పులి- కొంగ



శత్రువుతో కలసి ప్రయాణించకూడదన్నాడు అరుణముఖుడు. దీర్ఘముఖుణ్ణి శత్రువుని చేశాడు. అతన్ని అనుమానిస్తూ, అవమానిస్తూ ఓ కథ చెప్పాడు. దానికి చాలా బాధపడ్డాడు దీర్ఘముఖుడు. ఇలా అన్నాడు.‘‘చూడు మిత్రమా! నాకు మా రాజు ఎంతో నువ్వూ అంతే! లోకంలో తనలాంటి వాళ్ళే ఉంటారనుకుంటారు మంచివాళ్ళు. చెడ్డవాళ్ళే తానొకటీ, పరాయివారొకటీ అనుకుంటారు. నేను, నిన్ను చంపను. చంపనని మాటిస్తున్నాను.భయపడకు. నాతోరా’’పకపకా నవ్వాడు అరుణముఖుడు. దీర్ఘముఖుడి మాటలు అతనికి నవ్వు తెప్పించాయి. తర్వాత ఇలా అన్నాడు.‘‘ఈ మాయమాటలకేఁ! ఎన్నయినా చెబుతావు. నమ్మించి నీతో వచ్చేట్టుగా చేసుకుని, దారిలో చంపేస్తావు. నీ ఆలోచన నాకు తెలియదనుకోకు. దుర్మార్గులూ, నేరస్తులే ఇలా మెత్తగా మాట్లాడుతారు. అలా మాట్లాడే గొంతు కొస్తారు.’’‘‘అయ్యయ్యో! నేను అలాంటి వాణ్ణి కాదు మిత్రమా’’‘‘కాదనకు. ఇంతవరకూ మా రాజ్యాన్ని, మా రాజునీ తిట్టి తిట్టి, ఇప్పుడు మాట మారుస్తున్నావు. నీ సంగతి అందరికీ తెలుస్తూనే ఉంది. అసలీ గొడవకి కారణమే నువ్వు. నీ మాటల వల్లే యుద్ధం రాబోతోంది.’’ కసురుకున్నాడు అరుణముఖుడు.‘‘నన్నర్థం చేసుకో మిత్రమా’’ బ్రతిమలాడాడు దీర్ఘముఖుడు. మెత్తగా జాలిగా అరుణముఖుణ్ణి చూశాడు.‘‘ఇదిగో ఈ మాటలూ ఆ చూపే వద్దు. ఇలా మట్లాడే వెనకటికి ఓ పులి, పాపం కొంగను తినేసింది. ఆ కథ తెలుసా నీకు?’’ అడిగాడు అరుణముఖుడు.‘‘తెలీదు’’ అన్నాడు దీర్ఘముఖుడు.‘‘అయితే చెబుతా, విను.’’ అన్నాడు అరుణముఖుడు. చెప్పసాగాడిలా.‘‘జంబూద్వీపంలో ఓ అడవి ఉంది. దాని పేరు కామ్యకం. అందులో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఓ పొద ఉంది. ఆ పొదలో ఓ పులి ఉండేది. దానికి దగ్గర్లోనే ఓ జువ్విచెట్టుంది. ఆ చెట్టు మీద ఓ కొంగ ఉండేది. గూడుకట్టుకుని ఉందక్కడ కొంగ. ఒక రోజు దుప్పిని వేటాడింది పులి.

తనివి తీరా దాని మాంసం తింది. మాంసం తింటుంటే ఓ చిన్న ఎముక ముక్క పళ్ళల్లో గుచ్చుకుపోయింది. బయటికి రాదు, లోనికి పోదు. భరించలేకపోయింది పులి. నానా బాధలూ పడింది దాంతో. నాలికతో ఎముకముక్కని లాగి లాగి చూసింది. రాలేదది. నాలిక కూడా తెగినట్టుగా ఉంది. మండుతోంది. దాంతో పిచ్చి పిచ్చిగా తయారయింది. పెద్ద పెద్దగా కేకలేస్తూ గాండ్రించసాగింది. దాన్ని కొంగ గమనించింది. అయ్యో పాపం అనుకుంది. వచ్చి, పులిని అడిగిందిలా.

