పిల్లి-ఎలుక



గుడ్లగూబలన్నీ గుహలో ఉన్నాయి. మాంఛి నిద్రలో ఉన్నాయి. అదే అదనుగా చిరంజీవి బయటకు వచ్చాడు. పేడను పోగు చేసి, గుహ ద్వారానికి దాన్ని గట్టిగా పట్టించాడు. గాలి కూడా చొరబడలేదు. కావాల్సింది అదే అనుకున్నాడు. సన్నగా నవ్వుకున్నాడు. బయల్దేరాడక్కణ్ణుంచి. ఎగురుకుంటూ వెళ్ళి ఋష్యమూకపర్వతానికి చేరుకున్నాడు. తోటి కాకులన్నీ చిరంజీవిని చుట్టుముట్టాయి. వాటితో పాటుగా రాజును కలుసుకున్నాడు చిరంజీవి. నమస్కరించాడతనికి.‘రాజా! ఆనాడు మీకు నేను చెప్పినట్టే ఉపమర్దనుడి కొలువులో చేరాను. కష్టపడి వాణ్ణి బాగా నమ్మించాను. వాడు నమ్మాడుగాని, వాడి మంత్రులు నన్ను నమ్మలేదు. నన్ను క్షణక్షణం బాధించారు. చంపాలని చూశారు. అన్నీ తట్టుకున్నాను. తిండి కూడా పెట్టలేదు. అయినా ఓర్చుకున్నాను. రాజుని బుట్టలో వేశాను. వీళ్ళెంత? కొన్నాళ్ళు పోతే వీళ్ళే కాళ్ళ బేరానికి వస్తారనుకున్నాను.’‘అద్గదీ, తర్వాత?’ ఉత్సాహపడ్డాయి తోటి కాకులు. గుడ్లగూబల మీద కసిగా ఉంది వాటికి. వాటిని వారించాడు రాజు.‘నువ్వు చెప్పు’ అన్నాడు చిరంజీవితో.

‘మంత్రులెంత చెప్పినా రాజు వారి మాట వినలేదు. నన్ను దూరం చేసుకోలేదు. అదే అవకాశంగా రోజులు నెట్టుకొచ్చాను. ఇన్నాళ్ళకి ముహూర్తం కుదిరింది. గుడ్లగూబలన్నీ గుహలో పడుకున్నాయి. ఇదే సమయం అనుకుని, బయటికి వచ్చాను. పేడని పోగు చేశాను. గుహకి దానిని బాగా పట్టించాను. ఈపాటికి అది ఎండకి ఎండి పిడకలా తయారయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే...’’‘‘ఏం చెయ్యాలి?’’ అడిగాయి కాకులు. తొందరపడసాగాయి.‘‘కాలుతోన్న కట్టె పుల్లల్ని తలా ఒకటి ముక్కున కరచి పట్టుకుని గుహ దగ్గరకి వెళ్దాం. గుహ ద్వారం దగ్గర వాటిని పడేద్దాం. ఎండిన పిడక, ఆ అగ్నికి రాజుకుంటుంది. పొగల్నీ, సెగ ల్నీ విరజిమ్ముతుంది. గుహలోని గూబలకు ఊపిరాడదు. తప్పించుకునే వీలుకూడా లేదు. దాంతో గుడ్లగూబలన్నీ ఛస్తాయి. అనుమానం లేదు. పదండి.’’ అన్నాడు చిరంజీవి.‘‘మంచి తరుణం. పదండి.’’ అన్నాడు రాజు.

