పాము మరియు కప్పరాజు



ఒక అడవిలో ముసలి పాము ఉండేది. ఒకరోజు దానికి ఆహారం దొరకలేదు. ఆకలి బాధతో అడవిలో తిరుగుతూ ఒక చెరువు వద్దకు చేరింది. అక్కడ దానికి అనేక కప్పలు కనిపించాయి. ఎలాగైనా ఇక్కడే కొంతకాలం నివసించి కప్పలను తినాలని పాము నిర్ణయించుకుంది. పాము చాలా దిగులుగా, మెల్లిగా పాకుతూ చెరువు ఒడ్డుకు చేరింది. పామును చూడగానే కప్పలన్నీ భయపడి పారిపోయాయి.



“ఓ కప్ప మిత్రులారా! నేను మిమ్మల్ని చంపాలనే కాంక్షతో ఇక్కడికి రాలేదు. నేను మీ రాజుతో ఒక విన్నపం చేసుకోవడానికి వచ్చాను. కాబట్టి నన్ను చూసి మీరంతా భయపడకండి” అని చెప్పింది పాము. పాము మాటలకు కప్పల రాజు ఆశ్చర్యపోయాడు. “నేనే కప్పల రాజును. నువ్వు ఏం చెప్పదలచుకున్నావో చెప్పు” అని పాముతో కప్పల రాజు అన్నాడు. “నాకు కలిగిన కష్టాలను నీతో చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చాను” అన్నది పాము. “నీకు కలిగిన కష్టమేమిటి?” పామును ప్రశ్నించాడు కప్పల రాజు.

పాము చాలా బాధపడుతూ “నిన్న రాత్రి నేను ఆహారం వేటలో తిరుగుతున్నాను. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ బాలుడు నా తోకను తొక్కాడు, అందువల్ల నాకు కోపం వచ్చి కాటు వేశాను.

నా విషం బాలుడి శరీరంలో ప్రవేశించేపాటికి మూర్ఛపోయాడు. ఆ సమయంలో బాలుడు చనిపోయాడని భావించిన అతని తల్లిదండ్రులు బిగ్గరగా ఏడుస్తూ కూర్చున్నారు. ఆ సమయంలో మంత్రశాస్త్రం తెలిసిన ఒక వ్యక్తి తన శాస్త్ర పరిజ్ఞానంతో బాలుడిని బ్రతికించాడు. ఆ తరువాత బాలుడి తండ్రి నా వైపుచూసి ‘నా బిడ్డను బాధపెట్టిన ఓ విషసర్పమా! నీ ఆహారమైన కప్పలకు నువ్వు వాహనమై, వాటిని మోస్తూ, ఆ కప్పలు దయతలచి పెట్టిన ఆహారాన్ని తిని బ్రతుకు’ అంటూ శపించాడు. అప్పటి నుండి నాకు ఆహరం దొరకడం లేదు, ఆకలితో అలమటిస్తున్నాను” అంటూ బాధ నటిస్తూ చెప్పింది పాము.

“బాధపడకు, నీకు ఆహారం నేను ఇస్తాను సర్పరాజా! అయితే నువ్వు ఒక పని చేయాలి. నాతో పాటు, నా మంత్రులను సైతం మోస్తూ ఈ చెరువు చుట్టు తిప్పు. నా గొప్పతనాన్ని మిగిలిన కప్పలన్నీ చూస్తాయి” అని కప్పల రాజు ఆజ్ఞాపించాడు. పాము తన వీపుపై కప్పల రాజును మోస్తూ తీసుకుని వెళుతుంటే కప్పలన్నీ ఆశ్చర్యంగా చూశాయి. పాము కొద్దిగ దూరం కప్పలను మోసుకుని వెళ్ళి అలసిపోయినట్లు నటించి ఆగిపోయి కప్పలన్నింటినీ తినేసింది.

నీతి కథలు : శత్రువులు తేనెపూసిన కత్తిలా ఎంత తియ్యగా మాట్లాడినా వారిని విశ్వసించరాదు.

Responsive Footer with Logo and Social Media