పిచ్చి కోరిక

తెనాలి రామకృష్ణుడి కాలంలోనే – నెల్లూరు (అప్పుడు సింహపురం అనేవారు)లో ఒక వేశ్య ఉండేది. ఆమె సంస్కృతమూ, ఆంధ్రభాషా బాగా అభ్యసించడమే కాక అపరిమితమయిన దైవభక్తి కలిగి ఉండేది. ఎందరో పండితులను తన ఇంటికి ఆహ్వానించి పురాణములు చెప్పించుకొనుచూ గోష్టులతోనూ(పండితులు) కాలం గడుపుతూండేది.

ప్రత్యక్షపురాణమంటే ఆమెకెంతో ప్రీతి. ప్రత్యక్షపురాణమంటే – కేవలమూ నోటితో పురాణం జెప్పడం కాకుండా ఆ సన్నవేశాలలోని ప్రతిపాత్రా తానయి నటనతో సహా చేసి చూపిస్తూ పురాణం చెప్పడం. అలా అయితే ఆ సంఘటనలు కళ్లకి కట్టినట్లుంటాయని.

ఎందరు పండితులు ఎంత చక్కగా చెప్పినా ఆ వేశ్యకు నచ్చలేదు. ఇది తెలిసిన రామకృష్ణుడు ప్రభువయిన శ్రీకృష్ణదేవరాయల అనుమతి పొంది, రాజభటుల సహాయంతో నెల్లూరు చేరుకుని తన రాకను ఆమెకు తెలిపాడు.

అప్పటికే రామకృష్ణుని గురించి కొంత విని ఉన్న ఆ వేశ్య ఎంతో సంతోషంతో ఆ రాత్రే పురాణపఠనానికి తగిన ఏర్పాట్లన్నీ చేయించి – రామకృష్ణునకు ఆహ్వానం పంపింది. అతను వచ్చి వేదిక మీద కూర్చొని – “ఏ ” మట్టం చెప్పేది?” అని అడిగాడు. “అయ్యా! వాల్మీకి రామాయణం సుందరకాండలో హనుమంతుడు సముద్రమును లంఘించి, లంకిణిని చంపి లంకాదహనం గావిస్తాడే.. అంత వరకూ తమరు ప్రత్యక్షపురాణం చెప్పగలరు! అందామె వినయంగానూ తన మనోభీష్టాన్ని తెలుపుతూను.

రామకృష్ణుడు మనసులో తన ఇష్ట దైవాలైన సీతారాములునూ ఆంజనేయుడినీ తలచుకున్నాడు. పురాణం ప్రారంభించాడు. హనుమంతుడు సముద్రం దాటి వెళ్లే ఘట్టం వచ్చింది కొద్దిసేపట్లోనే.

“హనుమంతుడు సముద్రాన్ని యిలా లంఘించాడు-” అంటూ వేదిక మీంచి వేశ్య పడకగదిలోకి ఒక్క గెంతు గెంతాడు. వేశ్య ఆశ్చర్యంగా చూసింది. “మైనాక పర్వతాన్నిఈ విధంగా ఎక్కాడు” అంటూ మంచం మీదకు ఎగిరాడు. అతనలా ఒక్కసారిగా గెంతేసరికి ఖరీదయిన పట్టెమంచం కాస్తా ‘ఫెళఫెళమని విరిగిపోయింది.

అది చూస్తున్న వేశ్య అయోమయంలో పడింది. “మైనాక పర్వతం మీంచి మళ్లీ ఇలా సముద్రాన్ని లంఘించాడు” అంటూ విరిగిన మంచం మీంచి – గదిలోని బల్లలొక్కొక్క దాని మీదకి – ఒక దాని మీంచొక దాని మీదకి గెంతసాగాడు. అతని గంతులకి అవి సర్వనాశనమయ్యాక “ఇలాగ ఆంజనేయుడు లంకలో ప్రవేశించాడు. అప్పుడు లంకిణి కనిపించింది” అని వేశ్య ముఖంలోకి చూస్తూ ఒక్కసారాగి.. ‘ఆ లంకిణీని ఇలా చావబాదాడు” అంటూ వేశ్య వీపుమీద రామకృష్ణుడు నాలుగు పిడిగుద్దులు గుద్దాడు.

వేశ్య ఆ దెబ్బలకు తట్టుకోలేక కుయ్యో మొర్రోమంటూ ఏడుస్తున్నా వినిపించుకోకుండానూ… తన నడుముకి చుట్టుకున్న వస్త్రాన్ని తోకలా తగిలించుకుని…. ఆ పిమ్మట ఈ తీరున.. లంకా దహనం గావించసాగాడు.” అంటూ తోకకి నిప్పంటించి ఆ గదిలో ఉన్న వస్త్రాలకి కర్రబీరువాలకీ, బల్లలకీ, మంచానికీ – దేనినీ- వదలకుండా అన్నిటికీ ఆ మంటనంటించాడు. నిముషంలో అవన్నీ ఒక్కెత్తున భగ్గుమంటూ మండసాగాయి.

గదినిండా మంటలు… వేడి… పాగలు… నానాభీభత్సమూ జరిగిపోతూంది. తెల్లబోయి చూస్తున్న వేశ్య – జరుగుతున్నది అర్ధమై – లబోదిబోమని ఏడుస్తూ వీధిలోకి పరుగెత్తింది. నలుగురినీ పిలిచి తనకి రామకృష్ణుడు కలగచేసిన నష్టాన్ని చెప్పుకుని ఏడ్చింది. వాళ్లు రామకృష్ణుణ్నిపట్టుకుని న్యాయం కోసం నగరాధికారులకు అప్పగించగా,

“ఇందులో నా తప్పేమీలేదు. ఎందరు పండితులు ఎంత చక్కగా పురాణం చెప్పినా ఈమెకు నచ్చలేదు. నన్ను ప్రత్యక్షపురాణం చెప్పమంది. హనుమంతుడు లంకాదహనం గావించిన ఘట్టం చెప్పమని ఆమే మరీ మరీ కోరింది..” అన్నాడు వేశ్యవేపు చూస్తూ. “నిజమే” అందామె మెల్లగా. “కాని… నేను… ప్రత్యక్షపురాణం చెప్పమన్నానే కాని సర్వనాశనం చేయమనలేదు”

“ప్రత్యక్ష పురాణమంటే ఊరికే చెప్పడం కాదు. చేసి చూబెట్టడం కూడా. మామూలు పురాణ పఠనానికీ ప్రత్యక్షపురాణానికీ అదే తేడా” అన్నాడు రామకృష్ణుడు”. ఆమె కోరిందే నేను నెరవేర్చాను. కోరరాని కోరిక కోరి అది తీరినందుకు విచారిస్తే ఎలా?”

అధికారులకి రామకృష్ణుడి మాటలలోనే సబబు కనిపించింది. “ఇక నుంచి అయినా పిచ్చి పిచ్చి కోరికలు కోరుకోకు. ఇంటిమీదకు తెచ్చుకోకు. తిన్నగా ఉండు-” అంటూ ఆమెనే చివాట్లు పెట్టి రామకృష్ణుడిని సగౌరవంగా సాగనంపారు.

Responsive Footer with Logo and Social Media