కాకులన్నీ ఉత్సాహంగా బయల్దేరాయి. ఒక చోట చలిమంట కనిపించింది. అక్కడి కట్టె పుల్లల్ని తలొకటీ ముక్కున కరచి ఎగిరాయి. గుడ్లగూబలు ఉన్న గుహను చేరాయి. మండుతోన్న కట్టె పుల్లల్ని అక్కడ పడేశాయి. పేడపిడక అంటుకుంది. పొగలు లేచాయి. మంటలు కూడా చెలరేగాయి. తప్పించుకునే అవకాశం లేకపోవడంతో గుహలోని గుడ్లగూబలన్నీ కాలి మసి అయిపోయాయి.’’ కథను ముగించాడు సర్వజ్ఞుడు. హిరణ్యగర్భుణ్ణి చూశాడు. ఆలోచిస్తున్నాడతను.‘‘మహారాజా! ఈ కథ ఎందుకు చెప్పానంటే...తెలియని వాళ్ళని ఎన్నడూ చేరదీయకూడదు. చేరదీస్తే ప్రమాదం తప్పదు. శత్రువులెప్పుడూ తీయగానే మాట్లాడతారు. ఆ తీపిదనానికి అలవాటు పడ్డామో, ప్రాణాలు పోతాయి.’’‘అంతేనంటావా?’ అన్నట్టుగా సర్వజ్ఞుణ్ణి చూశాడు హిరణ్యగర్భుడు.

‘‘నమ్మవద్దు మహారాజా! నీలవర్ణుని తేనె పలుకులు నమ్మవద్దు. నీలవర్ణుడు తెలివయిన వాడు. యుద్ధ సమయంలో పనికి వస్తాడనుకుంటున్నావు. ఏమీ పనికి రాడు. పైగా ఆపాయాన్ని కలిగిస్తాడు. నువ్వు విన్నా వినకపోయినా మంత్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం.’’ అన్నాడు సర్వజ్ఞుడు. అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు.‘‘నిజానిజాలు గ్రహిస్తే తక్షణం నీలవర్ణుణ్ణి ఇక్కణ్ణుంచి పంపించేయండి. పీడా విరగడవుతుంది.’’ఆ మాటకి సన్నగా నవ్వాడు హిరణ్యగర్భుడు. ఇలా అన్నాడు.‘‘నీ మాటల్ని నేను కాదనను. నువ్వంతా మన మంచికే చెప్పావు. అయితే కొత్తవాళ్ళందరూ శత్రువులనుకుంటే ఎలా? వాళ్ళలో కూడ నమ్మదగ్గ వారుంటారు. ఉండరనుకోవడం పొరపాటు. నీలవర్ణుణ్ణే తీసుకుందాం. ఇంతవరకూ అతను మనకు ఎలాంటి అపకారాన్నీ తలపెట్టలేదు. గుణాలను బట్టి చూడాలిగాని, జాతిని బట్టి ఫలానా వాడు దుర్మార్గుడు, శత్రువనుకుంటే ఎలా? మనవాళ్ళు మనకి కీడు తలపెట్టరా, చెప్పు. మనవాళ్ళంతా మంచివాళ్ళంటావా? ఒకొక్కసారి పరాయివాడే మనకెంతో మేలు చేస్తాడు.’’ అన్నాడు హిరణ్యగర్భుడు.దీర్ఘముఖుడూ, సర్వజ్ఞుడూ ఒకరినొకరు చూసుకున్నారు. వారికి రాజు అర్థంగాకుండా ఉన్నాడు.‘‘శరీరానికి అంతు చిక్కని వ్యాధి వస్తుంది. శరీరం మనదే! కాని, మందు అడవిచెట్టులో లభిస్తుంది. అర్థమయిందా? అలాగే నీలవర్ణుడు మందులాంటి వాడు. వాణ్ణి ఇక్కణ్ణుంచి పంపేసినా, లేదంటే వాణ్ణి చంపేసినా ప్రయోజనం లేదు. మనం యుద్ధం చేయబోతున్నాం. బలమైన శత్రువుని ఎదుర్కొబోతున్నాం. గెలవాలంటే సాయం చేసే వారందర్నీ వెంటబెట్టుకుని పోవాల్సిందే! వారిని అనుమానించకూడదు.’’ అన్నాడు హిరణ్యగర్భుడు.‘‘అది కాదు మహారాజా...’’ అని ఏదో చెప్పబోతుంటే మధ్యలోనే అడ్డొచ్చాడు హిరణ్యగర్భుడు. సర్వజ్ఞునితో ఇలా అన్నాడు.

