నేత కార్మికుని కథ



అనగనగా ఓ నేత కార్మికుడు. అతని మగ్గం విరిగిపోయింది. కొత్త మగ్గాన్ని తయారు చేసుకోవాలి. కలప కోసం గొడ్డలి పట్టుకుని అడవికి వెళ్ళాడు. ఓ చెట్టును చూశాడక్కడ. బాగుంది. గొడ్డలి ఎత్తి కొమ్మను నరకబోయాడు. అంతలో ఆ చెట్టు మీద ఉన్న యక్షుడు కార్మికుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఇలా అన్నాడతనితో.‘దయచేసి ఈ చెట్టునేం చెయ్యకు. కొమ్మలు నరికి, పాడు చెయ్యకు. నాకీ చెట్టు హాయిగా ఉంది. ప్రాణానికి సుఖంగా ఉంది. నేను దీనిని ఆశ్రయించుకుని ఉంటున్నాను. అందుకే వద్దంటున్నాను.’చేతిలోని గొడ్డలినీ, చెట్టునీ, యక్షుణ్ణీ మార్చి మార్చి చూశాడు కార్మికుడు. ఏం చెయ్యాలో పాలుపోలేదతనికి. అది గ్రహించాడు యక్షుడు. ఇలా అన్నాడు.‘ఈ చెట్టుకు బదులు నీకేం కావాలో కోరుకో! ప్రసాదిస్తాను.’ఏం కోరుకోవాలి? ఊహించని అవకాశం. అప్పుడూ ఏమీ పాలుపోలేదు కార్మికుడికి. ఆలోచించి ఇలా అన్నాడు.‘అయితే ఏం కోరుకోవాలో నా మిత్రుడు క్షురకుడు ఒకడున్నాడు. అతన్ని అడిగి వస్తాను. అభ్యంతరం లేదుకదా’లేదన్నట్టుగా నవ్వాడు యక్షుడు.‘నేనంటే నా మిత్రుడికి చాలా ఇష్టం. ఎప్పుడూ నా మంచినే కోరుకుంటాడతను. అందుకనే అడుగుతున్నాను. ఇబ్బందేం లేదు కదా’ మళ్ళీ అడిగాడు కార్మికుడు. లేదన్నట్టుగా తలూపాడు యక్షుడు. కార్మికుడు పరుగు పరుగున మిత్రుణ్ణి చేరుకున్నాడు. జరిగిందంతా చెప్పాడతనికి.

‘రాజ్యాన్ని కోరుకో మిత్రమా! రాజువయితే సుఖసంతోషాలకు లోటుండదు. పేరుకి పేరూ, డబ్బుకి డబ్బూ, నిన్ను మించిన వారుండరు. రాజువి కదా, ఎంతయినా దానధర్మాలు చెయ్యొచ్చు. దాంతో చెప్పలేనంత పుణ్యాన్ని మూటగట్టుకుని, స్వర్గానికి చేరుకోవచ్చు.’ అన్నాడు మిత్రుడు.అతని మాటని అనుసరించి, తనని రాజుని చేయమని యక్షుణ్ణి అర్థిస్తే పోయేది. కాని, కార్మికుడు అలా చేయలేదు. భార్యని కూడా ఈ విషయమై సంప్రదించాలనుకున్నాడు. నెత్తి మీద శని కూర్చున్నప్పుడు అన్నీ ఇలాంటి ఆలోచనలే కలుగుతాయి.ఇంటికి చేరుకున్నాడు కార్మికుడు. జరిగిందంతా పూసగుచ్చినట్టుగా భార్యకు వివరించాడు. క్షురక మిత్రుని మాటలు కూడ ఒక్క ముక్క మరిచిపోకుండా అంతా చెప్పుకొచ్చాడు.‘నువ్వేమంటావు?’ అడిగాడు.ఆమె హరికథలూ, బుర్రకథలూ వింటూ మిడిమిడి జ్ఞానాన్ని బాగానే సంపాదించింది. ఆ జ్ఞానంతో భర్తతో ఇలా అంది.

