ఓర్పే శ్రీరామరక్ష
గంగావురంలో భూషయ్య అనే వ్యాపారి వుండేవాడు. భూషయ్య ఎల్లప్పుడూ అయిన దానికి కాని దానికి నిరుత్సాహపడుతూ వుండేవాడు. భూషయ్య ఏ రోజు వ్యాపారం సరిగా జరగకపోతే ఆ రోజు నిరుత్సాహపడిపోతూ, అందరిమీద కోపంతో విరుచుక పడేవాడు. రానురాను ఈ అలవాటు భూషయ్యకు వ్యసనంగా మారి అతన్ని తీవ్రంగా వేధీంచసాగింది. నిరుత్సాహాన్ని భరించలేక భూషయ్య, అక్కడికి సమీపంలో ఉన్న ఓ ఆశ్రమానికి వెళ్ళి ' జ్ఞానానందుడనే మహర్షి వద్ద తన బాధ చెప్పకుని తనకు నిరుత్సాహం పోయే మార్గాన్ని సూచించమని ప్రాధేయపడ్డాడు.
భూషయ్య మాటలు విన్న జ్ఞానానందుడు చిరుమందహాసం చేస్తూ “నాయనా...! సముద్ర ప్రవాహానికి ఆటు పోటులు ఎలా సహజమో, అదేవిధంగా మానవజీవితంలో సుఖదుఃఖాలు, మంచి, చెడ్డలు, ఉత్సాహ, నిరుత్సాహాలు సహజం. ఆనందం, విచారం వంటి మనోవికాసాలకు లొంగిపోతే అవి మనల్ని కృంగదీస్తాయి. మన కోర్కెలను అదుపులో పెట్టుకుని హాయిగా జీవించడానికి ప్రయత్నించు. జీవితంలో ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా ఓర్పుతో ధైర్యంగా జీవిత సమ్మస్యలను ఎదుర్కొంటే, జీవితంలో నిరుత్సాహ మనేదే ఉండదు. పైగా ఉత్సాహంతో కొత్త కొత్త విజయాలను సాధించగలవు' అని బోధించాడు.
జ్ఞానానందుని మాటల్లోని అసలు విషయాన్ని తెలుసుకున్న భూషయ్య ఆనాటినుంచి నిరుత్సాహన్ని వదిలి, ఉత్సాహంతో మరింతగా కృషి చేసి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాడు.