పిల్లిప్రేమ



గుడ్లగూబ నుంచి త ప్పించుకునేందుకు పిల్లికి దగ్గరయింది ఎలుక. ఎప్పుడయితే పిల్లిని చూసిందో అప్పుడు భయపడి, అక్కణ్ణుంచి ఎగిరి పారిపోయింది గుడ్లగూబ. ఎలుక దక్కదు సరికదా, పిల్లితో ప్రాణాపాయం ఎందుకొచ్చిన గొడవ అనుకుంది. వలలో చిక్కుకున్న పిల్లిని రక్షించేందుకు ఎలుక సిద్ధపడిందో లేదో యముడిలా బోయవాడు వస్తూ కనిపించాడు. వాణ్ణి చూడగానే పిల్లికి పై ప్రాణాలు పైనే పోయాయి. గోల గోల చేసింది.

‘ఎలుక బావా! అడుగో, బోయవాడు వచ్చేస్తున్నాడు. వాణ్ణి చూస్తూంటేనే వణుకు పుడుతోంది. తొందరగా కాపాడు బావా! ఈ వలలోంచి నన్ను తప్పించు.’‘ఆ పనిలోనే ఉన్నాను.’ అంది ఎలుక. వలను అదే పనిగా పటపటపటమని కొరికి వేసింది. వల చిరిగిన మరుక్షణం కలుగులోనికి దూరి పోయింది. వలలోంచి బయటపడ్డ పిల్లి, చటుక్కున చెట్టెక్కేసింది. బోయవాడికిది ఊహకందలేదు. దొరుకుతుందనుకున్న పిల్లి దొరకలేదు. పైగా వల చిరిగిపోయింది. తల పట్టుకున్నాడతను. వెళ్ళిపోయాడక్కణ్ణుంచి. కనుచూపు మేర బోయని చూసి, అతను మలుపు తిరిగినప్పుడు, ఇక రాడని నిర్ధారించుకుని, చెట్టు దిగింది పిల్లి. ఎలుక దాగిన కలుగు దగ్గరగా వచ్చింది.‘బావా! రారా! నేను, పిల్లి బావను పిలుస్తున్నాను. సరదాగా కబుర్లాడుకుందాం, రా’కలుగులోంచి సమాధానం లేదు.‘నీ స్నేహాన్నీ, నిన్నూ మరచిపోలేకపోతున్నాను. రా! నీతో మాట్లాడకపోతే ఏదోలా ఉంది. రా’ పిలిచింది మళ్ళీ.ఎలుక ఏమీ మాట్లాడలేదు.‘నువ్వూ నేనూ ఒకటి. నా ఇల్లు, నీ ఇల్లనుకో! ఇద్దరం మా ఇంట్లోనే ఉందాం. నన్ను కాపాడినందుగ్గాను, నీకు విందు చేద్దామనుకుంటున్నాను. చెప్పు, నీకేం కావాలో? అవన్నీ వండి పెడతాను.’ అంది పిల్లి.

దానికీ జవాబు లేదు.‘సరే! ఇవన్నీ కాదుగానీ, నువ్వొక్కసారి బయటికి రా! కృతజ్ఞతగా నిన్ను గట్టిగా కౌగిలించుకుంటాను.’ అంది పిల్లి.కలుగులోంచి ఎలుక రాలేదు. జవాబు వచ్చింది.‘పిల్లిబావా! కాలం కలిసి రానప్పుడు, గతిలేక పోయినప్పుడు శత్రువుతో స్నేహం చెయ్యాల్సి వస్తుంది. అప్పుడు కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. లేకపోతే ప్రాణాపాయం తప్పదు. అంటున్నానని కాదుగాని, పొద్దున నించి వలలో చిక్కి ఆకలితో అల్ల్లాడిపోతున్నావు. నన్ను చూశావనుకో, అమాంతం మీద పడతావు. చంపాలని నీకుండదు. కాని, ఆకలికి ఆత్మీయతలూ, అనురాగాలూ ఉండవంటారు. నీ మాటలు నేను నమ్మను. నేను కలుగులోంచి బయటకు రాను. నీకూ నీ స్నేహానికీ వెయ్యి నమస్కారాలు. వెళ్ళిరా!’ అంది ఎలుక.వేటను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది పిల్లి.’’ కథ ముగించాడు హిరణ్యగర్భుడు.‘‘కథ బాగుంది.’’ అన్నారు దీర్ఘముఖుడూ,సర్వజ్ఞుడూ.‘‘కథ బాగోగులు పక్కన పెట్టండి. ఈ కథ మీకు ఎందుకు చెప్పానంటే...అవసరార్థం అప్పుడప్పుడూ మనం శత్రువుతో కూడా స్నేహం చెయ్యాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ అవసరార్థమే మనం నీలవర్ణుని చేరదీశాం. అతనితో స్నేహం నటిస్తున్నాం.’’

