నీకు అమ్మనుకదా

రామకృష్ణుడు యుక్తవయస్కుడయ్యాడు ఆ కాలంలోనే తెనాలి కవులు, కళాకారులకు నెలవు. ఏ కాస్తంత చదువుకున్న వాళ్లని కదిలించినా కవితాధోరణిలోనే మాట్లాడేవారు.

సాహిత్య సారస్వతాలకి తగ్గట్టే ఊళ్లో వేశ్యాగృహాలు అనేకం ఉండేవి. అప్పటికే యువకుడైన రామకృష్ణ ఒకరోజు వీధిగుండా వెళ్తున్నాడు. సహజకవి అయిన రామకృష్ణ ఆవేశ్యాగృహాలకి ఎవరెవరు వస్తున్నారో కనిపెట్టి వాళ్లని ఆటపట్టించాలన్న ఉద్దేశ్యంతో అటుగా వచ్చాడు.

వేశ్యాంగనలు తమ తమ యిళ్ల గుమ్మాల్లో నిలబడి యువకుడు, రూపసియైన రామకృష్ణుడిని ఆకర్షించడానికి తమ తమ హావభావాలతో ప్రయత్నించసాగారు. రామకృష్ణ ముసిముసిగా నవ్వుతూ కొంటెగా కన్నుగీటుతూ వెళ్తున్నాడు.

అంతలో ఒక ప్రౌఢ మహిళ అతనికి తారసపడింది. ఆమె చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంది. నుదుట్న కాసంత బొట్టు పెట్టుకుంది. గోచీపోసి చీరకట్టి జబ్బ విర్చుకుంటూ నిర్భయంగా నడుస్తోంది.

ఆమె చంకలో ఒక కోడిపెట్టని యిరికించుకుని, మరో చేతిలో తాడు కట్టిన కుక్కపిల్లని పట్టుకుని వస్తోంది. ‘ఆమె ఆ వాడకట్టు వనిత కాదు’ అని చూస్తేనే అర్థమవుతోంది. తనకంటే పెద్దదైన ఆమెని ఆటపట్టించాలని నిశ్చయించుకున్నాడు రామకృష్ణ.

అలా అనుకున్నదే తడవుగా ఆమెకు ఎదురునిల్చి కొంటెగా నవ్వుతూ, “ఓలమ్మీ! రూపాయి యిస్తా పెట్టనిస్తావా? లేదంటే మొహరీ యిస్తా కుక్కనిస్తావా?” అని అడిగాడు ద్వంద్వార్థం ధ్వనించేలా.

ఆమె చిరునవ్వు నవ్వి “నీకు ‘అమ్మ’ను గదా…” అని తనూ ద్వంద్వార్థ పద్ధతిలో జవాబు చెప్పింది.ఆ జవాబు విన్న రామకృష్ణుడికి చెంప ఛెళ్లుమన్నట్లు అయింది

. ఆమెలోని మాతృత్వభావాన్ని గుర్తించి తన ప్రశ్నకి తానే సిగ్గుపడ్డాడు.“అమ్మా… పద…. ఈ వాడకట్టు దాటేదాకా యీ బిడ్డడు నీకు తోడుగా వస్తాడు” అని చెబుతూ ఆమెకి తోడుగా నడిచి, ఆ వీధి దాటించి తన తప్పు సవరించుకున్నాడు రామకృష్ణుడు.

Responsive Footer with Logo and Social Media