పిట్టపోరు-పిల్లితీర్పు



పూర్వం వింధ్యపర్వతం మీద ఓ చెట్టుతొర్రలో ఓ పక్షి నివసిస్తూ ఉండేది. దాని పేరు కపింజలం. అది ఆహారాన్ని వెతుక్కుంటూ పొద్దునే బయల్దేరి, సాయంత్రానికి గూటికి చేరుకునేది. ఎప్పటిలాగానే ఒకరోజు పొద్దునే బయల్దేరింది. సాయంత్రం అవుతోంది. గూటికి చేరే ప్రయత్నంలో వేగంగా ఎగురుతూ వస్తోంది. అంతలో వర్షం పట్టుకుంది. కుండపోతగా కురవసాగింది. వర్షానికి బాగా తడిసిపోయింది పక్షి. ఎగరడం కష్టం అనుకుంది. ఓ చెట్టుకొమ్మన కూర్చుంది.వర్షానికి తడుస్తూ పరుగు పరుగున వింధ్యపర్వతం మీది చెట్టు దగ్గరకు వచ్చింది ఓ కుందేలు. దాని పేరు దీర్ఘకర్ణుడు. చెట్టుతొర్రను గమనించింది. ఖాళీగా ఉందది. అదృష్టం అనుకుంది. తొర్రలోకి దూకి, వర్షం నుంచి తప్పించుకుని, వెచ్చగా హాయిగా పడుకుంది. చీకటి చీకటి వేళ గూటికి చేరుకుంది పక్షి. తొర్రలోకి ఆత్రంగా చేరుదామనుకుంటే అడ్డంగా కుందేలు కనిపించింది. చిర్రెత్తుకొచ్చింది పక్షికి. పొడిచి పొడిచి లేపింది దాన్ని.‘ఎవరూ’ అంటూ లేచింది కుందేలు.

‘నా ఇంట పడుకుని, నన్నెవరంటావేంటే! లే!వెళ్ళిక్కణ్ణుంచి. చూడెలా పడుకుందో మహరాజులా.’ కోపగించుకుంది పక్షి.‘నేను వెళ్ళను. ఏం చేస్తావు?’’‘చంపేస్తాను, నన్ను తక్కువగా అంచనా వెయ్యకు.’ అంది పక్షి.‘అది నీ వల్ల కాదుగాని, ముందో విషయం తెలుసుకో! బావులూ, చెరువులూ, చెట్టుతొర్రలూ ఎవరు ముందు ఆక్రమించుకుంటే వారికే చెందుతాయి. నేను నీ కంటే ముందొచ్చాను కాబటి ్ట ఇది నాది. కాదంటావా, దిక్కున్న చోటుకి వెళ్ళి చెప్పుకో, పో’ అంది కుందేలు.ఎక్కడికి పోతుంది తను? ఈ వర్షంలో ఎక్కడికి పోయి తల దాచుకుంటుంది? అందుకుని, నోరు తగ్గించుకుంది. ఇలా అంది.‘ఈ రాత్రివేళ తగవు ఎందుకు కాని, నేనూ నీతో పాటే ఇక్కడే ఉంటాను. తెల్లారనీ, తగవు తీర్చుకుందాం.’ అంది పక్షి.‘అలా అన్నావు, బాగుంది.’ అంది కుందేలు.

నిద్రపోయింది. బాగా అలసిపోయి ఉందేమో! పక్షి కూడా పడుకుంది. తెల్లారిందో లేదో లేచింది పక్షి.‘లేలే! పద, తగవు తీర్చుకుందాం.’ అని తొందర చేసింది.‘తగవు ఎవరు తీరుస్తారు?’ అడిగింది కుందేలు.‘ఎవరు తీరుస్తారంటే నర్మదానది ఒడ్డున ఓ ముసలిపిల్లి ఉంది. దాని పేరు దధికర్ణుడు. వ్యవహారజ్ఞానంలో దానికి ఉన్నంత పేరు మరెవరికీ లేదు. అలాగే అనుభం కూడా ఎక్కువ. దాని దగ్గరి పోదాం, అదే చెబుతుంది, తీర్పు’ అన్నది పక్షి.‘సరే’నంది కుందేలు.రెండూ పిల్లి దగ్గరకి వచ్చాయి. తగవు అంతా పూసగుచ్చినట్టుగా చెప్పాయి.‘పెద్దదానివి, సరైన తీర్పు నువ్వే చెప్పాలి.’ బ్రతిమలాడాయి.ముసలిపిల్లి చాటుగా నవ్వుకుంది. అదృష్టం అంటే తనదేననుకుంది. కాలు కదపకుండానే కావాల్సిన ఆహారం వెతుక్కుంటూ రావడం గతజన్మలో చేసిన పుణ్యం అనుకుంది. రెంటినీ చంపి తినాలని ఆలోచన చేసింది. ఇలా అంది.

