పెరిగిన వాతావరణం
ఒక అడవిలోని చెట్టుపై చిలుక జంట నివసిస్తుంది. వాటికి రెండు పిల్లలు కలిగాయి. ఒకరోజు చిలుకల జంట ఆహారం వేటలో వెళ్ళాయి. ఆ సమయంలో ఒక దొంగ వచ్చి చిలుకల పిల్లల్ని దొంగిలించి బుట్టలో పెట్టుకొని తీసుకొని పోయాడు. ఆ బుట్టకు రంధ్రం ఉంది. దారిలో ఒక చిలుక పిల్ల క్రింద పడిపోయింది. ఈ దృశ్యాన్ని ఒక యోగి చూసి దారిపై పడిఉన్న ఆ చిలుకను తీసుకుని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. దొంగ వద్ద ఒక చిలుక, యోగి వద్ద మరో చిలుక పెరిగింది. కొద్ది నెలల తరువాత వేటకు మహారాజు ఆ వైపు వచ్చాడు. మొదట దొంగ నివాసముంటున్న ఇంటి ప్రక్కగా మహారాజు గుర్రంపై వెళుతున్నాడు. దొంగ పెంచిన చిలుక మహారాజును చూసి అరవసాగింది.
“ఎవడో దొంగ వచ్చాడు! వాడిని కొట్టండి, బయటకు పంపేయండి” ఇలా ఆ చిలుక అరవ సాగింది. ఆ కేకలకు రాజు భయభ్రాంతుడై గుర్రాన్ని పరుగులు తీయించాడు. ఆ గుర్రం నేరుగా వెళ్ళి యోగి నివసిస్తున్న ఆశ్రమం వద్ద ఆగింది. అక్కడ యోగి పెంచుతున్న చిలుక మహారాజును చూసింది. “ఎవరో అతిథి వచ్చారు! ఆహ్వానించండి. మంచినీరు, ఫలాలు పట్టుకురండి. అతిథి సత్కారం చేయండి” అని ఆ చిలుక అన్నది. చిలుకల కథను యోగి ద్వారా మహారాజు తెలుసుకున్నాడు.
“రెండు చిలుక పిల్లలు ఒక తల్లి కడుపునే పుట్టాయి కదా, ఎందుకింత వ్యత్యాసం?” అని మహారాజు ప్రశ్నించాడు. “మహారాజా! రెండు చిలుకలు ఒక తల్లి కడుపునే పుట్టాయి. అయితే పెరిగిన వాతావరణంలో తేడా ఉంది. దొంగ వద్ద ఉన్న చిలుక పెరిగిన వాతావరణం వేరు, మా ఆశ్రమంలో చిలుక పెరిగిన వాతావరణం వేరు. పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళ స్వభావాలలో వ్యత్యాసం వచ్చింది” అని యోగి వివరించాడు.
నీతి కథలు : పెరిగిన వాతావరణాన్ని బట్టి బుద్ధుల్లో వ్యత్యాసం ఉంటుంది.