పెద్దరాణి - చిన్నరాణి



ఒక రాజుకు ఇద్దరు భార్యలు ఉండేవారు. పెద్దరాణికి తలమీద ఒక వెంట్రుక, చిన్నరాణికి రెండు వెంట్రుకలు ఉండేవి. పెద్దరాణి మంచి గుణాలు కలది, కానీ చిన్నరాణి చెడు గుణం కలదు. రాజు "నీ తలమీద ఒకే ఒక వెంట్రుక ఉంది, నువ్వు అందంగా లేవు. కనుక బయటకు వెళ్ళిపో" అంటూ పెద్దరాణిని కోట నుండి వెళ్ళగొట్టాడు.

అడవిలో ఒక ముసలమ్మ ఉందని ఆమె చెప్పినట్లు చేస్తే తలనిండా వెంట్రుకలు వస్తాయని పెద్దరాణికి ఎవరో చెప్పారు. పెద్దరాణి ఆమె వద్దకు బయలుదేరింది. దారిలో ఆమెకు మల్లెచెట్టు ఎదురు వచ్చింది. "నాకు నీళ్ళు పోస్తేనే దారి ఇస్తాను" అంది. పెద్దరాణి అలాగే చేసింది. చెట్టు దారిని ఇచ్చింది. పోగా పోగా ఒక చీమ ఎదురుపడింది. "నాకు పంచదార పెడితేనే నీకు దారి ఇస్తాను" అంది. పెద్దరాణి చీమకు పంచదార ఇచ్చింది. చీమ దారి ఇచ్చింది.

పెద్దరాణి ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఒక ఎద్దు ఎదురైంది. "నాకు గడ్డి వేస్తేనే దారి ఇస్తాను" అంది. రాణి గడ్డి వేసింది. ఎద్దు దారి ఇచ్చింది. మరికొంత దూరం వెళ్ళగానే దేవుడు అడ్డు వచ్చాడు. "నాకు కొబ్బరికాయ కొడితేనే దారి ఇస్తాను" అన్నాడు. పెద్దరాణి అలాగే చేసింది. దేవుడు దారి ఇచ్చాడు. రాణి ముందుకు సాగింది.

చివరకు పెద్దరాణి ముసలమ్మ ఇంటికి చేరింది. అక్కడ ఒక చెరువు ఉంది. ముసలమ్మ పెద్దరాణితో "చెరువులో మూడుసార్లు మునుగు తలనిండా వెంట్రుకలు వస్తాయి" అంది. రాణి అలాగే మునిగింది. ఆమెకు తలనిండా అందంగా వెంట్రుకలు వచ్చాయి. చాలాసంతోషంగా ఇంటికి బయలుదేరింది. దారిలో దేవుడు ఎదురయ్యాడు. "నీకు కొత్తచీర కావాలా? పాతచీర కావాలా?" అని అడిగాడు. "పాతచీర కావాలి" అంది రాణి. దేవుడు ఆమెకు కొత్తచీర ఇచ్చాడు. రాణి ఇంకా ముందుకు రాగా ఎద్దు కలిసింది. "నీకు బంగారు నగలు కావాలా? వెండి నగలు కావాలా?" అని అడిగింది. "వెండి నగలు కావాలి" అని చెప్పింది రాణి. ఎద్దు ఆమెకు చాలా బంగారు నగలను ఇచ్చింది. రాణి ముందుకు సాగింది. ఇంకొంత దూరం వెళ్ళేసరికి చీమ ఎదురైంది. "నీకు పాయసం కావాలా? అన్నం కావాలా?" అని అడిగింది. పెద్దరాణి "అన్నం కావాలి" అంది. చీమ పాయసం ఇచ్చింది. రాణి కడుపునిండా పాయసం త్రాగి బయలుదేరింది.

మరికొంత దూరం వెళ్ళేసరికి మల్లెచెట్టు ఎదురొచ్చింది. "నీకు మల్లెపువ్వులు కావాలా? ఆకులు కావాలా?" అని అడిగింది. "ఆకులే కావాలి" అంది పెద్దరాణి. మల్లెచెట్టు ఆమె తలనిండా మల్లెపూలు పెట్టింది.

