నిర్మల రాగమల్లుల కథ
పూర్వం మధురానగరాన్ని విక్రమజిత్తు అను రాజు పాలించేవాడు. ఆ మహారాజు పుత్రిక పేరు నిర్మల. ఆమె అందాలరాశి. ఆమెను పెండ్లాడగోరి
అనేకమంది రాజపుత్రులు ప్రయత్నించారు. కానీ, నిర్మల వారినందరనూ తృణము వలె నిరాకరించింది.
ఒకనాడు నిర్మల తన చెలికత్తెలతో విహరిస్తూ ఉంది; ఉద్యానవనంలో. ఆ ఉద్యానవనంలో అంతఃపురస్త్రీలు తప్ప ఇతరులు ఎవరూ అందు విహరించుటకు వీలు లేదు. మగవారు అసలే పోరాదు.
నిర్మల విహరించే ఆ సమయంలో, ఒక యువకుడు రహస్యంగా చుట్టూ ఉన్న ప్రహరీగోడ దూకివచ్చి ఒక పొదరిల్లు మధ్య దాగియుండెను. అతని రాకను రాజపుత్రికగాని, చెలికత్తెలుగాని ఎవ్వరును గుర్తించలేదు.
కొంతసేపటికి రాజపుత్రిక నిర్మల ఆటలు చాలించి, అందులో గల కొలను గట్టున విశ్రాంతి తీసికొనుచు. విశ్రమించెను. చెలికత్తెలు కొంతదూరంలో గల పూలవృక్షములు చేరి, పూలుకోయుచుండిరి. ఆ సమయంలో ఒంటరిగానున్న రాజపుత్రిక దగ్గరకు చేరాడు పొదరిల్లు మధ్య దాగిన యువకుడు.
ఆ యువకుడు మిక్కిలి అందమైనవాడే. కానీ, రాజపుత్రులు ధరించి విలువైన వస్త్రము లేవీ లేవు. అతడిని చూచి నిర్మల మొదట భయపడినది, కానీ, ఆతని అందచందములకు ముగ్ధురాలై అతనిని చూడడంతో లేచి కూర్చున్నది.
ఆ యువకుడిలా అన్నాడు.
"రాకుమారి: నేనొక ధనవంతుని కుమారుడను, రాజపుత్రుడను కాను, మాది కళింగ దేశము. నీ అందచందములను గూర్చి విని సాహసించి ఇలా వచ్చాను;
నీ అభిమతము తేలిసికొని, మీ నాన్నగారితో మాట్లాడ వలయునని." అన్నాడు. రాజపుత్రిక సమ్మతించినది.
ఇంతలో నిర్మల చెలికతైలు వచ్చుచున్న సవ్వడి గమనించి - రాగ మల్లుడు "నిర్మలా, నేను రేపు కలుస్తాను" అని పలుకుచూ, తాను వచ్చినదారినే మాయమైపోయాడు.
రాగమల్లుడు పారిపోవుట ఒక చెలికత్తె చూసినది. వెంటనే నిర్మల తనను దగ్గరకు పిలిచి “అల్లరి చేయకు. అతడు నాకై వచ్చినాడు. నేనతనిని ప్రేమించాను. అమ్మద్వారా, నాన్న గారికి యీ విషయం చెప్పిస్తాను" అన్నది. తర్వాత వారందరూ అంతఃపురం చేరుకొన్నారు.
ఇంతలో రాజభవనం క్రింద పెద్ద కోలాహలం బయలు దేరింది. అంతః పురం నుండి నిర్మల ఆటు చూచింది. రాగమల్లుని రాజభటులు బంధించినారు. అందువలన కోలాహలం బయలు దేరింది.
రాజభవనానికి అనుకొనియే ఉద్యానవనముంది. కావున రాగమల్లుడు గోడదూకి పారిపోవుట గమనించి రాజభటులు ఆతనిని బంధించారు.
మరునాడు రాజదర్బారులో రాగమల్లుని విచారణ జరిగింది. రాగమల్లుని బంధించిన సేనాధిపతి ఆతనిని గూర్చి యిలా చెప్పాడు.
