పావురం- డేగ



వింధ్యపర్వతం మీది పక్షులు గురించి హిరణ్యగర్భుడికి చెబుతూ మంచి చెప్పినా, బుద్ధి చెప్పినా తెలివయిన వారికీ, మంచివారికే చెప్పాలన్నాడు దీర్ఘముఖుడు. తెలివి తక్కువ వారికీ, బుద్ధిహీనులకీ చెప్పకూడదన్నాడు. చెబితే కోతులకు నీతులు చెప్పిన కుందేలులా ప్రమాదంలో పడతాం అన్నాడు. ఆ కథ చెప్పాడు. విని నవ్వుకున్నాడు హిరణ్యగర్భుడు.‘‘అసలు విషయానికి రా’’ అన్నాడు.‘‘అక్కడికే వస్తున్నాను.’’ అన్నాడు దీర్ఘముఖుడు. చెప్పసాగాడిలా.‘‘ఆ పక్షులన్నీ మిమ్మల్నీ నన్నూ తిట్టి పోశాయని చెప్పాను కదా, తర్వాత ఏమన్నాయంటే ‘నీచుడా! మా దేశానికి వచ్చి మమ్మల్నీ, మా రాజునీ నిందిస్తావా? మీ రాజు గొప్పలూ, మీ దేశం గొప్పలూ గోరంతలు కొండంతలు చేసి చూపిస్తావా? మా రాజంటే ఏమనుకున్నావు? ప్రపంచం అంతా అతనికి జేజేలు కొడుతోంది. మీ రాజుకి మేఘం కనిపిస్తే చాలు, పారిపోతాడు. పిరికిసన్నాసి. మా రాజు అలాంటి వాడు కాదు. మీ రాజులాంటి వారు వెయ్యిమంది కూడా మా రాజుతో సరిరారు.’’‘‘బాగా బొప్పి కట్టించాయి.’’ అన్నాడు హిరణ్యగర్భుడు.‘‘అనుమానమా! ఆఖరికి ఏమన్నాయో తెలుసా? నీ మాట మేము వినడం కాదు, నువ్వే మా మాట విను. నువ్వూ, మీ రాజూ మా రాజ్యానికి రండి. మా రాజాశ్రయాన్ని పొందండి అన్నాయి. కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నాను. ఇలా అన్నాను.

‘మీరిలా మాట్లాడడం తప్పు. మా రాజ్యం బాగుందా? మా రాజు ఎలా ఉన్నాడని మీరడిగితేనే నేను నా అభిప్రాయం చెప్పాను. చెప్పినందుకు నన్ను తిట్టడం పద్ధతిగా లేదు. అయినా మా రాజు గొప్పతనం మీకేం తెలుసు? ఏం తెలుసునని ఆయన్ని తిడుతున్నారు? ఎవరయినా నోరు పారేసుకోకూడదు. మనం రాళ్ళు విసిరితే ఎదుటి వారు పువ్వులు విసురుతారనుకోవడం పొరపాటు. సరే, మా రాజు సంగతి అలా ఉంచండి. మీకీ నెమలిని రాజుని చేసిందెవరు? నెమలి రాజేమిటి? అడిగాను. అంతే! పక్షులకి కోపం వచ్చింది. నా మీద దాడి చేశాయి. నేనేం తక్కువ తినలేదు. ఎదురుదాడి చేశాను. ధైర్యంగా ఎదుర్కొన్నాను వాటిని.’’‘‘తానేమిటో, తన బలమేమిటో తెలుసుకోకుండా బలవంతులతో కయ్యానికి కాలు దువ్వితే ఎవరయినా నాశనమయిపోతారు. గతంలో ఓ పావురం ఇలాగే తనేంటో, తన బలమేమిటో తెలుసుకోకుండా డేగని ఎదుర్కొనాలని చూసింది. చూసి ఏమయిందో తెలుసా?’’ అడిగాడు హిరణ్యగర్భుడు.‘‘ఏమయింది?’’‘‘చెప్తాను, విను.’’ చెప్పసాగాడిలా.

