పింగళ సంజీవకుల పోరు



రాజు తలచుకుంటే దేనికీ కొదవ ఉండదు. అందుకే రాజుని ప్రార్థించాలి. అతన్ని దేవుడిగా గుర్తించాలంటూ దమనకుడు ఎన్నెన్నో కథలు చెప్పాడు సంజీవకుడికి. చెప్పిన కథలు సంజీవకుడి కోప తాపాలు తగ్గిస్తాయని, మృగరాజు పింగళకుడితో అతను సంధి చేసుకుంటాడని ఊహించాడు. సంధి తనకు ఇష్టం లేకపోయినా ప్రయత్నాలు చేశాడు దమనకుడు. ఫలించలేదవి. పైగా సంజీవకుడు ఇలా అన్నాడు దమనకుడితో.‘‘చూడు దమనకా! నువ్వు ఎన్ని కథలు చెప్పినా, రాజుని నువ్వు దేవుణ్ణి చేసినా నేను మాత్రం పింగళకుణ్ణి నమ్మను. వచ్చి అతని కాళ్ళ మీద పడను. ఎవరికయినా ఎప్పుడ యినా చావు తప్పదు. ప్రతిరోజూ వందలు వేలాది మంది చనిపోతున్నారు. నిన్న ఉన్న వారు ఇవాళ ఉండరు. రాజుకయినా బంటుకయినా చావు అనివార్యం. అందుకని, చావుకి భయపడడం అవివేకం. నాకు ప్రాణం కన్నా మానం ముఖ్యం. ఆత్మగౌరవం ప్రధానం. దానిని దెబ్బ తీశాడు పింగళకుడు. అందుకని, ఇక ఆలోచించేది లేదు. యుద్ధం తప్పదు. నేనో, రాజో తేలిపోవాలి. నేను యుద్ధానికే సిద్ధపడుతున్నాను. రాజుని కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పు. వెళ్ళు.’’‘‘ఇదేనా నీ ఆఖరి మాట’’ అడిగాడు దమనకుడు.‘‘అవును. ఇదే నా ఆఖరి మాట. ఇప్పుడిద్దరికీ యుద్ధమే శరణ్యం.’’ అన్నాడు సంజీవకుడు.

దమనకుడు బయల్దేరాడు అక్కణ్ణుంచి. పింగళకుణ్ణి చేరాడు.‘‘ఏవన్నాడు సంజీవకుడు?’’ అడిగాడు పింగళకుడు. కోపంతో రగిలిపోతున్నాడతను.‘‘ఏవన్నాడంటే ఏం చెప్పమంటారు మహారాజా! వినాశకాలంలో విపరీత బుద్ధులు పుడతాయని, సంజీవకుడు చాలా పొగరుగా మాట్లాడాడు. నోటికొచ్చిందల్లా మాట్లాడాడు. అవన్నీ నేను చెప్పలేను కాని, ఒక్కటి మాత్రం చెప్పదలచుకున్నాను. సంజీవకుడు మూర్ఖుడు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళన్న రకం.’’ చెప్పాడు దమనకుడు.

‘‘విషయానికి రా! నేను చెప్పమన్నది సంజీవకుడికి చెప్పావా? లేదా?’’‘‘చెప్పాను మహారాజా! వినలేదు. విననన్నాడు. ప్రాణాపాయాన్ని కొని తెచ్చుకుంటున్నావంటే పర్వాలేదన్నట్టుగా తలెగరేశాడు. జయాపజయాలు దైవాధీనాలని, మీ రాజుని యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పన్నాడు.’’‘‘అంతమాటన్నాడా? బాగా కొవ్వెక్కింది.’’‘‘అవును మహారాజా! సంజీవకుడివన్నీ కొవ్వెక్కిన మాటలే! మంచి చేద్దామని ఎంతగా చెప్పినా చెవిన పెట్టలేదు. నన్ను కూడా ఛీ కొట్టాడు.’’ అన్నాడు దమనకుడు. తర్వాత ఓ కంట రాజుని గమనిస్తూ ఇలా అన్నాడు అంతలోనే!‘‘యుద్ధం వద్దంటూ సంజీవకుని మనసు మార్చేందుకు నేనెంతగానో ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. నిజం చెప్పకేం! పదే పదే అతను యుద్ధాన్నే కోరుకుంటున్నాడు. మీరీ యుద్ధంలో ఓడిపోతే అతనే ఈ అడవికి రాజట! తర్వాత మీ ఇష్టం.’’‘‘అంత కోరికతో ఉన్నాడా! అయితే ఇక క్షమించేది లేదు. రమ్మను యుద్ధానికి’’ జూలు విదిల్చాడు పింగళకుడు.