‘‘నీలవర్ణుణ్ణి మనం నమ్మవద్దు. నమ్మినట్టుగా నటిద్దాం. పని పూర్తి కాగానే వదిలించుకుందాం. ముల్లుని ముల్లుతో తీసి, రెంటినీ ఒకేసారి పారేద్దాం. నీలవర్ణుని సాయంతో శత్రువు ఆనుపానులు తెలుసుకుని, యుద్ధం కాగానే నీలవర్ణుని కూరలో కరవేపాకులా తీసి విసిరేద్దాం.’’‘‘మహారాజా’’ మెచ్చుకోలుగా చూశాడు సర్వజ్ఞుడు.‘‘పూర్వం ఒక ఎలుక, అవ సరార్ధం ఓ పిల్లితో స్నేహం చేసి, పని కాగానే దాని మానాన దాన్నొదిలేసిన కథ ఒకటి ఉంది. వింటారా?’’ అడిగాడు హిరణ్యగర్భుడు.‘‘ఓ’’ అన్నారు, దీర్ఘముఖుడూ, సర్వజ్ఞుడూ.చెప్పసాగాడు హిరణ్యగర్భుడు.

‘‘పంచవటి సమీపంలో ఓ మర్రిచెట్టు ఉంది. దాని తొర్రలో ఓ పిల్లి నివసిస్తూ ఉండేది. దాని పేరు రోమశుడు. ఆ చెట్టు కిందనే ఓ కలుగులో ఓ ఎలుక ఉండేది. దాని పేరు పలితుడు.ఓ రోజు రాత్రి ఓ బోయవాడు వచ్చి, మర్రిచెట్టు చుట్టూ వల పన్ని వెళ్ళాడు. తెల్లారుతూనే తొర్రలోంచి తల బయటికి పెట్టి చూసింది పిల్లి. చీకటి ఇంకా చిక్కగానే ఉంది. అయినా తొందరపడి ంది. బయటపడింది. బయటపడడమే ఆలస్యం, వలలో చిక్కుకుంది. ‘కుయ్యో మొర్రో’మంది. దాని మూలుగులకి ఎలుక మేల్కొని, కలుగులోంచి బయటికి వచ్చి చూసింది. వలలో విలవిలలాడుతోన్న పిల్లిని చూసి, ఆనందించింది. పీడా విరగడయింది అనుకుంది. హాయిగా, నిర్భయంగా తిరగసాగింది. అంతలో ఓ గుడ్లగూబ వచ్చిందక్కడకి. తిరుగుతోన్న ఎలుకని చూసి నాలిక చప్పరించింది. ఎలుక అది గమనించింది. గమనించి, ముచ్చెమటలు పట్టి, వణికిపోయింది.

దేవుడు ఆడుకుంటున్నాడు తనతో. క్షణం క్రితం పిల్లిని వలలో చూపించి, సంతోషించమని చెప్పి, అంతలోనే చెట్టు మీద గుడ్లగూబని చూపించి, భయపెడుతున్నాడు. దయలేదు దేవుడికి అనుకుంది ఎలుక. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవాలనుకుంది. ఆలోచించింది. ఆలోచించాలోచించి, పిల్లితో స్నేహం చేస్తే గుడ్లగూబ తన జోలికి రాదని, తన ప్రాణానికి హాని ఉండదని తలచింది. పిల్లిని పలకరించింది.