‘మీరిందాకటి నుంచీ ఏదో చెబుతున్నారుగాని, నాకేదీ వినిపించడం లేదు. ముసలిదాన్నయిపోయాను కదా, చెవులు పని చేయడం లేదు. అందుకని, ఓ పని చేయండి. మీరిద్దరూ నా దగ్గరగా వచ్చి, నా చెవుల్లో నోరు పెట్టి, గట్టిగా అరిచి చెప్పండి. వింటాను. అప్పుడు మీ గొడవేమిటో ముందు అర్థమవుతుంది.దగ్గరకు వెళ్ళాలి. చెవుల్లో నోరు పెట్టి చెప్పాలి. ప్రమాదమేమీ ఉండదు కదా! అనుకున్నాయి. కుందేలూ, పక్షీ. ఉండదుండదు అనుకున్నాయి అంతలోనే!‘ఏంటాలోచిస్తున్నారు? తొందరగా చెప్పండి. నాకవతల చాలా పనులున్నాయి.’ అంది పిల్లి. తొందర చేసింది వాటిని. తప్పదనుకున్నాయి కుందేలూ, పక్షీ. పిల్లి రెండు చెవుల దగ్గరికీ రెండూ చేరాయి. చెవుల దగ్గర నోరు పెట్టి మాట్లాడబోయాయి. అంతే! చటుక్కున కాళ్ళతో నొక్కి పెట్టి, మెడలు కొరికీ రెంటినీ చంపేసింది పిల్లి. రెండు మూడు రోజుల పాటు వాటిని దాచుకుని, తృప్తిగా తింది.ఒకరిని నమ్మాలన్నా, సన్మానించాలన్నా దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని కాదనుకుని ముందుకి అడుగు వేస్తే ప్రమాదాల పాలవుతాం. ఈ మాట ఎందుకంటున్నానంటే...మేఘవర్ణుణ్ణి అర్హతకు మించి సన్మానిస్తే మనకి మంచి కన్నా చెడు జరిగే అవకాశమే హెచ్చు. ఆలోచించండి.’ అన్నాడు దూరదర్శి.

చిత్రవర్ణుడు కళ్ళు మూసుకున్నాడు కాసేపు. దీర్ఘంగా ఆలోచించాడు. తర్వాత ఇలా అన్నాడు.‘దూరదర్శీ! నీ మాట నేను కాదనను. నువ్వు చెప్పినట్టే చేద్దాం. మేఘవర్ణుణ్ణి మరోలా అభినందిద్దాం. అయితే దానికి ముందో పని చేద్దాం. మేఘవర్ణుణ్ణి కర్పూరద్వీపానికి మరోసారి పంపుదాం. అక్కడ చూడచక్కని వస్తువులు, అపూర్వమయినవి చాలా ఉన్నాయి. అవన్నీ ఇక్కడకి తెప్పించుకుందాం. వాటిలో కొన్నిటిని మేఘవర్ణునికి బహుమతిగా ఇద్దాం. మిగిలిన వాటిలో కొన్నింటిని మన సేవకులకు కానుకలుగా అందజేద్దాం. ఇంకా మిగిలినవి, మంచివీ మనం ఉంచుకుందాం. కర్పూరద్వీపం మనకి సామంత రాజ్యం. ఇది, మన రాజ్యం. రెండు రాజ్యాలూ మనవే! మనకిక తిరుగులేదు. ఏమంటావు?’ఆ మాటలకి దూరదర్శి సన్నగా నవ్వాడు.‘మహారాజా! కలలు కనాలి కాని, మరీ రంగుల కలలు కనకూడదు. నాకెందుకో కుండను పగలగొట్టుకున్న బ్రాహ్మణుని కథ గుర్తుకొస్తోంది. వింటానంటే మీకా కథ చెబుతాను.’‘చెప్పు చెప్పు’ ఉత్సాహ పడ్డాడు చిత్రవర్ణుడు. కథ చెప్పసాగాడిలా దూరదర్శి.అయోధ్యానగరంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. పేరు దేవశర్మ. పౌరోహిత్యం చేసుకుని బతికేవాడతను. ఒకరోజు ఎవరింటనో శ్రాద్ధకర్మ నిర్వహించాడు. కుండడు పేలపిండి దానంగా లభించిందతనకి. అక్కడే మంచి భోజనం కూడా చేశాడు. భుక్తాయాసంతో బయల్దేరాడు. చంకన కుండను పెట్టుకున్నాడు.