‘ఏమయింది?’‘పళ్ళల్లో ఎముక ముక్క ఇరుక్కుంది. రావట్లేదు. చాలా బాధగా ఉంది.’ అంది పులి.‘ఎక్కడా?’ నోరు తెరవమంది కొంగ. తెరిచింది పులి.‘అదా’ చూసింది కొంగ.‘అవును, తీసిపెడదూ, నీకు పుణ్యం ఉంటుంది.’ బ్రతిమలాడింది పులి. కళ్ళు చెమర్చుకుంది. జాలిపడింది కొంగ. తన పొడుగాటి ముక్కుతో పులి నోట్లో ఇరుక్కున్న ఎముక ముక్కని తీసి పారేసింది. అది మొదలు, ఆ రెండూ మంచి స్నేహితులయ్యాయి. ఎవరి వేట వారు సాగిస్తూ, తిన్న తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకునేవి.

ఒకరోజు పులికి వేట దొరకలేదు. లేచిన వేళా విశేషం. చిన్న జంతువు కూడా చిక్కలేదు. కడుపు కరకరమంటుంటే ఏం చెయ్యాలో తోచలేదు.ఆకలిని తట్టుకోలేకపోతోంది పులి. ప్రాణం పోయేట్టుగా ఉంది దానికి. దాంతో ఇలా అనుకుంది.ప్రాణం కోసం ధర్మాలన్నీ మంటగలపొచ్చు. ఈ శరీరం కోసం దేన్నయినా త్యాగం చెయ్యొచ్చు. శరీరం ఉంటేనే ధర్మాధర్మ విచక్షణ. అదే కరవయినప్పుడు మంచీ లేదు, చెడూ లేదు. ఎంతకయినా తెగించొచ్చు. తన ఆకలి తీరాలిప్పుడు. ఏదో ఒకటి కడుపులో పడాలి.కొంగని తినేస్తే!? కొంగ తన స్నేహితుడే! కాదనను. కాకపోతే స్నేహధర్మాన్ని పాటిస్తే కడుపు నిండదు.కొంగని తినేసి కడుపు నింపుకోవడమే తక్షణ కర్తవ్యం అనుకుంది పులి. అందుకు తగ్గ ఎత్తు వేసింది.ఎముక ముక్క మళ్ళీ పళ్ళలో ఇరుక్కున్నట్టుగా బాధపడసాగింది.పెద్దగా కేకలు వేయసాగింది. నేల మీద పడిపొర్లుతూ బాధను తట్టుకోలేనట్టుగా గంతులేయసాగింది. కొంగ చూసిందంతా. మళ్ళీ ఏదో అయింది పాపం అనుకుంది. కొమ్మ మీద నుంచి కిందికి దిగింది.‘ఏమయింది మిత్రమా’ అడిగింది పులిని.

‘ఏం చెప్పమంటావు? మళ్ళీ అదే బాధ. అప్పుడు నువ్వు నా బాధ తీర్చినందుకు నేనింత వరకూ నీకెలాంటి సాయం చెయ్యలేదు. నీ ఋణం తీర్చుకోలేదు. మళ్ళీ ఇంతలోనే’’ అంటూ కళ్ళు చెమర్చుకుంది.‘పళ్ళల్లో ఎముక ముక్క మళ్ళీ ఇరుక్కుందా?’’ అడిగింది కొంగ.‘అవును! మళ్ళీ ఇరుక్కుంది. బాధ భరించలేకపోతున్నాను. బలం ఉంది. వేటాడగల సత్తా ఉంది. అయినా ఎన్నడూ నీకింత తిండి పెట్టలేకపోయాను. తప్పు చేశాను. క్షమించు. ఇకపైన నీ తిండి కూడా నేనే సంపాదించి పెడతాను. దయచేసి, పళ ్ళల్లో ఇరుక్కున్న ఎముక ముక్క తీసిపెట్టు.’‘తప్పకుండా తీసిపెడతాను. స్నేహం అన్న తర్వాత ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా?’ అంది కొంగ. పులిని బాగా నోరు తెరవమంది. తెరించింది పులి. ‘ఎక్కడా’ అంటూ ముక్కుతో వెదుకుతూ ముందుకొచ్చింది కొంగ. రావడమే ఆలస్యం, కొంగ మెడ పట్టుకుంది పులి. కొరికేసింది. తర్వాత తినేసింది.’’ కథ ముగించాడు అరుణముఖుడు. అంతలోనే ఇలా అన్నాడు మళ్ళీ.

