరి సమాధానాలు విన్న మంత్రి రఘువర్మను ఎన్నికచేసి వీరసేనుడికి వివరించాడు. మంత్రి తెలివితేటలకు వీరసేనుడు భేష్ భేష్ అంటూ మెచ్చుకున్నాడు.