యుద్ధం మొదలయ్యింది.సంజీవకుడూ పింగళకుడూ ఒకరినొకరు తీవ్రంగా హింసించుకోసాగారు. కొమ్ములతో సంజీవకుడు కుమ్మితే పింగళకుడికి ఊపిరిరాడలేదు. అలాగే పింగళకుడి పంజా దెబ్బకి సంజీవకుడు సొమ్మసిల్లిపోసాగాడు. లంఘిస్తూన్న పింగళకుణ్ణి ఆపడం, అడ్డుకోవడం సంజీవకుడి వల్ల కావట్లేదు. ఇద్దరి శరీరాలూ నెత్తురోడుతున్నాయి. మాంసం ముద్దలు ముద్దలుగా తెగిపడుతూంది.కొద్దిదూరంలో నిల్చుని, కరటక దమనకులిద్దరూ ఆ యుద్ధాన్ని చూస్తున్నారు. ఉత్కంఠగా ఉంది ఇద్దరికీ. గెలుపోటములు ఎవరి పరం అన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఏదేమయినా తను అనుకున్నది సాధించానని ఆనందిస్తున్నాడు దమనకుడు. అతని ఆనందాన్ని గమనించాడు కరటకుడు. బాధపడ్డాడు. అకారణంగా ఒకరినొకరు చంపుకోవడం అవివేకం అనిపించింది. ఇలా అన్నాడు దమనకుడితో.‘‘నిన్ను నమ్మినందుకురాజుకి తగిన శాస్తే జరుగుతోంది. అది కాదుగాని, నీ అంతట నువ్వే సంజీవకుడికీ, పింగళకుడికీ స్నేహం కలిపావు. తర్వాత నీ అంతట నువ్వే వాళ్ళిద్దరికీ వైరాన్ని కల్పించి యుద్ధానికి ఎగదోశావు. ఎందుకిలా చేశావు?’’సమాధానం లేదు దమనకుడి దగ్గర్నుంచి.

‘‘నువ్వు దూరం ఆలోచించలేదు గాని, యుద్ధం ఎప్పుడూ ప్రమాద కరమే! ఏ ఇద్దరి యుద్ధం ఆ ఇద్దరికే పరిమితం కాదు. అది అందర్నీ చుట్టబెడుతుంది. మట్టుబెడుతుంది. అందుకే యుద్ధాలు వద్దంటారు. చేతనయితే యుద్ధాన్ని ఆపగలగాలిగాని, యుద్ధానికి సన్నద్ధుల్ని చెయ్యకూడదు. ఒక సేవకుడిగా రాజుకెప్పుడూ మంచే చెయ్యాలి. హితాన్నే చేకూర్చాలి. అప్పుడది నీకే కాదు, తోటివారందరికీ శుభాన్ని చేకూరుస్తుంది. అలాకాక, కావాలని మంచివాడికి కీడు తలపెట్టడం, చెడ్డవాడికి సహాయం చెయ్యడం చేస్తే చివరికి అవి అందుకు సహకరించిన వాణ్ణే బలిగొంటాయి. మంత్రి అన్నవాడు ఎప్పుడూ కూడా రాజుకి చెడు సలహాలు ఇవ్వకూడదు.’’ అన్నాడు కరటకుడు.‘చాల్లే చెప్పొచ్చావు’ అన్నట్టుగా చూశాడు దమనకుడు.

