This Story is a Part of Potana kavithalu click here for more stories
వామనావతారము (Vaamanaavataaramu)
వామనుడు లేదా త్రివిక్రముడు, హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో ఐదవ అవతారం. వామనుడు అదితికి పుత్రునిగా జన్మించి, బలి చక్రవర్తి దగ్గర నుండి మూడు అడుగుల నేల అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపించి అక్కడ రాజుని చేసి తానే స్వయంగా వరాహ రూపంలో ఆ రాజ్యానికి కాపలాగా మారతాడు.
వామనుడు అనగానే తెలుగు వారికి "ఇంతై ఇంతై వటుండంతై " అన్న పోతన భాగవత పద్యము తెలుగునాట సుపరిచితం. దేవాసుర యుద్ధంలో ఇంద్రునితో ఓడిపోయిన బలి, రాక్షస గురువైన శుక్రాచార్యుల దయ వలన బ్రతికి, గురూపదేశంతో విశ్వజిత్‌యాగం చేసి బంగారు రథము, మహాశక్తివంతమైన ధనుస్సు, అక్షయతూణీరములు, కవచము, శంఖములు పొందుతాడు. బలగర్వితుడై ఇంద్రుని మదమణిచేందుకు, రాక్షసులనందరినీ ఒకచోటచేర్చి, యుద్ధమునకు సంసిద్ధం చేసి అమరావతిపై దండెత్తుతాడు.
ఆ దుర్భర దానవ శంఖా విర్భూత ధ్వనులు నిండి, విభుదేంద్ర వధూగర్భములు పగిలి, లోపలి శిశువులు ఆవురని ఆక్రోశించుచుండ, దేవతలు బృహస్పతి వచనములు విని అమరావతి వీడి పారిపోయారు.
దేవతల దుస్థితిని చూసి, సురమాత అదితి, తన భర్తయైన కశ్యపబ్రహ్మను వేడుకున్నది. అంతట కశ్యపుడు అదితికి పయోభక్షణ వ్రతాన్ని ఉపదేశిస్తాడు. ఆమె ఫాల్గుణ మాసం, శుక్లపక్ష పాడ్యమి నుంచి 12 రోజులు హరిసమర్పణంగా వ్రతం చేసి భర్తను చేరగా, భగవదంశతో, శ్రవణ ద్వాదశి (శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద బహుళ ద్వాదశిని శ్రవణద్వాదశి అంటారు), ఆనాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నంలో, రవి మధ్యాహ్నమున చరించునప్పుడు, గ్రహ తారా చంద్ర భద్రస్థితిలో వామనుడు జన్మించాడు. వామనుడు పుట్టినప్పుడు శంఖ, చక్ర, గదా కమల కలిత, చతుర్భుజునిగా, బిశంగ వర్ణ వస్త్రాలతో, మకరకుండల మండిత గండ భాగుడై, శ్రీ విరాజిత లోలంబ, కదంబ వనమాలిగా సమస్త అలంకారాలతో, నిఖిల జన మనోహరుడిగా అవతరించాడు.
రూపాంతరంబున తన దివ్యరూపాన్ని ఉపసంహరించుకొని, కపట వటుని వలె, ఉపనయ వయస్కుండై వామన బాలకుడయ్యాడు.
అతనిని చూచి జనులు గుజగుజలు పోవుచూ, గజిబిజి పడుచూ, కలకలములై ఎవరీ పొట్టి బాలుడు? శివుడా? హరియా? బ్రహ్మయా? సూర్యుడా? అగ్నియా? ఈ బ్రహ్మచారి ఎవరు? అని విస్మయం చెందారు. కొందరితో చర్చించుచూ కొందరితో జటలు చెప్పుచూ, గోష్ఠిలో పాల్గొనుచూ, తర్కించుచు, ముచ్చటలాడుచు, నవ్వుచూ అనేక విధంబుల అందరికీ అన్ని రూపులై వినోదించుచూ, వెడవెడ నడకలు నడుచుచూ, బుడి బుడి నొడువులు నొడుచుచు, జిడిముడి తడబడగ, వడుగు రాజును సమీపించి "స్వస్తి ! జాగత్త్రయీ భావన శాసన కర్తకు! హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, ఉదారపద వ్యవహర్తకు, మునీంద్ర స్తుత మంగళాధ్వ విధాన విహర్తకు, దానవ లోక భర్తకు స్వస్తి అని దీవించెను.