‘‘పులి లాంటి దానివి నువ్వు. నేను కొంగలాంటి దాన్ని. నీతో చేరితే నాకు చావు తప్పదు.’’అరుణముఖుడు నన్ను అనుక్షణం అనుమానించడంతో అవమానించడంతో అక్కడ అందరికీ చులకనయిపోయాన్నేను. దాంతో అంతా నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. బాధించారు. ఆ తిట్లూ, ఆ బాధా మరిచిపోలేను. ఇది చెప్పాలనే కాబోలు నేనింకా బతికి ఉన్నది. క్షణాల్లో శత్రువుల అంతు చూడగల మీలాంటి రాజు ఉండీ, వేలాదిగా సైన్యం ఉండీ నేనెంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు.’’ కళ్ళు చెమర్చుకున్నాడు దీర్ఘముఖుడు.

‘‘వూర్కో వూర్కో’’ ఓదార్చజూశాడు హిరణ్యగర్భుడు.‘‘జరిగిందంతా చెప్పి మీ మనసెంతో నొప్పించాను. అసలు ఇదంతా మీకు చెప్పడానికే కాబోలు చిత్రవర్ణుడు నన్నేం చేయకుండా వదిలిపెట్టింది.’’ అని ఏదో గుర్తొచ్చినట్టుగా ఇలా అన్నాడు మళ్ళీ.‘‘అన్నట్టు రాజా! నా వెనుకే అరుణముఖుణ్ణి పంపుతానన్నాడు చిత్రవర్ణుడు. పంపే ఉంటాడు. వాడు రేపో మాపో మన రాజ్యానికి వ స్తాడు. ఇక ఏం చేస్తే బాగుంటుందో మీరే ఆలోచించండి.’’తన యాత్రా విశేషాల వివరణను ముగించాడలా దీర్ఘముఖుడు. హిరణ్యగర్భుడు ఆలోచనలో పడ్డాడు.కాస్సేపటికి తేరుకున్నాడు. ఇలా అన్నాడు.‘‘అయిందేదో అయిపోయింది. బాధపడకు. ఏదయినా మన మంచికే అనుకోవాలి. ఏది జరిగినా పైవాడిష్ట ప్రకారం జరిగిందనుకోవాలి.’’‘‘అవును మహారాజా’’‘‘చిత్రవర్ణుడికీ, అతని సైన్యానికీ మూడింది. చావాలని రాసి పెట్టి ఉంది. అందుకే నిన్ను బంధించి బాధించారు. యుద్ధం అంటూ దూత రానవసరం లేదు. వచ్చి మనకేమీ చెప్పనక్కర్లేదు. మనమే యుద్ధం ప్రకటిద్దాం.’’ అన్నాడు హిరణ్యగర్భుడు.్‌్‌్‌అరుణముఖుణ్ణి పిలిచాడు చిత్రవర్ణుడు. ఒక దూతగా ఏమేమి చెయ్యాలో చెప్పాడతనికి. కర్పూరద్వీపానికి వెళ్ళి రమన్నాడు. సాగనంపాడతన్ని. తర్వాత మంత్రులతో ఏకాంతంగా ముచ్చటించాడు. ఎవరో చెప్పారు, మేఘవర్ణుణ్ణి గూఢచారిగా పంపడం మంచిదని. కబురు పెట్టాడతనికి. కబురందగానే వచ్చి వాలింది కాకి. అతనే మేఘవర్ణుడు.‘‘గూఢచారిగా నువ్వు కర్పూర ద్వీపానికి వెళ్ళాలి. హిరణ్యగర్భుడితో స్నేహం చెయ్యాలి. అతన్ని నమ్మించి, మన పని చక్కబెట్టాలి.’’ అన్నాడు చిత్రవర్ణుడు.