"వీడు చూపులకు మాత్రం అతి సుందరాంగుడు. చేసే పనులనుబట్టి మహాక్రూరుడు, వీడు ఊరుకొక పేరుతో చలామణి యగుచున్న దుర్మార్గుడు. వీడి పేరు రాగ - మల్లుడు. దేశంలో జరిగిన బందిపోటు దొంగతనాలకు, హత్యలకు వీడే కారకుడు. వీడి వలన ఎన్నియో కుటుంబాలు నాశనమైనాయి. వీనిని బంధించుటకు రాజ భటులు అహోరాత్రులు కష్టపడ్డారు. నిన్నెటి దినమున మన రాజభటులు వెంటాడగా, మన రాజపుత్రిక ఉద్యానవనమున ప్రవేశించినాడు. భటులూ, నేనూ ఆ ప్రాంతమందే ఉండి తిరిగి వచ్చినప్పుడు బంధించాము. ఈ ద్రోహికి తగిన శిక్ష విధించ గోరుచున్నాను." అని రాగ - మల్లుని ముందుకు త్రోశాడు సేనాధిపతి.
మహారాజు నిర్ఘాంతపోయాడు. రాత్రి భార్యవల్లా, కూతురువల్లా వాని సంగతి విన్నాడు మహారాజు. "ఇటువంటి ద్రోహినా రాజపుత్రిక వరించినది." అనుకున్నాడు. దేశద్రోహ్రి, హంతకుడు అయిన- ఆ రాగమల్లునికి (వీరమల్లునికి) ఉరిశిక్ష విధించాడు మహారాజు.
ఈ విషయము నిర్మలకు తెలిసినది. "అతడు ఎవడుగాని, వానిని నేను ప్రేమించాను. వానిని క్షమింపుమని తండ్రిని వేడుకుంది. కానీ, మహారాజు దేశ క్షేమము ఆలోచించి ఆమె కోరికను తిరస్కరించాడు.
రాజభటులు రాగమల్లుని ఉరిదీశారు. ఈ వార్తవిన్న నిర్మల విషము త్రాగి తాను కూడా మరణించింది.
మహారాజా: వింటివి గదా నిర్మల రాగ - మల్లుల కథ? నిర్మల మరణం వలన కలిగిన స్త్రీ హత్యపాతకం ఎవరికి చెందుతుంది? మహారాజుకా?" అని ప్రశ్నించాడు. భేతాళుడు.
విక్రమార్కుడు క్షణం ఆలోచించి "భేతాళాః మహారాజుకు ఎందుకు చెందుతుంది. చెందదు. విక్రమజిత్తు తన రాజధర్మమును పాలించినాడు. కుమార్తె కోరికను గూడ తిరస్కరించి, తన విధిని నిర్వర్తించినాడు. కావున న్యాయంగా ఆలోచిస్తే ఆ పాతకం మహారాజుకు చెందదు. పై పై మెరుగులకు అంద చందాలకు భ్రాంతిపడి, యుక్తాయుక్తములు విచారింపక ప్రేమించిన నిర్మలకు తగిన శాస్తి ఆమెకు భగవంతుడే విధించినాడు. కావున ఆ పాతకం ఎవ్వరికి చెందదు" అని సమాధాన మిచ్చాడు.
నియమభంగ కారణంగా వెంటనే భేకాళుడు విక్రమార్కుని భుజముపై నుండి ఎగిరి వృక్షము చేరుకొన్నాడు. విక్రమార్కుడు తిరిగి వెనుకకు బయలు దేరాడు.
విక్రమార్కుడు తిరిగి చెట్టువద్దకు వచ్చాడు; భేతాళుని బంధించాడు. భుజముపై వేసుకొని సన్యాసి ఆశ్రమానికి బయలుదేరాడు. తప్పించుకొను మార్గము నెరింగిన భేతాళుడు మరల నీకొక కథ నిట్లు చెప్పుట ప్రారంభించాడు.