పాము - వర్తకుడు



చిత్రవర్ణుడు కర్పూరద్వీపాన్ని ఆక్రమించుకున్నాడు. విజయకేతనం ఎగరేశాడు. కొన్నాళ్ళు పాలించి, నచ్చిన సేవకుణ్ణి సామంతుని చేసి తరలి పోయాడక్కణ్ణుంచి. జంబూద్వీపానికి చేరుకున్నాడు. చిత్రవర్ణుడు జంబూద్వీపానికి చేరుకున్నాడని తెలిసిన తర్వాతే హిరణ్యగర్భుడు బయటపడ్డాడు. అంతవరకూ అజ్ఞాతంలోనే గడిపాడు. మహారాజు యుద్ధంలో మరణించలేదు. బతికే ఉన్నాడని తెలుసుకుని, సర్వజ్ఞుడు కలిశాడతన్ని. సర్వజ్ఞుణ్ణి చూస్తూనే హిరణ్యగర్భుడు ఆనందించాడు. మహారాజూ, మంత్రీ కలుసుకున్నారని తెలుసుకున్న హిరణ్యగర్భుని సైనికులు, యుద్ధంలో పారిపోయి, ప్రాణాలు దక్కించుకున్న వారు వచ్చి రాజునీ, మంత్రినీ కలుసుకుని, కష్టసుఖాలు కలబోసుకున్నారు. అంతా ఒక చోట కలిసి జీవించడం ప్రారంభించారు.ఒకనాడు మంత్రి సర్వజ్ఞునితో ఇలా అన్నాడు హిరణ్యగర్భుడు.‘‘యుద్ధంలో అనేకమంది చనిపోయారు. ఒకరకంగా అందర్నీ చంపుకున్నాను. ఓడిపోయాను. ఓడిపోయినందుకు బాధలేదు కాని, కోటకి నిప్పు పెట్టిందెవరో తెలుసుకోవాలని ఉంది. నిప్పు పెట్టి యోధులందర్నీ చంపి, చిత్రవర్ణుని చేతికి గెలుపు బావుటాని అందించిన పాపాత్ముని చూడాలని ఉంది.’’కసిగా కోపంగా ఉంది హిరణ్యగర్భుడికి.‘‘ఆ దుర్మార్గుడు ఎవడై ఉంటాడంటావు?’’ అడిగాడు.‘‘ఎవరంటే...మీ మిత్రుడు నీలవర్ణుడనే నా అనుమానం. యుద్ధంలో చనిపోయాడా, లేదు. ప్రాణాలు దక్కించుకునేందుకు పారిపోయాడా, పారిపోతే ఇప్పుడొచ్చి కలుసుకోవాలిగా. రాలేదు. రాలేదంటే...వాడేనని నా నమ్మకం. వాణ్ణి మీరు పూర్తిగా నమ్మి, ప్రజల్ని పణం పెట్టారు.’’ అన్నాడు సర్వజ్ఞుడు.‘‘నిజమే! కాని, ఇదంతా మన దురదృష్టం సర్వజ్ఞా! కాలం మనకి కలిసి రాలేదు. పైగా దేవుడి దయ కూడా లేదు. ఏం చేస్తాం? అనుభవించక తప్పదు.’’ అన్నాడు హిరణ్యగర్భుడు.

‘‘లేదు మహారాజా! దేవుడి దయలేకపోవడం కాదు, కాలం కలిసి రాకపోవడం అంతకన్నా కాదు. ఇది చేజేతులా తెచ్చుకున్న దురవస్థ. నాలాంటి వాళ్ళు ఎంతమంది, ఎన్ని విధాల చెప్పినా మీరప్పుడు వినలేదు. రాబోయే అపాయాన్ని ముందే గ్రహించాలి. అలా గ్రహించి, జాగ్రత్తపడిన వాళ్ళే సుఖపడతారు. ఎలా జరిగితే అలా జరుగుతుంది. దేవుడు ఏది రాసి పెట్టి ఉంటే అదవుతుందనుకునేవారు అదృష్టాన్నే నమ్ముకోవాలి. అదృష్టాన్ని నమ్ముకున్నవాడు మంచి జరిగితే దేవుణ్ణి పొగుడుతాడు. చెడు జరిగితే నిందిస్తాడు. దేవుణ్ణి నిందిస్తాడేగాని, తనని తాను నిందించుకోడు. అదే చిత్రం.’’ అని నవ్వాడు సర్వజ్ఞుడు. అంతలో జంబూద్వీపానికి గూఢచారిగా వెళ్ళిన ధవళాంగుడు తిరిగొచ్చాడక్కడికి. హిరణ్యగర్భుని దీనావస్థ చూసి బాధపడ్డాడు.‘‘కోటను రక్షించుకోమని గొంతు చించుకున్నాను. రక్షించుకోలేకపోయారు. అసలు మన కోటను తగలబెట్టింది ఎవరో తెలుసా?’’ అన్నాడు ధవళాంగుడు.‘‘ఎవరు’’ అడిగాడు హిరణ్యగర్భుడు.‘‘ఇంకెవరు? మీ స్నేహితుడు నీలవర్ణుడే!’’‘‘అనుకుంటూనే ఉన్నాం. వాడే కొంపకి కొరివి పెట్టాడయితే’’ బాధపడ్డాడు హిరణ్యగర్భుడు.