రాణి సంతోషంతో రాజు దగ్గరకు వెళ్ళింది. కొత్తచీర, నగలు, తలనిండా వెంట్రుకలతో చాలా అందంగా ఉన్న పెద్దరాణిని చూసి రాజు ఆనందపడి ఆమెను లోనికి రానిచ్చాడు. చిన్నరాణిని వెళ్ళగొట్టాడు. పెద్దరాణి ద్వారా జరిగిన విషయాలు తెలుసుకున్న చిన్నరాణి ముసలమ్మ వద్దకు బయలుదేరింది.

దారిలో ఆమెకు మల్లెచెట్టు ఎదురైంది. "నాకు నీళ్ళు పోస్తేనే దారి ఇస్తాను" అంది. అందుకు చిన్నరాణి "నేను రాజుగారి భార్యను. నీకు నీళ్ళు పోయను పో" అంటూ ప్రక్కనుండి వెళ్ళింది. ఇంకొంత దూరం వెళ్ళగానే చీమ ఎదురై "నాకు పంచదార పెడితేనే దారి ఇస్తాను" అంది. "నేను రాజు భార్యను నీకు పంచదార పెట్టను పో" అంటూ చిన్నరాణి ముందుకు నడిచింది. మరి కొంతదూరం వెళ్ళాక ఎద్దు ఎదురైంది. "నాకు గడ్డివేస్తేనే నీకు దారి ఇస్తాను" అంది. అందుకు చిన్నరాణి "నేను రాజు భార్యను. నీకు గడ్డి వేయను పో" అంది. చివరికి దేవుడు ఎదురయ్యాడు. "నాకు కొబ్బరికాయ కొడితేనే దారి ఇస్తాను" అన్నాడు. "నేను రాజు భార్యను. నీకు కొబ్బరికాయ కొట్టను" అంటూ ముందుకు వెళ్ళింది.

ఆఖరికి చిన్నరాణి ముసలమ్మ ఇంటికి చేరుకుంది. "చెరువులో మూడుసార్లు మునుగు తలనిండా అందంగా వెంట్రుకలు వస్తాయి" అంది ముసలమ్మ. చిన్నరాణి అలా కాకుండా నాలుగుసార్లు మునిగింది. దాంతో ఆమెకు కొత్త వెంట్రుకలు రాకపోగా ఉన్న రెండు వెంట్రుకలు కూడా ఊడిపోయి బోడిగుండు అయ్యింది.

ఏడుస్తూ ఇంటికి బయలుదేరింది. దారిలో దేవుడు కలిసి "కొత్తచీర కావాలా? పాతచీర కావాలా?" అన్నాడు. "కొత్తచీర కావాలి" అంది. దేవుడు పాతచీర ఇచ్చాడు. ఎద్దు ఎదురై "బంగారు నగలు కావాలా? వెండి నగలు కావాలా?" అని అడిగింది. రాణి "బంగారు నగలు కావాలి" అంది. ఎద్దు వెండి నగలు ఇచ్చింది. చీమ ఎదురై "పాయసం కావాలా? అన్నం కావాలా?" అని అడిగింది. "పాయసం కావాలి" అంది రాణి. చీమ అన్నం ఇచ్చింది. మల్లెచెట్టు ఎదురై "పువ్వులు కావాలా? ఆకులు కావాలా?" అని అడిగింది. రాణి "పువ్వులు కావాలి" అంది. మల్లె చెట్టు ఆమె తలనిండా ఆకులు పెట్టింది.

అలా చిన్నరాణి రాజు వద్దకు వెళ్ళింది. పిచ్చిదాని మాదిరిగా ఉన్న ఆమెను రాజు తిట్టి పంపించాడు. పెద్దరాణి రాజుతో సంతోషంగా జీవించింది.

Responsive Footer with Logo and Social Media