‘‘సరేగానీ...’’ అని ఏదో చెప్పబోతున్న సర్వజ్ఞుని మాటకు అడ్డువచ్చి ఇలా అన్నాడు హిరణ్యగర్భుడు.‘‘ఇక నీలవర్ణుని గురించి మాటలనవసరం. యుద్ధం మేఘం కమ్ముకొచ్చినట్టుగా కమ్ముకొచ్చేసింది. శత్రువు కూడా దగ్గరకొచ్చేశాడు. చర్చలు అనవసరం. ముందు ఏం చెయ్యాలో ఆలోచించండి.’’సర్వజ్ఞుడు మౌనం వహించాడు.‘‘సర్వజ్ఞా! మాట్లాడవేమి?’’ అడిగాడు హిరణ్యగర్భుడు. దాంతో మేల్కొన్నట్టుగా ఇలా అన్నాడు సర్వజ్ఞుడు. ‘‘నీలవర్ణుని గురించి నేనిక మాట్లాడను మహారాజా! అతన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇకపోతే...యుద్ధంలో విజయావకాశాలు గురించి మాట్లాడుకుందాం. చిత్రవర్ణుడికీ, అతని మంత్రికీ భేదాభిప్రాయాలు ఉన్నాయి. పైగా ఆ రాజుకి మన శక్తియుక్తులు తెలిసినట్టు లేదు. అదలా ఉంచితే, చిత్రవర్ణుడు సైన్యసమేతంగా చాలా దూరం ప్రయాణించి వచ్చాడు. బాగా అలసిపోయి ఉన్నాడు. వాళ్ళలో వాళ్ళకి పడక భేదాభిప్రాయాలతో తల్లడిల్లుతోన్న శత్రువుల్నీ, అలసిన శత్రువుల్నీ, ఎదుటివారి శక్తియుక్తులు తెలుసుకోని, తెలుసుకోలేని శత్రువుల్నీ ఇట్టే మట్టుబెట్టొచ్చు. ఇదే సరయిన సమయం. యుద్ధానికి సిద్ధం కండి.’’హిరణ్యగర్భుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు.

యుద్ధం మొదలయింది. ఇరువర్గాలూ హోరాహోరీగా పోరాడాయి. అయితే అలసిన చిత్రవర్ణుని సేన, హిరణ్యగర్భుని సేన చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. కాళ్ళు తెగి కొందరు, పీకలు తెగి కొందరు, గొంతులోనూ, గుండెల్లోనూ గాయాలతో కొందరూ మరణించారు. యుద్ధ ప్రారంభం నుంచే హిరణ్యగర్భుడిది పైచేయి అయింది. చిత్రవర్ణుని సేనని, అతను తుత్తునియలు చేశాడు. వందలు, వేలాదిగా చచ్చిపడి ఉన్న సైనికుల్ని చూస్తూ కళ్ళు చెమర్చుకున్నాడు చిత్రవర్ణుడు. ఏం చెయ్యాలో పాలుపోలేదతనికి. కాస్సేపటికి తేరుకున్నాడు. దీర్ఘదర్శిని పిలిపించాడు. యుద్ధంలో పాల్గొనకుండా తన మానాన తనున్న దీర్ఘదర్శిని పిలిచి, ఇలా అడిగాడు.‘‘చూశావా, సేనంతా ఎలా చచ్చిపడి ఉందో! ఇది చూస్తూ కూడా నువ్వు పట్టించుకోకపోవడం, యుద్ధంలో పాల్గొనకపోవడం భావ్యం కాదు. యుద్ధం వద్దన్నావు. మంచే చెప్పావు. అయితే నీ సలహా విననందుకు ఇంతలా మంకుపట్టు పట్టడం పద్ధతా చెప్పు? మనందరం ఒక చెట్టు కాయల్లాంటి వాళ్ళం. నీకు నేనూ, వీళ్ళూ అంతా కావాల్సిన వాళ్ళే! పొరపాటు చేశాను. నిన్ను నిందించాను. తప్పయిపోయింది. నన్ను క్షమించు.’’ తలొంచుకున్నాడు చిత్రవర్ణుడు.