‘అమ్మో! రాజ్యాలూ, రాజులూ మనకొద్దు. రాజ్యం కోసమే కదా, రాముడు అడవుల పాలయ్యాడు. పాండవులూ అంతే! బలిచక్రవర్తి కథ కూడా నీకు తెలిసిందే! పాపం పాతాళానికి దిగజారిపోయాడు. కార్తవీర్యార్జునుడూ, రావణాసురుడూ అంతా రాజులు కావడం వల్లనే నాశనం అయిపోయారు. మనకొద్దా రాచరికాలు.’’‘డబ్బు కావాలంటే రాజు కావాలిసిందే’ అన్నాడు కార్మికుడు.‘మనకంత డబ్బు కూడా వద్దు. డబ్బుంటే దురలవాట్లకు లోనవుతాం, వద్దొద్దు.’ అందామె.‘మరింకేఁ కోరుకోమంటావు?’‘ఏం కోరుకోమంటానంటే...ఇప్పుడు నువ్వు రోజుకో బట్టను నేస్తున్నావు. దానిని అమ్మగా వచ్చిన సొమ్ముతో నువ్వూ నేనూ బతుకుతున్నాం. అంతే! కాణీ పరకా దాచుకునే వీలు లేకుండా పోతోంది. నువ్వు కాని మరో బట్టను నేయగలిగితే, అది అమ్మగా వచ్చిన డబ్బును మనం దాచుకోగలం. ముందు ముందు మన అవసరాలకు ఆ డబ్బు పనికి వస్తుంది. పదిమందిలో మనం కాస్తంత ఉన్నతంగా బతికే అవకాశం కూడా ఉంటుంది. ఆలోచించు.’

‘నిజమే’‘ఒకటికి మరో బట్ట నెయ్యాలంటే నీకు మరో తలా, మరో రెండు చేతులూ కావాలి కాబట్టి, నువ్వు యక్షుణ్ణి అవే కావాలని అడుగు. హాయిగా బతుకుతాం.’ అంది భార్య. కార్మికుడికి భార్య సలహా బాగా నచ్చింది.రెండు తలలూ, నాలుగు చేతులూ ఉంటే రెండు మగ్గాలని ఏకకాలంలో ఉపయోగించి, రెండు బట్టల్ని నెయ్యొచ్చనుకున్నాడతను. భార్య ఆలోచనని మెచ్చుకున్నాడు. అడవికి పరుగుదీశాడు. చెట్టుని సమీపించాడు. యక్షుణ్ణి పిలిచాడు. వెంటనే యక్షుడు ప్రత్యక్షమయ్యాడు.‘చెప్పు ఏం కావాలి?’ అడిగాడు.‘నాకు రెండు తలలూ, నాలుగు చేతులూ కావాలి.’ అడిగాడు కార్మికుడు.‘తథాస్తు’ అన్నాడు యక్షుడు.చేనేత కార్మికుడికి రెండు తలలు ఏర్పడ్డాయి. నాలుగు చేతులు పుట్టుకొచ్చాయి. తడిమి తడిమి చూసుకున్నాడు వాటిని. ఆనందం పట్టలేక గెంతాడు కాసేపు. తర్వాత ఇంటి దారి పట్టాడు. రాదారిన వస్తోంటే అతన్ని అంతా వింతగా చూడసాగారు. భయపడ్డారు. ఊరి చేనేత కార్మికుడు అని ఎవరూ గుర్తు పట్టలేదతన్ని. ఎవరో రాక్షసుడు అనుకున్నారు. దాడి చేశారు అతని మీద. కర్రలతో కొట్టి కొట్టి చంపేశారు.’’ కథ ముగించాడు మిత్రుడు.