‘‘నీలవర్ణుడి అసలు పేరు, మేఘవర్ణుడు. చిత్రవర్ణుడు పంపితే గూఢచారిగా మీ దగ్గర చేరాడు. ఎప్పుడయితే మన రాజ్యం వాళ్ళదయిందో అప్పుడు, చిత్రవర్ణునితో పాటు జంబూద్వీపానికి చేరుకున్నాడు. ఇక్కడీ కర్పూరద్వీపంలో నీలవర్ణుని సత్కరించలేదుగాని, అక్కడ జంబూద్వీపంలో నీలవర్ణుని చిత్రవర్ణుడు అద్భుతంగా సత్కరించాడు. ఎన్నెన్నో బహుమానాలిచ్చాడు. అందరి ముందూ కౌగిలించుకున్నాడతన్ని. కౌగిలించుకుని, ‘కేవలం ఈ మేఘవర్ణుని కారణంగానే మనం కర్పూర ద్వీపాన్ని జయించాం. అందుకు ఈ మేఘవర్ణునికి కర్పూర ద్వీపాన్ని కానుకగా ఇస్తున్నాను. ఇక ఇతనే కర్పూర ద్వీపానికి రాజు.’ అన్నాడు. మంత్రి దూరదర్శి, చిత్రవర్ణుని వారించాడు. ‘అక్కడ సామంతుడున్నాడుగా! మీ సేవకుణ్ణే మీరు రాజుని చేశారు. చేసి కొద్దిరోజులు కూడా కాలేదు. అప్పుడే మార్పా? వద్దు మహారాజా’ అన్నాడు.’’

‘‘దూరదర్శి బాగానే ఆలోచించాడు. అప్పుడు చిత్రవర్ణుడు ఏమన్నాడు.’’ ఉత్కంఠగా అడిగాడు సర్వజ్ఞుడు.‘‘చిత్రవర్ణుడు ఏమీ అననేలేదు, దూరదర్శి ఇలా అన్నాడు. ‘చేసిన మేలుకి మేఘవర్ణునికి ఇంకేదయినా మంచి బహుమతి ఇవ్వండి. అంతేకాని, కాలుకి వేసుకునే చెప్పుల్ని నెత్తిన పెట్టుకుంటే నలుగురూ నవ్వుతారు. అంత పని చేయకండి.’ అన్నాడు. అంతటితో ఊరుకున్నాడా? ఇంకా ఇలా అన్నాడు. ‘ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచాలన్నాడు. అల్పులు మేలు చేస్తే, మేలు చేసిన వారికే అల్పులు కీడు తలపెడతారన్నాడు.పాము-వ్యాపారి కథ చెప్పాడు.’’‘‘ఏంటా కథ? చెప్పు చెప్పు’’ అడిగాడు హిరణ్యగర్భుడు.అక్కడ చిత్రవర్ణునికి దూరదర్శి చెప్పిన కథను ఇక్కడ ధవళాంగుడు ఈ విధంగా చెప్పసాగాడు.పూర్వం హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఓ వర్తకుడు ఉండే వాడు. పని మీద పక్క ఊరికి వెళ్ళి కాలినడకన తిరిగి వస్తున్నాడు. అడవిదారి పట్టాడు. అడవిలో దావాగ్ని చెలరేగింది. చెట్లూ పుట్టలూ కాలిపోతున్నాయి.పొగ కమ్ముకొస్తోంది. అయినా ధైర్యంగా నడుస్తున్నాడు. చూస్తూండగానే ఓ పొద అంటుకుంది. పొదలో ఓ పాము ఉంది.

