పెద్దల ఎన్నిక


కృష్ణాపురంలో రామయ్య సీతమ్మ అనే దంపతులుండేవారు. ఆ దంపతులకు ఒకమ్మాయి కలిగింది. ఆ అమ్మాయి పేరు కళ్యాణి ఆ అమ్మాయికి బాల్యం గడిచి యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేయాలనుకున్నారు కళ్యాణి అందచందాల్ని గుణగణాల్ని చూసి చాలామంది ఆ అమ్మాయిని పెళ్ళాడతామని ముందుకొచ్చారు. ఐతే తల్లితండ్రులు ఒక మంచి సంబంధం చూసి నిశ్చయించారు.
కళ్యాణికి ఆ నరుడు నచ్చలేదు.కళ్యాణి ఆలోచనలు ఊహాలోకాల్లో విహరిస్తున్నాయి. ఏదో ఒక గొప్పవాడిని చేసుకోవా అని ఆమె ఊహ. ఆ ప్రాంతంలో అందరిని మించినవాడు రాజు కదా! రాజునే పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఎవరన్నా అడిగితే నేను రాజునే పెళ్ళాడి రాణినవుతా అంటుండేది. అది విన్న నాళ్ళంతా ఫకాలున నవ్వి పోతుండేవారు. కానీ ఆమె రాజుని ఆరాధించడం మానలేదు.
ఒకరోజు దేశాన్నేలే రాజు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ రాజుకోసం కళ్యాణి ఎదురుచూస్తూ నిల్చుంది. అంతలో ఒక సన్యాసి వచ్చి రాజుకి ఎదురుపడగానే రాజు ఆయనకు సాష్టాంగపడి నమస్కరించాడు. అది చూసి కళ్యాణి రాజుకన్నా సన్యాసి గొప్పవాడిగా తలచి ఆయననే వలచి ఆ సన్యాసిని అనుసరించసాగింది. అలా వెళ్తున్న సన్యాసి దారి ప్రక్కగా వున్న శివలింగాన్ని ఛలవుష్వాలతో పూజించాడు. దాన్ని చూసిన ఆమె సన్యాసికన్నా శివుడే గొప్పవాడని తలచి ఆ శివలింగం ముందే కూర్చుని శివునికోసం తపస్సు ప్రారంభించింది.
కొద్దిసేపటి తర్వాత ఒక కుక్క వచ్చి శివలింగంపై మూత్రాన్ని వదిలి అపరిశుభ్రం చేసింది. అది చూసి ఆమె అందరికన్నా కుక్కయే గొప్పది అనుకుని కుక్కని అనుసరించింది. మరి కాసేపటికి ఆ కుక్క ఓ ఇంట్లోకి జొరబడుతుండగా ఓ పిల్లవాడు చూసి రాళ్లతోకొట్టి వెళ్ళ గొట్టాడు. ఇది చూసి వీధిలో వెళ్తున్న ఒక యువకుడు కుక్కని ఎందుకు కొట్టావ౦టూ పిల్లవాడ్ని కోపంగా దండించాడు. అది చూచిన కళ్యాణి ఆ యువకుని భూతదయ గమనించి ఎలాగైనా ఆ యువకుడ్నే పెళ్లి చేసుకోవాలని నిశ్రయించుకుంది.
ఆ యువకుడు ఎవరనుకున్నారు? మరెవరో కాదు కళ్యాణి తల్లిదండ్రులు ఆమెనిచ్చి పెళ్లి చేయటానికి నిశ్రయించినవాడే. కనుక అందని దానికోసం అర్రులు చాచడం కన్నా అందిన దానితో సంతృప్తి చెందడం మంచిది. అనుకున్న కళ్యాణి పెద్దలు దూరదృష్టితో నిర్ణయించిన యువకుడినే పిళ్లాడి సుఖభోగాలు అనుభవించింది జీవితాంతం!

Responsive Footer with Logo and Social Media