‘‘మధురానగరంలో ఓ గుడి ఉంది. ఆ గుడిలో ఓ పావురాల జంట కాపురం ఉండేది. ఓ రోజు ఆ రెండు పావురాలూ గుడిమంటపంలో తిరుగుతోంటే ఓ డేగ చూసింది. ‘బాగున్నాయివి. వీటితో ఎంచక్కా కడుపు నింపుకోవచ్చ’ని, వాటిని వేటాడేందుకు తెగ ప్రయత్నించింది. అటూ ఇటూ భక్తులు తిరుగుతుండడం, రక్షకభటులు కూడా ఉండడంతో వేటాడేందుకు వీలు చిక్కలేదు. పొద్దున నుంచి సాయంత్రం దాకా కాపేసింది. ఫలితం లేదు. దాంతో ‘ఇవి ఎక్కడికి పోతాయి. వంటింటి కుందేళ్ళలా ఇక్కడే ఉంటాయి. రేపు చూసుకుందాం వీటి పని.’ అని ఎగిరిపోయింది. డేగ తమ కోసం కాచుక్కూర్చుకోవడం, కాలం కలిసిరాకపోవడంతో ఎగిరిపోవడం అంతా గమనించింది ఆడపావురం. భయపడింది. మగపావురంతో ఇలా అంది.

‘డేగని చూశావా? మన కోసమే కాపేసింది. అవకాశం చిక్కలేదు. వెళ్ళిపోయింది. వదిలేసింది అనుకోకు. రేపొస్తుంది. అనుమానం లేదు. చంపేస్తుంది. అందుకని, మనం ఇవాళే గూడు మార్చేద్దాం. ఇక్కణ్ణుంచి వెళ్ళిపోదాం. ముందు జాగ్రత్త పడదాం.’భార్య మాటలకి భర్తపావురానికి కోపం తన్నుకొచ్చింది. భయపడుతోన్న భార్యని చూసి చిరాకుపడింది. ఇలా అంది.‘అన్నిటికీ భయమే! ధైర్యం అన్నది లేనేలేదు నీకు. ఉన్న ఊరూ, కన్నతల్లీ ఒక్కలాంటివి. వదిలి వెళ్ళిపోయామో, తిరుగులేని కష్టాలను కొని తెచ్చుకుంటాం. పైగా ఇన్నాళ్ళూ ఇక్కడుండి, ఇప్పుడు హఠాత్తుగా మాయమయిపోతే మనం ఎంత పిరికివాళ్ళమో అందరికీ తెలిసిపోతుంది. నా సంగతి నీకు తెలీదు. ఇలా కనిపిస్తాను కాని, చాలా బలం ఉంది నాకు. ఇలాంటి డేగల్ని నాలుగింటిని ఒక్కసారిగా ఎదుర్కోగలను. ఏమనుకున్నావో’అయినా భార్య పావురం ధైర్యాన్ని కూడగట్టుకోలేకపోయింది. భయం భయంగానే చూడసాగింది.

‘ఇదిగో, అలా చూడకు. భయపడకు. డేగ కూడా మనలాంటి పక్షే! దానికి కూడా చావంటే భయం ఉంటుంది. నా ముక్కు చూశావు కదా, ఎంత గట్టిదో, ఈ ముక్కుతో ఒక్క పోటు పొడిచాననుకో, డేగా లేదు, గీగా లేదు. చచ్చూరుకుంటుంది. ఈ గోళ్ళు చూశావా? ఎంత వాడిగా ఉన్నాయో, వీటితో దాన్ని చీల్చి చెండాడేస్తాను. నీకేం భయం లేదు. ధైర్యంగా ఉండు.’ అంది.లాభం లేదు. భార్య పావురానికి ధైర్యం రావట్లేదు. గమనించింది భర్త పావురం. మళ్ళీ ఇలా అంది.‘చూడూ, సుఖదుఃఖాలు దైవ సంకల్పాలు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అనవసర భయాలు పెట్టుకుని, నిద్ర చెడగొట్టుకోకు. పడుకో’పడుకుంది ఆడపావురం. పడుకున్నదన్న మాటేగాని నిద్ర రాలేదు దానికి. భయంతో నిద్రపట్టడం లేదు. చెబితే వినని భర్తని చూసి, ఏం చేయాలో అంతుచిక్కక తెల్లార్లూ మేల్కొనే ఉంది.తెల్లారింది. తెల్లారుతూనే డేగ వచ్చేసింది. గుడి ప్రహారిగోడ మీద కాపేసుక్కూర్చుంది. ఈ సంగతి తెలియని పావురాల జంట ఆహారం కోసం గుడి బయటికి వచ్చాయి. డేగని చూసి, లోనికి పారిపోయింది ఆడపావురం. మగపావురాన్ని రా రమ్మని పిలిచింది. రాలేదది. రాలేదు సరికదా, డేగని ‘ఏం చేస్తావు?’ అన్నట్టుగా చూడసాగింది. అదే అదనుగా డేగ ఆ పావురాన్ని ముక్కున కరిచి పట్టుకుపోయింది. చంపేసింది. తినేసింది.’’ కథ ముగించాడు హిరణ్యగర్భుడు. అంతలోనే ఇలా అన్నాడు.‘‘బలవంతుడితో తలపడకూడదు. అసలు అతని వైపే చూడకూడదు. చూస్తే చావుని కొని తెచ్చుకున్నట్టే! ఇంకొకటి, ఎంత బలం ఉన్నా మాట దురుసుతనం మంచిది కాదు. దీనికో కథ ఉంది. చెబుతాను, విను.’’‘‘చెప్పండి మహారాజా’’ కుతూహలం కనబరిచాడు దీర్ఘముఖుడు.