మంటల్లో ఇరుక్కుపోయిందది. బయటపడేందుకు ప్రయత్నిస్తోంది కాని, దాని వల్ల కావట్లేదు. దారంట పోతున్న వ్యాపారిని చూసింది పాము. కేకేసింది.‘ఇదిగో మనిషీ! దేవుడిలా కనిపించావు. దయచేసి నన్ను రక్షించు. ఈ మంటల్లోంచి నన్ను కాపాడు.’కేకేస్తున్నది పాము. దానిని రక్షించొచ్చా? ఆలోచనలో పడ్డాడు వ్యాపారి. ప్రాణభయం ఎవరికైనా ఒకటే! కాపాడడం మానవధర్మం అనుకున్నాడు. జాలిపడ్డాడు. దగ్గరలో కర్ర దొరికింది. దాన్ని అందుకున్నాడు. ఆ కర్రకి ఓ తాడు కట్టి, ఆ తాడుకి చేతిలో ఉన్న సంచిని కట్టాడు. నేర్పుగా ఆ సంచిని పొదలో ఇరికించాడు. మంటలకి సంచిని అందనీయక జాగ్రత్త పడ్డాడు. ఎప్పుడయితే పాము సంచిలోకి దూరిందో అప్పుడు, సంచిని అంతే జాగ్రత్తగా పొదల మధ్య నుంచి లాగి పాముని కాపాడాడు.ఎంతయినా పాము పామే! దానిని దగ్గరకు చేరనీయకూడదు. అందుకని, సంచిలో పాముని, తోవ పక్కగా వదిలేశాడు.‘నీ దారి నీది, నా దారి నాది’ అన్నాడు.

ముందుకు నడిచాడు. అతన్ని అనుసరించింది పాము. గ్రహించాడది వ్యాపారి.‘ఏంటి నా వెనక పడ్డావు?’ అడిగాడు.‘మేము కనిపిస్తే చాలు, మీ మనుషులు మమ్మల్ని కొట్టి చంపుతారు. అలాంటి నిన్ను కాటేయక వదిలి వేస్తే మా జాతికే మోసం చేసినట్టు. అందుకే నీ వెంట పడ్డాను. నిన్ను కాటేసి చంపిగాని పోను.’ అంది పాము. మీది మీదికి రాసాగింది. ప్రాణభయంతో పరుగుదీశాడు వర్తకుడు. అతని పరుగును మించి మెలికలు తిరుగుతూ ముందుకు రాసాగింది పాము. పాముకాటు తప్పదు! చావు తప్పదనుకుంటూ అలసిపోయి పరుగుదీయలేకపోతోన్న వర్తకుణ్ణి చూసిందో నక్క. పరుగున పాముకీ-వర్తకునికీ మధ్య వచ్చి నిలిచింది.

‘ఏంటి మీ ఇద్దరి గోల’ అడిగింది. జరిగింది చెప్పబోయాడు వర్తకుడు. ఊపిరాడక చెప్పలేకపోయాడు. పాము చెప్పిందంతా.‘విన్నావు కదా, చూడు ఈ పాముకి కృతజ్ఞత లేదు.’ అన్నాడు వర్తకుడు. బాధపడ్డాడు.తప్పు చేస్తోంది పాము. దీనికి బుద్ధి చెప్పాలనుకుంది నక్క.‘ఏంటేంటీ? ఆరడుగుల పామువి, నువ్వు వర్తకుడి చేసంచీలో దూరావా? నమ్మలేక పోతున్నాను. అసలీ చిన్న సంచిలో నువ్వెలా పట్టగలిగావు?’’ అడిగింది నక్క.

‘జాగ్రత్తగా దూరి, చుట్టగా పడుకుంటే సంచిలో పట్టొచ్చు. పెద్ద కష్టమేమీ కాదు.’ అంది పాము.‘కావాలంటే చూడు’ అంది. వర్తకుని చేసంచీలో దూరింది. అదే అవకాశంగా వర్తకునికి సైగ చేసింది నక్క. ఆ సైగను అర్థం చేసుకున్న వర్తకుడు, సంచిని బిగించి, మూటలా కట్టేశాడు. మూతిని తాడుతో ముడి వేశాడు. వెలుపలికి రాలేక పాము సంచిలో మెలికలు తిరగసాగింది.‘కానీయ్‌’ అన్నట్టుగా మళ్ళీ నక్క సైగ చేసింది. అంతే! దగ్గరగా ఉన్న లావుపాటి కర్ర అందుకుని, దాంతో సంచి మీద దబదబ మోదాడు వర్తకుడు. ఆ దెబ్బలకి సంచిలోని పాము చచ్చిపోయింది. పాముకి తగినట్టుగా బుద్ధి చెప్పినందుకు నక్కకి చేతులు జోడించి, కృతజ్ఞతలు తెలిపాడు వర్తకుడ ంటూ కథ ముగించాడు దూరదర్శి.అల్పులకూ, నీచులకూ ఉపకారం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలంటాడు దూరదర్శి. మరో కథ కూడా చె ప్పాడతను.’’ అన్నాడు ధవళాంగుడు.‘‘ఆ కథేంటి’’ అడిగారు మంత్రీ, రాజూ. చెప్పసాగాడిలా ధవళాంగుడు.