పాము మరియు బ్రాహ్మణుడు



ఒక నది ఒడ్డున పెద్ద పాము పుట్ట ఉంది. ఆ పాము ప్రతిరోజూ పుట్ట నుండి బయటకు వచ్చి సమీపాన ఉన్న చెరువులోని కప్పల్ని తినేది. కొన్నాళ్ళకు ఆ మడుగులోని కప్పలన్నీ అయిపోయాయి. ఆకలి బాధ పడలేక పాము ఆహారం కోసం సమీపాన ఉన్న అడవికి బయలుదేరింది. అక్కడ కూడా దానికి ఆహారం లభించలేదు. పాము దిగాలుగా వస్తుంటే, గడ్డి పొదల నుండి మంటలు నలువైపులా వ్యాపించడంతో పాము వెళ్ళడానికి దారి లేదు. మంటల మధ్య పాము ఇరుక్కుంది. ఇక తనకు చావు తప్పదని పాము కంగారు పడసాగింది. తనను కాపాడమని పాము కేకలు వేసింది.



ఇంతలో అటుగా వెళుతున్న ఒక బ్రాహ్మణుడు ఆ కేకలు విని ప్రమాదంలో ఉన్న పాము పరిస్థితి చూసి జాలిపడ్డాడు. వెంటనే తన సంచిని ఆ మంటల్లో విసిరాడు. “నాగరాజా! నువ్వు ఈ సంచిలో దూరు. నేను కర్రతో సంచిని నెమ్మదిగా మంటల్లో నుండి లాగి నిన్ను రక్షిస్తాను” అన్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు చెప్పినట్లే పాము అతడు విసిరిన సంచిలోకి దూరింది. ఒక కర్రసాయంతో సంచిని నెమ్మదిగా మంటలు తగలకుండా బయటకు తీసి పామును కాపాడాడు. ఆపదలో ఉన్న పామును రక్షించినందుకు బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు.

ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. వెనుతిరిగి చూస్తే పాము పడగ విప్పి బుసలు కొట్టింది. బ్రాహ్మణునికి భయమేసి “ఇదేమిటి నాగరాజా! నేను నీ ప్రాణాలను కాపాడాను. నాపైనే బుసలు కొడతావా?” అని ఆవేదన చెందుతూ అడిగాడు. “నీ జాతి ధర్మం నువ్వు చూపావు, నా జాతి ధర్మం నేను చెయ్యాలి కదా?” అన్నది పాము. చేసేది లేక బ్రాహ్మణుడు పరుగులెత్తాడు. పాము అతడిని వెంబడించింది. ఆ సమయంలో బ్రాహ్మణుడికి ఒక గాడిద ఎదురొచ్చింది. “బ్రాహ్మణోత్తమా! ఎవరో రాక్షసుడు నిన్ను వెంటాడుతున్నట్లు ఎందుకా పరుగు?” అని గాడిద ప్రశ్నించింది. “రాక్షసరూపంలో ఉన్న పాము నన్ను వెంటాడుతుంది” అన్నాడు బ్రాహ్మణుడు. ఇంతలో పాము అక్కడకు వచ్చి బుసలు కొడుతూ ఆగింది.

బ్రాహ్మణుడు జరిగిందంతా గాడిదకు చెప్పాడు. “మీరే న్యాయం చెప్పండి. రక్షించిన నన్ను చంపాలనుకోవడం పాముకు ధర్మమా?” అన్నాడు బ్రాహ్మణుడు. పాము కూడా గాడిద వైపు చూసింది. పాముకు వ్యతిరేకంగా మాట్లాడితే తన ప్రాణానికి ముప్పు వస్తుందని గాడిద భావించింది.

వెంటనే గాడిదకి ఒక ఉపాయం తోచింది. “ఏదైనా కళ్ళతో చూస్తేనే నేను నమ్ముతాను, ఏం జరిగింది? ఎలా జరిగింది? అనేది నాకు మీరు కళ్ళకు కట్టినట్లు చూపించండి. అప్పుడు నేను న్యాయం చెబుతాను” అంది గాడిద. అందరూ కలసి మంటల వద్దకు వచ్చారు. పాముని మంటల మధ్యలో వేసింది గాడిద. మంటల సెగకు పాము కేకలు పెడుతూ “ఓ బ్రాహ్మణోత్తమా! ఇంతకు క్రితంలా సంచిని వెయ్యి” అన్నది పాము. బ్రాహ్మణుడు సంచిని వేయబోయాడు.

“ఓ వెర్రి బ్రాహ్మణుడా! ఆ సంచిని మంటల్లో వేయకు. సాయం అనేది కృతజ్ఞతా భావం ఉన్నవాళ్ళకు, సాయం వారికే చేయాలి. లేదంటే మనకే ముప్పు కలగవచ్చు” అన్నది గాడిద. బ్రాహ్మణుడు, గాడిద ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. మంటలు చెలరేగడంతో పాము అందులో తగలబడి, మాడి మసైపోయింది.

నీతి కథలు : మనం చేసే సహాయాన్ని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్లకే మనము సహాయం చేయవలెను. లేదంటే అది మనకే కీడు చేయవచ్చు.

Responsive Footer with Logo and Social Media