హిరణ్యగర్భుడు చెప్పసాగాడిలా.‘‘కరిపురం అని ఓ ఊరు ఉంది. ఆ ఊరిలో ఓ రజకుడు ఉండేవాడు. అతని పేరు విలాసుడు. ఓ గాడిద ఉందతనికి. దానిని బాగా మేపేందుకు ఓ ఉపాయం ఆలోచించాడతను. రాత్రివేళ గాడిద మీద పులితోలు కప్పి, పంటచేల వైపు పంపించేవాడు. పొలాలకు కాపలా ఉండేవారు, గాడిదను పులి అనుకుని, భయపడేవారు. దాని జోలికి కూడా వెళ్ళేవారు కాదు. తిని తిని గాడిద బాగా బలిసింది. కొంతకాలం గడిచిందిలా.

పులి పొలాల్లో పడి గడ్డి మేయడం అంతుచిక్కని ఓ రైతు, అసలు సంగతి కనుక్కునేందుకు తెగించాడు. పులిని చంపాలని నిర్ణయించుకున్నాడు. బూడిదరంగు దుప్పటి కప్పుకుని, పొలం గట్టున చెట్టు నీడన కూర్చున్నాడు. చేతిలో విల్లు ఉంచుకున్నాడు. భుజాన అమ్ములు కూడా తగిలించుకున్నాడు. రాత్రి అయింది. పులితోలు కప్పుకుని గాడిద వచ్చింది. పొలంలో పడి ఇష్టానుసారం మేయసాగింది. మేస్తూ మేస్తూ గట్టున చెట్టు నీడలో ఉన్న బూడిద రంగు దుప్పటి కప్పుకుని ఉన్న రైతును చూసింది.

అయితే అతన్ని రైతు అనుకోలేదది. తనలాంటి గాడిదనే అనుకుంది. మేయడానికి తనలాగే వచ్చిందనుకుంది. పలకరింపుగా ఓండ్ర పెట్టింది. ఆశ్చర్యపోయాడు రైతు. ‘అయితే ఇది పులి కాదు. పులితోలు కప్పుకున్న గాడిద. దీనికి భయపడ్డాం ఇన్నాళ్ళూ’ అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం బాణాన్ని ప్రయోగించాడు. గాడిద కుప్పకూలిపోయింది.’’ కథ ముగించాడు హిరణ్యగర్భుడు.‘‘నోరు మూసుకుని పడి ఉంటే రైతు భయపడి ఉండేవాడు. పులులు గడ్డి కూడా మేస్తాయని బెదిరిపోయేవాడు. కాళ్ళూ చేతులూ ఆడక బాణాన్ని వేసేవాడే కాదు. గాడిద బతికిపోయేది. నోరిప్పింది. ఏమయింది? చచ్చింది. అందుకే అంటారు.‘అయిన చోటా కాని చోటా నోటి దురుసుతనం పనికి రాదని.’’ అన్నాడు మళ్ళీ హిరణ్యగర్భుడు.

Responsive Footer with Logo and Social Media