బలి అతనికి సముచితాదరమిచ్చి గౌరవించి...వడుగా ! ఎవ్వరి వాడవు? నీకేమి కావలయును కోరుకొమ్మన్నాడు. "ఒంటి వాడను నేను. నాకు ఒకటి, రెండడుగుల మేర యిమ్ము . అయినను అడుగమంటివి కనుక అడిగితిని. దాత పెంపు సొంపు తలపవలెను గదా! కావున నాకు మూడడుగుల నేలనిమ్ము, చాలు అని మాయావడుగు పలికెను. ఆ వామనుడిని విష్ణువుగా గుర్తించిన శుక్రుడు బలి చక్రవర్తిని వారించెను. బలి గురువుకు వినయముగా నమస్కరించి ...ఇచ్చెదనని పలికితిని. ఆడిన మాట తప్పను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు నీవిచ్చినచో అఖిలంబు పోవును. అంతేకాక...అది పాపము కాదు. అని శుక్రాచార్యుడు వివరించెను. దానికి బలి చక్రవర్తి ..కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతింబొందరే వారేరీ? సిరి మూట గట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనంగలదే! శిబి లాంటి దాతల పేరు ఈనాటికీ స్థిరములైనవి కదా! భార్గవా! అని పలుకుతూ తన మాటను తోసి పుచ్చిన రాజును పదభ్రష్ఠునివి గమ్మని శుక్రాచార్యుడు శపించాడు.
అయినను బలిచక్రవర్తి హరిచరణములు కడిగి, త్రిపాద ధరిణిం దాస్యామి అనుచు నీటిధార విడిచాడు. ఆ కలశములో సూక్ష్మకీటక రూపమున చేరి శుక్రాచార్యుడు నీటిధారను ఆపబోయాడు. అప్పుడు హరి కుశాగ్రముతో కలశరంధ్రమును బొడువగా కన్ను పోగొట్టుకొని శుక్రాచార్యుడు ఏక నేత్రుడయ్యెను. పుట్టి నేర్చుకునెనో, పుట్టక నేర్చెనో.. ఈ పొట్టి వడుగునకీ చిట్టి బుద్ధులెట్లబ్బెనో, ఈతని పొట్టనిండా అన్నీ భూములే.. అని నవ్వుతూ మూడడుగుల నేలను బలి వడుగుకు దానమిచ్చెను.
అలా ధారా పరిగ్రహంబు చేసి, ఇంతితై వటుడింతయై, దానింతై, నభో వీధిపైనంతై, తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశి పైనంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహార్వాటి పైనంతై, బ్రహ్మాండాంత సంవర్థియై, సత్యపదోన్నతుడైన విష్ణువునకు అప్పుడే ఉదయించిన సూర్యబింబము మొదట గొడుగులా, తదుపరి శిరోరత్నమై, చెవి కుండలమై, మెడలోని ఆభరణమై, బంగారు కేయూరమై, కంకణమై వడ్డాణపు ఘంటమై, నూపురప్రవరమై, చివరకు పాదపీఠమై ఒప్ప అతడు బ్రహ్మాండము నిండినాడు - అని బమ్మెర పోతన భాగవతంలో పద్య రచన అద్భుతంగా చేశాడు.
ఒక పాదంబులో భూమిని కప్పి, దేవ లోకమును రెండవ పాదమున నిరోధించి, జగములెల్ల దాటి చనిన త్రివిక్రముడు మరల వామనుడై బలినవలోకించి నా మూడవ పాదమునకు స్థలము జూపమన్నాడు. అప్పుడు బలి వినయముతో నీ తృతీయ పాదమును నా శిరమున ఉంచమని వేడుకొనగా సమ్మతించిన హరి బలిని ఆశీర్వదించి, ప్రహ్లాదునితో సుతలలోకమునకు పంపి, తానే ఆలోకమునకు ద్వారపాలకుడాయెను. బలి నడిగి సంపాదించిన లోకములను తన సోదరుడైన ఇంద్రున కిచ్చి సంతోషపరిచాడు శ్రీహరి.