నాణేల గంప నాటకీయం



ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలకు రామలింగడి తెలివిని పరీక్షించాలనె ఆలోచన పుట్టింది. అనుకున్న విధంగానే రామలింగడి తెలివికి మెచ్చి శ్రీకృష్ణదేవరాయలు ఒక గంప నిండా బంగారు నాణేలను బహుమతిగా రామలింగడికి ఇస్తాడు. ఆ గంప నిండా నాణాలు ఉండడంతో ఆ గంప చాలా బరువుగా ఉంటుంది, ఏ మాత్రం కుదుపు వచ్చినా గంప లో ఉన్న నాణేలు అన్నీ కింద పడిపోతాయి, ఎవ్వరూ ఎత్తలేనంత బరువుగా ఉంటుంది ఆ గంప. దాంతో మిగిలిన సభికులు అంతా రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించసాగుతారు. రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా ఆ గంప లేవదు.

ఇలా రామలింగడు కొద్దిసేపు ఆలోచించిన తర్వాత తన తలకి ఉన్న తలపాగాను తీసి నేలపై పరిచి అందులో కొన్ని నాణాలను తలపాగాలో పోసి మూటగట్టుకుంటాడు, కొన్ని నాణాలను తన జేబులో నింపుకొని, మూటగట్టుకున్న నాణేలను భుజాన వేసుకుని, వెలితి పడిన గంప నెత్తిన పెట్టుకొని నడవడం మొదలు పెడతాడు.
రామలింగనీ సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయిన రాజు” శభాష్ రామలింగా! శభాష్!” అంటూ మెచ్చుకొంటాడు. రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తలవంచి నమస్కరిస్తూ ఉండగా ….బరువు కి అతని జేబులోని నాణేలు నేలమీద పడిపోతాయి. ఆ నాణాల శబ్ధంతో సభంతా మార్మోగి, ఆ బంగారు నాణాలన్నీసభంతా చెల్లాచెదురుగా పడిపోతాయి.
రామలింగడి తొందరపాటుకు సభంతా నవ్వుతారు, దాంతో నెత్తిన పెట్టుకున్న గంపను మరియు వీపున వేసుకున్న మూటను కిందపెట్టి రామలింగడు ఆ జారి పడిపోయిన నాణేల కోసం వెతకడం ప్రారంభింస్తాడు. పడుతూ లేస్తూ నాణాలను ఏరుకుంటున్న రామలింగడిని చూస్తున్న సభికులు ఎంతో తమాషాగా చూస్తూ అందరూ తలో మాట అంటారు.

“ఎంత దురాశ పరుడివి రామలింగా నువ్వు ..! రాజుగారు నీకు గంప నిండా బంగారు నాణాలు ఇచ్చినాకూడా నువ్వు కిందపడిపోయిన బంగారు నాణాల కోసం వెతుకుతున్నావు “అని అంటాడు ఆ ఆస్థాన పూజారి”. రామలింగడు మాత్రం ఎవరి మాట పట్టించుకోకుండా..అదిగో ఆ స్తంభం వెనకాల ఒకటి, రాజు గారి సింహాసనం పక్కన మరోకటి అనుకుంటూ సభంతా పరిగెత్తుతూ కింద పడిన నాణేలను ఏరుతాడు రామలింగడు. ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గరకొచ్చి ఆయన చెవిలో “ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనింతవరకూ చూడలేదు ..!” అంటూ రామలింగడిని దూషిస్తాడు.

రామలింగడు ఎవరి మాటలు పట్టించుకోకుండా నాణలన్నింటిని ఏరసాగుతాడు. రామలింగడు నాణాలన్నింటిని ఏరిన తరువాత రాజు రామలింగనితో ఇలా అంటాడు” రామలింగా..! నేను నీకు గంపెడు బంగారు నాణేలను ఇచ్చాను కదా..! మరి నువ్వు ఎందుకు ఇంత దురాశ పడి కిందపడిన కొన్ని నాణేల కోసం వెతుకుతున్నావు..?.
అప్పుడు రామలింగడు రాజుతో ఇలా అంటాడు…” రాజా ఇది దురాశ కాదు నాణేలపైన మీ యొక్క ప్రతిమ మరియు మీ పేరు రాసి ఉంది కదా ఇలా అందరూ నడిచే చోట నాణేలను పెట్టడం వల్ల ఎవరైనా వాటిని తొక్కి మిమ్మల్ని అవమానించే ప్రమాదం ఉంది.

అది నేను సహించలేను కాబట్టి నేను అంత ఆత్రుతగా వాటిని ఏరివేశాను అని చెప్పడంతో సభంతా మూగబోతుంది.
రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగడిని కౌగిలించుకుని. అతనికి మరో గంపెడు బంగారు నాణేలను బహుమతిగా ఇస్తాడు.

ఈ కథ ద్వారా తెలుసుకోవలసింది: సభలోని సభ్యులు లాగా తొందరపడి మాట జారడం ఇతరులు చేసే పనిని కించపరచడం అనేవి వారి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి.

Responsive Footer with Logo and Social Media