‘పిల్లిబావా, బాగున్నావా?’‘ఏం బాగు? చూశావుగా’‘అదే బాధగా ఉంది. ఒకే చెట్టు కింద ఇద్దరం అన్నదమ్ముల్లా బతికాం. ఏనాడూ నా వల్ల నీకుగాని, నీ వల్ల నాకుగాని ఏ ఇబ్బందీ రాలేదు. హాయిగా ఉందనుకుంటే ఇప్పుడీ విపరీతం చూడాల్సి వచ్చింది. నిన్ను చూస్తోంటే గుండె తరక్కుపోతోంది.’ అంది ఎలుక.కన్నీళ్ళతో చూసింది పిల్లి.‘నిన్ను విడిపించాలి. నిన్ను ఈ వలలోంచి విడిపిస్తే తప్పా నా మనసు కుదుటపడదనుకున్నాను. ఆ మాట అనుకున్నానో లేదో చూడక్కడ గుడ్లగూబ ఎలా వచ్చి, వాలిందో! నిన్ను చూసి ఆగింది కాని, లేకపోతే నన్నెప్పుడో గుటుక్కున మింగేసేదే!’ అంది ఎలుక.అతిప్రయత్నం మీద తల తిప్పి చూసింది పిల్లి. నిజమే! ఇంతింత గుడ్లేసుకుని, గుడ్లగూబ ఎలుక కోసం కాచుక్కూర్చుని ఉంది.‘నాతో స్నేహం చేస్తావా, చెప్పు! నిన్నీ వలలోంచి బయట పడేస్తాను. నేను నిన్ను రక్షిస్తున్నాను కాబట్టి, నన్ను నువ్వు రక్షించాలి, నన్ను చంపకూడదు.’ అంది ఎలుక.

‘ఎందుకు చంపుతాను చెప్పు? నేనంత బుద్ధిహీనురాలినా? నీకో సంగతి తెలుసా? నాకెప్పుడూ నీతో స్నేహం చెయ్యాలనే ఉంటుంది. నిన్ను చూస్తే చాలు, కోటిమంది బంధువుల్ని చూసినట్టుగా ఉంటుంది.’ అంది పిల్లి.ఆశ్చర్యపోయింది ఎలుక.

‘నన్నీ వలలోంచి తప్పించి నువ్వు ఉపకారం చేస్తున్నావు. ఉపకారికి అపకారం చెయ్యొచ్చునా? తప్పు కాదూ! మాటిస్తున్నాను, నిన్ను చంపను గాక చంపను. పైగా నిన్నా గుడ్లగూబ చంపడానికి వస్తే నేనడ్డుకుంటాను. సరేనా!’ అంది పిల్లి.అనుమానంగా చూసింది ఎలుక.‘కాటికి కాళ్ళు జాచి కూర్చున్నాను. ముసలిదాన్ని. మాటంటే మాటే! నా మాట నమ్ము. ధర్మకార్యాలంటే నాకు చాలా ఇష్టం. బతికినంత కాలం మంచి చెయ్యాలన్నదే నా ధ్యేయం. నిన్ను ఆ దేవుడే పంపించాడు. నన్ను కాపాడు. నేను నిన్ను కాపాడతాను.’ అంది పిల్లి.‘వల కొరికి నన్ను రక్షించు మిత్రమా! నీకు వేయి దణ్ణాలు’ అంది మళ్ళీ.తప్పదిక పిల్లిని కాపాడాల్సిందేననుకుని, వల కొరికేందుకు సిద్ధమయింది ఎలుక. పిల్లికి మరి దగ్గరగా జరిగింది. జరిగిందన్న మాటేగాని, తన జాగ్రత్తలో తానుంది. ఎప్పుడయితే పిల్లి-ఎలుకా దగ్గరయ్యాయో అప్పుడిక తన పప్పులు ఉడకవని అక్కణ్ణుంచి ఎగిరిపోయింది గుడ్లగూబ. పిల్లి అంటే గుడ్లగూబకు చచ్చేంత భయం మరి!

Responsive Footer with Logo and Social Media