‘‘హిరణ్యగర్భుడితోనే కాదు, మంత్రి సామంతులతో కూడా నువ్వు స్నేహం చెయ్యాలి. స్నేహం చెయ్యని పక్షంలో వారంతా నీకూ రాజుకీ విరోధాన్ని కలిగిస్తారు. అప్పుడు మనం ఆశించిన పని నెరవేరదు. అన్నట్టు రాజుతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. వారి మనసు చంచలంగా ఉంటుంది. అది గ్రహించి నడుచుకోవాలి.‘మహారాజా, మహానుభావా’ అంటూ ముఖస్తుతి చెయ్యాలి. అనవసర విషయాల్లో తల దూర్చొద్దు. గూఢ చర్యం అంటే కత్తి అంచు మీద నడక. జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వెయ్యాలి. మన విషయాలేవీ అక్కడి వారికి తెలియకూడదు. అలాగే నువ్వెవరో, ఏమిటో కూడా ఎవరికీ తెలియకూడదు. చెప్పిన పని చేసి, త్వరగా తిరిగి రా! నీకోసమే చూస్తుంటాం.’’ అన్నాడు చిత్రవర్ణుడు.‘సరే’నన్నాడు మేఘవర్ణుడు. మేఘాల్లోకి ఎగిరిపోయాడు.

మంత్రి సర్వజ్ఞుణ్ణి పిలిచాడు హిరణ్యగర్భుడు. తనకి దీర్ఘముఖుడు చెప్పిందంతా అతనికి తెలియజేశాడు.సర్వజ్ఞుడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.‘‘ఉన్నచోట ఉండకుండా అటూ ఇటూ ఎందుకు తిరగడం ఈ దీర్ఘముఖుడు? తగుదునమ్మ అని వెళ్ళి తగవు పెట్టుకుని వచ్చాడు. తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని, ఇప్పుడీ ఈ యుద్ధానికి దీర్ఘముఖుడే కారణం అయి కూర్చున్నాడు. దీన్నే అంటారు, కయ్యానికి కాలు దువ్వడం అని.’’సర్వజ్ఞుణ్ణి వారించాడు హిరణ్యగర్భుడు.‘‘సర్లే, ఇప్పుడు దీర్ఘముఖుడు చేసిన తప్పుల్ని తవ్వుతూ కూర్చోడం మన కర్తవ్యం కాదు. అతన్ని నిందించి సమయాన్ని వృధా చేసుకోవడం కూడా తెలివి తక్కువతనమే అవుతుంది. పొరపాటున వెళ్ళాడక్కడికి. శత్రువులకి చిక్కాడు. చీవాట్లూ చెప్పుదెబ్బలూ తిన్నాడు. వచ్చాడు. ఇప్పుడు అది అనవసరం. జరగాల్సింది చూడు.’’‘‘జరగాల్సింది అంటే...జంబూద్వీపానికి గూఢచారిని పంపించడమే మన తక్షణ కర్తవ్యం. ఆనుపానులన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ముందుకురకడం మంచిది కాదు. ఇలాంటి వ్యవహారాల్లో నిదానమే ప్రధానం. నిదానంగా చేసే పనికి దైవం కూడా సహకరిస్తుందంటారు.’’ అన్నాడు సర్వజ్ఞుడు.

తర్వాత మళ్ళీ ఇలా అన్నాడు.‘‘రాజుకి కన్నూ, ముక్కూ, చెవులూ గూఢచారులే! వారిని అనుక్షణం రాజు నమ్మాలి.’’‘‘కాదన్నానా’’ అన్నాడు హిరణ్యగర్భుడు.‘‘అన్నానని కాదుగాని, గూఢచర్యానికి సరయిన వాడు దీర్ఘముఖుడే! మన పట్ల విశ్వాసం ఉన్నవాడూ, ఉపాయాలు తెలిసిన వాడూ అతనే! వేగంగా కూడా ప్రయాణించగలడు. అతనితో పాటు అతని తమ్ముడు, ధవళాంగుణ్ణి కూడా జంబూద్వీపానికి పంపుదాం. అంతా రహస్యంగా చేద్దాం. రాజ్య వ్యవహారాలన్నీ రహస్యంగానే ఉండాలి.’’ అన్నాడు సర్వజ్ఞుడు.‘‘నిజమే’’ అన్నాడు హిరణ్యగర్భుడు.