ఆ చూపును అర్థం చేసుకున్న కరటకుడు ఇలా అన్నాడంతలోనే!‘‘అయినా నీకు బుద్ధి చెప్పాలనుకోవడం నా బుద్ధి తక్కువ. వెనకటికి, తెలివితక్కువ కోతులు కొన్ని మిణుగురు పురుగుల చూట్టూ చేరి, చలి కాచుకుంటున్నాయి. వెచ్చగా ఉందంటూ భ్రమించి సంతోషిస్తున్నాయి. దోవన పోతూ వాటిని ఓ పక్షి చూసింది. కోతుల తెలివితక్కువతనానికి జాలిపడింది. వాటికి నిజం చెప్పాలనుకుంది.‘‘మీరు నిప్పు అనుకుంటున్నారేమో, కాదు. అవి మిణుగురు పురుగులు.’’ అంది.‘‘తెలుసులే! నీ మానాన నువ్వెళ్ళు’’ అన్నాయి కోతులు.‘‘నేను చెబుతోంది నిజం. మిణుగురుల్ని మీరు నిప్పనుకుంటున్నారు. భ్రమలో ఉన్నారు.’’ అంది పక్షి.అయినా పట్టించుకోలేదు కోతులు. పదే పదే చెప్పి చూసింది పక్షి. దాంతో కోతులకి తిక్కరేగింది. దారిన పోయే పక్షి తమకు నీతులు చెబుతుందా? అనుకున్నాయి. ఒక్కుమ్మడిగా దాడి చేసి, పక్షిని చంపేశాయి.’’

‘‘అవును మరి, చిన్నా పెద్దా తేడా తెలుసుకోవద్దూ’’ అన్నాడు దమనకుడు. కోతుల్ని ఒక రకంగా సమర్థించాడు. నచ్చలేదది కరటకునికి.‘‘లోకంలో మంచివాళ్ళు, మంచి మాటలు చెప్పేవాళ్ళు తక్కువగా ఉంటారు. ఆ మాటలు వినే వాళ్ళు ఇంకా తక్కువగా ఉంటారు. ఆ సంగతి అలా ఉంచితే, తన మేలు కోసం ఇతరులకు కీడు తలపెట్టేవాడు బాగుపడడు. దీనికి నందిగుప్తుడు కథే ఉదాహరణ.’’ అన్నాడు కరటకుడు.

‘‘ఏంటా కథ? చెప్పు చెప్పు’’ అడిగాడు దమనకుడు. చెప్పసాగాడిలా కరటకుడు.పూర్వం జనావతి నగరంలో ఇద్దరు వర్తకులు ఉండేవారు. ఒకరు నందిగుప్తుడు, మరొక రు సుదర్శనగుప్తుడు. ఇద్దరూ మంచి స్నేహితులు. జనావతినగరంలోనే గాక ఇతర నగరాల్లో కూడా ఆ ఇద్దరూ వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదించారు. కోటీశ్వరులనిపించుకున్నారు. ఓసారి అవంతీనగరంలో వ్యాపారం చేసి, అక్కడ బాగా డబ్బు సంపాదించి, జనావతికి తిరుగు ప్రయాణమయ్యారు. ఇంకో అరగంటలో ఉన్న వూరికి చేరుతారనగా సుదర్శనుడితో నందిగుప్తుడు అన్నాడిలా.

‘‘ఇతర నగరాల్లో వ్యాపారాలు చేసి, మనం బాగా డబ్బు సంపాదిస్తున్నామన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు అవంతీనగరం నుంచి తిరిగి వస్తున్నామంటే ఇంకా బాగా సంపాదించుకుని వస్తున్నారనుకుంటారు జనం. అయితే వారలా అనుకోవడం ఇద్దరికీ క్షేమం కాదు. మన ఇళ్ళ మీద పడి దోచుకుని పోయే అవకాశం ఉంది. అందుకని మనం ఏం చేద్దామంటే...’’‘‘ఏం చేద్దాం?’’‘‘బండిలో ఉన్న లంకెల బిందెల్లో సంపాదించిన డబ్బంతా దాచి, ఆ బిందెల్ని అదిగో ఆ మర్రిచెట్టు కింద గొయ్యి తవ్వి పాతిపెడదాం. డబ్బు కావాల్సి వచ్చినప్పుడు రహస్యంగా వచ్చి రహస్యంగా తీసుకుని వెళ్దాం. నా ఆలోచన ఎలా ఉంది?’’ అడిగాడు నందిగుప్తుడు.‘‘చాలా బాగుంది.’’ మెచ్చుకున్నాడు సుదర్శనగుప్తుడు.సంపాదించిన సొమ్మునంతా లంకెల బిందెల్లో దాచారు. మోయలేక మోయలేక వాటిని మర్రిచెట్టు దగ్గరకి తీసుకుని వచ్చారు. చీకటిపడే వరకు కబుర్లాడుకుని, తర్వాత ఎవరూ లేని వేళ చెట్టు కింద గొయ్యి తవ్వి, ఆ గోతిలో బిందెల్ని పాతిపెట్టారు. తర్వాత అక్కణ్ణుంచి వెళ్ళిపోయారు.