తల మీద గిరగిరా తిరుగుతూన్న చక్రాన్ని నిరోధించేందుకు నానా యాతనా పడ్డాడు. వీలుకాలేదు. అప్పుడన్నాడు ఇలా.‘క్షురక మిత్రుని మాట వింటే నేత కార్మికుడు బాగుపడే వాడు. బతికేవాడు. అలాగే నీ మాట నేను విని ఉంటే హాయిగా నీతో పాటే బంగారాన్ని పంచుకుని బాగు పడేవాణ్ణి. అత్యాశకు పోయాను. ఫలితాన్నిఅనుభవిస్తున్నాను.’‘చంద్రభూపతిలా రత్నాలకు ఆశపడ్డావు. ఆపదల్ని తెచ్చుకున్నావు.’ బాధపడ్డాడు మిత్రుడు.‘చంద్రభూపతి ఎవరు? ఆ కథేమిటి?’చెప్పసాగాడిలా మిత్రుడు.‘చంద్రపురాన్ని పాలిస్తున్న రాజు పేరు చంద్రభూపతి. అతని ఉద్యానవనానికి రోజూ ఓ కోతి మూక వస్తుండేది. అంతఃపురంలోని పిల్లలు వాటికి పళ్ళూ పలహారాలూ విసిరి ఆనందించేవారు. కోతులన్నిటికీ ఓ ముసలికోతి రాజుగా ఉండేది. అది కోతులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ, కాపాడుతుండేది.‘పొరపాట్న కూడా మీరు అంతఃపురానికి వెళ్ళకండి. చంద్రభూపతి మంచివాడు కాదు. మహాక్రూరుడు.’ ముసలి కోతి చెబుతున్నా వినలేదు కోతిమూక. పళ్ళకీ, పలహారాలకీ ఆశపడి, పిల్లలతో పాటుగా ఒకనాడు అంతఃపురానికి చేరుకున్నాయి. అల్లరి చేయసాగాయి. చూశాడది చంద్రభూపతి. కోపం వచ్చిందతనికి. సేవకులికి చెప్పి వాటన్నిటినీ చంపించేశాడు. కళ్ళ ముందే కోతులన్నీ చచ్చిపోతుంటే తట్టుకోలేకపోయాడు కోతిరాజు.

చాటుగా ఉండి, ఏడుస్తూ కూర్చున్నాడు. తర్వాత ఎలాగయినా చంద్రభూపతిపై పగ సాధించాలనుకున్నాడు.ఒకరోజు దాహం తీర్చుకునేందుకు పరుగుదీశాడు కోతిరాజు. వెతగ్గా వెతగ్గా ఓ సరోవరం కనిపించింది దానికి. దాహం తీర్చుకునేందుకు తొందరపడి నీళ్ళలోకి దూకకుండా, తెలివిగా ప్రవర్తించింది. గట్టున ఉన్న ఇసుకను పరిశీలనగా చూసింది. ఇసుకలో చెరువుకి వచ్చిన వారి అడుగుజాడలే ఉన్నాయి కాని, వారు తిరిగి వెళ్ళినట్టుగా ఒక్క జాడ కూడా కనిపించలేదు. ప్రమాదాన్ని పసి గట్టింది కోతి. సరోవరంలోనికి ప్రవేశించడం క్షేమం కాదనుకుంది. ఒడ్డున పడి ఉన్న తామరతూడుని తీసుకుని, ఆ గొట్టం ద్వారా నీరు తాగుతూ దాహం తీర్చుకోసాగింది. అంతలో సరోవరం మధ్య నుంచి ఓ రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. మెడలో రత్నమాలతో మెరిసిపోతూ కనిపించాడు. మెచ్చుకోలుగా అన్నాడిలా.‘దాహం తీర్చుకోవడమే ప్రధానంగా మనుషులూ, జంతువులూ ఈ సరోవరంలోకి దూకి, నాకు ఆహారమయిపోయారు. నువ్వు మాత్రం తెలివిగా ప్రవర్తించి ప్రాణాన్ని కాపాడుకున్నావు. నచ్చావు నాకు. కోరుకో, నీకేం కావాలో, వరం ప్రసాదిస్తాను.’ఆలోచించసాగింది కోతి. తర్వాత తేరుకుని, ఇలా అడిగింది.‘ఒక్కసారిగా నువ్వు ఎంతమందిని తినగలవు?’’‘‘ఈ సరోవరంలో ప్రవేశించిన ఎంతమందినయినా ఒక్కసారిగా తినగలను.’‘అయితే నేను నీకు వందలాది మంది నరులను కానుక చేస్తాను, నరమాంసాన్ని తనివితీరా తిందూగాని. దానికి ముందు నువ్వో పని చెయ్యాలి. నీ మెడలోని రత్నహారాన్ని నాకివ్వాలి.’ అంది కోతి.‘ఎందుకు?’ అడిగాడు రాక్షసుడు.