నడుస్తోంటే నిద్రస్తోందతనికి. ఆపుకోలేకపోయాడు. అటూ ఇటూ చూసి, ఓ ఇంటి అరుగు మీద పడుకున్నాడు. పడుకునే ముందు అంగవస్త్రాన్ని చుట్టకుదురు చేసి, దాని మీద కుండను భద్రంగా ఉంచాడు. కర్ర కూడ పెట్టుకున్నాడు పక్కన. దొంగో, కుక్కో వచ్చి కుండను ముట్టుకునేందుకు ప్రయత్నిస్తే బెదిరించేందుకు కర్ర ఉండాలన్నది అతని ఆలోచన. నిద్రలోనికి జారుకున్నాడు. దేవశర్మ ఏ ఇంటి అరుగు మీద అయితే పడుకున్నాడో ఆ ఇల్లు ఓ కుమ్మరిది. ఆ కుమ్మరి తను తయారు చేసిన కుండల్ని అరుగు మీదే వరుసగా పేర్చి పెట్టుకున్నాడు. వాటి ముందే పడుకున్నాడిప్పుడు దేవశర్మ.

కలలు కనడం దేవశర్మకు బాగా అలవాటు. పడుకున్నాడంటే ఒకటే కలలతనికి. ఆలోచనలకు కూడా కొదవ ఉండదు.మంచి ధర పలికిన సమయంలో కుండలో పేలపిండిని అమ్ముతాను. ఆ డబ్బుతో ఓ మేకపిల్లను కొంటాను. కొన్నాళ్ళకది పెరిగి పెద్దదయి, పిల్లల్ని పెడుతుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దవయి, అవీ పిల్లల్ని పెడతాయి. కొంత కాలానికి తన దగ్గర మేకలు వందల్లో ఉంటాయి. ఆ మేకల్ని అమ్మేస్తాడు. ఓ వంద మంచి మేలు జాతి ఆవుల్ని కొంటాడు. ఆ వంద ఆవులూ మెల్ల మెల్లగా పెద్ద మందగా వృద్ధి చెందుతాయి. అప్పుడు పాల వ్యాపారం చేస్తాడు తను. ఆ వ్యాపారం మీద వచ్చిన డబ్బుతో పొలాలు కొంటాడు. వ్యవసాయం చేస్తాడు. కోటీశ్వరుడయిపోతాడు. డబ్బున్నవాడు కదా తను, అందుకని, మేమిస్తామంటే మేమిస్తామంటూ అంతా పిల్లనివ్వజూపుతారు. ఎంచెంచి గుణవంతురాల్నీ అందగత్తెనీ పెళ్ళి చేసుకుంటాడు తను. గుమ్మడిపండులాంటి కొడుకు పుడతాడు. వాడికి ‘సోమశర్మ’ అని తన తండ్రి పేరు పెడతాడు.

సోమశర్మ ఇల్లంతా కలియ తిరుగుతూ అల్లరి చేస్తాడు. వద్దురా అంటే వినడు. దాంతో కోపం వస్తుంది. కోపం వచ్చి కర్రతో నాలుగు తగిలిస్తాడు.-కలలోనే ఉన్నాడు దేవశర్మ. పక్కన పెట్టుకున్న కర్ర అందుకున్నాడు. చుట్టకుదురు మీద ఉన్న కుండను కొడుకనుకుని నాలుగు తగిలించాడు. కుండ పగిలిపోయింది. పిండి మట్టిపాలయింది. ఇంకా కొడుతూనే ఉన్నాడు దేవశర్మ. ఆ దెబ్బలకి అరుగు మీద కుమ్మరి పేర్చుకున్న కుండలు కూడా పగిలిపోయాయి.కుండలు పగలగొడుతున్న శబ్దం వినరావడంతో ఇంటి లోపలి నుంచి కుమ్మరి పరుగున వచ్చి చూశాడు. దేవశర్మ నిర్వాకాన్ని గమనించాడు. నిద్రపోతున్న దేవశర్మని కసిరి, కొట్టి లేపాడు. నోటి కొచ్చినట్టల్లా తిట్టి పొమ్మన్నాడు.-కథ ముగించాడు దూరదర్శి. అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు.

‘మహారాజా! ముందెన్నడో జరగబోయే వాటి గురించి పగటికలలు కంటూ కూర్చుని, ప్రస్తుతం చేసుకోవాల్సిన పనుల్ని చెడగొట్టుకోవడం అవివేకుల పని. మనం అవివేకులం కాదని నా ఉద్దేశం.’నిజమే అనుకున్నాడు చిత్రవర్ణుడు.‘సరే మంత్రి! నువ్వు చెప్పినట్టుగానే ఎందుకయినా మంచిది, కర్పూరద్వీపానికి మేఘవర్ణుణ్ణి రాజుని చేసే యోచన మానుకుందాం.’ అన్నాడు.