పరోపకారి హంస
ఒక అడవిలో ఒక హంస నివసించేది. అది చాలా పరోపకార బుద్ధి కలది. ఎప్పుడూ ఇతరులకు మేలు చేసేది. ఉత్తమ జాతి పక్షి అయిన హంసతో స్నేహం చేసి, తాను గొప్పలు చెప్పుకోవాలని ఒక కాకి దాని దగ్గరకు వచ్చింది. నమ్మకమైన మాటలు చెప్పి హంసతో స్నేహం చేసింది. మంచి బుద్ధికల హంస తెలియక చెడు బుద్ధికల కాకితో స్నేహం చేసింది. కాకి తన జాతి పక్షుల వద్దకు వెళ్ళి ఉత్తమ జాతి పక్షి అయిన హంస తన నేస్తమని గొప్పలు చెప్పుకోసాగింది. ఒకరోజు వేటగాడు వేటకు వచ్చాడు. ఆరోజు ఎంత తిరిగినా అతడికి పక్షులు దొరకలేదు. ఎండవేడికి అలసిపోయి ఒక చెట్టు క్రింద విశ్రమించి నిద్రపోయాడు. అతడి పరిస్థితి చూసి హంసకు జాలి కలిగింది. నిద్రపోతున్న వేటగాడికి హంస తన రెక్కలతో విసరడం ప్రారంభించింది. ఆ చల్లగాలికి వేటగాడు హాయిగా నిద్రపోయాడు.
ఇది చూసిన నీచబుద్ధికల కాకి “నీది ఎంత మంచి మనస్సు. కానీ మన ప్రాణాలు తీయాలని వచ్చిన వేటగాడికి నువ్వు సేవలు చేస్తున్నావు. ఇలాంటి నీచుడికి సేవ చేయడం నీకు సిగ్గు అనిపించడం లేదా?” అని ఎద్దేవా చేసింది. “ఇతరులు ఎటువంటి వారైనా మనకు చేతనైన సాయం చేయడం మంచి పనేకదా?” అన్నది హంస.
“నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో? ఇటువంటి నీచులకు బాగా సేవలు చేసుకో?” అంటూ కాకి వెక్కిరిస్తూ వేటగాడి మొహంపై పెద్ద రెట్ట వేసి వెళ్ళిపోయింది. నిద్రాభంగం అయిన వేటగాడికి పట్టరాని కోపం వచ్చింది. కళ్ళు తెరచి చూస్తే హంస కనిపించింది. ఈ హంసే తన మొహంపై రెట్ట వేసి ఉంటుందని అనుకొని వేటగాడు బాణంతో గురి చూసి హంసని కొట్టబోయాడు. కానీ ప్రమాదాన్ని వెంటనే గ్రహించిన హంస అక్కడి నుండి పైకి ఎగిరిపోయింది. చెడుబుద్ధికల కాకి చేసిన పనికి హంస ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
నీతి కథలు : చెడు బుద్ధి కలవారితో స్నేహం అనేది ఎప్పటికైనా ప్రమాదకరమే.