‘‘మహారాజా’’ వారించాడు దీర్ఘదర్శి.‘‘యుద్ధం ముగిసిపోయింది. మనం ఓడిపోయామనుకుంటున్నారు శత్రుసేన. నాకు తెలిసీ యుద్ధం ముగిసిపోలేదు. ఇంకా ఉంది. మనం ఓడిపోయి, వింధ్యపర్వతానికి తిరుగుముఖం పట్టలేదు. ఇక్కడే ఉన్నాం. యుద్ధంలోనే ఉన్నాం. నీ సారధ్యంలో యుద్ధం చేద్దాం. నువ్వే సేనాపతివి.’’ అన్నాడు చిత్రసేనుడు.‘‘మహారాజా’’ దీర్ఘదర్శి గొంతు బొంగురుపోయింది. కృతజ్ఞత గా కళ్ళు మూసుకున్నాడతను. రాజు తనని నిందించడం, తను యుద్ధాన్ని పట్టించుకోకపోవడం...అన్నీ అతనికి గుర్తొచ్చాయి. తప్పు చేశాననిపించింది. తన కోపానికి ఇంత మంది బలయిపోయారా? ఎంత దారుణం అనుకున్నాడు. తన కోపమే శత్రువు అనుకున్నాడు. కోపాన్ని మానుకున్నాడు. కళ్ళు తెరిచి ఇలా అన్నాడు రాజుతో.

‘‘అయిందేదో అయింది మహారాజా! మనకి జరిగింది తీవ్రనష్టమే! అయినా దిగులు పడనవసరం లేదు.ఉన్న సైన్యంతోనే యుద్ధం చేద్దాం. గెలుపు మనదే! ఇలాంటి యుద్ధాలు ఇంతకు మునుపు మనం చాలా చూశాం. ఓడిపోయామనుకున్నాం. గెలిచామా? లేదా? అలాగే ఇదీనూ. ఇక మన ముందు ఎవరూ నిలువలేరు. చూడండి మీరే!’’దీర్ఘదర్శి నాయకత్వంలో సైన్యం ముందుకురికింది. హిరణ్యగర్భుని కోటను ముట్టడించేందుకు వారు ప్రయత్నాలు ప్రారంభించారు. గూఢచారి ధవళాంగుడు ఈ విషయాన్ని పసిగట్టాడు. వార్తను చల్లగా హిరణ్యగర్భుని చెవిలో ఊదాడు.‘‘ముందు సర ్వజ్ఞుని పిలవండి.’’ ఆజ్ఞాపించాడు రాజు.హాజరయ్యాడు సర్వజ్ఞుడు.

‘‘శత్రువులు మన కోటను ముట్టడించబోతున్నారట!’’ చెప్పాడు రాజు.‘‘భయపడకండి మహారాజా! ఏం కాదు. ముందు మీరేం చెయ్యాలంటే...’’‘‘చెప్పు, ఏం చెయ్యాలి?’’‘‘మన సైన్యంలోని మహావీరుల్ని పిలిచి, నిన్నటి యుద్ధంలో వారి జయాల్ని కీర్తించండి. గొప్పవారంటూ వారి భుజాల్ని తట్టండి. మహావీరులకు జీతభత్యాలకంటే రాజుగారి మెప్పే కోట్లతో సమానం. అందుకుని పొంగిపోతారు వారు. నేటి యుద్ధంలో ప్రాణాలొడ్డి మరీ పోరాడుతారు.’’ చెప్పాడు సర్వజ్ఞుడు.‘‘తప్పకుండా అలాగే చేద్దాం. వీరుల్ని పిలిపించండి.’’ అన్నాడు హిరణ్యగర్భుడు.

అంతలో అక్కడికి ఎగిరొచ్చి వాలాడు నీలవర్ణుడు. మహారాజుకి ముందు నమస్కరించి, తర్వాత ఇలా అన్నాడు.‘‘శత్రుమూకలు మన కోటను చుట్టుముట్టాయి మహారాజా! మనమేమో కోటలో ఉన్నాం. శత్రువులు కోట ద్వారాలను మూసేసి, మనల్ని నిరోధిస్తే చేయగలిగిందేమీ లేదు. అందుకని, అనుమతించండి! నేను ఆ శత్రుమూకను చీల్చి చెండాడి వస్తాను.’’హిరణ్యగర్భుడికి ఏం మాట్లాడాలో తోచలేదు. సర్వజ్ఞుణ్ణి చూశాడతను. అదే అవకాశంగా నీలవర్ణుని నిందించాడు సర్వజ్ఞుడు.‘‘చాల్చాలు! నువ్వెంతో నీ బలం ఎంతో అందరికీ తెలుసు. మాట్లాడకు! ఊర్కో! అసలు నీ వల్లనే ఈ యుద్ధం వచ్చింది. యుద్ధం యుద్ధం అంటూ ఓ తెగ గోల చేశావు. వచ్చింది. ఏమయిందిప్పుడు? నీతో పాటు మేమూ ముప్పును ఎదుర్కొంటున్నాం. నీలాంటి వాళ్ళంతా మాటల వరకే! చేతలకి పనికి రారు.’’ఊహించని పరిస్థితి. నీలవర్ణునికి నోటంట మాట రాలేదు. సర్వజ్ఞుణ్ణి చూడసాగాడతను.

Responsive Footer with Logo and Social Media