‘తర్వాత చెబుతాను, ముందు ఇవ్వు. నా పని కాగానే నీ హారం నీకిచ్చేస్తాను.’ అంది కోతి.‘అయితే ఇంద’ రత్నహారాన్ని కోతికి అందేట్టుగా విసిరాడు రాక్షసుడు. అందుకుని, దాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి చూసి, బాగానే ఉందనుకుంది. మెడలో ధరించింది. మెరిసిపోతూ చంద్రభూపతి దగ్గరకు చేరుకుంది.‘రాజా’ అని పిలిచింది.‘ఏమిటి? బతకాలని లేదా?’ కోపంగా అడిగాడు చంద్రభూపతి.‘కోపగించుకోకు రాజా! నేను చెప్పేది జాగ్రత్తగా విను.’ అంది కోతి. చెప్పసాగిందిలా.‘నేను ఉంటోన్న వనంలో ఓ సరస్సు ఉంది. ఆ సరస్సులో లెక్కలేనన్ని రత్నరాసులు ఉన్నాయి. అవి నీ దగ్గరుంటే బావుంటుంది. అక్కడుండి ఏం ప్రయోజనం? సేవకుల్ని పంపించు మహారాజా, సరస్సు చూపిస్తాను. సొమ్ములన్నీ సొంతం చేసుకో’‘నీ మాటలు నమ్మమంటావా?’’ అడిగాడు చంద్రభూపతి.‘నమ్మండి మహారాజా! ఇదిగో చూడండి.’’ తన మెడలోని రత్నహారాన్ని చూపించింది రాజుకి.

‘ఇది, నేను స్నానం చేసేందుకని సరస్సులో మునిగి తేలిన మరుక్షణం నా కంఠాన్ని అలంకరించింది. ఇలాంటివి మరికొన్ని మెడలో పడతాయోమోనని మళ్ళీ మునగబోతుంటే అప్పుడు జలదేవత ప్రతక్షమయింది. అయ్యి, సూర్యుడు ఉదయిస్తూన్న క్షణంలో ఈ సరస్సున మునిగివారికి ఒకొక్కరికీ ఒకొక్క హారమే ప్రసాదిస్తాను. సూర్యోదయం అయిన తర్వాత ప్రసాదించే ప్రసక్తే లేదు. అలాగే పదేపదే మునిగినా ఒకటి కన్నా ఎక్కువ హారాలు అందుకునే అవకాశం కూడా లేదంది.’కోతి చెప్పింది నిజమా? అబద్ధమా? అని ఆలోచించలేదు రాజు. నిజమే అయి ఉంటుందని ఆత్రం చెందాడు. ధనరాసులతో కోశాగారం నిండిపోయి ఉన్నా, కక్కూర్తి పడ్డాడు. బంధు మిత్ర సపరివారంగా సూర్యోదయానికి పూర్వమే కోతి వెంట బయల్దేరాడు. ‘అదిగో సరస్సు’ అంటే ‘అదిగదిగో సరస్సు’ అంటూ పరివారంతో అక్కడికి చేరుకున్నాడు.

Responsive Footer with Logo and Social Media